.
చాలాసార్లు మీరు ఈ కథ చదివి ఉండవచ్చు… ఏమో, చదివి ఉండకపోవచ్చు కూడా… సమూహంలో ఒకరు అదృష్ణవంతుడు, పుణ్యశీలి ఉంటే ఆ సమూహానికి భద్రత… అదే ఒక్కడు దురదృష్ణవంతుడు ఉన్నా సరే సమూహం మొత్తానికీ అరిష్టం…
మరోసారి ఇది చదవండి… పర్లేదు, మనమెంత నిమిత్తమాత్రులమో చెప్పే కథ… మనల్ని నేలపై ఉంచే కథ…
Ads
చీకటి కావస్తున్నది… ఆ బస్సు రద్దీగా ఉంది… ప్రయాణికులతో నిండుగా ఉంది… గమ్యస్థానంవైపు మెల్లిగా వెళ్తున్నది…
అడవిలోకి ప్రవేశించింది… ఘాట్ రోడ్డు… అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది… భయంకరమైన ఉరుములు, మెరుపులు… కుండపోత వర్షం…
ప్రయాణికులు చూస్తుండగానే ఓ పిడుగు పడింది… బస్సుకు 50, 60 అడుగుల దూరంలోని ఓ చెట్టు నేలకూలింది… డ్రైవర్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్… బస్సుకు సడెన్ బ్రేక్ వేశాడు… ఆ చెట్టు మరో పక్కకు ఉన్న లోయలోకి పడిపోయి, వీళ్ల మార్గానికి అడ్డురాలేదు…
ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు… కాసేపటికి మళ్లీ బస్సు బయల్దేరింది… మెల్లిగా సాగుతున్నది ప్రయాణం… బస్సుకు ఏమవుతుందో ఏమో అనే భయంతోపాటు చలి ప్రయాణికుల్ని వణికిస్తున్నది…
రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో బస్సు… మరో పిడుగు… ఈసారి మరింత దగ్గరగా ఉన్న చెట్టుపై పడింది… చూస్తుండగానే అది నిలువునా చీలిపోయింది… డ్రైవర్ మరోసారి సడెన్ బ్రేక్ వేశాడు…
దాంతో అయిపోలేదు… ఇంకోసారి… ఇలా మూడుసార్లు… మూడోసారి మరీ బస్సుకు ఇంకా దగ్గరగా 30 అడుగుల దూరంలో పడింది… ప్రయాణికుల్లో భయం పెరిగింది… కొందరు ఏడుస్తున్నారు… అరుస్తున్నారు…
వారిలో సాధువులా కనిపిస్తున్న ఓ పెద్ద మనిషి ఇలా అన్నాడు… ‘‘చూడండి, మనందరిలో ఒక దురదృష్టవంతుడు ఎవడో ఉన్నాడు… పిడుగుపాటుతో మరణం అని రాసిపెట్టబడి ఉన్న మనిషి తను… అతని కర్మఫలంతో మనం కూడా తనతోపాటు చావవలసి ఉందేమో…
అందుకని ఓ పనిచేద్దాం… మనలో ఒక్కొక్కరు విడిగా అదుగో ఆ ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని రావాలి, మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి వెళ్లి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు… మిగతావాళ్లందరమూ క్షేమంగా వెళ్లిపోవచ్చు… ఒక్కరి కోసం అందరు చావాలా… ఆ ఒక్కడిని వదిలించుకుని అందరమూ బతకాలా, ఆలోచించండి’’
అందరూ తలలూపారు… అంతకు మించి గత్యంతరం లేదనే భావనకు వచ్చేశారు… మొట్టమొదట ఆ పెద్దమనిషే చెట్టు వద్దకు వెళ్లి ముట్టుకుని మళ్లీ వచ్చి బస్సులో కూర్చున్నాడు… ఒక్కొక్కరూ అలాగే భయంభయంగా వెళ్తున్నారు… వచ్చి బస్సులో కూర్చుని తేలికగా ఊపిరి పీల్చుకుంటున్నారు…
అందరూ అయిపోయారు ఒక్కడు తప్ప… అంటే ఏమిటి అర్థం..? తనే మరణించబోతున్నాడు అని… అందరూ తనను జాలిగా చూస్తున్నారు… వెళ్లి ముట్టుకో త్వరగా, మేమంతా బతికిపోతాం అనుకుంటున్నారు… అతనిలో కూడా భయం… విషయం అర్థమైంది…
కాసేపు మొరాయించాడు చెట్టు దగ్గరకు వెళ్లడానికి… బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమంతా చావాలా అంటూ బలవంతంగా బస్సులోనుంచి కిందకు నెట్టారు… చేసేదేముంది..? వెళ్లాడు… చెట్టును ముట్టుకున్నాడు… అంతే… ఫటేళ్మని పెద్ద శబ్దం… పిడుగు…
పడింది తన మీద కాదు… ఆ బస్సు మీద… ఆ బస్సులోని ప్రయాణికులందరూ మరణించారు… తను దిగ్భ్రమకు గురై చూస్తూనే ఉన్నాడు… అంటే అర్థమేమిటి..?
తనొక్కడికే బతికే రాత ఉంది కాబట్టి ఇప్పటిదాకా ప్రతి పిడుగు బస్సు సమీపంలోని చెట్లపై పడింది గానీ బస్సుపై పడలేదు… ఎప్పుడైతే బస్సు నుంచి అతను బయటికి వెళ్లిపోయాడో… పిడుగు బస్సుపై పడింది… వాళ్లంతా పోయారు… తను మిగిలాడు… ఇదీ ఒక అదృష్టవంతుడి వల్ల సమూహానికి రక్షణ..!!
Share this Article