.
నగరిలో ఒక్క వార్డు కూడా టీడీపీని గెలవనివ్వను… ఇది రోజా వ్యాఖ్య… ఛైర్మన్‌తోపాటు అన్ని వార్డులూ టీడీపీ ఏకగ్రీవం… ఇదీ ఫలితం… నవ్వొచ్చిన మాట నిజం… రాజకీయాలు అంటే ఫుల్ టైమ్ జాబ్, ప్రజల్లో ఉండాలి, అందుబాటులో ఉండాలి, పోరాడాలి, ముందు నిలబడాలి… గాలివాటంగా గెలిస్తే, మంత్రి పదవి దక్కితే పవర్ఫుల్, సక్సెస్ఫుల్ రాజకీయవేత్త అనిపించుకోబడరు… అదే నగరిలో తనకు బలమైన ప్రత్యర్థులు సొంత పార్టీలోనే ఉన్నారు, ఈసారి ఇక తన పోటీ, గెలుపు అంత వీజీ కాదు…
ఆమెకు అది చెప్పినా అర్థం కాదు… అంతకుముందు హీరోయిన్గా, నటిగా బోలెడు డబ్బు, ఖ్యాతి సంపాదించింది కదా… ఈటీవీ జబర్దస్త్ మాత్రమే తనను ఎమ్మెల్యేగా గెలిపించిందనే భ్రమల్లో ఉంటుంది… ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద పని లేదు కదా… ఇక టీవీ షోలు, సినిమాల్లోకి వచ్చేసింది… రాకపోతేనే ఆశ్చర్యం… మేకప్ లేకుండా ఆమె ఉండలేదు… అదే తనకు ఆక్సిజెన్ అనుకుంటుంది… కాకపోతే ఇంద్రజ, నాగబాబు ఫిక్సయ్యారు కదా… జబర్దస్త్‌లోకి రీఎంట్రీ లేదు పాపం…
Ads
చాలాకాలం తరువాత ఆమె తమిళ సినిమా తెరపై కనిపించింది… సినిమా పేరు లెనిన్ పాండియన్… ప్రైమ్‌లో స్ట్రీమింగు ఇప్పుడు… మరి సినిమా ఎలా ఉంది… అది ఓసారి చెప్పుకుందాం… మిత్రుడు Ashok Pothraj సమీక్ష ఇది…
లెనిన్ పాండియన్.. ఖాకీ చాటున దాగిన అరాచకాలకు అద్దం!
చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీ, కొందరి చేతుల్లో సామాన్యుల పాలిట శాపంగా మారితే? న్యాయం కోసం పోరాడాల్సిన వ్యవస్థే అన్యాయానికి అండగా నిలిస్తే? ఎదిరించే ధైర్యం లేని సామాన్యుడి పరిస్థితి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నమే లెనిన్ పాండియన్..!
పోలీస్ వ్యవస్థలోని అణచివేత, అధికార దుర్వినియోగం, రాజకీయ పలుకుబడితో సాగించే అక్రమాలు.. వీటి మధ్య నలిగిపోయే సామాన్యుల జీవితాలను తెరపై ఆవిష్కరించిన సోషల్ క్రైమ్ డ్రామా ఇది. డీడీ బాలచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటీనటుల సహజమైన నటన, వాస్తవికతకు దగ్గరగా ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.
ఇసుక అక్రమ తవ్వకాలు వాటి వెనుక రాజకీయ బలగాలు ఓ సామాన్య కానిస్టేబుల్ పోరాటం, ఓ వృద్ధ రైతు జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఈ అంశాల చుట్టూ కథ తిరుగుతుంది.
శిక్షణ పొందిన యువ కానిస్టేబుల్ మారవర్మన్ సుందరపాండియన్ పాత్రలో దర్శన్ గణేశన్ ఆకట్టుకున్నారు. (శివాజీ గణేషన్ మనమడు- ఇది డెబ్యూ చిత్రం)… కమర్షియల్ హంగులకు దూరంగా, సహజత్వానికి పెద్దపీట వేసిన ఈ పాత్రలో ఆయన నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన ప్రదర్శించిన పరిణతి పాత్రకు బలాన్నిచ్చింది. ఫీల్డులో నిలబడతాడు…
ఇక జడ్జి భీమారావు పాత్రలో జార్జ్ మరియన్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. సామాజిక అసమానతలను ప్రశ్నించే ఆయన పాత్ర, సంభాషణలు కథలోని అంతర్లీన సంఘర్షణను మరింత బలంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాయి.

గంగై అమరన్, రోజా మధ్య వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా ఉద్వేగాన్ని, నవ్వులను పంచుతాయి. అయితే కొన్ని చోట్ల డబ్బింగ్ సరిగ్గా సింక్ కాకపోవడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.
సంగీతం విషయానికొస్తే.. ఇళయరాజా తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సన్నివేశంలో ఆయన అందించిన నేపథ్య సంగీతం కథలోని తీవ్రతను పెంచుతూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
దర్శకుడు డీడీ బాలచంద్రన్ ఎంచుకున్న కథాంశం బలమైనది. పోలీసు వ్యవస్థలోని లోపాలు, రాజకీయ అండతో సాగించే అక్రమాలు, వాటి వల్ల సామాన్యులు ఎదుర్కొనే ఇబ్బందులను చూపించడంలో ఆయన నిజాయితీ కనిపిస్తుంది.
అనవసరమైన కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా కథను వాస్తవికంగా నడిపించే ప్రయత్నం చేశారు. అయితే కథనంలో అక్కడక్కడా వేగం తగ్గుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ముందుగానే ఊహించేలా ఉండటం, క్లైమాక్స్‌లో భావోద్వేగాల తీవ్రత మరింత బలంగా ఉంటే బాగుండేదనిపించడం చిన్నపాటి నిరాశ కలిగిస్తాయి.
అయినప్పటికీ దర్శకుడు ఎంచుకున్న నేపథ్యం, నటీనటుల ప్రదర్శన, కథలోని సామాజిక కోణం ఈ లోపాలను కొంతవరకు కప్పిపుచ్చుతాయి. ఖాకీ యూనిఫామ్ వెనుక అధికారం మాత్రమే కాదు.. బాధ్యత కూడా ఉంటుందని గుర్తుచేసే సినిమా ఇది. అక్రమ ఇసుక తవ్వకాల నుంచి రాజకీయ జోక్యాల వరకు.. అధికార దుర్వినియోగం నుంచి సామాన్యుడి న్యాయపోరాటం వరకు పలు అంశాలను స్పృశించిన లెనిన్ పాండియన్ ఒక సాధారణ క్రైమ్ డ్రామాగా మాత్రమే మిగిలిపోదు. వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది.
వేగవంతమైన కథనం, భారీ యాక్షన్ సన్నివేశాలు, కమర్షియల్ మసాలా ఆశించే ప్రేక్షకులకు ఈ సినిమా పూర్తి స్థాయిలో నచ్చకపోవచ్చు. కానీ వాస్తవిక కథలు, సామాజిక సమస్యలతో కూడిన సినిమాలను ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఎంపిక.
చివరగా ఒక్క మాట.. అధికారం చేతిలో ఉందని చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకునేవారికి, ఆ అధికారమే ఒకరోజు ప్రశ్నగా మారుతుందనే విషయాన్ని గుర్తుచేసే సినిమా 'లెనిన్ పాండియన్'.
Share this Article