Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోదీకి తెలిసొచ్చిందట – దక్షిణ రాజకీయాలపై మతప్రభావం !!

September 20, 2026 by M S R

.

ఇదే రాధాకృష్ణ గతంలో రాసినట్టు గుర్తు… అప్పుడప్పుడూ ఆల్ మైటీ జగన్ కలలోకి వచ్చి మాట్లాడతాడని… ఆ విషయాన్ని జగనే తన సన్నిహితులకు చెబుతాడని..! ఈరోజు ఆంధ్రజ్యోతిలో తన కొత్త పలుకు చదువుతుంటే అదే గుర్తొచ్చింది… ఈ వ్యాసంలో రాధాకృష్ణ రాసుకొచ్చిన అంశాలన్నింటితోనూ మనం ఏకీభవించకపోవచ్చు… తెలుగుదేశం పట్ల తన విధేయత, జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత అంతర్లీనంగా ఇందులోనూ ధ్వనిస్తోంది…

కాకపోతే… ఖచ్చితంగా దక్షిణాది రాజకీయాల్లో వస్తున్న మార్పులు, మత ప్రభావం మీద మంచి డిబేట్ మాత్రం లేవనెత్తాడు రాధాకృష్ణ… క్రిస్టియన్ల సంఖ్య పెంచి, వారిని వోటు బ్యాంకులుగా మార్చుకునే జగన్ ప్రయాస ఏనాటి నుంచో చర్చల్లో ఉన్నదే… తన మెప్పు కోసం వైసీపీ లీడర్లు ఏకంగా మతం మార్చుకుని, జగన్ కరుణ కోసం వెంపర్లాడుతున్న తీరును రాధాకృష్ణ కొన్ని ఉదాహరణలతో చెప్పుకొచ్చాడు…

Ads

నిజమే… జగన్ పాలన కాలంలో దేవాలయాల మీద దాడులు, సర్కారు నిర్లిప్తత, ప్రత్యేకించి తిరుమలను భ్రష్టుపట్టించిన తీరు మొన్నమొన్నటిదాకా చూసిందే… లడ్డూ నెయ్యి, శాలువాల్లో పట్టు దగ్గర నుంచి అన్యమతస్తుల ఆధిపత్యం, తెగింపు, మొరాయింపు దాకా… తిరుమల పాలనను భూమన, ధర్మారెడ్డి, చెవిరెడ్డి, సుబ్బారెడ్డి ఎట్సెట్రా రెడ్లు ఏ స్థాయికి దిగజార్చారో కూడా చూసిందే…

ఇప్పుడు అదే భూమన పేజీల కొద్దీ తిరుమల పవిత్రత మీద వ్యాసాలు రాస్తుంటాడు అదే సాక్షిలో… హిందూ ధర్మం మీద వైసీపీ ధోరణి అదే… పేరుకు పంచాంగశ్రవణాలు, పుష్కరస్నానాలు… హిందువుల కళ్లు కప్పడానికి… చివరకు తన కొడుకు పెళ్లిని హిందూ తంతు అని కనిపించేలా షోఆఫ్ చేసి, నిజంగా క్రిస్టియన్ పద్ధతిలోనే చేశామని విజయమ్మతో సహా షర్మిల చెబుతున్న తీరు మీద వీడియో కూడా ఆమధ్య వచ్చింది… ఆ షోఆఫ్ దేనికి..? షర్మిలను హిందువులు తమ ఆడపడుచే అనుకోవాలనా..? జనానికి తెలియదా షర్మిల క్రిస్టియన్ మత ప్రచారకురాలు అని… తన భర్త వృత్తి మత ప్రచారమే అని…

ఇప్పుడామె బిడ్డ పెళ్లి కూడా చేస్తోంది… డౌటెందుకు..? సేమ్, కొడుకు పెళ్లిలాగే ఉంటుంది… జగన్ భార్య భారతీరెడ్డి జగన్‌కు మతానుసరణ కోణంలో సరైన జోడీ… ఇప్పుడు తన సంపాదనలో 10 శాతం చర్చిల కోసం జగన్ ఖర్చు పెట్టబోతున్నాడు అనే రాధాకృష్ణ వ్యాఖ్యలో నిజానిజాల మాటెలా ఉన్నా.., మతవ్యాప్తికి జగన్ ఏమేరకు ఖర్చు పెట్టడానికైనా రెడీ… అది తనకు రాజకీయంగా ఉపయుక్తం ప్లస్ మతం పట్ల అనురక్తి…

హిందూమతం ఎంత తగ్గితే, క్రిస్టియానిటీ ఎంత పెరిగితే అంత తనకు పొలిటికల్ ఫాయిదా… సేమ్, తెలంగాణలోనూ మతవ్యాప్తి అధికంగా జరిగితే తెలంగాణలో మళ్లీ వోట్ల దుకాణం తెరుస్తాడనేది రాధాకృష్ణ వ్యాఖ్య… ఆల్రెడీ జగన్ తెలంగాణలో పార్టీ రీఎంట్రీ మీద ప్లాన్లలో ఉన్నాడు… వైఎస్ లెగసీ వోట్లు, ఏళ్లుగా కాంగ్రెస్‌కు మద్దతు పలికే క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ వోట్లను చీల్చి, బీఆర్ఎస్‌కు ఉపయోగపడే ప్లాన్ అట…

అనేక వర్గాలుగా కొట్టుకుచస్తున్న బీజేపీ ఇప్పటికిప్పుడు మీకు అధికారం ఇస్తాంరా అని ప్రజలు చెప్పినా, వద్దనేట్టుగా ఉన్నారు… హైకమాండే చేతులెత్తేసింది… పైగా కేసీయార్ కోవర్టులు బీజేపీలో పెత్తనాలు చేస్తున్నారనే విమర్శలు సరేసరి… మరిక తెలంగాణలో వైసీపీ వ్యాప్తిని అడ్డుకునేదెవరు..? ఏపీలో హిందూ సంఘటనకు ప్రయత్నించేదెవరు..? చంద్రబాబుకు ఆ రాజకీయం తెలియదు… లోకేష్‌ ధోరణి వేచిచూడాలి… పవన్ కల్యాణ్‌ను కాసేపు పక్కన పెట్టండి… తను పేరుకే సనాతన ధర్మ పరిరక్షకుడు… చంచలం…

తమిళనాడులో విజయ్ ప్రభుత్వం వచ్చాక క్రిస్టియన్ మతవ్యాప్తి తప్పకుండా పెరుగుతుంది… డీఎంకేకు మొన్నటిదాకా క్రిస్టియన్లు సపోర్ట్ చేసి ఉండవచ్చుగాక, కానీ బేసిక్‌గా డీఎంకే నాస్తికం… ఇప్పుడు అక్కడి క్రిస్టియన్లకు తమ మతస్తుడు దొరికాక స్టాలిన్‌ వెంట ఎందుకు ఉంటారు..? సేమ్, కేరళలో లెఫ్ట్ నాస్తికం… కాకపోతే హిందూవ్యతిరేకం… అక్కడ క్రిస్టియన్లు, ముస్లింలు లెఫ్ట్, కాంగ్రెస్ కూటములను సమానంగా చూస్తారు… అక్కడ కాంగ్రెస్ కూటమి కూడా ముస్లిం పార్టీలతో కూడిన హిందూ వ్యతిరేక కూటమి కాబట్టి…

కర్నాటకలో మతాల మధ్య పోరు కాదు, రాజకీయ పార్టీల పోరాటమే… ఐతే నిజంగా మోదీషా దక్షిణాన పెరుగుతున్న హిందూ వ్యతిరేక సంఘటన పట్ల ఆందోళనగా ఉన్నారా..? అది పెద్ద ప్రశ్న… అదే నిజమైతే తెలంగాణలో ఈ గ్రూపు కొట్లాటలు, కోవర్టు యవ్వారాలకు ఎప్పుడో తెరవేసేవాళ్లు… తమిళనాట అన్నామలైని వదులుకునేవాళ్లు కాదు… ఏపీలో గుడ్డిగా ఓ పవన్ కల్యాణ్‌ను నమ్ముకునేవాళ్లు కాదు…

చంద్రబాబు తాను సెక్యులర్ అంటాడు, ఏమాత్రం హిందూ సంఘటనకు వీసమెత్తు కూడా ఉపయోగపడడు… ఇలా… అందరూ ఈ అంశాలతో ఏకీభవించకపోయినా సరే… దక్షిణాన ప్రాంతీయ పార్టీలు మతవ్యాప్తితో రాజకీయ లబ్ధికి వెంపర్లాడుతున్న తీరు మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశమే…

దిక్కూదివాణం లేని ఏపీ, ఇప్పుడు టీవీకే తోకలా మారిన తమిళనాడులను వదిలేస్తే… కర్నాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఈసారి లోకసభ సీట్లు పెరగొచ్చు… మోదీషా ఎలా నిలువరించగలరు..? దక్షిణాన ఆర్ఎస్ఎస్ కూడా క్లూలెస్‌గా మారిపోయిన స్థితిలో ఇదే పెద్ద ప్రశ్న… ఐనా జగన్‌తో రహస్య దోస్తీని అలాగే కొనసాగిస్తుందా బీజేపీ..? దాన్ని బ్రేక్ చేయడం కోసమేనా ఏబీఎన్ ఈ మతచర్చను ముందుకు తీసుకొస్తున్నది..?!

సున్నితమైన విషయాలను కూడా చర్చకు పెట్టే గట్స్ రాధాకృష్ణ కనబరుస్తాడు… తను స్వతహాగా పచ్చకలంకారుడే అయినా సరే, చాలా ఇష్యూస్ డిబేట్ పెడతాడు… సంప్రదాయిక, సోది వ్యాసాలతో పొద్దుపుచ్చే తెలుగు ఇతర పెద్ద జర్నలిస్టులకు రాధాకృష్ణ అందుకే మింగుడుపడడు… తన దారిలోకి వాళ్లు వెళ్లలేరు- రాయలేరు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బాలయ్య కొడుకు ఎంట్రీకి ఈ కథ సరిగ్గా కుదురుతుందేమో..!!
  • మోదీకి తెలిసొచ్చిందట – దక్షిణ రాజకీయాలపై మతప్రభావం !!
  • యుద్ధం ముదురుతోంది – ప్రపంచ దేశాలన్నీ లాగబడుతున్నయ్ !!
  • ‘‘ ఆ వృద్ధ టిబెటన్ షెర్పా ఆఫీసర్ నా మెంటల్ మ్యాప్ మార్చేశాడు ’’
  • అంతటి కమలహాసన్ సైతం… ఆ అక్కినేని సీన్లలో వెలవెలా..!!
  • ఇరుముడి ! థియేటర్- ఓటీటీ వీక్షకుల వేర్వేరు స్పందనలు..!!
  • కనిమొళి థర్డ్ ఫ్రంట్ ప్రయాస – కేసీయార్ రెడీయా..? సాహసిస్తాడా..?
  • ‘‘ వసూళ్లు తప్ప విలువల్లేవు – నేనిక నటించను – ఇక చాలు ’’
  • ఎదుటివారి ప్రశంస మనకు మత్తు – అందుకే ఆడంబర ప్రదర్శనలు
  • అగడు పడ్డట్టు తెగ మింగారు! ఎవడి పాలైందిరో నా తెలంగాణ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions