.
A crisscross love story . గజిబిజి లవ్ స్టోరీ . పోల్కంపల్లి శాంతాదేవి నవల చండీప్రియ ఆధారంగా 1980 మార్చిలో వచ్చింది ఈ చండీప్రియ సినిమా . బహుశా మహిళా ప్రేక్షకులు , ఆరోజుల్లో ఎక్కువగా ఉన్న నవలా పాఠకులు ఈ సినిమాను వంద రోజులు ఆడించారు .
కొన్ని నవలలు చదవటానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి . వాటిని స్క్రీన్ మీదకు అనువదించటం అంత సులభం కాదు . ఆ కోవకు సంబంధించిందే ఈ కధ కూడా . దర్శకుడు వి మధుసూధనరావు స్క్రీన్ ప్లేని ఇంకాస్త బిర్రు చేసి ఉంటే ఓ ప్రేమనగర్ లాగానో , ఓ డాక్టర్ చక్రవర్తి లాగానో , ఓ జీవనతరంగాలు లాగానో నిలిచిపోయి ఉండేది .
అయిననూ బాగానే ఉంటుంది . బహుశా ఇప్పటి స్పీడు తరం వాళ్ళకు రుచించకపోవచ్చు . చూడబులే . ఫస్ట్ హీరో శోభన్ బాబు సినిమా ప్రారంభమయ్యాక ఓ ఇరవై ఇరవై అయిదు నిమిషాల తర్వాత తెర మీదకు వస్తాడు . భగ్న హృదయుడు . కాస్త జీవనతరంగాలు సినిమాలో విజయ్ పాత్ర లాగా ఉంటుంది .
Ads
ఆయనకు రెండు లవ్ స్టోరీలు . సెకండ్ హీరో గుబురు మీసాల చిరంజీవి . ఆయనకో రెండు లవ్ స్టోరీలు . ఫస్ట్ హీరోయిన్ జయప్రదను ప్రేమించి , మధ్యలో విరమించుకొని , చివరకు సెకండ్ హీరోయిన్ సువర్ణని పెళ్ళి చేసుకుంటాడు .
సినిమాలో అందమైన పాత్ర , టైటిల్ పాత్ర జయప్రదది . పొగరు , పెంకి , మొండి , అహంకారం , అనవసర అతి ఆత్మాభిమానం అన్నీ మేళవించిన అందమైన పాత్ర . అప్పట్లో వాణిశ్రీ వేస్తుండే పాత్ర . జయప్రద కూడా బాగానే నటించింది .
ఆమెవి రెండు పాత్రలు . ఒకటి ఫుల్ లెంగ్త్ టైటిల్ పాత్ర . మరోకటి కాసేపు ఉండే నెగటివ్ కవిత పాత్ర . ఫస్ట్ హీరో ఈ కవిత చేతిలో భంగపడి ఆఖర్లో చండీప్రియను పెళ్లి చేసుకుంటాడు .
సెకండ్ హీరోయిన్ సువర్ణ . సెకండ్ హీరో చిరంజీవిని ప్రేమించి , అతను ప్రేమించే చండీప్రియకు అతను దగ్గర కాకుండా అడ్డంకులు సృష్టిస్తూ , చివరకు తాను ప్రేమించిన సెకండ్ హీరోని పెళ్ళి చేసుకుంటుంది . రెండు జంటల పెళ్ళిళ్ళతో సినిమా సుఖాంతం అవుతుంది .
అంజలీదేవి స్వంత బేనరుపై తీయబడిన ఈ సినిమాకు ఆమె భర్త ఆదినారాయణరావు , సత్యంలు సంగీతాన్ని అందించారు . సి నారాయణరెడ్డి వ్రాసిన ఓ ప్రియా ప్రియా చండీప్రియా పాట బాగా హిట్టయింది . చిరంజీవి , జయప్రదలపై ఉంటుంది . చాలా శ్రావ్యంగా ఉంటుంది .
సినిమా మొదట్లో చండీ మాత ఆలయంలో జయప్రద నృత్యం చాలా బాగుంటుంది . శ్రీ భాగ్యరేఖ జననీ పాట . ఆమెదే మరో నృత్య గీతం వేటూరి వారి ఏలో ఏలో వరపులో కూడా బాగుంటుంది . జయప్రద నృత్యం బాగుంటుంది .
మరో రెండు డ్యూయెట్లు ఏ వేళనైనా ఒకే కోరిక , మసకపడితే నిదుర పట్టదు బాగుంటాయి . ఈ రెండు పాటలు శోభన్ బాబు , జయప్రదల మీద ఉంటాయి . నవలా చిత్రాల్లో హీరోహీరోయిన్ల పేర్లు గ్లామరస్ గా ఉంటాయి . ఈ సినిమాలో హీరో శోభన్ బాబు పేరు ఇంద్రనీల్ , హీరోయిన్ జయప్రద పేరు చండీప్రియ . తారల్లాగానే అందమైన పేర్లు .
ఇతర పాత్రల్లో అంజలీదేవి , గుమ్మడి , అల్లు రామలింగయ్య , పి యల్ నారాయణ , కాంతారావు , మంజు భార్గవి , గిరిజ ప్రభృతులు నటించారు . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . శోభన్ బాబు , జయప్రద , చిరంజీవి అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . చూడబులే .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……….. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )
Share this Article