.
“గడ్డి నీలం రంగులో కదా ఉండేది?” అని ఒక గాడిద పులిని అడిగింది… దానికి పులి, “నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి ?.. ఆకుపచ్చ రంగులో కదా ఉంటుంది” అని జవాబిచ్చింది గాడిద… “ఏడ్చావులే! గడ్డి నీలం రంగులోనే ఉంటుంది” అని గాడిద వాదించింది.
అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది. ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాయి.
Ads
దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చుని ఉంది. అక్కడికి చేరుకోగానే పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద “వన రాజా! వన రాజా! గడ్డి నీలం రంగులో కదా ఉండేది.. అవునా కాదా? మీరే చెప్పండి ” అంది…
“అవును! గడ్డి నీలం రంగులోనే ఉంటుంది” అంది సింహం . అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ “చూడండి మహారాజా! అలా అని నేను ఎంత చెప్పినా ఈ పులి ఒప్పుకోవడం లేదు, అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే” అంది…
“అవును, పులికి తప్పకుండా శిక్ష పడవలసిందే.. పులిని ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచండి!!” అని ఆదేశించింది సింహం… పెల్లుబికిన ఉత్సాహంతో రంకెలేసుకుంటూ అడవంతా పరుగెత్తడం మొదలెట్టింది గాడిద .
పులి నీరసంగా సింహం దగ్గరకు వెళ్ళి ” అదేమిటి మహారాజా! గడ్డి ఆకుపచ్చ రంగులో కదా ఉండేది?” అనడిగింది… “అవును, గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది!” అంది సింహం . “మరి నాకెందుకు శిక్ష విధించారు మహారాజా ?” అంది పులి దీనంగా…
దానికి సింహం “గడ్డి నీలం రంగులో ఉంటుందా? లేక ఆకుపచ్చ రంగులో ఉంటుందా? అనే విషయం గురించి నిన్ను శిక్షించడం జరగలేదు. బుద్ధిలేని ఒక గాడిదతో వాదించి, మరలా దానికి తీర్పు ఇవ్వమని నా దగ్గరకు వచ్చినందుకు నీకు శిక్ష పడింది..” అంది…
ఫేస్‌బుక్‌లో కొన్ని జీవులుంటాయి… పార్టీల పెయిడ్ బ్యాచ్ కావచ్చు, మూర్ఖపు ఫ్యానిజం బ్యాచ్ కావచ్చు… ఆ జీవులకు పోస్టులు అర్థం కావు, గుడ్డిగా ట్రోలింగుకు దిగుతాయి… ఇన్‌బాక్సుల్లోకి వచ్చి వాగ్వాదాలకు దిగుతాయి… బెదిరిస్తాయి, వాదిస్తాయి… పద్దతి బాగాలేదు బ్రో అంటే ప్రొపైల్ మీద రిపోర్టులు కొడతాయి…
నిజమే, పైన కథలో చెప్పినట్టు పులి నిజాలు చెబుతుంది… కానీ గాడిదలు అంగీకరించవు… సో, కొన్ని వదిలేయాలి, కొందరిని వదిలేయాలి… వాదించడం, పందేలు కాయడం, గోకించుకోవడం తెలివైనవారి లక్షణం కాదు…
చివరగా… తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు! ఎవరికి ఎంత అర్థమైంతే అంత…!! [[ – దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]]
Share this Article