ఒక వార్త, ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది… సంక్షిప్తంగా సదరు వార్త ఏం చెబుతున్నదంటే… ‘‘ఈ ఫోటోలో పెద్దాయన్ని గమనించండి, వేదాలు చదివిన పండితుడిలా, వృద్ధ బ్రాహ్మడిలా కనిపిస్తున్నాడు కదా… ఆయన ఓ పేరుమోసిన డాక్టర్, కేన్సర్ కేసుల్ని ట్రీట్ చేసే అంకాలజిస్టు… కేరళలోనే మొట్టమొదటి అంకాలజిస్టు… కొట్టాయం మెడికల్ కాలేజీలో అంకాలజీ ప్రొఫెసర్, తరువాత ఆ డిపార్ట్‌మెంట్ హెడ్, కొట్టాయం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా కూడా పనిచేశాడు… రిటైరైన తరువాత ఫ్లయింగ్ డాక్టర్ అనిపించుకున్నాడు… 50 దేశాలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్లి ప్రసంగాలు చేశాడు, చికిత్సలు చేసేవాడు… ఈయన ఎదురుగా కూర్చున్నాయన పేరు సూర్యన్ సుబ్రహ్మణ్యన్ భట్టాతిరి… ఆయనేమో ఓ సిద్ధవైద్యుడు… అంతటి అనుభవం ఉన్న పెద్ద కేన్సర్ స్పెషలిస్టు ఇన్నాళ్ల తన చదువు, వైద్యం నిరర్ధకమని భావించి ఇదుగో ఈ సిద్ధవైద్యుడిని గురువుగా గుర్తించాడు… సిద్ధవైద్యం నేర్చుకున్నాడు… దాంతో అనేకమంది రోగులను కాపాడాడు… చివరకు అమెరికాలోని ప్రసిద్ధ ‘మాయ క్లినిక్’ వదిలేసిన కేసుల్ని కూడా ఈయన ట్రీట్ చేశాడు…
సిద్ధవైద్యంతోపాటు వేదాలు, ఉపనిషత్తులను అధ్యయనం చేశాడు… ఈ వయస్సులో ఆయన తంత్రిక కర్మలకు పేరొందిన ‘సూర్యకాలాది మాన’ అనుసరించి ఉపనయన సంస్కారం పొంది, జీవితమంతా సనాతన ధర్మాన్ని ఆచరించి, ఇటీవల 92 ఏళ్ల వయస్సులో మరణించాడు… ఏ మీడియా ఆయన మరణవార్తను పట్టించుకోలేదు… నిజానికి ఆయన పుట్టుకతో వెనుకబడిన తరగతులకు చెందిన ఒక క్రిస్టియన్… కానీ జ్ఙానంతో బ్రాహ్మణుడయ్యాడు… ఆయన పేరు సీపీ మాథ్యూ…..’’ ఇదీ ఆ పోస్టుల సారాంశం… ఇందులోని మతాన్ని, కులాన్ని కాసేపు పక్కన పెట్టేయండి… ఇక్కడ మాథ్యూను మెచ్చుకోదగిన కొన్ని అంశాలున్నయ్… తనకే మొత్తం తెలుసనే అహం లేదు ఆయనకు… రిటైరయ్యాక కూడా తను తెలుసుకోవాల్సింది ఇంకెంతో ఉందనే సోయితో బతికాడు… ఓ సాదాసీదా మూలికావైద్యుడిని గురువుగా గుర్తించి, ఆ వైద్యం నేర్చుకున్నాడు… అల్లోపతీకి భారతీయ దేశీయవైద్యంలోని ‘మంచి’ని కూడా జతచేయాలనే ఆలోచన బాగుంది…
Ads
ఆయన ట్రీట్ చేసిన కేసుల్లో సక్సెస్ రేటు ఎంతనేది ఇదమిత్థంగా చెప్పలేం కానీ… మనం విస్మరిస్తున్న మన దేశీయ వైద్యాన్ని నేర్చుకుని, అందులో ఉపయుక్త విధానాలను అర్థం చేసుకుని, అప్పటి తన అల్లోపతీ అంకాలజీ అనుభవానికి జోడించి, ఓ కొత్త ప్రయత్నంలో ముందుకు సాగాడు… జరగాల్సింది ఇదేనేమో… మన ప్రభుత్వాలు ఘోరంగా విస్మరిస్తున్నదీ ఇదేనేమో… బ్యూరోక్రాట్ల చేతుల్లో, డ్రగ్ మాఫియాలు, మెడికల్ మాఫియాల గుప్పిట్లో వైద్యం ఇరుక్కుంటే జరిగే అనర్థాలు మనం చూస్తూనే ఉన్నాం… కరోనా పీరియడ్‌లో ఈ మాఫియాల విశ్వరూపం కూడా చూశాం… సో, పాతలోని మంచినీ, కొత్తలోని మంచినీ కలగలపాలనే మాథ్యూ ఆలోచన బాగుంది… అది ఒక్క కేన్సర్‌కు మాత్రమే కాదు, ఇతర వ్యాధులపై కూడా జరగాల్సిన అవసరం ఉంది… ఆమధ్య ఆనందయ్య మందు వివాదకాలంలో సిద్ధవైద్యం అంటే ఉత్త పసరు మందు అనీ, బిర్యానీ అనీ, అల్లోపతీ తప్ప ఇంకే వైద్యమూ అసలు సైన్సే కాదనీ వితండవాదాలు రెచ్చిపోయిన తీరు చూశాం కదా… సైన్స్ అంటే వాళ్లకు నిర్వచనాలు తెలిస్తే కదా… అది తెలిసినవాడు ఇదుగో ఈ మాథ్యూ…!!
Share this Article