Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్రమమో సక్రమమో గానీ… అది ప్రపంచ ప్రఖ్యాత కన్నీటి ప్రేమ కథ!

October 10, 2023 by M S R

Taadi Prakash ……..  ప్రపంచ ప్రఖ్యాత కన్నీటి ప్రేమ కథ! A complex symphony of love …. ఉదాత్తమైన అక్రమప్రేమ… ‘ది బ్రిడ్జెస్ ఆఫ్ మేడిసన్ కౌంటీ’ ఒక సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా. ఒక అక్రమ ప్రేమకి సంబంధించిన ఈ కథని ప్రపంచం అంతా సంభ్రమాశ్చర్యాలతో చూసింది. సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకులు తేరుకోలేకపోయారు. థియేటర్ల లోంచి నిశ్శబ్దంగా నడిచి వెళిపోయారు.

ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిందీ సినిమా. ఒక స్త్రీ, ఒక పురుషుడి నాలుగంటే నాలుగు రోజుల శృంగారానుభవం ఒక జీవితకాలపు ప్రేమగా వికసించి, కొన్ని జీవితాలను ప్రభావితం చేసిన తీరు ప్రేక్షకుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వందల కోట్ల రూపాయల కనక వర్షం కురిపించిన ‘ది బ్రిడ్జెస్ ఆఫ్ మేడిసన్ కౌంటీ’ ఒక నిజజీవిత ప్రేమకథ. అమెరికాలో నడిచిన లవ్ ఎఫైర్!

1965 ప్రాంతాల్లో జరిగిన కథ. ఆమె పేరు ఫ్రాన్సెస్కా జాన్సన్. రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా వున్న వ్యక్తి ఆమె భర్త. వాళ్లకి ఇద్దరు పిల్లలు.

Ads

ఒకరోజు భర్తా, పిల్లలూ నాలుగు రోజుల పని మీద అమెరికాలో మరో రాష్ట్రానికి వెళతారు. అసలు కథ అక్కడ మొదలవుతుంది. ప్రపంచ ప్రఖ్యాత నేచర్ మేగజైన్ ‘నేషనల్ జియోగ్రఫీ’కి ఫొటోగ్రాఫర్ అయిన యువకుడూ, ఉత్సాహవంతుడూ అటుగా వస్తాడు. చరిత్ర ప్రసిద్ధి చెందిన మేడిసన్ కౌంటీ బ్రిడ్జిని ఫొటోలు తీయడం అతని అసైన్మెంట్.

అమెరికాలోని అయోవాలో ఆ బ్రిడ్జి వున్న ప్రాంతానికి వస్తాడు గానీ, కచ్చితంగా అదెక్కడుందో తెలుసుకోలేక పోతాడు. ఇంటి ముందు దుస్తులు ఆరేస్తున్న ఒకామెని చూస్తాడు. బ్రిడ్జి ఎక్కడుందో చెప్పగలరా అని అడుగుతాడు. దగ్గర్లోనే వుందనీ, దారి చూపిస్తాననీ, వచ్చి అతని జీపు ఎక్కుతుంది.

సాయంకాలపు బంగారు వన్నె ఎండలో బ్రిడ్జినీ, ఆమెనీ చాలా ఫొటోలు తీస్తాడు. తిరిగి ఆమెని ఇంటి దగ్గర దించేస్తాడు. థాంక్స్ చెబుతాడు. ఒక్క టీ కోసం ఇంటిలోకి రమ్మని పిలుస్తుంది. చిరునవ్వుతో మన్నిస్తాడు. ఆ ఇంటిలో మరెవరూ లేకపోవడం గమనిస్తాడు. భర్తా, పిల్లలూ మరో వూరు వెళ్లారనీ, నాలుగైదు రోజులు రారనీ చెబుతుంది. అతని కోసం చేసిన బ్లాక్ టీలో “కొంచెం బ్రాందీ పొయ్యనా” అని అడుగుతుంది. మూగతనం లాంటి మాయ ఒకటి మాటలుగా తర్జుమా అవుతుంది. మోహపు బరువుతో గాలి మూలుగుతుంది.

ఒక భావోద్వేగం అపరిచితుల్ని దగ్గర చేస్తుంది. ఒక అపూర్వమైన శృంగార అనుభవం నలిగిన పూల పరిమళమై… నవ్వుతుంది. ఆమె కళ్ళల్లోని మెరుపు, అతని ఛాతీ పైన కాంతి ఇష్టంగా కావలించుకుంటాయి. అలా నాలుగు రోజులు… నాలుగంటే నాలుగు రోజులు! ప్రేమదీపమై, దివ్యానుభవమై వెలిగిన ఆ రోజులు గతించిపోతాయి. అతను వెళిపోతాడు.

ఆమె నిరీక్షిస్తుంది. ఎదురుచూపులే… ఎదురుతెన్నులే… జ్ఞాపకాలే మిగులుతాయి. అవే వెన్నాడతాయి. విడిచి వెళిపోయిన మాధుర్యం, ఆమెకి నిద్రపట్టని రాత్రులుగా మిగిలిపోతుంది. ఈ కథ సినిమాగా రావటం వెనుక చాలా పెద్దకథ వుంది.

నిజమైన ప్రేమకథని రచయిత రాబర్ట్ జేమ్స్ వేలర్ నవలగా రాశారు. ‘ది బ్రిడ్జెస్ ఆఫ్ మేడిసన్ కౌంటీ’ అని పేరు పెట్టింది ఆయనే. 1992లో ఈ నవల లక్షల కాపీలు అమ్ముడుపోయింది. చదివిన వాళ్లు వెర్రెత్తిపోయారు. ఈ బెస్ట్ సెల్లర్ని సినిమా తీయాలని దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ అనుకున్నారు. ఆయన సొంత ప్రొడక్షన్ కంపెనీ ఆమ్బ్లిన్ ఎంటర్టైన్మెంట్ 25 వేల డాలర్లకి ఈ నవల హక్కులు కొన్నది.

ముందు ఒకాయనా, తర్వాత మరొకరూ రాసిన స్క్రీన్ ప్లే స్పీల్ బర్గ్ కి నచ్చలేదు. మూడో వాడు కేథలిన్ కెన్నడీ. ఈ ప్రేమకథని ‘ఆమె’ చెబుతున్నట్టుగా కెన్నడీ ఆవిష్కరించడం స్పీల్ బర్గ్ కి నచ్చింది. హీరో క్లింట్ ఈస్ట్ వుడ్ అని ముందే అనుకున్నారు. అప్పటికి స్పీల్ బర్గ్ ‘షిండ్లర్స్ లిస్ట్’ పోస్ట్ ప్రొడక్షన్ పని జరుగుతోంది. అయిపోగానే ‘ది బ్రిడ్జెస్ ఆఫ్ మేడిసన్ కౌంటీ’ తీద్దామనుకున్నాడు.

హీరోయిన్ ఎవరో తేల్చుకోలేకపోయారు. ముందు ఇసబెల్లా రోసాల్లినీ అయితే బావుంటుందనుకున్నారు. మరో అయిదుగురు హీరోయిన్ల పేర్లూ చర్చకు వచ్చాయి. చివరికి అంతగా స్పీల్ బర్గ్ కి నచ్చకపోయినా, మెరిల్ స్ట్రీప్ హీరోయిన్ గా వుండాలని క్లింట్ ఈస్ట్ వుడ్ పట్టుబట్టాడు. ఆఖరికి దర్శకత్వమూ ఈస్ట్ వుడ్ దక్కించుకున్నాడు. సినిమా చిత్రీకరణ పకడ్బందీగా ప్లాన్ చేశాడు.

52 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోవాలి. ఎన్నో జాగ్రత్తలూ, మంచి ప్లానింగ్ వల్ల 42 రోజులకే నిర్మాణం పూర్తయిపోయింది. 1994 నవంబర్ 1కి షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టారు. మేడిసన్ కౌంటీ వున్న అయోవాలోనే చిత్రీకరణ జరిగింది. “or should we just fu– on the LINOLEUM one last time?” అని సరదాగా అంటుంది హీరోయిన్. ఆ మాట వున్నందువల్ల ‘పెద్దలకు మాత్రమే’ అన్నారు సెన్సారు వాళ్లు. ఆ ఒక్క డైలాగ్ తప్ప అందరూ చూడాల్సిన ప్రేమకథ యిది అని అధికార్లని ఒప్పించాడు దర్శకుడు ఈస్ట్ వుడ్. 1995లో విడుదలై రికార్డులు బద్దలుకొట్టింది సినిమా. మంచి దర్శకుడిగా ఈస్ట్ వుడ్ పేరు మోగిపోయింది. ఉత్తమ నటిగా మెరిల్ స్ట్రీప్ పేరు ఆస్కార్ కి నామినేట్ అయింది.

ప్రేమకథ వెనక దాగిన నిజజీవిత కథ : ఫ్రాన్సెస్కా జాన్సన్ ప్రియుడు, ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ పేరు రాబర్ట్ కిన్ కైడ్. నాలుగు నాళ్ల ప్రగాఢ ప్రేమ తర్వాత వెళిపోయిన అతను తిరిగి రాలేదు. కొన్నాళ్ళకి ఫ్రాన్సెస్కా భర్త రిచర్డ్ చనిపోయాడు. రాబర్ట్ తిరిగి వస్తాడేమో అని ఎదురుచూసిందామె. మరో మూడేళ్లకు రాబర్ట్ కిన్ కైడ్ మరణించాడన్న వార్త వినింది. ఆతర్వాత కొన్నేళ్లకి ఆమె కూడా చనిపోయింది.

పెద్దవాళ్లు అయిన ఆమె పిల్లలిద్దరూ తల్లి చనిపోయాక అయోవాలోని ఎస్టేట్ అమ్మేద్దామని వచ్చారు. తనని భర్త పక్కన ఖననం చేయొద్దనీ, తన బూడిదని మేడిసన్ కౌంటీ బ్రిడ్జి మీద చల్లాలని తల్లి కోరిందని తెలిసి కొడుకు మైకేల్, కూతురు కరోలిన్ జాన్సన్ ఆశ్చర్యపోయారు. ఇనప పెట్టెలో తల్లి దాచిన ఫొటోలు, ఉత్తరాలు, తాళంచెవి చూశారు.

తాళం తీస్తే ఒక చిన్న పెట్టెలో నేషనల్ జాగ్రఫీ పత్రికలూ, మేడిసన్ కౌంటీ బ్రిడ్జి ఫొటోలున్న పత్రికా, పాత కెమెరాలు, కొన్ని మెమొంటోలు ఉన్నాయి. నేషనల్ జాగ్రఫీ పత్రికలో ఒకచోట కిన్ కైడ్ ఫొటో వుంది. వాళ్ళమ్మ వేసుకునే క్రీస్తు శిలువ గొలుసు అతని మెడలో వుంది. వాళ్ళిద్దరూ అమ్మ నోట్ బుక్ చదువుతూ వుండడం flash back గా సినిమా మొదలవుతుంది. “మాది నిజమైన ప్రేమ. మా ఇద్దరి జీవితాల్నీ వెలిగించిన, ఒక గొప్ప అనుభవంగా మిగిలిపోయిన ప్రేమ” అని ఫ్రాన్సెస్కా రాసింది. బూడిదని బ్రిడ్జి మీద చల్లాలనే తన చివరి కోరికని పిల్లలు మన్నిస్తారనే ఆశతో ఆమె ప్రేమ గురించి వివరంగా రాసింది. అంతకుముందు కిన్ కైడ్ బూడిదను కూడా ఆ బ్రిడ్జి మీదే చల్లారు. తల్లి ప్రేమ కథని చదివిన పిల్లలు చలించిపోయారు. ఆమె చివరి కోర్కె నెరవేర్చారు.

కథ వెనక కథ : రచయిత రాబర్ట్ జేమ్స్ వేలర్ కి ఒక ఫోనొచ్చింది. ఫ్రాన్సెస్కా పిల్లలు మైకేల్ జాన్సన్, అతని చెల్లెలు కరోలినా మాట్లాడారు. రచయితతో వ్యక్తిగతంగా మాట్లాడాలన్నారు. విమానంలో అయోవా వచ్చి జేమ్స్ వేలర్ తో మాట్లాడారు. ‘మీరు మంచి రచయిత గనక, మా అమ్మ ప్రేమకథ రాస్తారా?” అని అడిగారు. ఆసక్తికరంగా వుంటే రాస్తాను అన్నారాయన. వాళ్ళ అమ్మకి మరో వ్యక్తితో సంబంధం వుందనీ… ఆ కథంతా ఎంతో శ్రద్ధగా, నిజాయతీగా చెప్పారు. తల్లిది అక్రమ ప్రేమే అయినా ఆమెనీ, ఆమె గాఢమైన ప్రేమనీ గౌరవించి దాన్ని ఒక చిన్న నవలగా రాయమని అడిగిన విధానం రచయితని కదిలించింది.

మేడిసన్ కౌంటీ ప్రాంతంలో రైలుపెట్టెలా పైకప్పుతో వున్న బ్రిడ్జి దగ్గర ప్రేమ చిగురించడం నుంచి, నాలుగు రోజులకే ముగిసిపోయిన ఒక మాయ లాంటి ప్రేమ అనుభవం గురించి, తేదీలూ, డైరీలూ, గుర్తుగా దాచుకున్న మేగజైన్ లూ… జేమ్స్ వేలర్ కి అదో వింత అనుభూతి. ఆయన, అందమైన ప్రేమకథని చిన్న నవలగా రాశారు. అది కొన్ని వారాల్లో ప్రింట్ అవుతుందనగా … ఇంకా ఇంట్రెస్టింగ్ సమాచారం దొరుకుతుందేమోనని రచయిత సియాటెల్ వెళ్లారు.

కొందరితో మాట్లాడి, చివరికి రాబర్ట్ కిన్ కైడ్ ఎక్కడుంటారో తెల్సుకున్నారు. ఆ ఫొటోగ్రాఫరూ, రచయితా – పాటలు పాడే ఒక బార్ లో మిత్రులయ్యారు. కొన్నిరోజుల తర్వాత ఫ్రాన్సెస్కాతో ప్రేమ వ్యవహారం గురించి వివరంగా చెప్పాడు కిన్ కైడ్. ఆమె ఒక మహోన్నతమైన వ్యక్తి అనీ, ఆ ప్రేమ తనకో కొత్త జీవితాన్ని ప్రసాదించిందనీ చెప్పాడు. ఫ్రాన్సెస్కా యిచ్చిన క్రీస్తు శిలువ గొలుసు అతని మెడలో వుంది. ఆమె గురించి చెబుతున్నపుడు ఆ 70 ఏళ్లు దాటిన వృద్ధుడు కవి అయిపోయాడు – అంటాడు రచయిత.

ఆ తర్వాత కొన్ని రోజులకే కిన్ కైడ్ అనారోగ్యంతో చనిపోయాడు. ‘బ్రిడ్జెస్ ఆఫ్ మేడిసన్ కౌంటీ’ నవల 10 లక్షల కాపీలు అమ్ముడుపోయి, అమెరికాని ఒక కుదుపు కుదిపింది. తర్వాత అదే పేరుతో వచ్చిన సినిమా అంతే సంచలనం సృష్టించింది.

కొన్ని జీవితాలు అంతేనేమో

కొన్ని నిజమైన ప్రేమలూ అంతేనేమో

క్షణికమై, దివ్యానుభవమై…

ఎప్పుడూ మనల్ని పిలుస్తూ వుండే

కన్నీటి తావులై… ఎండమావులై…

APARNA SEN’S PAROMA

గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ అపర్ణా సేన్ దాదాపు ఇలాంటి కథతోనే 1985లోనే ‘పరోమా’ అనే మంచి సినిమా తీశారు. హీరోయిన్ రాఖీ. భర్త , పిల్లలు వున్న 40 ఏళ్ళ ఆమె ఓ ఫొటోగ్రాఫర్ తో ప్రేమ, దాని పర్యవసానం. తప్పక చూడాల్సిన సినిమా. అపర్ణా సేన్ అంటే తెర మీద కవిత్వాన్ని కురిపిస్తుంది కదా. ’36 చౌరంగీ లేన్’ చూసే వుంటారుగా! – TAADI PRAKASH    97045 41559

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions