ఒలింపిక్స్ దాకా వెళ్లింది… అందరి అదృష్టాలూ, అందరి ప్రతిభలూ ఒకేరకంగా ఉండవ్… మేరీకామ్ చూడండి, ఈ ప్రపంచఛాంపియన్ జడ్జిల పొరపాటుతో పోటీల నుంచి వైదొలగాల్సి వచ్చింది… మీరాబాయ్ చాను రజతం గెలిచి ఆనందంగా దేశానికి తిరిగొచ్చింది… గెలిచినవాళ్లు సంబరపడుతూ ఉంటే…, ఓడినవాళ్లు సైలెంటుగా కన్నీళ్లు నింపుకుని, సూట్‌కేసు సర్దుకుని, ఇంటికి వచ్చేయడం అత్యంత సహజం… మొన్న ఒకామె తను ఓడిపోయాక దేశప్రజలకు సారీ చెప్పింది… నా ప్రతిభ మేరకు పోరాడాను, ఓడిపోయాను, క్షమించండి అంటూ ఓ ట్వీట్ పెట్టింది… అదీ స్పిరిట్, హుందాతనం… దానికి వెంటనే ప్రధాని మోడీ స్వయంగా స్పందించాడు… ‘‘ఇది జస్ట్, ఒక ఆట తల్లీ, గెలుపూఓటములు సహజం, దేశం నీ స్పిరిట్ చూసి గర్విస్తోంది, నిన్ను స్పూర్తిగా తీసుకుంటుంది…’’ అని ఓదార్పు మాటలతో ట్వీట్ పెట్టాడు… ‘‘నా స్పూర్తి మీరు, నా ఓటమిలోనూ నా వెనుక నిలిచారు… నా ఆట ఆగదు సార్’’ అని ఆమె ఆనందంగా రిప్లయ్ ఇచ్చింది… ఇక్కడ సీన్ కట్ చేయండి…. బాగా నచ్చింది వార్త… నిజానికి తెలుగు మీడియా ఆమె గురించి ఏమాత్రం పట్టించుకోనట్టు కూడా అనిపించింది… ఆమె పేరు గానీ, ఆమె ఆడే ఆట పేరు గానీ చాలామందికి తెలియవు… ఆమె పేరు చదలవాడ ఆనంద సుందర రామన్ భవానీ దేవి… సింప్లీ భవానీ దేవి…
ఈ ఒలింపిక్స్‌లో ప్రవేశం పొందిన తొలి ఇండియన్ ఫిమేల్ ఫెన్సర్ ఆమె… అసలు ఒలింపిక్స్ ఎంట్రీయే ఓ పెద్ద అచీవ్మెంట్… కాదు, కాదు… ఆమె నేపథ్యం ఓసారి పరికిస్తే… ఆమె టోక్యో దాకా ఓ కత్తి పట్టుకుని రావడమే ఓ విశేషం… ఏమిటీ ఫెన్సింగ్… సింప్లీ… కత్తిసాము..!! కత్తులు, కటార్లు అందరికీ తెలుసు, కానీ ఒలింపిక్స్‌లో ఈ పోటీ ఉంటుందని తెలియదు… ఇందులో మూడురకాలు ఉంటయ్… ఈమెది Sabre రకం కత్తిసాము… తమిళనాడులో పుట్టింది… ఓ గుడి పూజారి బిడ్డ… తల్లి గృహిణి… నిజానికి ఈ ఫెన్సింగ్ ఆట ఆమెకు అనుకోకుండా అంటుకుంది… స్కూల్లో చదువుతున్నప్పుడు ఆరు కొత్త క్రీడాంశాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని బడిలో చెప్పారు… ఈమె వంతు వచ్చేసరికి ఈ ఫెన్సింగ్ మాత్రమే మిగిలింది… తప్పదు, టిక్ పెట్టింది… అప్పటికి ఈ ఆట ఏమిటో ఆ పిల్లకే తెలియదు… పైగా ఈ ఆట అంత ఈజీ కాదు… కత్తి ఖరీదు, మొహానికి కప్పుకునే ప్రొటెక్షన్ గేర్, డ్రెస్సులు అన్నీ కాస్ట్లీయే… ఆడుతున్నప్పుడు గేర్ మీద గీతలు పడితే రిపేర్లు, లేదంటే కొత్తవి కొనడం… పదో తరగతి పూర్తయ్యేసరికి ఆట మీద మక్కువ పెరిగింది… వేగం, ఒడుపు, టైమింగ్, ప్రాక్టీస్, డెడికేషన్ చాలా అవసరం… క్రమేపీ ఆమె తన చేతిలోని కత్తిని ప్రేమించడం స్టార్ట్ చేసింది…
Ads
ఆడపిల్లకు ఈ కత్తిసాములు ఎందుకని ఆడిపోసుకునే సమాజం గురించి మళ్లీ చెప్పుకోవడం ఎందుకు..? ఈమెకూ ఆ బెడద తప్పలేదు…! కానీ అమ్మ అండగా నిలబడింది… దాంతో ఈ ఫెన్సింగ్‌ను పదును పెట్టుకోవడానికి కేరళలోని తలసిరిలో ఉన్న స్పోర్ట్ అకాడమీ ఆఫ్ ఇండియా ట్రెయినింగులో చేరింది భవాని… పనిలోపనిగా అక్కడే బిజినెస్ మేనేజ్మెంటులో కూడా చేరింది… కానీ ఖర్చులు..? శాయ్ వసతి, ట్రెయినింగ్ దొరికింది… రాహుల్ ద్రవిడ్ అథ్లెట్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా GoSports Foundation స్పాన్సర్షిప్ లభించింది… ఆమె తొలి అంతర్జాతీయ పోటీ ట్రాజెడీ ఏమిటో తెలుసా..? పద్నాలుగేళ్ల వయస్సుకే టర్కీలో జరిగే ఓ ఇంటర్నేషనల్ పోటీకి వెళ్లింది… సరిగ్గా గైడ్ చేసేవాళ్లు లేరు, అక్కడ హోటళ్ల నుంచి ప్లేగ్రౌండ్ల వద్దకు సరైన టైంకి వెళ్లే ప్లానింగు లేదు… దాంతో పోటీ ప్రారంభానికి మూడు నిమిషాలు ఆలస్యం… పోటీ నిర్వాహకులు బ్లాక్ కార్డు చూపించి, పోటీ నుంచే వెళ్లగొట్టారు… వచ్చీపోయిన కర్చులు దండుగ… ఈమె అంత తేలికగా వదిలేసే రకం కాదు… ఎక్కడ ఏ పోటీ జరిగినా పోతూనే ఉంది… కత్తి ఝలిపిస్తునే ఉంది…
తరువాత ఏడాదికో, రెండేళ్లకో ఫిలిప్పీన్స్‌లో నిర్వహించిన ఆసియన్ చాంపియన్ షిప్లో కాంస్యం కొట్టింది… ఇక వెనుతిరిగి చూడలేదు… మలేషియాలో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో కాంస్యం… ఆమె విజయాలు చూస్తూ తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఈ అమ్మాయికి నగదు సాయం చేసి, అమెరికాలో ట్రెయినింగుకు పంపించింది… అప్పటి నుంచీ ఈమె దేశదేశాలు తిరుగుతూనే ఉంది… పతకాలు గెలుస్తూనే ఉంది… కొన్నేళ్లుగా ఇటలీలో శిక్షణ పొందుతూ ఈ ఒలింపిక్స్‌కు ప్రిపేరైంది… ఎంపికైంది… తొలి పోటీలో గెలిచింది, కానీ రెండో పోటీ వరల్డ్ నెంబర్ త్రీ క్రీడాకారిణితో పడింది… ఓడిపోయింది… సో వాట్..? నా చేతిలో కత్తికి ఇంకా పదునుంది… ఇక ఒలింపిక్స్ రావా..? నేేనేమిటో చూపించనా..? అంటోంది భవానీదేవి… కత్తిలాంటి పట్టుదల… కీపిటప్ ఖడ్గ భవానీ…!! (స్టోరీ నచ్చితే దిగువన ఉన్న డొనేట్ బటన్ దగ్గరకు వెళ్లండి, ముచ్చటను సపోర్ట్ చేయండి…)
Share this Article