.
ఈరోజు పత్రికల్లో వచ్చిన అన్ని వార్తల్లోకెల్లా… ఒక చిన్న సింగిల్ కాలమ్ వార్త… అదీ అనేక వార్తల నడుమ దాక్కుని, కనిపించనా వద్దా అన్నట్టుగా ఉంది… అది నచ్చిందని కాదు, అక్కడ కాసేపు ఆలోచనలు స్తంభించాయి…
ఆ వార్త నేపథ్యం ఓసారి గుర్తుచేసుకుందాం… మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు మరో 60 మంది పోరాట సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట ఆయుధాలతో సహా లొంగిపోయాడు కదా… ఇక సాయుధ పోరాట విరమణ తప్ప మరో మార్గాంతరం లేదనీ ఓ బహిరంగ చర్చను రేపాడు…
Ads
70 ఏళ్ల వయస్సులో… ఇక ఈ పోరాటంతో, ఈ తుపాకీతో రాజ్యాధికారం సిద్ధించదనే నిజం దశాబ్దాల తరువాత అర్థమై… ఇన్నేళ్ల అజ్ఞాత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి… మెయిన్ స్ట్రీమ్‌లోకి వచ్చిన తనపై పొగడ్తలూ వస్తున్నయ్, రెనిగేడ్ (విప్లవ ద్రోహి) అనే ముద్రలూ పడుతున్నయ్…
ఆ చర్చలు, ఆ స్పందనల్లోకి వెళ్లడం లేదిక్కడ..! తనకు లభించిన రివార్డు గురించీ ప్రస్తావన కాదిక్కడ… కానీ..?
నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లోనే ప్లాంట్లు, వ్యాపారం కలిగిన లాయిడ్స్ మెటల్ అండ్ ఎనర్జీ అనే కంపెనీ చేసిన ఓ ప్రకటన… దాని ఎండీ బి.ప్రభాకరన్ ఏమంటాడంటే..? ‘‘మల్లోజులను మేం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటాం… లొంగిపోయిన వాళ్లందరికీ శిక్షణ ఇచ్చి, వారు చేయగల పనుల్లో పెట్టుకుంటాం… మల్లోజులతో కలిసి పనిచేస్తాం… మాకూ మంచి అవకాశం’’
పారడాక్స్… అంటే తెలుగులో విరోధాబాస… క్వైట్ కంట్రాస్టు… ఏ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా తుపాకులు పోరాడాయో, ప్రాణాలకు తెగించాయో… ఆ తుపాకులకు ఇప్పుడు కొత్త పనిచెబుతుందట ఆ వనరులను తవ్వుకునే ఆ కంపెనీ… అవును మరి, లొంగిపోయిన తుపాకీ అందరికీ అలుసే… పైగా మల్లోజుల తమకు బ్రాండ్ అంబాసిడర్ అట…
తను ఏమని ప్రచారం చేయాలి..? ‘తుపాకులతో పనిలేదు, ఏ పనీ కాదు… ఈ ప్రతిఘటన పోరాటాలే వేస్ట్… ఇదుగో ఈ కంపెనీలతోనే అసలైన రాజ్యాధికారం… అభివృద్ధి…’ అని చెప్పాలా ప్రకటనల్లో, మీటింగుల్లో, ప్రమోషన్ యాక్టివిటీస్‌లో..?!
ఈ కంపెనీ ప్రధానంగా నక్సలైట్ల ప్రభావం అత్యధికంగా ఉన్న… ఇదే మల్లోజుల ఎక్కువ కాలం పోరాటజీవితం గడిపిన గడ్చిరోలి జిల్లాలోనే పలు ప్లాంట్లను కలిగి ఉంది… మైనింగు, స్పాంజ్ ఐరన్, స్టీల్, పవర్… వాట్ నాట్… గడ్చిరోలి వనరుల మీద ఈ కంపెనీదే పెత్తనం… కగార్ ఆపరేషన్‌తో బాగా లబ్ధి పొందే కంపెనీ కూడా…
అఫ్‌కోర్స్… వాళ్ల ఇలాకాలో అంతగా వ్యాపారం విస్తరించారు అంటే, మావోయిస్టులతోనూ మంచి సంబంధాలే మెయింటెయిన్ చేసి ఉంటుంది కంపెనీ… తన అవసరం కోసం… అన్నట్టు… సార్, మీ కంపెనీలో కొలువులు అంటే.,. మైనింగ్ ప్రాంతాల్లో, ప్లాంట్లలో, ఇతరత్రా సెక్యూరిటీ గార్డ్స్ కొలువులు ఇస్తారా సర్… హతవిధీ..!!
Share this Article