………… By….. Bharadwaja Rangavajhala………….. డెబ్బై ఐదు ప్రాంతాల్లో … బెజవాడ మాచవరం మారుతీనగరం ప్రాంతాల్లో పొద్దున్నే రోడ్ల మీద ఎర్ర నిక్కరు తెల్లచొక్కాల పిల్లలు బారులు తీరి ఎస్ఆర్ఆర్ కాలేజ్ పక్కన ఉండే మలేరియా ఆఫీసు వీధిలోకి వెళ్లడం అనే సీన్ ప్రతి ఉదయం దర్శనమిచ్చేది. ఆ సందు ప్రారంభం నుంచీ ఎడమ వైపు రెండో బిల్డింగులో ప్రతిభానికేతన్ అనే స్కూలు ఉండేది. ఆ కాలంలో అంత సక్సస్ ఫుల్ గా నడచిన ప్రైవేటు స్కూలు లేదు. సివిఎన్ ధన్ గారి రవి ట్యుటోరియల్స్ మినహాయిస్తే … ప్రభుత్వ స్కూళ్లల్లోనే చేర్చడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపించిన రోజులవి. ఇంగ్లీష్ మీడియం లో చదివించాలనుకున్న వారు క్రైస్తవ మిషనరీ స్కూళ్లను నమ్ముకునేవారు తప్ప ప్రైవేటు స్కూళ్లను ఎంకరేజ్ చేసేవారు కాదు. … ట్యూషన్స్ నడిచేవి … అంతే తప్ప ప్రైవేటు స్కూళ్లు పెట్టి దెబ్బతిన్నవారే అధికం … కాకినాడ లో ఠాగూరు కాన్వెంట్ అనేది కూడా సక్సస్ ఫుల్ గానే నడిచేది … నా చిన్నప్పుడు .. ఆ తర్వాత అదీ కొనసాగినట్టు లేదు.
ఎంతటి ధనవంతులైనా సరే పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లోనూ కాలేజీల్లోనూ చేర్చడానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. అక్కడ సీటు దొరక్కపోతేనే ప్రైవేటు వైపు చూసేవారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో సీటు కోసం నానా తిప్పలూ పడేవారు ఆరోజుల్లో … అలాంటి రోజుల్లో … ప్రైవేటు స్కూలు పెట్టి … ఆ ప్రాంతపు తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించి … రెండు వేల మంది విద్యార్ధులతో నడిపించిన ఘనత ఖచ్చితంగా అట్లూరి బాలకృష్ణ ప్రసాద్ గారికే దక్కుతుంది. ఆయన తన స్కూలు ఫీజులు భారీగా వసూలు చేయలేదు. తల్లిదండ్రుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే తీసుకునేవారు.
అతి తక్కువ ఫీజులు ఉన్నప్పటికీ చాలా మంది పిల్లలను సగం ఫీజులు తీసుకోవడం నాకు తెల్సు. కొంత మందికి పూర్తి ఉచిత విద్య చెప్పిన సంగతీ నాకు తెల్సు. ఎందుకంటే నేను అక్కడ చదువుకోవడమే కాదు … నా తొలి ఉద్యోగం అక్కడే చేయడం వల్ల …
మాస్టారు చాలా డిసిప్లీన్డ్ … విపరీతమైన క్రమశిక్షణ … టైమ్ అంటే టైమే … ఏడింటికి రమ్మని మనకి టైమ్ ఇస్తే .. ఆరూ నలభై ఐదు నుంచీ ఆయన రడీగా ఉండేవారు. ఓ పాతిక మంది పిల్లలతో ప్రారంభమైన ప్రతిభానికేతన్ … తర్వాత రెండు వేలు ఓ దశలో మూడు వేల మంది వరకూ స్ట్రెంత్ వెళ్లింది. ఈ స్కూలుకు సంబంధించి మరో విశేషం ఏమిటంటే .. తెలుగు మీడియం స్కూలు … అంతే కాదు .. ప్రభుత్వ స్కూళ్ల ప్రభ వెలుగుతున్న రోజుల్లో వాటితో పోటీ పడ్డ ప్రతిభానికేతన్ … ప్రభుత్వ స్కూళ్లతో పాటే తన ప్రాభవాన్నీ కోల్పోయింది. చైతన్య నారాయణల జైత్రయాత్ర నడుస్తున్న రోజుల్లో ఓ సారి మాస్టారిని కల్సాను. మీరూ ఇంగ్లీష్ మీడియం అనేయవచ్చు కదా అన్నా … వద్దు అన్నారాయన. ప్రపంచం వెళ్తున్న వైపే మనం కూడా పోవాలి కదా అని చెప్తే … ఆయన నవ్వి ఆ పని నేనెప్పుడూ చేయలేదు. నాకు మంచి అనిపించింది చేశాను. దాన్ని ప్రపంచం మెచ్చుకుంది. ఇప్పుడు కాదనుకుంది … అంత మాత్రాన నేను మారాలసిన అవసరం ఏముంది అన్నారాయన నవ్వుతూ … స్కూలు పెట్టి పదిమందికి సేవ చేస్తూ నా జీవనాన్ని కొనసాగించాలనుకున్నానుగానీ … వ్యాపారం చేయాలనుకోలేదు … కనుక నేను డ్రాప్ అయిపోతున్నాను అన్నారు …
స్కూలు వదిలేశాక … హైద్రాబాద్ వచ్చేశారు. అమీర్ పేట సారధీ స్టూడియోస్ వెనకాల అమ్మనిలయం పేరుతో అపార్డ్మెంట్స్ కట్టి పెంట్ హౌస్ లో తానుండేవారు. ఓ నాలుగు రోజుల క్రింద తన డెబ్బై రెండో ఏట కన్నుమూశారు. మాస్టారు చనిపోయారు అనే వార్త నాకు మిత్రుడు గూడూరు ప్రసాద్ ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే బయల్దేరి వెళ్లాను. రాత్రి పన్నెండు గంటల తర్వాతే జరిగింది అని వాడి ఇన్ఫర్మేషన్ … కనుక ఇంటి ముందు టెంట్ వేసి ఉంటుంది. బంధువుల వాళ్లూ అంతా హడావిడి ఉంటుంది … ఓ పదినిమిషాలు అలా నిలబడి వచ్చేద్దాం అనే ఆలోచనే ..ఎందుకంటే … ఆయనతో నా రిలేషన్ టీచరూ స్టూడెంటూ రిలేషన్ మాత్రమే కాదు … చాలా సందర్భాల్లో నాకు తండ్రి పాత్ర కూడా పోషించారాయన. అందుకని అక్కడ ఉండగలనా లేదా అనే ఓ టెన్షన్ తో వెళ్లిన నాకు … ఇంటి ముందు టెంట్ కనిపించకపోయే సరికి ప్రసాద్ గాడు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు అని ఆశ చిగురించింది.
Ads
నెమ్మదిగా లోపలకి వెళ్లి వాచ్ మెన్ ని పిల్చా .. అతని భార్య వచ్చింది … మాస్టారు అన్నా … రాత్రి పన్నెండింటికి హాస్పటల్ నుంచీ వచ్చారు కదండీ అంది … హమ్మయ్య అనుకున్నా … చనిపోయారు కదా అంది నెమ్మదిగా …. నా కాళ్లల్లో శక్తి చాలడం లేదు … నిలబడ్డానికి … పన్నెండింటికి తీసుకొచ్చి తీసుకెళ్లిపోయారు … అమ్మ అయితే పైన ఉంది ..అందా అమ్మాయి … నెమ్మదిగా లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్లా … ఇల్లంతా నిశ్శబ్దం … ఆవిడ అలా కూర్చుని ఉన్నారు మౌనంగా … ఏంటమ్మా ఇది ఎలా జరిగింది అని అడిగా … పది రోజులుగా ఒంట్లో బాగోలేదు … హాస్పటల్ లో చేర్చాం …. డాక్టర్లు కష్టం అని చెప్పారు అయితే హోప్ వదలకూడదు కనుక అక్కడే ఉంచేశాను …నిన్న రాత్రి పన్నెండు దాటిన తర్వాత ఆయన వెళ్లిపోయారు … అన్నారు. మార్చురీలో ఉంచారా అన్నా … లేదు … నీకు తెల్సు కద బాబూ … ఆయన పద్దతి నాకన్నా మీకే బాగా తెల్సు … ఆయన గురించి … తను చనిపోతే బాడీని మెడికల్ కాలేజ్ కి డొనేట్ చేయాలనీ .. బంధువులు రావడం ఏడవడం తనకు ఇష్టం లేదు కనుక ఎవరికీ చెప్పొద్దనీ … ఇంటి దగ్గర టెంట్ వేయడం లాంటి పన్లు కూడా చేయకూడదనీ రాశారు కదా …దాన్ని పాటిస్తావా లేక చనిపోయాక ఈ శరీరం నా ప్రాపర్టీ అనుకుని నీ ఇష్ట ప్రకారం చేస్తావా చెప్పు అని అడిగారు … హాస్పటల్ లో చేర్చిన రోజే … మీ ఇష్ట ప్రకారమే చేస్తాను అని మాట ఇచ్చాను … చనిపోగానే ఆయన కట్టుకున్న ఇల్లు కనుక ఇక్కడకు తీసుకకువచ్చాను … ఓ పావుగంట మాత్రం అంబులెన్స్ అలా ఉంచాను … కామినేని వాళ్ల మెడికల్ కాలేజ్ కి అప్పగించేశాను … కర్మకాండలూ అవీ కూడా వద్దు అన్నారు కనుక నేను ఇలా మౌనంగా ఇంటికొచ్చేశాను అన్నారు.
ఆవిడకీ అరవై ఎనిమిది దాకా ఉంటాయి. పిల్లలకు చెప్పారా అన్నా … ఇన్ఫామ్ చేశాను గానీ ఎవర్నీ రావద్దనే చెప్పా … ఎందుకంటే … చనిపోయిన తర్వాత బాడీ చూస్తే అదే గుర్తుంటుంది వాళ్లకి … కనుక చనిపోయిన తర్వాత నా శరీరం ఎవరూ చూడాల్సిన అవసరం లేదు … అప్పుడు లాస్ట్ టైమ్ వాళ్లు మనల్ని కల్సినప్పుడు ఉన్న పిక్చరే ఉంటుంది కనుక అలా చేయమంటున్నాను అని చెప్పారు. నేనూ అదే చేశాను … అయితే నాతో పాటు ఉన్న వారు బయటకు ఫోన్లు చేసి చెప్పినట్టున్నారు … అన్నారావిడ.. అలాగే నాకు తెల్సిందమ్మా … బయల్దేరుతా అని లేచా … ఒంటిగంట అవుతోంది … భోజనం అందావిడ అసంకల్పితంగానే … అమ్మ కదా … నాకు అక్కడ ఉండబుద్ది కాలేదు … అంతకు ముందు వెళ్లినప్పుడల్లా ఫ్రంట్ రూమ్ లో టీవీ చూస్తూ ఇద్దరూ మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ వాదించుకుంటూ ఉండేవారు. ఆ దృశ్యమే కళ్లముందు మెదులుతోంది …
కిందకు వచ్చేశా …
ఆ మధ్య మాస్టారూ నేనూ కాకినాడ ట్రావెల్ చేశాం … మా క్లాస్మేట్ కూతురు పెళ్లికి వెళ్లాం .. వాడు కార్డ్ ఇవ్వడానికి హైద్రాబాద్ వచ్చినప్పుడు … ఆయన కండీషన్ పెట్టారు … భరద్వాజ నన్ను తీసుకెళ్లి తీసుకొస్తాను అంటేనే వస్తాను అని .. వాడు నా దగ్గరకు వచ్చి ఇదీ విషయం మాస్టారు మా అమ్మాయి పెళ్లికి రాకపోవడం అంటూ జరిగితే అది నీ వల్లే అదే జరిగితే నిన్ను చంపేస్తానొరే అని బెదిరించి వెళ్లాడు. దీంతో నేను మాస్టారి దగ్గరకు పోయి … మాట్లాడి టిక్కెట్లు బుక్ చేసి తీసుకెళ్లి తీసుకొచ్చా … మాస్టారి గురించి చాలా మందికి తెలియని విషయం … 1969 70 ప్రాంతాల్లో అప్పటికి ఆయన వయసు ఇరవై .. కొత్తగా పెళ్లైంది … నక్సల్బరీ ఉద్యమ ప్రభావం దేశంలోని యువతను ఆవరించిన వేళ … ఉద్యమంలోకి వెళ్లిపోవాలని విశాఖలో ఓ మిత్రుడి కాంటాక్ట్ కోసం బయల్దేరారు. ట్రైన్ యలమంచిలి దాటుతుండగా భార్యను ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించి వెనక్కి వచ్చేయాలనుకుని కాంటాక్ట్ కలిసాక … తన పరిస్థితి చెప్పి బయట నుంచే సాయం చేస్తాను అని వచ్చేశారు. ఈ విషయం ఆవిడకి కూడా తెలియదు … ఈ రోజుకీ …
తర్వాత అంటే డెబ్బై ఒకటి రెండు ప్రాంతాల్లో ప్రైవేట్లు చెప్పడం ప్రారంభించారు. దాని ఎక్స్ టెన్షనే స్కూలు … స్కూల్లో చేరిన పిల్లల్ని విపరీతంగా ప్రేమించేవారాయన. నన్ను రావూరీ అని పిల్చేవారాయన. ఇలా టెంత్ క్లాస్ థర్డ్ బ్యాచ్ సి సెక్షన్ లో ఫలానా వాడు ఉండేవాడు వాడి పేరు ఇది ఇంటి పేరిది అని మొన్న మొన్న కల్సినప్పుడు కూడా చెప్పేవారాయన. అంతటి మెమరీ .. ఎవరు కనిపించినా ఇంటిపేరుతో సహా చెప్పేవారాయన. మేం గడ్డాలు పెంచుకుని వెళ్లినా గుర్తు పట్టేసేవారు. చిన్నప్పుడు … నేనక్కడ చదువుతున్న రోజుల్లో … ఓ సారి ఓ టీచర్ క్లాస్ రూమ్ లో స్టూడెంట్ ను ఒరే అని సంబోధించడం ఆయనకు వినిపించింది. క్లాసు రూమ్ ల ముందు నుంచీ తిరుగుతూ ఇన్స్ పెక్ట్ చేస్తూ ఉండేవారు. అలా ఆయన చెవిలో పడింది ఈ ఏరా అనే శబ్దం … క్లాస్ రూమ్ లోకి వచ్చారు. నేరుగా ఆ టీచర్ తో చెప్పారు. పిల్లల్ని ఒరే అని పిలవడం తప్పండి … ఏమోయ్ అనండి ఏమయ్యా అనండి … అంతే తప్ప ఒరే అరే అంటే నా పిల్లల్ని … నేను ఒప్పుకోనండి అని చెప్పి వెళ్లిపోయారు. అదే పద్దతి … పిల్లలకే ప్రాధాన్యత అక్కడ … ఈ రూలు పిల్లలకూ వర్తించేది .. ఎవరూ ఎవర్నీ ఒరే అని పిల్చుకోకూడదు … ఏమోయ్ అనే పిలు .. లేకపోతే పేరు పెట్టి పిలు … అంతేగానీ ఒరే అరే అనద్దు అనే చెప్పేవారు పిల్లలకీ స్ట్రిక్ట్ గా … స్కూలు టైమింగ్స్ కూడా అప్పటి స్కూళ్ల పద్దతికి కాస్త భిన్నంగా ఉండేది …
ఉదయం ఏడున్నర నుంచీ తొమ్మిదింటి వరకూ మార్నింగ్ స్టడీ అని ఉండేది … అప్పుడు ఆ రోజు క్లాస్ లో చెప్పే లెసన్స్ ఓ సారి చదువుకోవాలి … పది నుంచి నాలుగుంపావు వరకూ స్కూలు … ఆరున్నర నుంచీ ఎనిమిదింటిదాకా నైట్ స్టడీ నడిచేది … అప్పుడు హోం వర్కులు చేయించేవారు. ఏదన్నా డౌట్ వస్తే మాస్టారే చెప్పేవారు. ప్రతిభా నికేతన్ కు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉండేది … కర్ణాటక నుంచీ ఒరిస్సా నుంచీ తమిళనాడు నుంచీ కూడా పిల్లలు వచ్చి చేరేవారు. హాస్టల్ లో వంట చాలా శ్రద్దగా చేయించేవారాయన. తను రుచి చూసిన తర్వాతే పిల్లలకు పెట్టాలి … భోజనాల దగ్గర మానిటరింగ్ ఉండేది .. ఆ కూర తిను అందులో ఇది నంచుకో బావుంటుంది … ఇలా భోజనాల కార్యక్రమం అయ్యేవరకు అక్కడే ఉండేవారు. వంట బాగోపోతే నిర్మొహమాటంగా ఆ వంటవాడ్ని మార్చేసేవారు. హాస్టల్ పిల్లల భుజాలపై చేతులు వేసి రేపు బ్రేక్ ఫాస్ట్ ఏమి చేయిద్దాం అని అడగడం నాకు తెల్సు. పాఠం చెప్పాక టీచర్లు పిల్లలకు నోట్స్ చెప్పాలి కదా … ఆ నోట్స్ వారు రాసి ముందు మాస్టారికి ఇచ్చేవారు. ఆయన చదివి సంతకం పెట్టిన తర్వాతే పిల్లలకు చెప్పాలి … ఇదీ నిబంధన.
ఆయన తర్ఫీదులో టీచర్లు కూడా చాలా బాగా చూసుకునేవారు పిల్లల్ని … పరీక్షల్లో మంచి మార్కులు వచ్చిన వారికి పుస్తకాలు బహూకరించేవారు. అలాగే స్కూలుకు ఓ చక్కని లైబ్రరీ ఉండేది … బుక్స్ ఇంటికి ఇచ్చేవారు. ఆ స్కూల్లో చదివిన వాళ్లల్లో చాలా మందికి రీడింగ్ హాబిట్ తగిలించింది ఆయనే .. విజయవాడలో ఎగ్జిబిషన్ కు తీసుకెళ్లడం … సినిమాలకు విద్యార్ధుల్ని తీసుకెళ్లడం కూడా అక్కడే చూశాను. ఎస్వీఆర్ బాంధవ్యాలు సినిమా నేను స్కూల్లో ఉండగా మాస్టారితో కల్సే చూశాను. ఆయనే తీసుకెళ్లేవారు. ఓల్డ్ స్టూడెంట్స్ ఎప్పుడైనా వెళ్లి పలకరిస్తే ఆయనకు పండగే … ఏం తింటావ్ ? ఇలా విపరీతమైన ప్రేమ చూపించేవారు. అందుకే ఆ స్కూలు వదిలేసి నలభై ఏళ్లైనా ఇప్పటికీ ఆయనతో నా రిలేషన్ కొనసాగుతోంది … మాస్టారు ఎలాంటి వారంటే … ఓ సారి మా స్కూలు ఎదురింట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు తగలబడిపోయింది. పిల్లలు ఇద్దరూ స్కూల్లో ఉన్నారు. తల్లిదండ్రులు మంటల్లో చనిపోయారు. బంధువులు వచ్చారు … కర్మ కాండలు అన్నీ ముగిసిన తర్వాత పిల్లల బాధ్యత ఎవరు చూడాలి అనే చర్చ నడుస్తోందక్కడ … మాస్టారు వెళ్లారు … ఆయనకి ఆ చర్చ నచ్చలేదు .. లేచి నిలబడి మీరెవరూ చూడక్కర్లేదు … పిల్లలిద్దరూ నా దగ్గరే ఉంటారు. మీకెవరికైనా చూడాలనిపిస్తే నా దగ్గరకు వచ్చి చూడచ్చు … అన్నారు. వాళ్లేదో మాట్లాడబోతుంటే నేను నిర్ణయం తీసేసుకున్నానండీ .. అని చెప్పి ఇద్దరినీ తీసుకొచ్చి తనే చదివించి ఉద్యోగాలు వచ్చాక పెళ్లిళ్లు చేసేదాకా బాధ్యత తీసుకున్నారు. తల్లిదండ్రులు చనిపోయేనాటికి ఆ పిల్లలు అమ్మాయి సెకండ్ క్లాస్ అబ్బాయ్ ఫస్ట్ క్లాసు అనుకుంటా … అదీ మాస్టారంటే … అందుకే … ఎవరు హైద్రాబాద్ ఏ పని మీద వచ్చినా ఆయన్ని కలవకుండా వెళ్లరు. ఇలా చాలా మంది …
మాస్టారు ఒకటి నమ్మారంటే అంతే .. నో యు టర్న్ .. వాక్సిన్ విషయంలోనూ అంతే … కోవిద్ వ్యాక్సిన్ వచ్చింది వేసుకున్నారా అంటే … వేసుకోను అన్నారు. ఆవిడ అయితే బ్రతిమాలారు … నువ్వు వేయించుకో … నా నమ్మకాలు నావి … నాకు కోవిద్ విషయంలో ప్రభుత్వాల తీరు దగ్గర నుంచీ అనేక అభ్యంతరాలున్నాయి … ఈ వ్యాక్సిన్ ల వ్యవహారం మీద కూడా నాకు అనుమానాలున్నాయి… వ్యతిరేకతా ఉంది … అని అలాగే ఉండిపోయారు … వ్యాక్సిన్ వేయించుకోలేదు … మొండి మనిషి … అనే టైటిల్ ఉండేది ఆయనకి … తను కాదు అనుకున్న తర్వాత ఎవరి కోసమూ నిర్ణయాలు మార్చుకోవడం ఆయనలో నేను ఎన్నడూ చూడలేదు. ఇంటర్ చదివే రోజుల్లో కొన్ని సార్లు ఆయన ప్రభుత్వాధికారులతో గొడవ పడేప్పుడు అబ్బా ఈయన మారడు అనుకునేవాణ్ణి … రూల్ ప్రకారం ఇది జరగాలి కదా … మీరు రాసుకున్నదే కదా నేను అడుగుతోంది ఇలా ఎంత వరకైనా వెళ్లిపోయేవారాయన.
ఎవరి రికమండేషన్ తో అయినా స్కూల్లో చేరడానికి వస్తే ఆయన చేర్చుకోను అనేవారు. ఏదైనా స్ట్రెయిట్ గా మాట్లాడడమే .. ఈ విషయంలో ఓ సారి ఓ లోకల్ రౌడీ మాస్టారికి దొరికిపోయాడు. నీ పేరు చెప్పి వస్తే నేను చేర్చుకోవడం ఏమిటి? పిల్లవాడు చదువుకుంటాను అంటే నేను చదువు చెప్తా … ఫీజులు కట్టలేం అంటే ఉచితంగా అయినా చదివిస్తా … లేదు ఇంతే కట్టగలం అంటే అంతే కట్టించుకుంటా … అది నా ఇష్టం .. నా స్కూలు విషయంలోనూ నా పిల్లల విషయంలోనూ ఎవరైనా వేలు పెడితే సహించేది లేదు అని వార్నింగ్ ఇచ్చి వచ్చేశారు. అదీ ఆయన ధోరణి … ఆవిడ అన్నట్టు ఏం మారలేదు అదే మొండితనం … అలాగే ప్రపంచానికి అర్ధం అయ్యారాయన. మనం అనుకున్నది మనం చెప్పింది మనమే పాటించలేనప్పుడు అదీ మరణం అంటే … అన్నారాయన … ఓ సారి కల్సినప్పుడు … దాన్ని మొండితనం అంటే నాకేం అభ్యంతరం లేదు అనేది ఆయన ఆర్గ్యుమెంటు … మాస్టారు వెళ్లిపోయారు అన్నప్పట్నించీ ఆయన స్టూడెంట్స్ ఎవరికీ మనసు మనసులో లేదు. మా ప్రసాద్ గాడికి ఫోన్ చేయాలంటే భయం వేస్తోంది … వాడు ఏడ్చేస్తున్నాడు. పొద్దున్న వైజాగ్ నుంచీ ఫోను … ఇంతగా కదిలించిన వ్యక్తిత్వం కనుకే … ఆయన మనలో ఎప్పటికీ బ్రతికే ఉంటారు అని చెప్పడం తప్ప చేయగలిగింది లేదు. మాస్టారూ అమర్ రహే .. మొండి మనిషీ అమర్ రహే …
Share this Article