.
Murali Buddha ….. “10 రూపాయల బీర్ నుంచి 10 కోట్ల డిమాండ్ – బాగా ఎదిగిన జర్నలిజం…
అరే, ఈనికి కాస్త మంచి ఆదాయం వచ్చే ప్లేస్‌లో పోస్టింగ్ ఇవ్వురా బయ్ .. నీ పని అయిపోతుంది పో ….” అన్నాడు వీహెచ్… ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్‌లో అధికారి ఒకరు పీసీసీ అధ్యక్షునిగా ఉన్న వి హనుమంత రావును గాంధీ భవన్ లో కలిశాడు… కుటుంబ సమస్యలు, ఏవేవో సమస్యలు చెప్పి తానున్న చోటు నుంచి ఇంకో చోటుకు బదిలీ కోరాడు …
Ads
కుటుంబ సమస్యలు కావు ఆరోగ్య సమస్యలు కావు, అసలు సమస్య ఆదాయం బాగుండే చోటు కావాలి .. హనుమంతరావు దర్భార్‌లో ఈ సీన్‌ను ప్రత్యక్షంగా చూసి మూడున్నర దశాబ్దాలు అవుతున్నా అత్యంత సహజంగా ఉన్న సీన్ అలా గుర్తుండి పోయింది …
ఆ దర్బార్‌కు నేను ఎందుకు వెళ్ళాను అంటే ? 1990 ప్రాంతంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది . వి. హనుమంతరావు పీసీసీ అధ్యక్షులు … అప్పుడు నేను సంగారెడ్డిలో మెదక్ జిల్లా రిపోర్టర్‌ను .. జహీరాబాద్ ఈనాడు రిపోర్టర్‌ను అక్కడి కాంగ్రెస్ నాయకుడు ఎవరో బీర్ తాగిస్తే ఏమైనా రాస్తారు అని తిట్టాడు …
ఆ రోజుల్లో ఇప్పటిలా కాదు, పోటీ ఉన్నా రిపోర్టర్లు అంతా ఒక జట్టుగా ఉండేవారు … ఇప్పటిలా పార్టీల వారీగా కాదు … జహీరాబాద్ కు చెందిన బాగారెడ్డి అప్పటి కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు. వారికి ఫిర్యాదు చేసినా చర్యలు లేవు .
దానితో జహీరాబాద్ రిపోర్టర్లు జిల్లా రిపోర్టర్లకు చెబితే, జిల్లా రిపోర్టర్ల బృందం పీసీసీ అధ్యక్షునికి ఫిర్యాదు చేసేందుకు గాంధీభవన్‌కు చేరుకుంది … ఆ సమస్య పుణ్యమాని హనుమంతరావు దర్భార్‌లో కొన్ని అద్భుత దృశ్యాలను చూసే అదృష్టం కలిగింది …
అంతకు ముందు సినిమాల్లో , పత్రికల్లో చదవడం తప్ప అంత పెద్ద దర్భార్ చూడలేదు … బదిలీలు ఇంకా ఏవేవో సమస్యలపై వచ్చిన వారు గుంపులు గుంపులుగా ఉన్నా, ఫోన్ మీద అక్కడికక్కడే ఇన్స్టెంట్ తీర్పులు …
ఎక్సయిజ్ అధికారి ఏవేవో కథలు చెప్పి, బదిలీ కోరితే హనుమంత రావు మాత్రం అసలు కథ అర్థం చేసుకొని ఠక్కున, ఆదాయం ఎక్కువ వచ్చే చోటుకు బదిలీ చేయమని సంబంధిత ఉన్నతాధికారికి ఆదేశించారు … మా బీరు సమస్యను ఏం చేశారో ? ఎలా పరిష్కరించారో గుర్తు లేదు కానీ ఎక్సయిజ్ అధికారి సమస్య మాత్రం గుర్తుండి పోయింది .
1990 ప్రాంతంలో బీర్ ఎంతుండేది అని సెర్చ్ చేస్తే మహా మహా బ్రాండ్ బీర్ కూడా 10 నుంచి 20 రూపాయల ధర ఉండేది అని చెబుతోంది … ఆ రోజుల్లో మీడియా తమ గురించి రాస్తే, ఇలానే తిట్టేవారు బీర్ కోసం ఏమైనా రాస్తారు అని …
నెట్‌లో యేవో వార్తలు చూస్తుంటే టివి5 మూర్తి పది కోట్లు అడిగాడు అని బాధితుడు కోర్ట్‌కు వెళ్లడం – కేసు నమోదు చేయమని కోర్ట్ ఆదేశం వార్త … సీఎం సన్నిహితుడు ల్యాండ్ వివాదంలో ఒకరిని కిడ్నాప్ చేసి బంధించాడుట . బిగ్ టివి రిపోర్టర్ దీనిలో భాగస్వామి అని వరుస వార్తలు చూసి … జర్నలిస్ట్‌లు ఎంతగా ఎదిగిపోయారా అని ముచ్చటేసింది …
కిడ్నాప్‌లలో , ల్యాండ్ మాఫియాలో , అన్ని నేరాల్లో మేము సైతం అంటూ గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు …
ఎక్కడి పది రూపాయల బీర్ కోసం కక్కుర్తి, ఎక్కడి పది కోట్ల కేసు … వందల కోట్ల ల్యాండ్స్ వివాదాలు … ఏవేవో క్రమ సంబంధాలు …
టెక్నాలజీపరంగానే కాదు వ్యవహారాలపరంగా కూడా ఎంతో ముందుకు దూసుకు వెళ్లారు .. జొన్నలగడ్డ రాధాకృష్ణ అని ఓ జర్నలిస్ట్ ఉండేవారు . బాగా రాసేవారు … ఆయన ఓ పత్రికలో బాస్‌గా ఉన్నప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు .
గొప్ప రిపోర్టర్‌గా వెలిగి పోతున్న ఒకరిని హైదరాబాద్‌కు బదిలీ చేస్తా అంటే… వద్దే వద్దు కల్మషంతో నిండిన మహానగరంలో నేను ఉండలేను … అమాయకత్వం నిండిన ఆకలి జిల్లాలోనే పని చేస్తా అని ఆ కాలంలో తెలంగాణలోని ఆకలి జిల్లాకు బదిలీ చేయించుకున్నారు …
అంతా ఆహా ఓహో అనుకున్నారు . చాలా రోజుల తరువాత తెలిసింది ఆ ఆకలి జిల్లాలో వివాదాస్పద భూమి కోసమే ఈ బదిలీ అని … టీచర్ , జర్నలిస్ట్ , ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా మనిషే … ఏ వృత్తిలో ఉన్నా మనిషి మనిషే . సమాజం ఎలా మారుతుంటే సమాజంలో భాగం అయిన వారు అలాగే మారుతుంటారు … – బుద్దా మురళి
ఓ మామూలు రిపోర్టర్ స్థాయి నుంచి వందల కోట్ల మీడియా మాఫియాగా ఎదిగిన జర్నలిస్టుల కథలు కూడా ఉన్నాయి
Share this Article