ఒక సినిమా కొందరిని నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు… ఏ క్రియేటివ్ వర్కయినా అంతే… కాకపోతే సినిమా బలమైన ప్రభావం చూపించేది కాబట్టి వాటిపై విశ్లేషణలు, లోగుట్టులు, మార్మిక ఉద్దేశాలు గట్రా అవసరమే… మనం ఏకీభవించొచ్చు, అబ్బే, కరెక్టు కాదని తల అడ్డంగా ఊపవచ్చు… కానీ డిబేట్ జరుగుతూ ఉండాలి… చెత్త స్టెప్పులు, చెత్త ఫైట్లు, హీరోల బిల్డప్పుల వంటి మూసీతనం గురించి కాదు… కొన్ని సినిమాల ఎజెండాల గురించి…
వాల్ మీద సీతారామం సినిమాపై రాసిన వ్యంగ్య వ్యాఖ్యానం ఆపక్తికరంగా అనిపించింది… ఎందుకంటే… ఆ సినిమాలో హిందుత్వ ఎజెండా ఉందట… అదెలాగంటారా..? ఒకసారి సుదీర్ఘమైన ఈ పరిశీలన పూర్తిగా చదవాలి…1992 స్వాతంత్య్ర దినోత్సవం నాడు మణిరత్నం ‘రోజా’ సినిమా రిలీజైంది. కశ్మీర్ ‘టెర్రరిజం నేపథ్యంలో ప్రేమకథ’గా వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ విజయఢంకా మోగించింది. ముప్ఫె ఏళ్లు దాటాయి. స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరిగే సరికి మరో హిట్ సినిమా వచ్చింది. పేరు ‘సీతా రామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అని హను రాఘవపూడి గారి ఈ సినిమా పేరుకున్న తోక ఉద్ఘోషిస్తోంది. ఇది కూడా కశ్మీరు యుద్ధమే. కాకపోతే యుద్ధకాలంలో తేడా. 1990 దశకంలో సాయుధ తిరుగుబాటు సాగుతుండగా వచ్చిన ‘రోజా’కు రాష్ట్రపతి పురస్కారం లభించింది. 1964-65ల నాటి కశ్మీర్ కథతో వచ్చిన ‘సీతా రామం’పై పూర్వ ఉపరాష్ట్రపతి ప్రశంసలు కురిపించాడు.
కవి, సినీ రచయిత జావేద్ అఖ్తర్ ఓ మాటంటాడు. ‘‘నువ్వు జర్మన్లూ, యూదుల గురించి ఒక సినిమా తీస్తావు. దానికి నాజీ పార్టీ చాలా మంచి సినిమా అని కితాబునిచ్చిందంటే మాత్రం ఏదో తేడా కొడుతున్నట్టే!’’ మణిరత్నం ‘బొంబాయి’ని విశ్లేషించే సందర్భంలో ఆయన ఈ మాటన్నాడు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ మాదిరిగా పచ్చి ఫాసిస్టు సినిమాలు తీసేవారు వేరే వున్నారు. వారికి దాపరికమన్నది లేదు. వారి రాజకీయ సంబంధాలు అందరికీ చాలా స్పష్టంగా తెలిసినవే. కానీ ‘రోజా’, ‘సీతారామం’ల కథ వేరు. ఇవి లోపాయికారిగా పొలిటికల్ విషయాలు చెప్తాయి. కొంచెం కోవర్టుగా తామనుకున్నట్టూ లేదా ఏలిక వారికి నచ్చేటట్టూ చెప్తాయి. గట్టిగా నిలదీస్తే మాత్రం, ‘ప్రేమ కథ’ కదా అని తప్పించుకుంటాయి. అంటే వీటిలోని రాజకీయాలు ప్రేమ చాటు వ్యవహారాలుగా సాగుతాయన్నమాట!
Ads
‘సీతా రామం’ కథ:
సినిమా మొదలయ్యీ అవంగానే తెర మీద ‘1964 -పీఓకే (పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరు) -అక్కడో టెర్రరిస్టుల క్యాంపు’! ‘ఆపరేషన్ జిబ్రాల్టర్’ పేరుతో పాకిస్తాన్ ఆర్మీ, టెర్రరిస్టులూ కలిపి కశ్మీరులోకి శిక్షణ పొందిన యువకుల్ని పంపిస్తున్నారు. పిల్లలకు బ్రెయిన్‌వాష్ చేసే పనిని అన్సారీ అన్నవాడు చేపట్టి వున్నాడు. అక్కడికి కేప్టెన్ తారీక్ (సచిన్ ఖేడేకర్) వస్తాడు. మనకు తెలియాలి కాబట్టి ఆయనకు అంతవరకూ ఈ ఆపరేషన్ గురించి తెలీదు. ‘సైన్యమూ, టెర్రరిస్టులూ కలిపి ఆపరేషనా?’ అని ఆశ్చర్యార్థకం ప్రదర్శిస్తాడు తన మొహంలో! మరో సైనికుడొకడు ఆ అధికారికి ‘జిబ్రాల్టర్’ గురించి వివరించడంతో మనకూ ఆ సంగతి అర్థమౌతుంది. ‘కశ్మీర్లో ఖురానూ, గీతా చదివే వాళ్లు సోదరులుగా మసలుతున్నారు. దీనిక్కారణం అక్కడి ఆర్మీ. అక్కడి ప్రజల్లో చిచ్చుపెట్టాలి. ఆర్మీకి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టలి’ అని అన్సారీ టీనేజి కుర్రాళ్లకు చెబుతున్నపుడు మనకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.
కట్ చేస్తే, 1985 లండన్. ఆఫ్రీన్ (రస్మికా) పాకిస్థాన్‌కి చెందిన యూనివర్సిటీ విద్యార్థిని. ఇండియా అంటే విపరీతమైన ద్వేషం. పాకిస్థాన్ జెండాను భారత్ తగులబెట్టినందుకు ప్రతీకారంగా ఆమె ఒక భారతీయుడి కారుకు నిప్పెడుతుంది. చూడబోతే అది యూనివర్శిటీ మేనేజ్‌మెంట్ బోర్డ్ స్పాన్సరర్ ఆనంద్ మెహతా (టినూ ఆనంద్) గారిది. ఆఫ్రీన్ దగ్గర ఇప్పుడు రెండే ఆప్షన్లు! అదేదో టీవీ షో టైటిల్ మాదిరిగా ‘క్షమించమని దణ్ణం పెట్ట్టు లేదా క్యాష్ కట్టు!’ క్యాషంటే ఎంతనుకున్నారూ? అక్షరాలా వన్ మిలియన్ లేదా10 లక్షలు! లేదంటే రస్టికేషనే! పెంకి ఘటం కాబట్టి క్షమాపణ చెప్పదు. డబ్బు తెచ్చుకోడానికి పాకిస్థాన్ తాత గారి ఇంటికి వెళుతుంది. ఆ తాత ఎవరనుకున్నారూ? ఆర్మీ బ్రిగేడియర్ తారిక్ గారే! అంటే 1964 లో ‘జిబ్రాల్టర్’ గురించి శ్రద్ధగా విన్నాయనే! ఆయన అప్పటికే చనిపోయాడన్న సంగతి ఇండియాలో వున్న మనకే కాదు, లండన్‌లో వున్న సొంత మనవరాలికీ తెలీదు.
తాత గారి డబ్బు దక్కాలంటే ఆయన వీలునామా ప్రకారం ‘1965 లో ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ రామ్ భారతదేశానికి చెందిన తన ప్రేయసి సీతా మహాలక్ష్మికి రాసిన ఒక లేఖను ఆమెకు అందజేయాలి’. ‘ది బెస్ట్ క్రిష్మస్ ప్రెజెంట్ ఇన్ ది వరల్డ్’ రచయితకు దొరికిన పని మాదిరి అన్నమాట! ఆఫ్రీన్‌కి ఇండియా అంటే నచ్చదు గానీ ఇండియాలోని హైదరాబాద్‌లో యూనివర్సిటీ సీనియర్ అయిన బాలాజీ (తరుణ్ భాస్కర్) అనే బెస్ట్ ఫ్రెండ్ వుంటాడు. ‘బాలాజీ హైనా!’ అనుకుని ఆయన సాయంతో సీతామాలక్ష్మి అన్వేషణలో పడుతుంది.
ఉత్తరం చెప్పిన కథ!
1965 లెటర్ని 1985లో డెలివర్ చేయడానికి వెళ్తే, అదీ దేశం కాని దేశానికి వెళితే, అదీ శత్రుదేశం అయితే ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నీ పడుతుంది ఆఫ్రీన్. కానీ రామ్ ఎవరు, సీత ఎవరు అన్న విషయలు తను కనుక్కుంటూ, టిక్కెట్టు కొనుక్కుని సినిమా చూస్తున్న మనకూ తెలుపుతుంది. కథలో ట్విస్టులే ట్విస్టులు. ‘రాముడు మంచి బాలుడు’ అన్నంత మంచి వాడు మన హీరో రామ్ (దుల్కర్ సల్మాన్). అనాథ, కశ్మీర్‌లో పోస్టింగ్‌లో ఉన్న సైనికుడు. సద్గుణ సంపన్నుడు. శత్రువులో కూడా మంచినే చూస్తాడు.
జిబ్రాల్టర్‌ను ఫెయిల్ చేసి హిందూ ముస్లింల మధ్య సఖ్యతను పునరుద్ధరించిన తర్వాత, దేశమంతా ఆర్మీకి జేజేలు పలుకుతున్న సందర్భంలో ఒక రేడియో జర్నలిస్టు (రోహిణి) ‘రామ్ అనాథ అయిన ఒంటరి సైనికుడు, దేశం కోసం రామ్ ఉన్నాడు, అతడి కోసం మనమున్నామని చెప్పడం మన బాధ్యత’ అని ఆలిండియా రేడియోలో శ్రోతల్ని కోరడంతో, ‘మేమంతా నీ వాళ్లమే’ అని చెబుతూ దేశం నలువైపుల నుండి రామ్‌పై ఉత్తరాలు కురుస్తాయి. దీని వలన పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి ఇన్కం పెరిగినా, అక్కడికి ఉత్తరాలు మోసుకొచ్చే పోస్టుమ్యాన్‌కి మాత్రం పనిభారం ఎక్కువౌతుంది. ఆయన ప్రతిరోజూ రామ్‌కి వచ్చిన ఉత్తరాల్ని సెగ్రిగేట్ చేసి, సెపరేట్ గన్నీ బ్యాగుల్లో మోసుకుని తెచ్చి ఇస్తూ వుంటే, రామ్ రాత్రంతా జాగారం చేసి ఆ ఉత్తరాలు చదివి జవాబులు రాస్తూ ఉంటాడు. రాత్రుళ్లు నిద్రలేకపోయినా డ్యూటీలో మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంటాడు. రోజుకి పద్దెనిమిది నుండి ఇరవై గంటలు పనిచేసేవారు అన్ని కాలాల్లోనూ ఉండేవారని మనకర్థమౌతుంది.
రామ్‌కి వచ్చే ఉత్తరాల్లో ఫ్రం అడ్రసు లేకుండా ఒకామె (బహుశా వాయిసోవర్ బట్టి ఒక యువతి! అందంగా ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పలేం!) ‘ఇట్లు నీ భార్య సీతామాలక్ష్మి’ అని రాస్తుంటుంది. ఈమెవరో తెలుసుకోవాలని మనకే అంత టెన్షన్ ఐనప్పుడు స్వయంగా ఉత్తరాలందుకుంటున్నాయనకి ఎలా ఉంటుందో ఊహించండి! అందుకే ఈసారి సెలవులొచ్చినపుడు ఆ పని మీద పడతాడు. హీరో కాబట్టి కనిపెట్టి తీరాలి కాబట్టి తీరుతాడు. ఆమె ఇంకెవరో కాదు, స్వయానా హైదరాబాద్ నవాబోళ్ల ప్రిన్సెస్ నూర్జహాన్! నవాబోళ్ల పిల్ల అయినా తూగోజి అమ్మాయిలా ఎంత చక్కని తెలుగు మాట్లాడుతుందనుకున్నారూ! భరతనాట్యం డాన్సింగ్‌తో పాటు డేరింగ్ జర్నలిస్టు కూడా కావాలనే కోరిక ఉండిందేమో, ఇందుగలడందులేదను సందేహము వలదన్నట్టు ఢిల్లీలో, పల్లెలో, వేరే జర్నలిస్టులెవ్వరు చేరని కశ్మీర్ రణభూమిలో -ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమౌతూ వుంటుంది సీత ఉరఫ్ నూర్!
‘కురుక్షేత్రంలో రావణ సంహారం-యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం’ అనే కోడ్ మొత్తానికి డీకోడ్ అవుతుంది. సుదూర కశ్మీర్లో అగర్తా అనే హిందువుల గ్రామంలో రావణ ‘జిబ్రాల్టర్’ సేనలు ఇళ్లకు నిప్పెడుతున్నప్పుడు అక్కడ ప్రత్యక్షమై, ఇరకాటంలో పడి, రామ్ చేత రక్షింపబడుతుంది చూడండీ, అదీ ట్విస్టంటే! ఆ చీకటి మంటల్లో అతడ్ని ఆమె చూసింది, ఆయన ఆమెను చూడలేదు. కానీ సింబాలిక్‌గా ‘స్వయంవరమేమిటి సాక్షాత్తూ పాణీ గ్రహణమే (చేయి పట్టుకోవడమే)’ జరిగిపోయింది. కాబట్టి ‘ఇట్లు మీ భార్య’ అని రాయడం లెజిటిమేటే అని మన మట్టి బుర్రలకి అప్పుడర్థమౌతుంది.
రామయణానికి పేరడీ కాబట్టి సీతా రాముల తర్వాత రావణుడెవరు? లంకెక్కడ? అన్న ప్రశ్నలు మొలకెత్తడం సహజమే. జీహాదుకు ఒడిగట్టిన దుష్టుడే రావణుడు, రావణుల స్థావరమైన పాకిస్థానే లంకనుకోవాలి. అయితే విభీషణుడెవరు? ఇంకెవరు? మేజర్ అబూ తారీక్! మరి ఆంజనేయుడూ? ఈ సినిమాను బట్టి ఆప్షన్స్ చాలానే వున్నాయి. ఈవెన్ అఫ్రీన్‌కి కూడా ఆ ఛాన్సుంది! రామాయణాన్ని పదే పదే గుర్తుతెప్పించడానికి ‘దుర్జొయ్ శర్మ’ అనబడే వెన్నెల కిషోర్‌కు హనుమంతుడి మేకప్ కూడా వేయించి ఒకటే ఓవరాక్షన్ చేయిస్తాడు దర్శకుడు.
ఇంకొన్ని ట్విస్టులు …
‘యువరాణి-సామాన్యుడి ప్రేమకథ!’ ‘రోమన్ హాలీడే’ మూడ్‌లోకి వెళ్లిపోతాం మనం! ‘12000 రూపాయల బ్యాంకు బ్యాలెన్సుతో ఓ ఇల్లు కొని సీతను రాణిలా’ చూసుకుంటానని మాటిచ్చాక కూడా రామ్ ఆ డబ్బును అభాగ్యులైన చెల్లెళ్ల కోసం ఖర్చు చేసేస్తాడు. మరికొన్ని ట్విస్టులు కథతో మళ్లీ పరాచికాలాడతాయి. ఒమన్‌లో పొలిటికల్ క్రైసిస్! ప్రిన్సెస్ ఫ్యామిలీ ఆస్తులు అక్కడ ఇరుక్కుని వున్నాయి. ఒమన్ యువరాజును హైదరాబాద్ యువరాణి గనుక పెళ్లి చేసుకుంటే ఆస్తులు సేఫ్‌గా వుంటాయి అని ఆర్డరేస్తాడు నూర్ అన్నయ్య! (ఆ మధ్య శ్యాం సింగడిని మర్డర్ చేసిన బెంగాలీ ఆయన ‘జిషూ సేన్‌గుప్తా’ ప్రేక్షకులకింకా గుర్తుండే వుండాలి!) మొత్తానికి నూరు తన ఊరు వదిలి ఉత్తరానికి వచ్చిన ఉత్తరం లాగా, స్వేచ్ఛగా ఎగిరే ‘సీతా’కోక చిలుకలాగా కశ్మీర్ వెళ్లి రామ్ ముంగిట వాలుతుంది.
కథ సుఖాంతమైంది కదా అని మనం ఊపిరి పీల్చుకుందామనుకుంటే దర్శకుడి ఆలోచనలు మరో రకంగా వున్నాయి. ‘ఘర్ మే ఘుస్కే మారేంగే’ (ఇంట్లోకి జొరబడి మరీ కొడతాం) లేక సర్జికల్ స్ట్రయిక్ సీక్వెన్సు మరో హిట్ ఫార్ములా అన్నది ఆయనకు గుర్తొస్తుంది. ఫలితంగా బోర్డర్ అవతలికి పోయి, టెర్రరిస్టు స్థావరాన్ని ధ్వంసం చేసి వచ్చే టీంలోకి రామ్ సెలెక్ట్ అవుతాడు. అక్కడ పని ముగించుకుని వస్తుండగా, మంటల్లో చిక్కుకున్న వహీదా అనే పాపను రక్షించబోయి రామ్ తన బ్రిగేడియర్ విష్ణు శర్మతో (సుమంత్) పాటు పాకిస్థాన్ సేనలకు పట్టుబడతాడు. టార్చర్‌కి తట్టుకోలేక విష్ణు శర్మ ఇండియన్ ఆర్మీ రహస్యాలను ‘లంకి’స్థాన్‌కి అందజేసి విముక్తి సంపాదించుకుంటాడు. ఆ నేరం రామ్‌పై పడుతుంది. తనను పాకిస్థాన్‌లో ఉరి తీసేముందు తన కథను సీతకు ఉత్తరం రాసి ‘విభీషణ’ తారీక్‌కు అప్పగిస్తాడు రామ్. ఆ ఉత్తరమే ఈ కథను ఇన్ని పాటలతో పాటు ఇంత దాకా నడిపించిందన్న మాట!
ఇంతకీ రామ్ కాపాడిన ఆ వహీదా ఎవరనుకునేరూ? మేజర్ (తర్వాతి కాలంలో బ్రిగేడియర్) అబూ తారీక్ మనవరాలే! అంటే ఇప్పటి ఆఫ్రీనే ఒకప్పటి వహీదా అన్నమాట! ఆ సంగతి తెలిశాక ఆఫ్రీన్తో పాటూ నాకూ హాల్లో గట్టిగా ఏడవాలనిపించింది. కానీ చుట్టూ వున్నవారు ఏమనుకుంటారో అని ఆగిపోయాను. ఉత్తరం సీతకు చేరింది. రామ్‌కు పోయిన గౌరవం దక్కింది. మరణానంతర అవార్డు దక్కింది. కథ సుఖాంతమైంది. కానీ రామ్ ఇంకా బతికి వుంటేనో! నూర్ ఏ ఒమన్ అడవుల పాలయ్యేదో! కొంచెం భయమేసి ఇమాజినేషన్ను ‘ఇన్ ది ఇంటరెస్ట్ ఆఫ్ నేషన్’ ఆపేసుకున్నాను.
చరిత్ర ఎవడిక్కావాలి?
అగర్తలో హిందూ ముస్లింల మధ్య అపార్థాలను తొలగించి వారిని ఒకటి చేసిన తర్వాత ‘ఆయుధంతో యుద్ధం చేసేవాడు సైనికుడనీ, ధర్మం కోసం యుద్ధం చేసేవాడు రాముడనీ అప్పుడర్థమైంది’ అని వర్ణిస్తాడు నేపథ్య వ్యాఖ్యాత. అప్పటికి కశ్మీర్‌లో జరుగుతున్న అధర్మాలెటువంటివీ? నిజంగానే కశ్మీరీలు తమ నేలపై తిష్టవేసిన సైనికుల్ని చూసి గర్వపడుతున్నారా? అప్పటి చరిత్ర కొంచెం చూద్దాం.
ఒకప్పుడు బ్రిటీషు వారు తమకు అనుకూలంగా వున్న డోగ్రా సామంతరాజుకు (గులాబ్ సింగుకు) 75 లక్షల రూపాయలకు కశ్మీరును అమ్మేయడంతో ఆధునిక కశ్మీరు చరిత్ర ఆరంభమౌతుంది. డోగ్రాల పీడనకు వ్యతిరేకంగా ఆగ్నేయ కశ్మీరులో ఆదివాసీల తిరుగుబాటు జరగడం, దాంతో దేశ విభజన సమయంలో తటస్థంగా ఉంటాననుకున్న డోగ్రా రాజు హరిసింగ్ కశ్మీరును భారత్‌లో విలీనం చేయడం, షేక్ అబ్దుల్లా ‘నయా కశ్మీర్’ నిర్మాణంలో భాగంగా దేశంలోనే అతి గొప్ప భూ సంస్కరణలు జరపడం, అందులో పేద ముస్లింలతో పాటు పేద హిందువులు కూడా లాభపడడం, భూ సంస్కరణలతో నష్టపోయిన భూస్వాములూ, డోగ్రాలూ హిందూత్వ పార్టీల పంచన చేరడం, ఆ పార్టీలు స్వయం ప్రతిపత్తిని కూడా వద్దని ఆందోళనకు దిగడం, ప్లెబిసైట్ నిర్వహించాల్సిన ప్రభుత్వాలు కనీసం స్వయం ప్రతిపత్తిని కూడా మెల్లమెల్లగా కాలరాయడం, ఆచరణలో 370 ఆర్టికల్‌ను నీరుగార్చడం వగైరా సంఘటనలు శరవేగంతో జరిగిపోతుంటే కశ్మీరులో ఏ రాముడు ధర్మం కోసం యుద్ధం చేశాడూ?
ఈ సినిమా కథాకాలానికి కొద్ది సంవత్సరాల ముందు రాజ్యాంగపు ఫ్రేమ్‌వర్కులో కూడా ఎన్నో అన్యాయాలు జరిగాయి. షేక్ అబ్దుల్లాను మళ్లీ మళ్లీ జైళ్లో పెట్టడం, డిఫెక్షన్లను ప్రోత్సహించి తమకు అనుకూలమైన మొహమ్మద్ గులాం బక్షీని ఒకసారీ, జి.ఎం. సాదిక్‌ను మరోసారీ గద్దెనెక్కించడం, కశ్మీరును భారత దేశపు ‘అటూంగ్ అంగ్’గా మలిచేలా మార్పులు చేయడం, అందుకోసం ఆ యా కశ్మీరు ప్రధాన మంత్రుల లంచగొండితనాన్ని చూసీచూడనట్టు వూరుకోవడం -ఇలా కశ్మీరీల నుండి భారతదేశం మానసికంగా దూరమౌతూ వచ్చింది.
ఈ కథాకాలం 1964-1965 మధ్యకాలంలో చాలా ముఖ్యమైన మార్పులు జరిగాయి. కశ్మీరు గవర్నరును ‘సదరీ రియాసత్’ అనేవారు. ఆయన్ను జమ్మూ కశ్మీరు అసెంబ్లీ మాత్రమే నియమించగలదు. ఈ పరిస్థితిని మార్చి ఇతర భారత రాష్ట్రాల మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం గవర్నరులను ఎన్నుకునే పరంపర కశ్మీరులో మొదలైంది. ఇకపై కశ్మీరు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి అని పిలిచేలా మార్పు జరిగింది. విలీన ఒప్పందం ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ మినహా మిగతా చట్టాలన్నీ కశ్మీరు అసెంబ్లీ మాత్రమే చేసుకోవాలి. కానీ ఆర్టికల్ 249ను కశ్మీరుకు అన్వయించి ఇతర అంశాలలో చట్టాలు ప్రతిపాదించే హక్కును కేంద్ర ప్రభుత్వానికి దక్కేలా మార్పులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలనను రుద్దే 356, 357 అధికరణాలను కశ్మీరులో కూడా అమలయ్యేలా మార్పులు చేశారు. వీటన్నింటితో ప్రజలు విసిగిపోయి వున్నారు. ఆర్మీ దౌర్జన్యాలు కూడా పెరిగాయని చెప్పే ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఆ దశలో జరిగిన పోరాటాలను పాకిస్థాన్‌కీ, భారతదేశానికీ మధ్య జరిగిన గొడవలుగా చిత్రించేపని ‘సీతారామం’ లాంటి సినిమాలు చేస్తున్నాయి.
1965 తర్వాత కూడా చాలా మార్పులు జరిగాయి. చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చిన షేక్ అబ్దుల్లాలో చాలా మార్పులు వచ్చాయి. ఆయన పార్టీ నేషనల్ కాన్ఫరెన్సుకు ప్రజల్లో పలుకుబడి పోయింది. ఈ దశలో ‘ముస్లిం యునైటెడ్ ఫ్రంట్’ వంటి కొత్త పార్టీ ఉనికిలోకి వచ్చింది. ఆ దశలో 1987 లో జరిగిన భూటకపు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను ఓడినవారిగా ప్రకటించడం, ఎన్నికల ఏజెంట్లను కూడా జైళ్లలో పెట్టడం లాంటి సంఘటనలతో 1990ల నాటి మిలిటెన్సీకి ఒక భూమిక ఏర్పడిరది. జగ్మోహన్ హయాం మరో రక్తపు చరిత్ర. ఆ దశలో వచ్చిన ‘రోజా’లాంటి సినిమా కనీసంగానైనా ఈ విషయాల్ని ముట్టుకోలేదు.
‘రోజా’ గురించి రుస్తమ్ బరూచా ‘ఆన్ ది బార్డర్ ఆఫ్ ఫాసిజం`మాన్యుఫాక్చర్ ఆఫ్ కన్సెంట్ ఇన్ రోజా’ అంటూ ‘ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ (జనవరి 4, 1994) పత్రికలో ఒక వ్యాసం రాశాడు. ఆర్టికల్ 370ను అత్యంత అన్యాయమైన రీతిలో రద్దుచేసి, ప్రధాన స్రవంతి నాయకులను కూడా గృహ నిర్బంధంలో పెట్టిన కాలంలో వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో అనుపమ్ ఖేర్ వేసిన పాత్రధారి ‘ఆర్టికల్ 370 ని రద్దు చేయండి’ అనే భూస్వాముల డిమాండును సూచించే ప్లకార్డుతో కనిపిస్తాడు. అది పేద హిందువుల డిమాండు కూడా కాదు. ‘సీతా రామం’ చూపిన ఆజాద్ కశ్మీర్‌లో నేటికీ నామమాత్రంగానైనా ఒక పార్లమెంటు వుంది, ప్రధాన మంత్రి ఉన్నాడు, సుప్రీం కోర్టు, హై కోర్టులు వున్నాయి. అసలు ‘లైన్ ఆఫ్ కంట్రోల్’కి అవతల వున్నదీ కశ్మీరీలే. అటునుండి ఇటుకీ, ఇటు నుండి అటుకీ ఆ రోజుల్లో సజావుగా రాకపోకలు సాగేవి.
సినిమాల వాళ్లకి వీటి పట్టింపులే అవసరం లేదు. నేటి పాలకుల ఎజెండాలకు నీరుపోస్తూ తిమ్మిని బమ్మి చేసి చూపడమే వారి పని. ‘కుడి ఎడమల దగా దగా’ అని శ్రీ శ్రీ ఆనాడు అన్నాడు. ఇప్పుడు హిందుత్వ ఎజెండాల ప్రచారంలో ఉత్తరాదిన పోటీపడి సాగుతున్నాయి దక్షిణాది సినిమాలు. దానికి ‘రాజ్యసభ’ల పారితోషికాలు కూడా ముడుతున్నాయి.
సాఫ్ట్‌గా అదే ఎజెండా!
రామ్ సీతతో మాట్లాడుతున్నప్పుడు ‘హైదరాబాదు’ను ‘మీ భాగ్యనగరం’ అన్నపుడు హైదరాబాదు పేరు మారుస్తానని చెప్పిన ఉత్తరాది రాజకీయ నాయకుడు గుర్తొస్తాడు. ‘జై శ్రీరాం’ అన్న యుద్ధ నినాదం బాబ్రీ ఉద్యమకాలంలోనే ఎక్కువగా పాపులర్ అయింది. సినిమాలోని 1964 కాలంలో గంగా-జమున తహ్ జీబ్‌లో భాగంగా ‘అస్సలామాలేకుం’ అన్న ముస్లిం మిత్రుడి పలకరింపుకు బదులుగా ‘జై రాంజీకీ’ లేక ‘రాం రాం భయ్యా’లాంటి బదులు పలకరింపులు ఉండేవి. కానీ ఈ సినిమాలో పాకిస్థాన్ ఆర్మీ అధికారి నోట ఆ కాలంలోనే ‘జై శ్రీరాం’ అనిపించేశారు. ఆన్సారీని చంపేసిన తర్వాత రామ్‌గారు ఒక ఖురాను గ్రంథాన్ని అతని గుండెపై విసిరేస్తూ ‘ఇంకో జన్మలోనైనా దీన్ని సరిగా అర్థంచేసుకో!’ అని ఖురాను స్పెషలిస్టులా అనడం చాలా అహంభావంతో కూడినట్టుగా వుంటుంది. ముస్లిం ఎవరైనా మన గీత గురించి అలా అన్నట్టు చూపిస్తే రియాక్షన్ ఎలా వుంటుంది?
కొద్దిమంది ముస్లింలను మంచి వారిగా చూపడం అనేది ఒక అతి తెలివి చర్య. ఒకరిద్దర్ని మంచిగా చూపడం కాదు ఒక జాతిని ఎలా చిత్రించారన్నది ముఖ్యం. మతాంతర ప్రేమలు లేక వివాహాల్లో మన సినిమా వాళ్ల దగ్గర ఒక ఫార్ములా వుంది. స్త్రీ హిందువు కాకూడదు. లేదంటే ‘లవ్ జిహాద్’ అనే మహాపాతకం చుట్టుకుంటుంది. అందుకే మణిరత్నం అంతటివాడు కూడా ‘బొంబాయి’లో జాగ్రత్త పడ్డాడు. ఆరు నూరైనా, ‘నూరు’నే సీతను జేశాడు హను రాఘవుడు. సీతను రక్షించే సందర్భంలో రాముడు గోవును కాపాడడం కూడా ఏమంత తీసిపారెయ్యాల్సిన దృశ్యం కాదు. సైనికులూ, టెర్రరిస్టులూ కలిసి కుట్ర పన్నుతున్నారన్న సంగతే తెలీని తారీక్ గారి మనవరాలు టెర్రరిస్టు క్యాంపుల వద్దే గడుపుతుందెందుకో? పాకిస్థాన్ పని మీద పోతున్న రామ్ సీతతో ‘చనిపోతే ఇలానే గొయ్యితీసి పాతేస్తారు’ అంటూ బాత్ టబ్‌లో డిమానిస్ట్రేట్ చేస్తాడు. అప్పుడు తడిసిన ఆర్మీ డ్రెస్‌లోని యూనిట్ ప్యాచ్ ఒకటి సీత చేతుల్లోకి వస్తుంది. ‘దీని తడి ఆరేలోగా నువ్వు తిరిగిరావాలి’ అని సీత సెంటిమెంటు. ఆ యూనిట్ ప్యాచ్ రామాయణంలోని రాముడి ఉంగరం లెక్క పనిచేస్తుందన్నమాట! ఆహా! ఏమి స్టోరీ రైటింగు భయ్యా!
మ్యాట్నీ మహారుచులే వేరయా! అన్నట్టు 20 ఏళ్ల తర్వాత కూడా పెద్దగా వయసు పెరగని సీత, రామ్ ఉత్తరం చదువుతున్నపుడు అదే బాత్ టబ్ ప్రక్కన కూర్చుని చదువుతుంది. వెరీ సెంటిమెంటల్ అటాచ్మెంట్ విత్ ది టబ్! ఫన్నీ సన్నివేశాలు ‘సీతా రామం’లో చాలానే ఉన్నాయి. పాఠకుల ‘సెన్సాఫ్ హ్యూమర్’కే వాటిని వదిలేద్దాం.
పాకిస్తాన్‌లో పట్టుబడిన అభినందన్ వర్ధమాన్ తను విడుదలైనప్పుడు ఆ దేశంలో తనను బాగా చూసుకున్నారని చెప్పాడు. కానీ ఆ తర్వాత ఏ వత్తిడి వచ్చిందో, ఆ మాట మళ్లీ ఎత్తుకోవడం మానేశాడు. పాకిస్థాన్ మేజర్ ఆయూబ్ ఖాన్ మన దేశంలో రెండేళ్లు బందీగా వుంటూ హ్యాపీగా వున్నాడట! బరువు కూడా పెరిగాడట! కానీ మనం మాత్రం పట్టుబడితే అంతే సంగతులట! (అబూ గరీబ్ ఫొటోల్లాంటివి సైనికుల చేతుల్లో చూడొచ్చు) జెనీవా వొప్పందాన్ని అవతలి దేశం అసలు పాటించదట! ఇలా పక్క దేశంపై పోరు పెట్టే మన వ్యాపార సినిమాల వారికీ, ఈ సినిమాలోని ఆఫ్రీన్‌కీ తేడా ఏమైనా ఉందా? కశ్మీరులో ప్లెబిసైట్ నిర్వహిస్తామని మన ప్రధాని ఐక్యరాజ్య సమితికి కూడా మాటిచ్చాడు. అదే పని పాకిస్థాన్ వాళ్లూ చేశారు. అది ఈనాటికైనా జరిగిందా? ఎవరు ఎవరికి ఏ నీతులు చెబుతున్నారూ? సినిమాలూ, చరిత్ర పాఠాలూ ఐటీ సెల్ వాట్సప్ రాతల దశకు చేరడం ఈ కాలపు అత్యంత విషాదం!
ఒక సినిమా గురించి ఇంత సూక్ష్మపరిశీలన నాకు అబ్బురం అనిపించింది… తన పరిశీలనను స్పష్టంగా అర్థమయ్యేలా వ్యక్తీకరించిన తీరు బాగుంది… అయితే వైజయంతి అశ్వినీదత్ గానీ.., ఈ సీతారామం నిర్మాత, ఆయన బిడ్డ స్వప్న గానీ హిందుత్వ శిబిరమే అని ఎప్పుడూ అనిపించలేదు… ఆయన మరో బిడ్డ ప్రియాంకదత్, ఆమె భర్త నాగ్ అశ్విన్ కూడా కాషాయం తొడిగిన బ్యాచేమీ కాదు… రాజమౌళి తండ్రికి రాజ్యసభ ఇచ్చారంటే కాషాయ ఎజెండా అయి ఉండవచ్చు…
అయితే ఆయన ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్, బీజేపీలకు చేసిపెట్టిందేమీ లేదు… ఇప్పుడు ఏమైనా రాసి ఉద్దరిస్తాడేమో తెలియదు… కొడుకు రాజమౌళిలాగే పక్కా కమర్షియల్, పాపులర్ రైటర్ కావచ్చుగాక, ఒక్కటంటే ఒక్కటీ చెప్పుకోదగిన సినిమా కథ లేదు… కాషాయానికేమీ ఉపయోగం లేదు… జస్ట్, కమర్షియల్ కషాయమే… నిజంగానే ఆయనకు రాజ్యసభ ఎలా ఇచ్చారనేది ఆర్ఆర్ఆర్ బడ్జెట్ అంత మిస్టరీ… అయితే సీతారామం సినిమా వెనుక నిజంగా ఇన్ని మార్మిక సంకల్పాలు, ఉద్దేశాలు ఉన్నాయా..? డిబేటబుల్…! (ఎలాగూ ఈ పోస్టు పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టారు కాబట్టి, డిబేట్ అవసరం కాబట్టి… ఎవరి పర్మిషనూ అడగకుండానే యథాతథంగా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను… అభ్యంతరాలుంటే తొలగించగలను… )
Share this Article