‘‘కరెంటు పోతే ఎప్పుడొస్తుందో తెలియదు… దోమల మోత… అసలు ఈ జీవితం నుంచే పారిపోవాలనేంత చిరాకు… సరిగ్గా తిండి దొరకదు… మంచి బట్టల్లేవు… చినకు పడితే చాలు, మా రెండు గదుల ఇల్లు చెరువైపోతూ ఉంటుంది… పాపం, నాన్న కూడా ఏం చేయగలడు..? బండి లాగేవాడు రోజూ డెబ్బయ్, ఎనభై సంపాదిస్తే అదే ఎక్కువ కదా… అక్కడికీ అమ్మ కొన్ని ఇండ్లల్లో పనులు చేస్తూ వేణ్నీళ్లకు చన్నీళ్లు తోడుగా ఉంటోంది… మాకు దగ్గరలోనే ఓ హాకీ అకాడమీ ఉండేది… హర్యానా, కురుక్షేత్ర జిల్లా, షహబాద్ మా ఊరు… నా పేరు చెప్పనేలేదు కదూ… రాణి రాంపాల్… చిన్నప్పుడు రోజూ ఆ హాకీ అకాడమీలో ఆటల్ని చూసేదాన్ని… నాకూ ఆడాలని ఉంది… కానీ నాకు తెలుసు, నాన్నకు ఈ ఖర్చు భరించే స్థోమత లేదని… కనీసం హాకీ స్టిక్ కూడా కొనుగోలు చేయలేడు… ఇంకేం అడగాలి..? ఆ కోచ్ ఎప్పుడు కనిపించినా… సార్, సార్, నాకూ ఆ ఆట నేర్పండి సార్ అని బతిమిలాడేదాన్ని… ఓ పిల్లా, నువ్వు బక్కగా ఉన్నవ్, ఇంకా చిన్న పిల్లవు, హాకీ ఆడాలంటే బలం కావాలి తెలుసా అంటూ ప్రేమగా భుజం తట్టి, నవ్వుతూ వెళ్లిపోయేవాడు…
విరిగిపోయిన ఓ హాకీ స్టిక్ దొరికింది నాకు… పనికిరాదని పారేశారు అకాడమీలో… ఆ అకాడమీలో ఆట చూడటం, ఈ విరిగిన స్టిక్‌తో ఆడుకోవడం, కోచ్ కనిపించిన ప్రతిసారీ బతిమిలాడటం… ఇదే పని… హాకీ డ్రెస్సు కూడా లేదు కదా, సల్వార్ కమీజులోనే పరుగులు తీస్తూ ఉండేదాన్ని… మొత్తానికి కోచ్ ఏమనుకున్నాడో ఏమో… మీ పేరెంట్స్‌కు చెప్పిరా, చేర్చుకుంటాను అన్నాడు… ఆనందంతో ఇంట్లో చెప్పాను… వాళ్లు పాతకాలం మనుషులు కదా… అంత తేలిగ్గా ఒప్పుకోలేదు… ఆడపిల్లలు ఇంట్లో పనులు చేయడం నేర్చుకోవాలి అన్నాడు నాన్న గొణుగుతూ… ఆ పొట్టి స్కర్టుల్లో ఆటలేమిటి మనకు అని మొరాయించింది అమ్మ… మొత్తానికి ఒప్పించాను… కొన్నాళ్లు చూడండి, నేను సక్సెస్ కాకపోతే ఇక మీరు ఏం చెప్పినా చేస్తాను అన్నాను బింకంగా… అకాడమీలో చేరాక తెలిసింది అదెంత కష్టమో… ముందు వ్యతిరేకించినా తరువాత అమ్మానాన్న బాగా సపోర్ట్ చేశారు… ఇంట్లో గడియారం లేదు కదా… పొద్దున్నే లేచి, ఉజ్జాయింపుగా టైం అంచనా వేసి, నన్ను లేపి అకాడమీకి తరిమేది అమ్మ… అకాడమీలో అందరూ అర లీటర్ పాలు తాగాలి… బలం కావాలి కదా… నాకంత సీన్ ఎక్కడిది..? కష్టమ్మీద పావు లీటర్ తెచ్చుకునేదాన్ని… మిగతావి నీళ్లు… చల్తా… కోచ్ క్రమేపీ నాకు బాగా సపోర్ట్‌గా నిలిచాడు… వాళ్ల ఫ్యామిలీ కూడా దగ్గరైంది నాకు… కడుపు నిండా తినేదాన్ని వాళ్లింట్లో… ఒక్కరోజూ ప్రాక్టీస్ మిస్సయింది లేదు…
Ads
నా తొలి సంపాదన 500 రూపాయలు… ఒక టోర్నమెంటు గెలిస్తే వచ్చింది… తీసుకెళ్లి నాన్న చేతుల్లో పెడితే, ఆ చేతులు వణికాయి… 500 నోటును చేత్తో ఎప్పుడు పట్టుకున్నాడు గనుక… ‘‘అమ్మా, నాన్నా… మనం మంచి ఇల్లు కట్టుకోవాలి…’’ అన్నాను… కానీ అంత సులభమా..? ఆటలో ఒడుపు తెలిసింది, చాలా పోటీల్లో పాల్గొంటున్నాను… పదిహేనేళ్లు… నేరుగా జాతీయ జట్టులోకి చేరిపోయాను… అంత చిన్న వయస్సులో జాతీయ జట్టులో చేరడం అప్పట్లో పెద్ద విశేషం… ఈలోపు పెళ్లెప్పుడు చేసుకుంటావ్ అంటూ ఇరుగూ పొరుగూ… నాన్న ఒక మాటన్నాడు స్థిరంగా…. ‘‘నీ హృదయం చెప్పినన్ని రోజులూ ఆడుకో…’’ గుండె నిండిపోయింది… నేనిప్పుడు ఇండియా మహిళా టీం కెప్టెన్‌ను… ఓ ఇల్లు కూడా కట్టించాను నాన్నకు ఇచ్చిన మాట మేరకు… ఓసారి నాన్న దోస్త్ ఒకాయన తన మనమరాలిని తీసుకుని వచ్చాడు… ‘‘నేను రాణి అక్కలాగా హాకీ ప్లేయర్ అవుతాను, నువ్వు తనకు స్పూర్తి’’ అన్నాడు… ఎందుకో కన్నీళ్లొచ్చాయి… కొన్నేళ్లుగా నేను ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నది రెండే సందర్భాలు… ఈ చిన్నారికి స్పూర్తిగా నిలిచానన్న మాట వినడం, మా కొత్త ఇంట్లోకి వెళ్లడం…
ఒలింపిక్స్‌కు అర్హత సాధించినప్పుడు ఇతర క్రీడాంశాల ఆటగాళ్లు మొదట నమ్మలేదు… వుమెన్ హాకీ టీం మీద ఎవరికీ ఏ అంచనాలు ఉండేవి కావు… దాదాపు 36 సంవత్సరాల తరువాత ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మహిళా హాకీ టీం మాది… కరోనా కారణంగా మా ప్రిపరేషన్ అనుకున్నట్టుగా సాగలేదు… కానీ తొలి మ్యాచ్ వోకే, తరువాత రెండు మ్యాచులూ పోయాయి… మా తప్పులు కాదు, వాళ్లు మాకన్నా బాగా ఆడారు… దక్షిణాఫ్రికాను ఓడించి ఆశల్ని నిలబెట్టుకున్నాం… అనుకోకుండా గ్రేట్ బ్రిటన్ ఐర్లండ్‌ను ఓడించడంతో మేం క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాం… ఇప్పటికి మాకిది విజయమే… 41 ఏళ్ల తరువాత ఇండియన్ వుమెన్ హాకీ టీం క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించడం… అసలు పరీక్ష ముందుంది… గోల్డ్ కొట్టాలనే కల బుర్రలో తిరుగుతూ ఉంది… అనుకున్నట్టుగానే అమ్మానాన్నకు మంచి ఇల్లు కట్టించి ఇచ్చాను, నా దేశానికి ఓ మంచి పతకం సమర్పించుకోలేనా..? సంకల్పానికి దరిద్రం దేనికి..? చూద్దాం… నా చేతిలోని హాకీ స్టిక్ ఏం చేస్తుందో, నా టీం ఎలా కదులుతుందో… నేనయితే ఇంతకుముందుకన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉన్నాను… విరిగిపోయిన హాకీ స్టిక్‌తో నా చిన్నప్పుడు ఆడుకున్నంత అదే ఉత్సాహంగా…’’
Share this Article