.
Veerendranath Yandamoori …. “నేను ఆనందంగా ఉన్నాను. నేను చాలా ఖరీదైన జీవితం గడుపుతున్నాను. మా సంసారం ఎంతో సుఖంగా ఉంది. మా పిల్లలు అమెరికాలో బాగా సంపాదిస్తున్నారు.”
ఇలాంటి విషయాలను చెప్పుకోవాలనే కోరిక చాలామందికి ఉంటుంది. వాటిని మరో మాటలో చుట్టి చెబుతారు.
ఒకావిడ పెళ్లికి పన్నెండు లక్షల విలువైన నగ వేసుకొని వెళ్లిందనుకుందాం. అందరూ ఆ నగను చూస్తున్నారు కానీ, అది ఏ యాభై వేల నగో అనుకుంటున్నారేమో అనే అనుమానం వేధిస్తూ ఉంటుంది. “పన్నెండు లక్షలు పోసి కొన్నా, డిజైన్ మాత్రం చాలా సింపుల్‌గా ఉందండీ!” అంటుంది.
Ads
బాధ నగ సింపుల్‌గా ఉండటం కాదు. దాని ధర ఎవరికీ తెలియకపోవడం. కొద్దిపాటి తెలివితేటలున్నవారికి కూడా ఆమె తాపత్రయం వెంటనే అర్థమైపోతుంది.
“మొన్న ఢిల్లీకి బిజినెస్ క్లాస్‌లో వెళ్తుంటే విమానంలో పండ్లు అసలు బాగాలేవు” అనే మాట కూడా ఇలాంటిదే. అక్కడ పండ్లపై విమర్శ కన్నా, తాను బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించానని చెప్పడమే అసలు ఉద్దేశ్యం.
ఖరీదైన కారు, విలువైన నగలు, విదేశీ ప్రయాణాలు, ఫైవ్‌స్టార్ హోటళ్లు— వీటిని సందర్భం లేకుండా మాటల్లోకి తీసుకురావడం కూడా ఇదే మనస్తత్వం. తన దగ్గర ఉన్నది తనకు ఆనందాన్నివ్వడం కన్నా, అది తన దగ్గర ఉందని ఇతరులకు తెలియడమే ముఖ్యమైపోతుంది.
దీన్ని మనస్తత్వశాస్త్రంలో ‘స్టేటస్ సిగ్నలింగ్’ అంటారు. ఫిర్యాదులా, వినయంలా కనిపించేలా గొప్ప చెప్పుకుంటే దాన్ని ‘హంబుల్ బ్రాగింగ్’ అంటారు. సాధారణ పరిభాషలో దీన్ని ‘షో-ఆఫ్’ అంటాం.
బయటకు అది ఆత్మవిశ్వాసంలా కనిపించినా, లోపలి అరక్షిత భావానికి వేసుకున్న ఖరీదైన వస్త్రం.
ఎదుటివారి ఆశ్చర్యం, ప్రశంస మత్తులాంటి సంతృప్తినిస్తాయి. అయితే చూసేవాళ్లందరూ ఆ వైభవాన్ని చూసి మెచ్చుకుంటారని అనుకోవడం పొరపాటు.

ఒకరి ఇంట్లో వాష్‌బేసిన్‌కు కూడా వెండి తాపడం ఉండటం చూసిన అతిథి, “ఆహా, ఎంత అద్భుతం!” అనుకోకుండా, “ఇంత డబ్బు ఎలా సంపాదించాడు?” అని అనుకోవచ్చు.
అదే వ్యక్తి ఎన్నో కష్టాలు పడి, ప్రతిభతో, నిజాయితీతో పైకొచ్చాడని తెలిసినప్పుడు అతడి వైభవాన్ని చూసి మనం చేతులెత్తి నమస్కరిస్తాం.
పరుగు పందెంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన కుర్రవాడు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి పెల్లుబుకుతున్న సంతోషంతో, అమ్మానాన్నలకి ఆ విషయం చెప్పటం ఆనందమే. ఆ విషయం, తల్లి పక్కింటి వారికి చెప్పడం కూడా సహజమే. కారణం… అందులో కృషి ఉంది! పట్టుదల ఉంది! దానికి వచ్చిన ఫలితం ఉంది..! వినేవారికి ప్రేరణ ఉంది..!
తేడా అర్థమైంది అనుకుంటాను.
అందుకే, ప్రతి ఆనంద ప్రకటననూ షో-ఆఫ్ అనలేం. పిల్లలు ఫస్ట్ క్లాస్‌లో పాసవడం, మంచి ఉద్యోగం సంపాదించడం, కృషికి గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన అవార్డు రావడం వంటి విజయాలను పదిమందితో పంచుకోవడంలో “ఆరోగ్యకరమైన ఆనందం” ఉంటుంది.
వస్తువు ఖరీదు కన్నా, దాని వెనుక ఉన్న కృషి విలువైనది.
ఒక రచయితకు సాహిత్య అకాడమీ అవార్డు వస్తే ఆ సంతోషాన్ని అందరితో పంచుకోవడం సహజమే కాకుండా అభిలషణీయం కూడా. ఎందుకంటే ఆ అవార్డు వెనుక అతడి ప్రతిభ, ఎన్నో సంవత్సరాల కృషి, నిరీక్షణ ఉంటాయి. ఆ విజయాన్ని వినయంతో, కృతజ్ఞతతో పంచుకుంటే అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది.
ఒకే విషయం పాజిటివ్‌గానూ ఉండవచ్చు, నెగటివ్‌గానూ మారవచ్చు. దాన్ని నిర్ణయించేది మన ఉద్దేశం, చెప్పే సందర్భం, చెప్పే పద్ధతి. మన ఆనందంలో ఇతరులను భాగస్వాములను చేసుకోవడం పాజిటివ్. వారికన్నా మనం గొప్పవాళ్లమని నిరూపించడానికి చెప్పడం నెగటివ్.
“మా పిల్లలు అమెరికాలో ఉన్నారు” అని సందర్భానుసారంగా చెప్పడం సహజం. సంబంధం లేని ప్రతి సంభాషణలోనూ వాళ్ల జీతాల వివరాలు చెప్పడం మాత్రం గుర్తింపు కోసం ఆకలి.
ఇంత చెప్పిన నేను కూడా ఈ బలహీనతకు అతీతుడిని కాను; కొన్ని సందర్భాల్లో తెలియకుండానే ఈ మాయలో పడినవాడినే. ఇంకా self realisation stage లో ఉన్న వాడినే.
నిజమైన గొప్పతనం మనం ఎంత ఖరీదైన జీవితం గడుపుతున్నామో చెప్పుకోవడంలో కాదు; మన ప్రయాణం తెలుసుకున్నవాళ్లు మనస్ఫూర్తిగా మెచ్చుకునేలా జీవించడంలో ఉంది.
Share this Article