.
దివంగత పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత డైరీలో సంచలన విషయాలు.. 32 ఏళ్ల ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో భయానక అనుభవాలు.. చిలీ చర్చి కుంభకోణమే నరక ద్వారాల దర్శనానికి నేపథ్యమా?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధించే కాథలిక్ చర్చి అత్యున్నత మతాధికారి.. వాటికన్ సిటీకి అధిపతి.. జీవితాంతం దేవుడి గురించి, విశ్వాసం గురించి, మానవత్వం గురించి మాట్లాడిన వ్యక్తి. అలాంటి పోప్ ఫ్రాన్సిస్ తన జీవితంలో మూడుసార్లు దెయ్యాన్ని ప్రత్యక్షంగా చూశానని రాసుకున్నాడంటే నమ్మగలమా? ఒకసారి ఏకంగా నరక ద్వారాలనే దర్శించానని పేర్కొన్నాడంటే ఆశ్చర్యపోకుండా ఉండగలమా? ఇవేవో ప్రచార కథలు కావు. దివంగత పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత డైరీ నుంచి వెలుగులోకి వచ్చిన విషయాలు!
Ads
కళ్లు అగ్నిజ్వాలల్లా.. భయంకరమైన స్వరం! పోప్ ఫ్రాన్సిస్ 1992 నుంచి 2024 వరకు తన జీవితంలోని అనుభవాలు, ఆలోచనలు, ఆధ్యాత్మిక సంఘర్షణలను వ్యక్తిగత డైరీలో రాసుకున్నాడు. ఆయన మరణానంతరం ఈ డైరీలోని ఎంపిక చేసిన అంశాలను ‘ది ప్రైవేట్ డైరీ ఆఫ్ పోప్ ఫ్రాన్సిస్’ పేరుతో పుస్తకంగా ప్రచురించారు. నవంబర్ 24న విడుదలైన ఈ పుస్తకాన్ని ఆయన సన్నిహిత సహాయకుడు, వాటికన్ సిద్ధాంత విభాగం అధిపతి కార్డినల్ విక్టర్ మాన్యుయెల్ ఫెర్నాండెజ్ సంకలనం చేశాడు.
ఈ డైరీలో పోప్ తన జీవితంలో మూడుసార్లు దెయ్యం ప్రత్యక్షంగా కనిపించిందని రాసుకున్నాడు. బ్యూనస్ ఎయిర్స్లో ఆర్చిబిషప్గా ఉన్న సమయంలో రెండుసార్లు, పోప్గా ఉన్న సమయంలో మరోసారి ఈ అనుభవం ఎదురైనట్లు పేర్కొన్నాడు.

ఒకసారి కారులో ఇంటికి వెళ్తుండగా దెయ్యం కనిపించిందని, మరోసారి ప్రార్థన సమయంలో చర్చి ప్రార్థనా వేదిక సమీపంలో కనిపించిందని వివరించాడు. దాని కళ్లు భయంకరంగా ఉన్నాయని, అగ్నిజ్వాలల్లా మండుతున్న ఆ చూపులు తనను తీవ్రంగా భయపెట్టాయని రాసుకున్నాడు.
మూడోసారి 2018లో చిలీ పర్యటన ముగించుకుని రోమ్కు తిరిగి వచ్చిన కొద్దిరోజులకు ఈ అనుభవం ఎదురైందట. ఒక సమావేశంలో ఉండగా దెయ్యం కనిపించడంతో పాటు దాని స్వరం కూడా వినిపించిందని పేర్కొన్నాడు. ‘ఇప్పుడు నేను కోరుకున్నదంతా సాధించాను’ అన్న విజయగర్వంతో కూడిన స్వరం తనకు వినిపించిందని రాశాడు. ఆ గొంతు ఇప్పటికీ తనకు గుర్తుందని వివరించాడు.
నరక ద్వారాల దగ్గరకు వెళ్లాడా? ఈ డైరీలో మరో ఆసక్తికరమైన అంశం 2018 జూన్ 7వ తేదీన రాసుకున్నది. నిద్రకు ఉపక్రమించే ముందు తనకు నరక ప్రవేశ ద్వారం కనిపించిందని పోప్ పేర్కొన్నాడు. ఆ దృశ్యాన్ని కొద్దిసేపు పరిశీలించానని, అయితే ఆ అనుభవం తనను తీవ్రంగా భయపెట్టిందని రాశాడు. వెంటనే చేతిలోని రోసరీని ఆయుధంలా పట్టుకుని ప్రార్థనలో మునిగిపోయినట్లు వివరించాడు.
నరక ద్వారాల దగ్గరకు వెళ్లడం ప్రమాదకరమని, అక్కడి మంటలు బయటకు ఎగసిపడి కాల్చివేయవచ్చని కూడా రాసుకున్నాడు. అయితే ఇక్కడే ఈ కథనంలో మరో కీలకమైన మలుపు ఉంది. పోప్ పేర్కొన్న నరక ద్వారాల దర్శనం వెనుక చిలీ చర్చిలో వెలుగుచూసిన మైనర్లపై లైంగిక వేధింపుల ఉదంతం ఉంది.
నరక ద్వారాల వెనుక చర్చి కుంభకోణం! 2018లో చిలీ పర్యటన సందర్భంగా అక్కడి చర్చిలో పూజారులపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆరోపణలు చేసిన బాధితుల వాదనలను మొదట్లో పోప్ ఫ్రాన్సిస్ విశ్వసించలేదు. ఆరోపణలు చేసినవారికి ఆధారాలు లేవని వ్యాఖ్యానించడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.
అయితే రోమ్కు తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితిని మరింత లోతుగా పరిశీలించాడు. బాధితులు చెప్పింది నిజమేనని, చిలీ చర్చి పెద్దలు తనను తప్పుదోవ పట్టించారని గుర్తించాడు. ఈ పరిణామం తనను తీవ్రంగా కలచివేసిందని డైరీలో రాసుకున్నాడు.
2018 జూన్లో నరక ద్వారాలు కనిపించాయని రాసుకున్న వ్యాఖ్యను కూడా ఈ పరిణామాల నేపథ్యంలోనే చూడాలి. చర్చిలో సాగిన అకృత్యాలు, వాటి తీవ్రత తనకు అర్థమైనప్పుడు కలిగిన ఆధ్యాత్మిక వేదనకు ఈ పదాలు ప్రతీకగా కనిపిస్తున్నాయి. జూలై, ఆగస్టు నెలల్లోనూ చర్చికి ఈ కుంభకోణం తెచ్చిన అవమానం, చెడు గురించి ఆయన బాధను డైరీలో వ్యక్తం చేశాడు.
పోప్ అంతరంగంలోనూ సంఘర్షణే! ఈ పుస్తకంలో కేవలం దెయ్యం దర్శనాలు, నరక ద్వారాల ప్రస్తావన మాత్రమే లేదు. 2021-22 మధ్య తాను రెండేళ్లపాటు తీవ్రమైన ఆధ్యాత్మిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు కూడా పోప్ వెల్లడించాడు. చర్చిని నడిపించే క్రమంలో అధికారం, నిర్ణయాలు, ఇతరులను తనకు అనుకూలంగా నడిపించాలనే ప్రలోభాల మధ్య అంతర్మథనం ఎదురైనట్లు రాసుకున్నాడు.
శారీరక అనారోగ్యం, తీవ్రమైన నొప్పులు, చర్చి పాలనలో ఎదురైన ఒత్తిళ్లు ఈ సంఘర్షణను మరింత పెంచాయి. చివరకు దేవుడి కరుణపై విశ్వాసంతో ఆ దశను అధిగమించినట్లు ఆయన రచనలు తెలియజేస్తున్నాయి.
పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత తన వద్ద ఉన్న ఈ డైరీ మరుగున పడిపోకూడదని, అందులోని ఆధ్యాత్మిక అనుభవాలు ప్రపంచానికి తెలియాలని కార్డినల్ ఫెర్నాండెజ్ భావించాడు. ఫ్రాన్సిస్ కోరిక మేరకే ఈ రచనలను వెలుగులోకి తెచ్చినట్లు వెల్లడించాడు.
మొత్తానికి.. ప్రపంచానికి దేవుడి కరుణ, ప్రేమ, క్షమాగుణం గురించి సందేశమిచ్చిన ఒక పోప్ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి భయాలు, ప్రలోభాలు, ఆధ్యాత్మిక సంఘర్షణలు ఎదుర్కొన్నాడో ఈ డైరీ మరో కోణాన్ని పరిచయం చేస్తోంది.
- దేవుడిని నమ్మినవారికి కూడా దెయ్యం భయం ఉంటుందా? నరక ద్వారాల దర్శనం అంటే నిజంగానే అలాంటి దృశ్యమా? లేక చర్చి ఎదుర్కొన్న పాపాలపై ఆయన అంతరంగంలో రగిలిన వేదనకు ప్రతిరూపమా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం పోప్ డైరీలోని మిగతా పేజీలను కూడా చదవాల్సిందే!
Share this Article