……… By… Gurram Seetaramulu………. అదొక ఆదివాసీ గ్రామం . దశాబ్దాల నిర్బంధం తిష్టవేసిన చెరసాల లాంటి గిరిజన గూడెం. కనీసం పేపర్ ఎర్ర బస్ కూడా టయానికి దొరకని నిజం. అక్కడొక బడి పంతులు. ఆయన తమ్ముడు నాకు ఆప్తుడు. ఆ వూరిలో కాన్వెంట్ లేదు, కనీసం నూటా యాభై కిలోమీటర్లు పోతే తప్ప ఇంగ్లీష్ మీడియం బడి అందుబాటులో లేదు. ఉదయం గంట మోగిన దగ్గర నుండి సాయంత్రం ఇంటి బెల్లు మోగే వరకు ఆయనకు అక్కడి పిల్లలే జీవితం.
తన ఇద్దరు ఆడబిడ్డలు తనతో బాటే అదే బడిలో పది దాకా చదువు కున్నారు. ఇద్దరికీ సింగిల్ అట్టెంప్ట్ లో MBBS వచ్చింది ఇప్పుడు ఒకామె గాంధీలో MD ఇంకొకరు ఎక్కడో అదే చదువు. ఆయన చిట్ ఫండ్ కంపెనీల చుట్టూ తిరగలేదు, నాలుగు వేల జీతం ఇచ్చి తన పనిని వాలంటీర్ తో చేయించి, లక్ష జీతం తీసుకోలేదు. బడిలో ఉన్నది తన పిల్లలా, పరాయి పిల్లలా అని తెలియకుండా పని చేసాడు. అలా చేస్తున్న వాళ్ళూ ఉన్నారు. అలా బ్రతికిన వాళ్ళు ఎందరో నాకు తెలుసు.
మరిప్పుడు బడికి ఏం రోగం వచ్చింది ?
Ads
ఉద్యమ అధ్యాపక సంఘాల లో నిబద్ధతతో బ్రతికే కొందరు మినహా మిగతా పంతుల్లకి ఈ విద్యావ్యవస్థ ఎంత అధోగతి పట్టిందో అర్ధం అవుతోందా ? అత్యంత మానవీయమైన వృత్తి . అది జాతీయోధ్యమానికి పునాది అయ్యింది. కోరుట్ల, సిరిసిల్ల, జగిత్యాల, జంగిల్ మహల్ కు ఇరుసయ్యింది. అన్ని ప్రజాస్వామిక విముక్తి ఉద్యమాలకు దారులు వేసింది. ఆంధ్రాలో జీతాల పెంపు కోసం ధర్నా చేయడం సబబే.., కానీ వచ్చిన డబ్బంతా సంక్షేమ పథకాల పేరుతో అలగా జనాలకు ఇచ్చేసి రేట్లు పెంచేసి, ఉద్యోగులను రోడ్ల పాలు చేసాడు అని అడిగావు చూడూ, అక్కడ నువ్వెంత మానసిక దౌర్బల్యంతో కునారిల్లుతున్నావో అర్ధం అవుతోంది ?
ఎవడబ్బ సొమ్ము అన్నావ్ కదా పంతులమ్మా… వృద్దులూ , వితంతువులూ, ఆటోవాళ్ళు ,అమ్మ ఒడి తీసుకునే వాళ్ళూ మనుషులే అనీ, వాళ్ళూ పన్నులు కడుతున్నారు అనీ తెలియని నీ బుర్రను చూసి జాలిపడుతున్నా. నీ లాంటి బుర్రలు ఉన్న బడి వదిలి, నారాయణ చైతన్యలో ఎందుకు చేరుతున్నారో ఆలోచించావా ? ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు రాదు అన్న కుక్క మూతి పిందెలు కదా మీరు..?
బడి ఎందుకు ఖాయిలా పడిందో, బడిలో విద్యా వాలంటీర్ వద్దు, నియామకాలు పెంచాలి అని ఎన్నడన్నా రోడ్ ఎక్కావా ? మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలతో కలిసి ఎన్నడన్నా తిన్నావా ? రేషనైలేజేషన్ పేరుతో బడులు మూసేస్తుంటే ఎన్నడన్నా ఒక్క కన్నీటి చుక్క కార్చావా అక్కా ?
ప్రతి ఏడూ రాష్ట్ర బడ్జెట్ లో విద్యకి జరుగుతున్న కేటాయింపులు చూస్తున్నావా? జీతంలో తేడా వచ్చింది అన్నావ్, బడ్జెట్ లో తేడా గుర్తించే తెలివి నీకు అబ్బలేదా ? ముందు సంక్షేమ రాజ్యం అంటే ఏమిటో, ధరలు ఎవరు ఎందుకు పెంచుతారో తెలుసుకో. తర్వాత DA లు, ఐఆర్ ల గురించీ ఆలోచించు…
(మొన్న ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఓ ఉద్యోగిని మాట్లాడుతూ ‘‘వచ్చిన డబ్బంతా జనానికి పంచేసి, రేట్లు పెంచేసి, ఉద్యోగుల్ని రోడ్లపాలు చేశాడు’’ అంటూ చెలరేగిపోయింది… ఆటో వాళ్లకు, వృద్ధులకు, వితంతువులకు, అమ్మ ఒడికి డబ్బులెందుకు తగలేస్తున్నారన్నట్టుగా మాట్లాడింది… అఫ్‌కోర్స్, అది ఉద్యోగులందరి అభిప్రాయం కాకపోవచ్చు, ఉద్యోగులందరూ అదే తరహా కాకపోవచ్చు… ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం ఉద్యమించనివ్వండి, పోరాడనివ్వండి, సమాజం మద్దతు కూడా పొందండి… కానీ సమాజంలో మిగతా సెక్షన్లకు ప్రభుత్వ సాయం అందకూడదు అన్నట్టుగా మాట్లాడడాన్ని ఏమనాలి..? మిగతా సొసైటీ ఏమైపోయినా పర్లేదు, మా బతుకులు మాత్రం పచ్చగా ఉండాలంటే ఎలా..?….. సమాజం మీద కన్సర్న్ ఉన్న ఓ విద్యావంతుడి ఆవేదనే పైన రాసిన పోస్టు…)
Share this Article