‘‘భారత సైన్యంలో నా మొదటి ఆపరేషన్ నాకు ఇప్పటికీ గుర్తుంది… సోపోర్‌లో ఉన్నాం మేం… శ్రీనగర్‌కు 50 కి.మీ దూరం ఉంటుంది… ఓ రాత్రి మాకు ఇంటలిజెన్స్ సమాచారం వచ్చింది… ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఆశ్రయం పొందబోతున్నారని… మా కెప్టెన్ విక్కీ సార్ నాకు ఆంబుష్ బాధ్యత అప్పగించాడు… ఇంటిని చుట్టుముట్టాం అదే రాత్రి… ఉగ్రవాదులు మాపై కాల్పులు స్టార్ట్ చేశారు… ఫ్రంట్ పొజిషన్లో ఉన్న నేను తప్పనిసరై ఎక్కువ కాల్పులు జరపాల్సి వచ్చింది… ఉగ్రవాదులు చనిపోయారు… నా జీవితంలో ఒకరిని చంపడం అదే మొదటిసారి నాకు… ఆర్మీ అకాడమీలో ఆయుధాలు ప్రయోగించడం నేర్పిస్తారు, టార్గెట్లను గురిచూసి కాల్చాలి… కానీ అవి మనపై తిరిగి కాల్పులు జరపలేవు కదా… అందుకే రియల్ ఫీల్డ్ ఆపరేషన్‌లో ఉండే టెన్షన్, అటెన్షన్ వేరు… ఆ ఇంటి గోడ మీద ఓ బుల్లెట్ తగిలిన మచ్చ కనిపించింది… అదే నాకు తగిలితే ఏమిటి..? ఈ భావన ఓసారి నన్ను వణికించింది… మనం ఎదుటోడిని కాల్చడానికి ఏమాత్రం సంకోచించినా, ప్రత్యర్థి కాల్చే బులెట్‌తో మన గుండె చీలిపోతుంది… అందుకే ఫీల్డ్‌లో మేమూ తుపాకులై మండాల్సిందే… దయ, దాక్షిణ్యం ఆలోచిస్తే మన ప్రాణాలు ఉండవు…
కొన్ని నెలల తరువాత హుబ్లీలోని మా ఇంటికి వెళ్లాను… కొందరు చొరబాటుదారులు మన మిగ్ విమానాల్ని కూల్చేశారని కొన్ని న్యూస్ చానెళ్లలో చూశాను… ఇండియన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న కార్గిల్ శిఖరాలు, సరిహద్దు పాయింట్లను వాళ్లు ఆక్రమిస్తున్నారని ఆ వార్తల సారాంశం… ఇక యుద్ధం తప్పనిసరీ అనీ, నేను సరిహద్దుల్లోకి వెళ్లకతప్పదనీ అర్థమైంది నాకు… మాకు ఆర్మీ అకాడమీలో పదే పదే ఏం నూరిపోస్తారంటే… నీ ఒక్కడిదే ప్రాణం కాదు, నువ్వున్న సమూహంలో ప్రతి ఒక్కరివీ నీ ప్రాణాలుగానే భావించాలి అని… మరి అక్కడ సరిహద్దుల్లో నా సోదర జవాన్లు పోరాడుతూ ఉంటే, ఇక్కడ నేను తృప్తిగా ఎలా భోంచేయగలను..? మా పేరెంట్స్‌కు విషయం అర్థం కాలేదు… నేనూ వివరించి చెప్పలేదు… కుటుంబంలో చిన్నోడిని… నాన్నకు నేనంటే ప్రేమ… అసలు నేను సైన్యంలో చేరడమే తనకు నచ్చలేదు, ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు తను… ఇక అమ్మ సరేసరి, పిచ్చిది, తన గురించి చెప్పేదేముంది..? ఎప్పుడూ నాకు ఏమీ జరగొద్దని దేవుళ్లను ప్రార్థిస్తూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది…
నా దోస్త్ ఒకడు నన్ను తన కారులో స్టేషన్ వరకూ తీసుకెళ్లాడు… ఒకసారి వెనక్కి తిరిగి ఇంటివైపు చూశాను, ఏమో, మళ్లీ ప్రాణాలతో వచ్చి, ఇంటిని చూస్తానో లేదో… నేను సజీవంగా ఈ ఇంటికి వస్తానో రానో… పలు శిఖరాల్ని ఆక్రమించేసిన పాకిస్థానీ సైన్యం కాల్పులు జరుపుతూ ఉంది, అటు వైపు వచ్చే ఇండియా విమానాల్ని కూల్చేస్తున్నయ్… పూర్తి స్థాయి యుద్ధమే స్టార్టయింది… మా యూనిట్‌ను సందర్శించిన ఆర్మీ చీఫ్ ఒక మాటన్నాడు… ‘‘వాళ్లు మొదటి బులెట్ కాల్చారు, చివరి బులెట్ కాల్చాల్సింది మనమే…’’ మేమందరమూ పెద్దపెట్టున అరిచాం… ‘‘దుర్గా మాతాకీ జై…’’
Ads
పాకిస్థానీ సైనికులు శిఖరాలు ఆక్రమించడమే కాదు, బంకర్లు ఏర్పాటు చేసుకుని, సేఫ్ పొజిషన్లో ఉన్నారు… మా బెటాలియన్‌కు 5140 పాయింట్‌ను విముక్తం చేసే బాధ్యత అప్పగించారు… నేను వెనుక వైపు నుంచి శిఖరం ఎక్కి, శత్రువు పొజిషన్ తెలుసుకుని రావాలి… ప్రాణాలతో రిస్క్, కానీ తప్పదు, ఆ బాధ్యతను నాకే ఇచ్చారు… శిఖరం ఎక్కేకొద్దీ ఆక్సిజన్ తక్కువవుతుంది, ఊపిరి కష్టమవుతుంది… ఏకధాటిగా కురిసే మంచు కొరికేస్తోంది… మరోవైపు శత్రువు చాలా భద్రంగా ఉన్నాడు… రాకెట్ లాంచర్లను కూడా తెచ్చుకున్నారు వాళ్లు… అందుకే ఎయిర్ ఆపరేషన్లు కష్టం అయిపోయాయి… నేను వెనక్కి తిరిగాను, నా బేస్ స్టేషన్‌కు వచ్చాను… గమనించిన వివరాలన్నీ చెప్పాను… అప్పుడు మా కెప్టెన్లు వక్కీ సార్, సంజీవ్ సింగ్… ఆ పాయింట్‌ను మేం త్వరగానే స్వాధీనం చేసుకున్నాం… అందరికీ ఆయుధాలు, అమ్యూనిషన్ ఎప్పటికప్పుడు చేరవేసే బాధ్యతను నేను నిర్వర్తించాను… ఆ శిఖరం మీద జెండా ఎగరేసి, కెప్టెన్ బాత్రా ‘యే దిల్ మాంగే మోర్’ అని అరిచిన అరుపులు చాలాదూరం వినిపించాయి…
మరో క్లిష్టమైన ఆపరేషన్ 4875 పాయింట్ విముక్తి చేయడం… మా కమాండింగ్ ఆఫీసర్ నన్ను పిలిచాడు, నీకు 120 మంది సైనికులను ఇస్తాను… ఈ ఆపరేషన్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ బాధ్యత నీదే… ఛాతీ ఒక్కసారిగా ఉప్పొంగింది… కానీ ఏదో సంకోచం, ఆపరేషన్ సరిగ్గా అమలు చేయలేకపోతే… నా మొహం ఎక్కడ పెట్టుకోను..? నా తోటి జవాన్లందరి ప్రాణాల్ని కాపాడుకుని ఆ శిఖరాన్ని కైవసం చేసుకోగలనా..? ఏమాత్రం తేడా వచ్చినా జీవితాంతమూ ఆ గిల్టీ ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుందా…? కానీ తప్పదు కదా, ఎవరో ఒకరు లీడ్ తీసుకోవాల్సిందే కదా… ‘‘సార్, నా ప్రాణం పోయినా సరే, ఆ శిఖరం మీద మళ్లీ త్రివర్ణపతాకం ఎగరేస్తాను’’ అన్నాను మా ఆఫీసర్‌తో ఉద్వేగంగా… నా సర్వీస్ అనుభవమే ఆరు నెలలు… మా జవాన్లలో చాలామంది సీనియర్లూ ఉన్నారు… భేటీ వేశాను… ‘‘మీకన్నా చిన్నోడిని, కానీ సంకల్పంలో, పట్టుదలలో మీతో సమానమైన స్పిరిట్ ఉన్నవాడినే..’’ అంటూ చెప్పుకున్నాను… పూర్తి స్థాయి ముఖాముఖి యుద్ధాలకు వెళ్లినప్పుడు జవాన్లు తమ కుటుంబాలకు లేఖలు రాయడం అనేది అలవాటే…
టెన్షన్, ఎమోషనల్… ఏం రాస్తే, కుటుంబాలు ఎక్కడ భయపడతాయేమో అనే జంకు… కలాలు కదల్లేదు చాలాసేపు… తమకు ఇష్టమైన కుటుంబసభ్యుల ఫోటోలు చూస్తూ, ఏవేవో రాసేశారు… అందరిలోనూ కన్నీళ్లే… నా దోస్త్ శ్యాంసింగ్ నా దగ్గరకు వచ్చాడు… జ్వరంతో ఉన్నాడు… నేనూ వస్తాను అన్నాడు, నేను వద్దు అన్నాను… ‘‘అన్నీ బాగున్నప్పుడు మీవెంట ఉన్నాను, మనం దుర్దినాల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టి ఉండలేను’’ అని మంకుపట్టు… తనను కన్విన్స్ చేయలేకపోయాను… పది యూనిట్లుగా విభజించి, ఇక ఒకరికొకరు కౌగిలించుకుని బయల్దేరాం… మా కెప్టెన్ విక్రమ్ బాత్రాను కౌగిలించుకున్నాను… ‘‘రారా, హగ్ చేసుకో, ఎవరిని మళ్లీ చూస్తామో, ఎలా చూస్తామో’’ అన్నాడు… అన్నట్టు, నేనూ ఇంటికి లేఖ రాశాను… ‘‘అమ్మా… నాన్నా… మీకు మంచి కొడుకుగా ఉండటమే నా ప్రథమ కర్తవ్యం… ఈ దేశానికి మంచి కొడుకుగా కూడా… మళ్లీ ఇంటికి రాలేకపోతే నన్ను క్షమించండి’’ అంతకుమించి ఏం రాయాలో అర్థం కాలేదు, కన్నీళ్లు కలానికి అడ్డుపడ్డాయి…
నిటారుగా ఉన్న కొండ… ఉధృతంగా గాలులు… ఆయుధాలు, అమ్యూనిషన్ బరువు… రాత్రి బయల్దేరితే, తెల్లారేసరికి కొన్ని శత్రువు నిర్మించుకున్న బంకర్ల జాడ తెలిసింది… గ్రెనేడ్లు, ఏకే-47లతో విరుచుకుపడ్డాం… ఒక్కో బంకర్ నిర్మూలన పదేసిమంది యూనిట్‌కు టార్గెట్… బంకర్లను ఖాళీ చేయడం, శత్రువు ఏమైనా బాంబులు పెట్టి ఉన్నాడో చెక్ చేసుకోవడం, ఒక బంకర్ చెక్ చేస్తుంటే ఓ దేహం కనిపించింది… మన దుస్తులే… దేశాన్ని వెల్లకిలా తిప్పి చూశాను… జ్వరంతోనూ దేశసేవ కోసం వచ్చినవాడు… వాడి జేబులో ఓ చిన్న కాగితం… ‘‘ఈ జీవితం ఓ జీవితమా..? శత్రువును ఖతం చేయలేని ఈ జీవితమూ ఓ జీవితమేనా..? మరణమే నయం కదూ…’’ దుఖం తన్నుకొస్తోంది… లీడర్‌ను కదా స్ట్రాంగుగా ఉండాలి, ఏడ్వలేను, తోటి జవాన్లు డౌన్ గాకుండా చూసుకోవాలి కదా… అవును, అంతటి ఎత్తయిన ఒంటరి శిఖరాల మీద, నా ఏడుపు కూడా నేను ఏడవలేకపోయాను…
రెండోరోజు… ఓ దాడి తరువాత పాకిస్థానీ సైనికుడొకడు ఓ బంకర్లో కనిపించాడు… దుస్తులంతా రక్తమే… మోకాళ్ల మీద తలవంచుకుని కూర్చున్నాడు… మెడ, శ్వాసనాళం ప్రమాదకరంగా కట్టయ్యాయి… నరకం అనుభవిస్తున్నాడు… ఒక్కక్షణం నాలోని మనిషి మేల్కొన్నాడు… వదిలేద్దామా..? ఒకవేళ నేను దొరికితే తను వదిలేవాడా..? వదిలితే బతుకుతాడా..? నువ్వయినా మిగలాలి, లేదా నేనయినా మిగలాలి… ఆ ముఖాముఖి పోరులో నీతి అదే… నేను బుల్లెట్ కాలిస్తే తన నరకయాతన నుంచి విముక్తం చేసి మేలు చేసినట్టేనేమో… నిర్దాక్షిణ్యంగా, అవును, కర్తవ్యోన్ముఖుడిగానే ట్రిగ్గర్ నొక్కాను… పాకిస్థాన్ కూడా ఎదురుదాడి ప్రారంభించింది… కాల్పుల శబ్దాలు, పేలుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి నిరంతరాయంగా… మూడోరోజు కమాండింగ్ ఆఫీసర్ రేడియో ద్వారా అడిగాడు, ఏమైనా ఫుడ్ పంపించాలా..? త్వరగా వెనక్కి వచ్చేస్తాం గానీ, ఇంకా అమ్యునిషన్ కావాలని కోరాను…
గాయపడిన ఓ సైనికుడిని స్ట్రెచర్ మీద పడుకోబెడుతున్నప్పుడు తను అన్నాడు ఇలా… ‘‘సారీ సర్, చివరి దాకా మీ అందరితో కలిసి పోరు చేయలేకపోతున్నాను…’’ మరో సైనికుడి కడుపుకు తగిలిన బులెట్ పేగుల్ని బయటికి తీసుకొచ్చింది… ‘‘సార్, నేను మళ్లీ నా భార్యాపిల్లలను చూస్తానా..?’’ నా వయస్సెంతని..? 25 ఏళ్లు… ఇలాంటి యుద్ధం, గాయాలు, అంతా బీభత్సం, నన్ను మానసికంగా దెబ్బతీస్తోంది… శిఖరం చేరే సమయం ఆసన్నమవుతున్నప్పుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా మాతో కలిశాడు… ఇంకా ఒకటోరెండో బంకర్లున్నయ్, అంతే… నేను మరో బంకర్లో కూర్చుని, చివరి స్టెప్పుకు రెడీ అవుతున్నాను… శత్రువు బంకర్ నుంచి ఓ గ్రెనేడ్ ఎగురుతూ నావైపు వచ్చింది… కాళ్ల దగ్గర వచ్చి నిలిచింది… దాని కిల్లింగ్ రేడియస్ 10 మీటర్లు… నాలుగు సెకండ్లలో పేలుతుంది… ఎదుటి వైపు నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నయ్… ‘‘దేవుడా, నా మొహం రూపు చెదరకుండా చూడు స్వామీ, చివరిసారిగా నా కుటుంబం నా మొహాన్ని చూసుకోవాలి కదా…’’ ఇదీ నా ప్రార్థన… గ్రెనేడ్ పేలింది…
ఏదో కాలిన వాసన, కళ్ల ముందు పొగ, దట్టంగా దుమ్ము… కాళ్లు తీవ్రంగా గాయపడ్డాయి… కదల్లేకపోతున్నాను… ఇంతకీ నేను బతికే ఉన్నానా..? చచ్చిపోయానా..? ఎదుటి వైపు నుంచి కాల్పులు వినవస్తున్నయ్, సోయిలోకి వచ్చాను… ఎలాగోలా చేతిలోని ఏకే-47 స్థిరంగా పట్టుకుని, ఎదురుగా కాలుస్తూనే ఉన్నాను… ఈలోపు కెప్టెన్ సాబ్ పరుగెత్తుకొచ్చి నన్ను బంకర్ నుంచి లాగేసి, మా ఇతర జవాన్లతో కలిసి కాల్పులు ఆరంభించాడు… ‘‘అన్నా, నువ్వు వెనక్కి వెళ్లిపో, నీకు అర్జెంట్ ట్రీట్మెంట్ కావాలి’’ అన్నాడు… మిషన్ ఇంకా అయిపోలేదు అని నేను చెబుతున్నా సరే ఆయన వినిపించుకోలేదు… 150 మీటర్ల వరకూ పాక్కుంటూ వెళ్లి ఓ బండరాయి వెనక్కి చేరాను… కాళ్లు చూసుకుంటే నుజ్జునుజ్జు… ఇద్దరు సైనికులు వచ్చి దాదాపు ఓ గోనెసంచిలా మోసుకుంటూ తీసుకుపోయారు… ఒక రాయి నుంచి మరో రాయి వెనక్కి… చావుబతుకుల పోరాటం… చివరకు సాయంత్రానికి బేస్ స్టేషన్ చేరాను… ‘‘డేంజరస్లీ ఇల్’’ జాబితాలో చేరిపోయాను… తెల్లవారి శ్రీనగర్ హాస్పిటల్‌కు తీసుకుపోయారు విమానంలో…
మరుసటిరోజు నర్స్ చెప్పింది… 4875 పాయింట్ దాటేసి మన సైన్యం ఇంకా ముందుకు పోతోంది… ఆ శిఖరం మీద మన జెండా చూడండి సార్ అని చెబుతోంది… కష్టమ్మీద లేచి నిలబడగలిగాను, సెల్యూట్ చేశాను అక్కడి నుంచే… ‘‘కానీ ఈ గెలుపు కోసం ఓ పెద్ద త్యాగం చేయాల్సి వచ్చింది’’ అన్నాదామె… ‘‘ఏమైంది..?’’ అనడిగాను… ‘‘కెప్టెన్ విక్రమ్ బాత్రాను కోల్పోయాం’’ అన్నదామె… నన్ను కాపాడి, తను బలైపోయాడు… ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తన్నుకొచ్చాయి… పదే పదే బాత్రా మొహం, నన్ను వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ఆర్డర్ వేస్తున్న ఆయన గొంతు గుర్తొస్తూనే ఉన్నయ్… శ్రీనగర్‌లో నాకు చికిత్స సరిపోలేదు, ఢిల్లీ తీసుకుపోయారు… అమ్మ వచ్చింది, ఏడుస్తోంది… నేను కార్గిల్ యుద్ధంలో ఉన్నట్టు అప్పటిదాకా అమ్మకు తెలియలేదు… తెలియనివ్వలేదు నేనే… ఇప్పుడు నేను మెంటల్‌గా కూడా డిస్టర్బ్డ్… ఏదో గ్రెనేడ్ పక్కన పేలినట్టు… నా వెనుక నుంచి ఎవడో శత్రుసైనికుడు కాల్పులు జరుపుతున్నట్టు… అకస్మాత్తుగా మెళకువ వచ్చేది… చివరకు కోలుకున్నాను… ఇంటికి వెళ్లాలి… నా అక్కాచెల్లెళ్లు పంపించిన రాఖీలు నా చేతులకు కట్టి, నర్సు సెల్యూట్ చేసింది… ‘‘అన్నా, దేశం తరఫున కృతజ్ఞతలు…’’ ఎవరైనా పౌరులు అమ్మ కాళ్లను టచ్ చేసి అంటుంటారు… ‘‘అమ్మా, ధైర్యవంతుడిని కన్నావు, మన సైనికులకు మనమెప్పుడూ రుణపడే ఉంటాం,..’’
Share this Article