.
Jagannadh Goud … రామాయణాన్ని, భారతదేశ జీవన విధానాన్ని విడదీసి చూడలేం. మన చుట్టూ ఉన్న ప్రతి పాత్ర రామాయణంలో ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఒక రామాయణం ఉంటుంది.
విశ్వమంతా శబ్దం చుట్టూ తిరుగుతుంది. ప్రపంచమంతా “మాట” చుట్టూ తిరుగుతుంది. మనం మాట్లాడే ప్రతి మాటకీ మనదే బాధ్యత.
రాముడు గొప్పవాడు, ధర్మం వైపు ఉన్నాడు. రావణుడు గొప్పవాడే కానీ అధర్మం వైపు ఉన్నాడు. రాముడి భార్య సీతమ్మ తల్లి పతివ్రతే, రావణుడి భార్య మండోదరి కూడా పతివ్రతే. రాముడు తన తండ్రి దశరథుడి మాటకు కట్టుబడి నిలబడ్డాడు. రావణుడు తన తల్లి కైకసి మాటకు కట్టుబడి నిలబడ్డాడు.
Ads
రామాయణంలో ప్రతి పాత్ర గొప్పదే. ప్రతి పాత్రకీ దానిదైన ఒక విశేషం ఉంది. ఆ పాత్ర నుంచి మనం తెలుసుకోవాల్సిన లేదా గమనించాల్సిన ఒక గుణం ఉంటుంది.
మంథర చెప్పుడు మాటల ప్రభావానికి లోనైన తన సవతి తల్లి కైకేయి కారణంగా, తెల్లారితే పట్టాభిషిక్తుడై అయోధ్యను పరిపాలించాల్సిన రాముడు అడవుల పాలయ్యాడు. చెల్లెలు శూర్పణఖ చెప్పుడు మాటల వలన రావణుడు విచక్షణ కోల్పోయి సీతమ్మను అపహరించాడు. రెండు వైపులా చెప్పుడు మాటలే కారణం. మనం చేసే ప్రతి పనికీ మనదే బాధ్యత. అందుకే మన చుట్టూ చెప్పుడు మాటలు చెప్పేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
రాముడి వైపు ప్రధానంగా లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు, జాంబవంతుడు, అంగదుడు, నీలుడు, నలుడు నిలబడ్డారు. తనకు పెళ్లయి భార్య ఉన్నా, భార్యను అయోధ్యలోనే ఉంచి అన్న కోసం నిలబడ్డాడు లక్ష్మణుడు. రాముడిని యజమానిగా చూసి అతనికి పరమ భక్తుడిగా మారిపోయాడు ఆంజనేయుడు. వాలి వల్ల ఎదురైన కష్టాల నుంచి తనను రక్షించిన రాముడికి సుగ్రీవుడు తన తోడ్పాటు అందించాడు.
వాలిని చంపినా, వాలి భార్య తార రాముడికి సహాయం చేసింది. లంకను చేరుకోవడానికి సుగ్రీవుడికి సలహాలు ఇచ్చింది. వానర రాజ్యంలో శాంతి నెలకొల్పింది. ఎలుగుబంట్లు, వానరులు మాత్రమే కాదు, చివరికి జటాయువు అనే పక్షి కూడా రాముడికి సహాయం చేసింది.
అడవుల పాలై ఆశ్రమంలో ఉన్నప్పుడు శబరి అనే వృద్ధురాలు కూడా తన దగ్గర ఉన్న పండ్లను రాముడికి తినిపించింది. రాముడి పాదధూళి వల్ల, నా దృష్టిలో ఆయన సహాయం వల్ల, రాయిగా ఉన్న అహల్య తిరిగి తన రూపాన్ని పొందింది. అడవుల్లో అగస్త్య మహాముని రాముడికి వరాలు ప్రసాదించి మార్గం చూపాడు.
నిజానికి భరతుడు తన సొంత కొడుకైనా, అన్నం కలిపి మొదటి ముద్ద రాముడికే తినిపించేది కైకేయి. మంచి బట్టలు కనిపిస్తే మొదట ఇది రాముడికైతే ఎలా ఉంటుందని అనుకునేది కైకేయి. రాముడి తల్లి కౌసల్య అయినా, ఇంకో పినతల్లి సుమిత్ర అయినా రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అందరినీ ఒకేలా చూసేవాళ్లు.
కానీ ప్రతి మనిషి జీవితంలో ఒక కైకేయి ఉంటుంది, ఒక మంథర ఉంటుంది. అంటే చెప్పుడు మాటలు చెప్పేవాళ్లు, ఆ చెప్పుడు మాటలు విని ప్రభావితమై మన జీవిత దిశను, దశను మార్చేవాళ్లు.
ఇక రావణుడి వైపు నిలబడిన వాళ్లలో అతని తమ్ముళ్లు కుంభకర్ణుడు, మైరావణుడు, అతని కుమారులు ఇంద్రజిత్తు (మేఘనాదుడు), అక్షయకుమారుడు, అతికాయుడు, సేనాధిపతి ప్రహస్తుడు, మంత్రులు మహోదరుడు, మహాపార్శ్వుడు ముఖ్యులు.
రావణుడికి చెల్లెలు శూర్పణఖ అంటే ఇష్టం. ఆమెకు విద్యుజ్జిహ్వుడితో పెళ్లి చేస్తే, విద్యుజ్జిహ్వుడికి తన బావ రావణాసురుడి లంకా సామ్రాజ్యం మీద, అతని సంపద మీద కన్ను పడింది. అందుకే రావణుడు అతన్ని చంపాల్సి వచ్చింది. రావణాసురుడికి సోదరుల వరుస అయ్యే ఖరుడు, దూషణుడు దండకారణ్యంలో నివసిస్తుంటే, తన చెల్లెలు శూర్పణఖను అక్కడికి పంపించాడు. వాళ్లు శూర్పణఖను బాగానే చూసుకున్నారు. రావణుడికి అండదండలుగా ఉండేవాళ్లు.
నిజానికి రావణాసురుడి తల్లి కైకసి మొదట్లో రాక్షస రాజ్యాన్ని స్థాపించాలని మాటలు చెప్పింది. కానీ సీతను అపహరించిన రావణుడికి ఆమెను తిరిగి ఇచ్చేయమని కొడుక్కి చెప్పింది. అధర్మాన్ని వీడమని చెప్పింది. రావణుడు విభీషణుడిని లంక నుంచి గెంటేస్తే, నువ్వు వెళ్లి రాముడిని కలువు అని విభీషణుడికి సలహా ఇచ్చింది కూడా కైకసియే. వివేకవంతురాలైన తల్లి అని చెప్పొచ్చు. చెడు చేసినప్పుడు, ఇది చెడు, మంచిది కాదు అని చెప్పింది ఆ మహాతల్లి.
రావణుడి తమ్ముడు విభీషణుడు రామ–రావణ యుద్ధంలో రాముడి వైపు ఉండి యుద్ధం చేస్తే, విభీషణుడి కుమారుడు తరణీసేనుడు లంక రక్షణ కోసం పెదనాన్న రావణుడి వైపే ఉన్నాడు.
అంతేకాదు, బ్రహ్మను గురించి రావణుడు ఒక్కడే తపస్సు చేయలేదు. కైకసి ముగ్గురు కుమారులైన రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు కలిసే చేశారు. ముగ్గురికీ బ్రహ్మ ప్రత్యక్షమై వరాలు ఇచ్చాడు. రావణాసురుడి ప్రాణాలు ఎక్కడ ఉన్నాయో మిగతా ఇద్దరికీ తెలుసు. అయితే అన్న కోసం కుంభకర్ణుడు ప్రాణాలు ఇచ్చాడు. ఇంకో తమ్ముడు విభీషణుడు అన్న ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. లంక రహస్యాలు, రావణుడి బలాలు, బలహీనతలు, అతని ప్రాణం ఎక్కడ ఉంటుందో అన్నీ రాముడికి చెప్పాడు విభీషణుడు.
కుంభకర్ణుడి కొడుకులు కుంభుడు, నికుంభుడు కూడా రావణుడి వైపే పోరాడారు. ఇంకా రావణుడి కవల పిల్లలు నరాంతకుడు, దేవాంతకుడు కూడా తండ్రి వైపే నిలబడి పోరాడారు.
రాముడు ఏకపత్నీవ్రతుడు. రావణుడు కూడా ఏకపత్నీవ్రతుడు అనేది కరెక్ట్ కాదు. రావణుడికి రెండో భార్య ధాన్యమాలిని ఉండేది. వాళ్లకు అతికాయుడు పుట్టి, బ్రహ్మ నుంచి బ్రహ్మాస్త్రాన్ని వరంగా పొందాడు. ఇంకా మూడు తలల త్రిశిరస్సు అనే కొడుకు కూడా రావణుడి వైపే పోరాడాడు.
….. ఈ విధంగా రామాయణంలో ఎన్నో పాత్రలు, ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. కొన్ని పాత్రలు ధర్మాన్ని బోధిస్తే, మరికొన్ని అధర్మం వల్ల కలిగే పరిణామాలను తెలియజేస్తాయి. ప్రతి పాత్ర వెనుక మనం గ్రహించాల్సిన ఒక జీవిత సత్యం ఉంటుంది.
నిజానికి ఆ కాలంలో రావణుడు మూడు లోకాలకు అధిపతి. ఆకాశం, భూలోకం, పాతాళం. అది ఊరికే రాలేదు. పరమ జ్ఞాని, ఉచితానుచితాలు తెలిసినవాడు రావణబ్రహ్మ. కానీ చెప్పుడు మాటలు విని రావణాసురుడయ్యాడు. అందుకే ప్రతి పనినీ ఆలోచించి విచక్షణతో చేయాలని అంటారు పెద్దలు.
ఫైనల్గా… రామాయణం సినిమా విషయానికి వస్తే, ప్రపంచ సినీ చరిత్రలో అవతార్ ఎలాగో, భారతీయ సినీ చరిత్రలో రామాయణం అట్లా ఉంది.
నిజంగా రామాయణాన్ని, మన జీవన విధానాన్ని విడదీసి చూడలేం. రామాయణం కేవలం ఒక కథ మాత్రమే కాదు, మనుషుల స్వభావాలను, బంధాలను, నిర్ణయాలను, వాటి పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఒక మార్గం. అందుకే ప్రతి మనిషీ రామాయణం గురించి తెలుసుకోవాలి.
మన జీవితంలో రాముడిలా ధర్మం కోసం నిలబడతామా, రావణుడిలా తెలిసీ అధర్మం వైపు వెళ్తామా అనేది మన నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. మన చుట్టూ మంథరలు ఉండొచ్చు, కైకేయిలు ఉండొచ్చు, లక్ష్మణులు, హనుమంతులు, విభీషణులు కూడా ఉండొచ్చు. కానీ ఎవరి మాట వినాలి, ఎవరి మాటను నమ్మాలి, ఎవరిని మన జీవితంలో నిలుపుకోవాలి అనేది మన విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది…
జీవితమే రామాయణం. ప్రతి మనిషీ ఒక రామాయణమే, ప్రతి పాత్ర ఒక రామాయణమే, ప్రతి కుటుంబం ఒక రామాయణమే!
Share this Article