ఇది ఏ హాస్పిటలో, ఎక్కడో తెలియదు… కానీ తెలిస్తే ఆ నర్స్ ఎవరో గానీ ఓసారి దండం పెట్టుకోవచ్చు… ఒక పాపులర్ పాటను, తెలుగువాడి గుండెల్ని కదిలించి, హృదయాంతరాల్లో కదలికను తీసుకొస్తున్న డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి పాటను ఈ నర్స్ ఎలా వాడిందో ఓసారి దిగువన వీడియో లింక్ చూడండి… ఇన్ని రోజులూ ఆఫ్టరాల్ ఓ ప్రైవేటు సాంగ్ అని తీసిపారేసేవాళ్లు, దాన్ని కొక్కిరిస్తూ పోస్టులు పెట్టి తమ పర్వర్షన్ ప్రదర్శిస్తున్నవాళ్లు తప్పకుండా చూడాలి… పక్షవాతంతో రోగి స్వాధీనం కోల్పోయిన ఒక చేయిని తిరిగి ఆ పేషెంట్ కంట్రోల్లోకి తీసుకురావడానికి ఈ పాటను ఓ మందుగా, ఓ మర్దనగా, ఓ ప్రేరణగా… ఓ ఫిజియోథెరపీగా వాడుతున్నది ఈ అమ్మాయి… అదీ మొక్కుబడిగా ఓ డ్యూటీగా కాదు, ప్రేమగా… ఓ ప్రయోగంగా…
అబ్బే, ఇదీ ఓ ఫేక్ అనీ, ఓ పబ్లిసిటీ స్టంటనీ కొట్టిపడేసేవాళ్లు కూడా ఉంటారు, వాళ్ల మానాన వాళ్లను అలా వదిలేసి… ఈ సీన్ చూస్తే మనకు అందులోని విశిష్టత అర్థమవుతుంది… నాడుల్ని ప్రేరేపించడం ద్వారా నరాల్లో, రక్త నాళాల్లో కదలికను, స్పందనను కలిగించడమే ఫిజియోథెరపీ ఉద్దేశమైతే ఆమె చేస్తున్నది ఆ ప్రయత్నమే… దాన్ని మెచ్చుకోవాలి… పెళ్లిళ్లు, బరాత్‌లు, సంగీత్‌లు, హల్దీ ఫంక్షన్లు, ప్రైవేట్ గెట్టుగెదర్లు, పార్టీలు, వాట్ నాట్… ప్రతిచోటా మారుమోగుతున్నది ఈ పాటే… కారణం, ఆ పాట కంటెంటు, ఆ ట్యూన్, ఏదైనా కావచ్చు… ఏ టాప్ హీరోయో నటించిన సినిమా సాంగ్ కాదు, ఏ టాప్ మ్యూజిక్ డైరెక్టరో స్వరపరిచిన గీతం కాదు, ఏ పాపులర్ లిరిక్ రైటరో రాసిన సాహిత్యమూ కాదు… ఓ ప్రైవేట్ ఆల్బమ్… ఐనా సరే, అదింత పాపులర్ అయ్యిందంటే గొప్ప విశేషమే… ఇక ఫిజియో థెరపీ విషయానికొస్తే ఆ నర్స్‌కు అభినందనలు… వందల మాటలేల..? ఒక్కసారి ఆ పాటను, ఆ నర్స్ ప్రయత్నాన్ని, ఆ రోగి కళ్లల్లో ఆనందాన్ని, ఆ ప్రయోగాన్ని చూస్తే సరిపోదా..? అందుకే, ఇక్కడే ముగిద్దాం… నాలుకలపై నాలుగు రోజులపాటు ఆడే పాటలు అనేకం ఉండొచ్చు, కానీ ఆత్మను పట్టుకునే పాటలు కొన్నే… డుగ్గు డుగ్గు దానికి తక్కువేమీ కాదు..!!
Ads
Share this Article