‘‘నాన్నే నాకు స్పూర్తి… తను ఎంత కష్టజీవో నాకు బాగా తెలుసు… ఓ చిన్న రైతు… తన భూమే తన సర్వస్వం…. ఎప్పుడు చూసినా పొలంలో ఏదో పనిచేస్తుండేవాడు… నాకు మంచి చదువు చెప్పించాలనేది నాన్న కోరిక… ‘ఒరే నాన్నా, మన భూమి, మన శ్రమే మన గుర్తింపు… డబ్బు అంత త్వరగా ఏమీ రాదు, మనలాంటోళ్లకు కాయకష్టం, పంటపొలం లేకపోతే డబ్బేది..?’ ఇలాంటి ముచ్చట్లే చెప్పేవాడు… ఊళ్లోకి ఏ కొత్త కారు వచ్చినా ఆసక్తిగా చూస్తుండేవాడు… ‘చూడ్రా, ఎంత అందంగా, సౌకర్యంగా ఉన్నాయో కార్లు..? నేను సాధించలేకపోయాను, నువ్వయినా అనుభవించాలిరా’ అనేవాడు నాతో… నిజమేనా, ఓ కారు కొని, అందులో నాన్నను కూర్చోబెట్టి, ఆయన కలను తీర్చగలనా నేను..? ఆ కళ్లల్లో ఆనందాన్ని చూడగలనా..? ఈ డబ్బు, ఈ కార్లు ఎలా సాధ్యం..? మంచి చదువా, మంచి కొలువా, పంట పొలమా, ఏది..? నాకేమీ తోచేది కాదు… క్రికెట్ ఆడుతుండేవాడిని… దాన్ని కెరీర్‌గా చేసుకుందామా..? తేల్చుకోలేని వయస్సు… మా అంకుల్ ఒకాయన షాట్‌పుట్ ప్లేయర్… అలవోకగా షాట్స్ విసిరేవాడు… ఆశ్చర్యమేసేది… మా ఊళ్లోని యువకులను పిలిచి చాలెంజ్ చేసేవాడు, నేను విసిరినంత దూరం మీరెవరైనా విసురుతారా..? ప్చ్, ఎవరికీ చేతనయ్యేది కాదు…
అరె, చెప్పనే లేదు కదూ… పంజాబ్‌లోని మొగా జిల్లా, ఖోసాపండొ ఊరు… నా పేరు తజిందర్‌పాల్ తూర్… అంకుల్ గురించి చెప్పాను కదా… తనను బీట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాను… అప్పటికది సరదా… ఖాళీగా ఉన్న పొలంలో షాట్ విసిరేవాడిని… ఏరోజుకారోజు అంకుల్‌ను రీచ్ అవుతున్నానా లేదా చూసుకునేవాడిని… ఓసారి తనను దాటేశాను… ఆశ్చర్యపడిన ఆయన ‘‘ఈ ఆటకు ఇంకా గుర్తింపు కావాలిరా, అది నువ్వు తీసుకురాగలవు’’ అని కౌగిలించుకున్నాడు ఆనందంగా… అదీ ఈ ఆటలో నాకు దక్కిన మొదటి రివార్డు… తనే మెళకువలు నేర్పించేవాడు… బడి వెళ్లడానికి ముందు, బడి విడిచిపెట్టాక… రోజూ రెండుసార్లు శిక్షణ… నాన్న ఒక్కరోజు కూడా నిరుత్సాహపరచలేదు… పొలం పనిలో దిగు అని చెప్పేవాడు కాదు… నా ఆట పదునెక్కుతోంది, పోటీలకు వెళ్లేవాడిని… గెలుపు రుచి చూస్తున్నాను… నాన్నకు కారు కొంటాననే నమ్మకం కుదురుతోంది… నా కెరీర్ ఏమిటో నాకు క్లారిటీ కూడా వచ్చేసింది… కానీ ఈలోపు ఓ పిడుగు… నాన్నకు బోన్ కేన్సర్… అదీ నాలుగో స్టేజ్… నా గుండె పగిలింది… ఊళ్లో ఉన్న మా పూర్వీకుల భూమిని అమ్మాల్సి వచ్చింది, లేకపోతే హాస్పిటల్ ఖర్చులకు డబ్బేది..? చిన్నప్పటి నుంచీ ఆ భూమినే తన ప్రాణంగా ప్రేమించిన నాన్న ఆ భూమిని అమ్మాల్సిన మా దుస్థితికి సాక్షాత్తూ రోదించాడు… ‘మీ పూర్వీకుల ఇజ్జత్ తీశారు కదా మీరు’ అనే ఊరివాళ్ల దెప్పులు మరింత బాధించేవి… నాన్నకు ఢిల్లీకి తీసుకెళ్లాలి చికిత్స కోసం… ‘ఆ షాట్ పుట్ కూడు పెట్టదు కానీ ఏదైనా పనిచూసుకో’ అనే బంధుగణం, ఊరివాళ్ల ఒత్తిడి పెరుగుతోంది… అంకుల్‌కు చెప్పాను… ‘‘నేను షాట్ పుట్ వదిలేస్తాను’’
Ads
Share this Article