Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది ఓసారి పూర్తిగా చదవండి – ‘గరివిడి లక్ష్మి’ సినిమా చూసి వస్తారు !!

October 21, 2026 by M S R

.

Srichaman Madhusudan Challa   ….. *తూరుపు తీరపు జాన‌ప‌ద‌ సింధూరం
బ‌హుజ‌న మ‌హిళ‌ల సాధికార స్వ‌రం*
*గ‌రివిడి ల‌క్ష్మి…*

ఈ టైటిల్‌తో సినిమా మొద‌లైన‌ప్పుడు ఎవ‌డ్రీడు అనిపించింది. ఇది ముందుకెళుతుందా? అనే అనుమాన‌మూ వ‌చ్చింది. త‌రువాత అలికిడి లేదు. మ‌ళ్లా ఒక్క‌సారి పాట‌ల తూటాల‌తో గ‌రివిడి ల‌చ్చిమి ఇన‌ప‌డ్డం మొద‌లైంది. ఇదేటో సూడాలి అనుకున్నాను. అందులో నాకు మిత్రుడైన కోరాడ జాన‌కిరామ్ పాత్ర కూడా ఉంద‌నిపించింది. మాట్లాడాను.

Ads

అలాగే ఓ ర‌చ‌యిత రాసిన పాట‌ను సీఐ సురేష్ కుమార్ సిఫార‌సుతో ఫ్రెండ్లీగా మ్యూజిక్ చేసి పాడిన చ‌ర‌ణ్ అర్జున్ దీనికి సంగీత ద‌ర్శ‌కుడు కావ‌డం మ‌రికొంత ఆస‌క్తి రేపింది. ఈ సినిమా డైరెక్ట‌ర్ జ‌మ్ము గౌరునాయుడు అచ్చ‌మైన ఉత్త‌రాంధ్ర పేరు కావ‌డం, గ‌రివిడి ల‌క్ష్మి బుర్ర‌క‌థ‌లు నేను కుర్రాడిగా ఉన్న‌ప్పుడు చూడ‌టం, ఆ జాన‌ప‌దాలు నాకు చాలా ఇష్టం కావ‌డంతో ఈ సినిమా అప్ డేట్సును ఫాలో కావ‌డం ప్రారంభించాను.

సినిమా విడుద‌ల‌కు ముందు సెప్టెంబ‌ర్ 23వ తేదీన ఈ సినిమా హిట్ అవుతుంద‌ని ఓ పోస్టు పెట్టాను. రిలీజయ్యాక హిట్ అని కొంద‌రు ప్రేక్ష‌కులు చెప్పాక‌, నా న‌మ్మ‌కం నిజ‌మైంద‌ని నిన్న అన‌గా తేదీ 19న విజయవాడ ట్రెండ్ సెట్ మాల్‌లో తొలాట‌కు వెళ్లాను. థియేట‌రులో 40 నుంచి 50 మంది వ‌ర‌కూ ఉంటారు.

ఎవ్వ‌రూ ఎండ్ కార్డ్ ప‌డేవ‌ర‌కూ బ‌య‌ట‌కు వెళ్ల‌లేదు. అంటే ఆస‌క్తిగానే చూశార‌న్న మాట‌. బుర్ర‌క‌థ కేసెట్టుగా విడుద‌ల కావ‌డానికి గ‌రివిడి లక్ష్మి మ‌న‌సు ఎలాగు అంగీక‌రించ‌లేదో, గ‌రివిడి ల‌క్ష్మి సినిమాను అత్యాధునిక‌మైన ఈ మాల్‌, మ‌ల్టీ ఫ్లెక్సుల‌లో చూడ‌టం నాకూ ఇష్టంలేదు.

.

అది ఊర‌మాస్ ప్రాంతాల్లోని థియేట‌ర్ల‌లో చూడాలి. నగరాలలో ఉత్తరాంధ్ర వలసజీవులు నివాస ప్రాంతాలకు దగ్గర థియేటర్లలో ఆడాలి. ఈ సినిమా పట్ల ఆసక్తి రేగాలంటే 1980-90 మ‌ధ్య యువ‌కులైనా అవ్వాలి. ప‌ల్లెజీవ‌నం అయినా గ‌డిపి ఉండాలి. అప్పుడే గ‌రివిడి లక్ష్మి సినిమాలోని ఆత్మ మీకు క‌న‌ప‌డుతుంది.

గరివిడి ఫేట్ట‌రీ.. అదేనండీ ఫెర్రో ఎల్లాయిస్ క‌ర్మాగారం. దీనివ‌ల్ల కూడా గ‌రివిడి బాగా ఫేమ‌స్సు. గ‌రివిడి ఫేట్ట‌రీలో ఉద్యోగ‌మంతే గ‌వ‌ర‌మెంటు ఉజ్జోగం లెక్క‌. ఆ ఊరు మా తీరుగా ఉండీది. రాజాంలో ఇప్పుడు కాలేజీలు వొచ్చాయి గానీ.. ఒక 30 ఏళ్ల క్రితం రాజామోలు ఇంట‌ర్ అయిపోతే డిగ్రీ సేరాలంటే ప‌క్క‌నే గ‌రివిడి ఎల్లాల్సిందే.

ఆ త‌రువాత శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, వ‌యిజాగు, అన‌కాప‌ల్లి వ‌ర‌కూ ఎల్లేవారు. అలా ఉన్న‌త చ‌దువుల‌కు ఎల్లే వోలంద‌రికీ గ‌రివిడి బాగా తెలుసు. గరివిడిలో డిగ్రీ చ‌దువుతున్నాడంటే మా ఏరియాలో స్టాన్ ఫోర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్నంత గౌర‌వం. ఫేట్ట‌రీ ఓన‌ర్ / అదేనండి సేటు (మార్వాడీ) దుర్గాప్ర‌సాద్ ష‌రాష్ పుట్టిన‌రోజైతే కాలేజీలో చ‌దివే పిల్ల‌ల‌కు స్వీట్లు పంచేవారు.

గ‌రివిడికి ఆ ఫేట్ట‌రీ, ఆ కాలేజీలు, ఈ గుడులు అదొక వైభ‌వం. ఫ్యాక్ట‌రీ సంక్షోభంతో గ‌రివిడి గ‌త వైభ‌వం త‌గ్గుతూ వ‌చ్చింది. గ‌రివిడి రైలు గేటు కూడా బాగా ఫేమ‌స్సు. ఎందుకంటే చాలా సేపూ ప‌డీది. ఆ ప‌క్క‌నే అమ్మే సీనా కాజా కూడా.. దీనినే గ‌రివిడి కాజా అంటారు. ఇన్ని పేరు ప్ర‌ఖ్యాతులు ఉన్న‌ గ‌రివిడి .. రెడ్డి విజ‌య‌ల‌క్ష్మికీ త‌న పేరు ఇచ్చింది.

garividi lakshmi
ఉత్త‌రాంధ్ర‌లో బీసీలు అధిక‌శాతం ఉంటారు. అందులో తూర్పుకాపులు ఇంకా ఎక్కువ మంది. బీసీల‌కు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసేట‌ప్పుడు ఏ గ్రేడ్ అంటే 15 ల‌క్ష‌లు దాటిన కులాల జాబితాలో తూర్పుకాపు 16 ల‌క్ష‌లకు పైబ‌డిన‌ జ‌నాభాతో రెండోదిగా ఉంది. బీసీ రిజ‌ర్వేష‌న్ల‌లో చిట్ట‌చివ‌ర‌న ఉంటూ, అతి ఎక్కువ జనాభా ఉన్న కేట‌గిరీలు అన్నీ ఉన్న డీలో అతి పెద్ద జ‌నాభాతో విద్య‌, ఉద్యోగ‌, రాజ‌కీయ ఫ‌లాలు అందుకోలేని ఓ శాప‌గ్ర‌స్థ కులం.

బీసీలంతా తూర్పుకాపులను అగ్ర‌వ‌ర్ణాల‌వారు మాలో చేరిపోయార‌ని దూరం పెడ‌తారు. అగ్ర‌వ‌ర్ణాలు బీసీలు, తూరుపోళ్లు అంటూ ఈస‌డించుకుంటూ ఉంటారు. వీరి ప్ర‌ధాన‌ జీవ‌నాధారం వ్య‌వ‌సాయం. వ‌ల‌స‌లు కూడా అధికం. గోదావ‌రి జిల్లాలు, కృష్ణా- గుంటూరు, మ‌ద్రాసు, హైద‌రాబాద్ ఎక్క‌డ‌కెళ్లినా ఈ ప్రాంత కూలీలు క‌న‌ప‌డ‌తారు.

వీరు బీసీ- డీ సీరియ‌ల్ నెంబ‌ర్ 30 పేరుతో రిజ‌ర్వేష‌న్ పొందారు. ఈ రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన‌ప్పుడు నిర‌క్ష‌రాస్య‌త‌, బాల్యవివాహాలు, ద్వితీయ వివాహాలు, క‌ట్టూబొట్టూ, వెనుక‌బాటుత‌నం ఆధారంగా చేశారు. ఇంటిపేర్లు చాలావ‌ర‌కూ వ్య‌వ‌సాయ‌, పాడి, పంట‌లు, ప‌శుప‌క్ష్యాదులు, ఊరి పేర్ల‌కు సంబంధించిన‌వే ఉంటాయి. ఆవు, ఎడ్ల, పాడి, పంటల, చెట్టు, సల్ల ఇంటిపేర్లలో కొన్ని.

గోత్రం అంద‌రికీ నాగుల (నాగేశ్వ‌ర‌, నాగ‌లి), చాలా కొద్దిమందికి తాబేలు ఉంటుంది. ఈ కులానికి ఏ కార‌ణాల‌తో రిజ‌ర్వేష‌న్ కట్ట‌బెట్టిందో అక్క‌డ మొద‌ల‌వుతుంది ఈ సినిమా. తండ్రి ద్వితీయ వివాహం, నిర‌క్ష‌రాస్య‌త, మూఢ‌న‌మ్మ‌కాల వ‌ల్ల‌ త‌ల్లి దేవుడ‌మ్మ, విజ‌య‌ల‌క్ష్మిని చ‌దువుకు దూరం చేయ‌డం ఇవ‌న్నీ బ‌హుజ‌నుల బ‌తుకు చిత్రంలోంచి తీసిన చిత్రంగా నాకు క‌నిపించింది.

~~~~

anandi

  • క‌ల్పితాలు, క‌ట్టుక‌థ‌ల‌తో తీసిన భ‌యోపిక్కుల కంటే, రెడ్డి విజ‌య‌ల‌క్ష్మి ఉంటుండ‌గానే ఆమె చెప్పిన‌వి, జ‌రిగిన‌వి ఉన్న‌ది ఉన్న‌ట్టు తీసిన నిజాయితీ బ‌యోపిక్ ఇది. గ‌రివిడి ల‌క్ష్మి సినిమా పాట‌లు త‌న సినిమాల్లో పెట్టుకుని ఆమెకు క్రెడిట్ కూడా ఇవ్వ‌ని ఆర్పీ ప‌ట్నాయ‌క్‌ను క‌థ‌లో బాగం చేసి, చివ‌రిలో ఆయ‌న అభిప్రాయం కూడా వేశారు.మాతా రికార్డింగ్ స్టూడియో వాళ్లు చేసిన మోసాన్ని సినిమాలో చూపించి, వారి వాయిస్ కూడా సినిమా చివ‌ర్లో నిజాయితీగా ప్ర‌క‌టించారు. ఈ మాతా స్టూడియో వాళ్ల పేరు సినిమాలో దూతా అని మార్చారు. వీరు ఎక్కువ‌గా జాన‌ప‌ద క‌ళారూపాల‌న్నీ రికార్డు చేసి ఇప్పుడు యూట్యూబ్ వేదికగా, సోష‌ల్మీడియాలో వ‌దులుతున్నారు.

జాన‌ప‌దాల‌ను నా పాట‌లు అనేందుకు వీలు లేదు. కానీ వాటిని సేక‌రించి, కాలానుగుణంగా మార్చి, బాణీలు క‌ట్టి పాడి, వాటిని మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లిన‌వారే వాటిని ఓన్ చేసుకుంటారు, ఓన్ చేసుకోవాలి. అలా ఉత్త‌రాంధ్ర‌లో ఉడుపు పాట‌లు, బార‌సాల పాట‌లు, జోల పాట‌లు, పెళ్లిపాటలు, బోనుల‌పాట‌, జాలారి బాగోతం, త‌ప్పెట‌గుళ్లు క‌ళాకారులు ఆడిపాడే పాట‌ల‌ను త‌న‌దైన బాణీలో బుర్ర‌క‌థ‌లోకి ర‌ప్పించి, వినిపించి, ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన గ‌రివిడి ల‌క్ష్మిది బుర్ర‌క‌థ కాద‌ని.. ప‌ర‌మ ప‌విత్రురాలైన (మ‌హిళ‌ల‌తో పేకాట ఆడుతూ ప‌ట్టుబ‌డింది లెండి) ఓ క‌ళాకారిణి ఆవేద‌న చూశాం.

కొంత‌మంది బూతు, డ‌బుల్ మీనింగు డైలాగులే త‌ప్పించి బుర్ర‌క‌థ ఎక్క‌డుంది? అంటారు. ప్ర‌జ‌లు ఆద‌రించిందే క‌ళ‌. పాడుకున్న‌దే పాట‌. చూసిందే ఆట‌. ఒక సంవ‌త్స‌రంలో 365 రోజులు అంటే .. ప‌దివేల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చింది గ‌రివిడి ల‌క్ష్మి. రోజుకి ఒక ప్ర‌ద‌ర్శ‌న వేసుకున్నా దాదాపు 20 ఏళ్లకు పైగానే రోజుకి 5 నుంచి 8 గంట‌లు నిరంత‌రాయ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన గ‌రివిడి ల‌క్ష్మి పాట‌ల‌ను వేలాది గ్రామాల్లో, ఏళ్లుగా, కోట్లాది మంది ఆద‌రించారు. దీనిని పాట కాదంటే ఎలా?

చ‌దువుకోని ఓ మ‌హిళ ప‌ల్లెపాట‌ల‌ను, జాన‌ప‌దాల‌ను ప‌ట్టుకుని, ట్యూను క‌ట్టి ఆడి పాడుతుంటే.. ఉత్త‌రాంధ్రే ప‌ర‌వ‌శించింది. ఇంత‌కంటే ఆమెకు అవార్డులు ఏం కావాలి? గ‌రివిడి ల‌క్ష్మి పాట‌లు సినిమాల్లో పెట్టుకునే స్థాయికి ఎదిగాయి. క్యాసెట్లు దొర‌క‌ని స్థాయిలో అమ్ముడుపోయాయి. ఇంత‌కంటే గ‌రివిడి ల‌క్ష్మి ప్ర‌తిభ‌కు ఇంకా కొల‌మానాలేంటి?

garividi

గ‌రివిడి ల‌క్ష్మి పేరుతో బుర్ర‌క‌థ క‌ళాబృందాలు పుట్టుకొచ్చాయంటే.. బుర్ర‌క‌థ‌కు ఆమె బ్రాండ్ అయ్యింద‌నేగా.. సుదూర ప్రాంతాల‌కు జీపుల్లో గంట‌ల త‌ర‌బ‌డి ప్ర‌యాణించి, గంట‌ల‌పాటు మేక‌ప్ అయి… రాత్రి 10 గంట‌ల‌కు వేదిక ఎక్కితే, తెల్ల‌వారి 5 వ‌ర‌కూ ఏక‌బిగిన 7 గంట‌లు ఆడి, పాడి అల‌రించి బుర్ర‌క‌థ త‌ల‌మానికం గ‌రివిడి లక్ష్మి జీవిత క‌థ సినిమాగా రికార్డు కావ‌డం ఒక చారిత్ర‌క అవ‌స‌రం.

  • తండ్రి రెండో పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. ఒంట‌రి మ‌హిళ, మూఢ‌న‌మ్మ‌కాల‌తో ఉన్న‌ త‌ల్లి ద‌గ్గ‌ర పెరిగింది. చ‌దువుకు దూర‌మైంది. చిన్నారి పెళ్లికూతురుగా బ‌లిపీఠం ఎక్కింది. వంచ‌న‌తో ఒంట‌రి అయ్యింది. బుర్ర‌క‌థ‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపును కొంద‌రు వ్యాపారం చేశారు. మోసం చేశారు. ప్రేమ పేరుతో ఒక‌రు, పేరు ప్ర‌ఖ్యాతులంటూ మ‌రొక‌రు, సినీ భ్ర‌మ‌లు క‌ల్పించి మ‌రొక‌రు.. ఇన్ని త‌ట్టుకుని నిల‌బ‌డింది గ‌రివిడి ల‌క్ష్మి.

బుర్ర‌క‌థ‌కు వ‌స్తున్న మ‌హిళ అంటే ఆ ఊరి పెద్ద‌కో, కార్య‌క్ర‌మ నిర్వాహ‌కుడికో ఒక ఆట వ‌స్తువు. బుర్ర‌క‌థ సాగుతుండ‌గా తాగుబోతులు, మ‌ద‌మ‌హారాజులు వెకిలి చేష్ట‌లు.. వెర్రికూతలు, వేధింపుల‌కు లెక్కే లేదు. పేద‌రికం, వెనుక‌బాటుత‌నం, అవిద్య‌, వివ‌క్ష‌, ఇన్నింటినీ గెలిచి … తూరుపు తీరపు జాన‌ప‌ద‌ సింధూరంగా, బ‌హుజ‌న మ‌హిళ‌ల సాధికార స్వ‌రంగా వినిపించి నిలిచింది గ‌రివిడి ల‌క్ష్మి…

Garividi

అమ్మాయి ఆనంది సినిమా ఇదే మొద‌టిసారి నేను చూడ‌టం. గ‌రివిడి ల‌క్ష్మికి క‌ళాకారిణిగా పున‌ర్జ‌న్మ ఇచ్చింది. గ‌రివిడి ల‌క్ష్మి అంటే పాట కాదు, ఆట కాదు, న‌ట‌న కాదు.. మూడూ క‌లిసిన అద్బుతం. రెడ్డి విజ‌య‌ల‌క్ష్మి గ‌రివిడి ల‌క్ష్మిగా పేరెల్లిన‌ట్టే, ఆనంది ఇక గ‌రివిడి ల‌క్ష్మి ఫేం ఆనందిగా పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదిస్తుంది.

రాగ్ మ‌యూర్‌.. నిర్మాత కొడుకో, రికమెండేష‌న్ కేండిడేటో అని నేను పొరపాటుగా అనుకునేవాడిని. గ‌రివిడి ల‌క్ష్మిలో త‌న న‌ట విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించాడు. అచ్చం బుర్ర‌క‌థ‌లో హాస్య‌గాడిని చూసిన‌ట్టే అమ‌రిపోయాడు. కంచ‌ర‌పాలెం కిశోర్.. కేరాఫ్ కంచ‌ర‌పాలెంలో ఈయ‌న న‌ట‌న న‌న్ను చాలా రోజులు వెంటాడింది. మ‌ళ్లీ ఇప్పుడు.. అవ‌కాశాలు వ‌స్తే, తెలుగు తెర గ‌ర్వించ‌ద‌గ్గ‌ న‌టుడు అవుతాడు. సీనియ‌ర్ న‌రేష్‌, రాశి, ఎల్బీ శ్రీరాం గారు, శ‌ర‌ణ్య‌.. ఒక‌రేమిటి చిన్న‌పాత్ర దొరికినా..దానికి ప్రాణం పోశారు న‌టులు.

aanandi

ఉత్త‌రాంధ్ర యాస ఎక్క‌డా దెబ్బ తిన‌కుండా చ‌క్క‌గా ప‌లికించ‌డంలో ద‌ర్శ‌కుడు గౌరినాయుడు క‌ష్టం క‌నిపించింది. అలాగే ఉత్త‌రాంధ్ర న‌టులు ష‌క‌ల‌క శంక‌ర్, మ‌రికొంత మంది మెరిశారు ఈ చిత్రంలో.. వ్యక్తిగా ప‌రిచ‌యం కాక‌ముందు పాట‌గా రేలారే రేలా కార్య‌క్ర‌మం ద్వారా ప‌రిచ‌యం అయిన కోరాడ జాన‌కీరావు అంకిత‌భావం ఈ సినిమాలో పాట‌లు, సంభాష‌ణ‌ల వెనుక ఉన్న‌ట్టు నాకు అనిపించింది.

చ‌ర‌ణ్ అర్జున్ ఉత్త‌రాంధ్ర జాన‌ప‌దాల‌ను అద్బుతంగా ప‌ట్టేశారు. పాడిన వారు గ‌రివిడి ల‌క్ష్మి బుర్ర‌క‌థ లైవ్‌కు మ‌న‌ల్ని తీసుకెళ్లారు. ఏ పాత్ర చూసినా మ‌న ఊర్లో కుర్రాడిలా క‌నిపిస్తాడు. మా ఊరు టంకాల నారాయణరావు కూడా ఇందులో న‌టించాడు. జ‌య‌మ్మ పంచాయ‌తీలో ఉన్న జ‌మ్మ‌డు కూడా ఇందులో బ్రోక‌ర్ పాత్ర వేసి ర‌క్తి క‌ట్టించాడు.

 

  • గ‌రివిడి ల‌క్ష్మి అచ్చ తెలుగు సినిమా. ప‌ర‌భాష న‌టులు లేరు. పాత్ర‌ల‌కు ఎంచుకున్న వారంతా నిజ‌జీవితాల్లాగే స‌హ‌జంగా న‌టించారు. ఈ సినిమాలో మ‌రో గొప్ప విశేషం. ఉత్త‌రాంధ్ర బుర్ర‌క‌థ క‌ళాకారిణి గ‌రివిడి ల‌క్ష్మి జీవిత క‌థ అయితే, ఉత్త‌రాంధ్ర వాసి జ‌మ్ము గౌరినాయుడు ద‌ర్శ‌కుడు. రాయ‌ల‌సీమ‌కు చెందిన టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మాత‌. సినిమాకు ప్రాణంగా నిలిచిన గ‌రివిడి ల‌క్ష్మి పాత్ర‌ధారి ఆనంది, స‌త్తిబాబు క్యారెక్ట‌ర్ పోషించిన రాగ్ మ‌యూర్‌, సంగీత ద‌ర్శ‌కుడు చ‌ర‌ణ్ అర్జున్ తెలంగాణ ప్రాంతం వారు. బ‌తుకులు తెలిసిన వారు, వెత‌లు చూసిన‌వారు, ఈ సినిమాను ప్రాంతాల వారీగా కాకుండా తెలుగువారిగా అంతా కలిసి తెలుగు సినిమాగా నిల‌బెట్టారు.

సినిమాలో లోటుపాట్లున్నాయి. మా త‌మ్ముడు ఆనంద్ హైద‌రాబాద్‌లో ఫిజియో థెర‌పిస్ట్. ఈ సినిమా చూసి చాలా బాగుంది అన్న‌య్యా సినిమా అంటూ తెగ మెచ్చుకున్నాడు. అయితే చివ‌రిలో గ‌రివిడి ల‌క్ష్మి, ఆమె ఫ్రెండు, న‌రేష్‌ల వృద్ధాప్యం మేక‌ప్, ఏడుస్తుంటే ఒక కంట్లోంచి నీరు రావ‌డం ఇటువంటి వాటిని నాతో చ‌ర్చించాడు.

గరివిడి లక్ష్మి

సినిమాను తెరకెక్కించిన క్రమంలో ఎన్నో సాధకబాధకాలుంటాయి. తెలియక కొన్ని, తెలిసినా ఏం చేయలేక మరికొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఇప్పుడు విమ‌ర్శించినా, ఎత్తి చూపినా మార్చే అవ‌కాశం లేదు. షూటింగ్ ఉత్త‌రాంధ్ర‌కు దూరంగా సెట్ వేసి లేదంటే, ఇత‌ర ప్రాంతాల్లో తీసిన‌ట్టుంది. నేటివిటీ లోపించింది.

కేజీఎఫ్ ధూళి ఫార్ములాతో మ‌సిబారిన తెలుగు సినిమా మ‌ట్టివాస‌న ప‌డుతోంది. ప‌ల్లెబాట చూస్తోంది. జాన‌ప‌ద పాట‌ను వెతుకుతూ వెళుతోంది. మ‌నిషి కంటే పొడ‌వైన క‌త్తులు, యుద్ద‌ట్యాంకు కంటే పెద్ద‌వైన తుపాకులు, శ‌వాల గుట్ట‌ల‌పై కూర్చునే హీరోల బ‌దులు.. అమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా చేసుకునే న‌య‌వంచ‌కులు..పాట‌ను అమ్ముకునే ద‌ళారులను స‌హ‌జంగా చూపుతోంది తెలుగు సినిమా.

బ‌ల‌గం, జ‌య‌మ్మ పంచాయ‌తీ, ప‌లాస‌, మారుతీన‌గ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం.. కొన్నే చెప్ప‌గ‌లిగాను.. మనవైన మంచి సినిమాలు చాలానే వ‌స్తున్నాయి.. వీటిలో గ‌రివిడి ల‌క్ష్మికీ స్థానం ల‌భించింది. మంచి సినిమా.. థియేట‌ర్‌లో మ‌నుషులే లేరు. గ‌రివిడి ల‌క్ష్మి గురించి తెలిసినోళ్లు ఉత్త‌రాంధ్ర కూలినాలి జ‌నం. బ‌హుజ‌నం. వారు ఉండే ప్రాంతాల థియేట‌ర్ల‌లో ఈ సినిమా పెద్ద‌గా అందుబాటులో లేదు. మ‌ల్టీఫ్లెక్సులు, మాల్స్ థియేట‌ర్లు ఎంచుకోవ‌డం చాలా పెద్ద త‌ప్పు.
*చ‌ల్ల మ‌ధుసూద‌న‌రావు*
*9490638222, జ‌ర్న‌లిస్ట్‌*

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇది ఓసారి పూర్తిగా చదవండి – ‘గరివిడి లక్ష్మి’ సినిమా చూసి వస్తారు !!
  • అయ్యా… శోధిస్తే మా సీమలోనూ ఎన్నో హృద్యమైన కథలున్నయ్!
  • రఫీ గొంతులో బతుకమ్మ పాట! 57 ఏళ్ల తర్వాత సోషల్ మీడియాలో సందడి!!
  • తమన్‌ను అలా నిందిస్తారేం..? జస్ట్, ఇది ఓ పాత పాట రీసైకిలింగ్..!!
  • అమెరికాలో ఉద్యోగం ఊడిందా… హైదరాబాద్‌కు వచ్చేయ్ బిడ్డా !
  • ఒకే జట్టులో కోహ్లీ, బుమ్రా, స్మృతి, హర్మన్… అదెలా అంటారా..?!
  • రామాయణ ! ఓ సినిమా మాత్రమే కాదు – ఓ భారీ గ్లోబల్ పందెం !!
  • వీ6వెలుగు Vs బీఆర్ఎస్ ! KCR కొండపోచమ్మ నీటిమళ్లింపు రాద్ధాంతం !!
  • అక్షరధామ్‌లో వికలమైన మనసు… ఇదుగో ఇక్కడ కుదుటపడింది…
  • web-fraud-lottery… ఈ యూరో లింకుల్ని నమ్మకండి – అంతా డ్రామా !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions