.
Director Devi Prasad.C. …. మా ఇంటి బాల్కనీలో నుంచుంటే వీధిలో ఉన్న కారుని శుభ్రంగా తుడుస్తున్న ఓ డ్రైవర్ కనిపించాడు.
ఎందుకోగానీ ఎన్నో సంవత్సరాలక్రితం మద్రాసులో మా గురువు కోడి రామకృష్ణ గారి కారు డ్రైవర్‌గా పని చేసిన “అప్పారావు” గురుకొచ్చాడు.
అతి తెల్లగా ఉండే అతని కళ్ళలో పెద్దగా కనిపించే నల్లటి కనుగుడ్లు, బ్లాక్&వైట్ సినిమాలలోని A.N.R. క్రాఫ్‌లా అనిపించేలా ఉండే హైయిర్ స్టైల్, మూతి మీద అక్కినేని స్టైల్ లోనే ఉండే సన్నటి మీసంతో, మొహమ్మీద ఎప్పుడూ ఉండే చెరగని చిరునవ్వు కూడా గుర్తొచ్చాయి.
Ads
తల్లి తన చంటి బిడ్డకి ఎంతో ప్రేమతో స్నానం చేయించి, తలదువ్వి, పౌడర్ రాసి, బట్టలు వేసి చూసుకుని మురిసిపోయినట్టు, ఉదయం ఆరు గంటలకల్లా గురువు గారి తెల్లరంగు మారుతీ కారుని శ్రద్ధగా కడిగి తుడిచి, ముందు సీట్లో తెల్లటి టర్కీ టవల్‌ని చిన్న మడత కూడా లేకుండా సర్ది,మంచి పరిమళం కోసం కారులో తాజా మల్లెపూల చుట్టలు పెట్టి, కారు దగ్గరే నిలబడిఉండేవాడు.
రోజంతా ఎక్కడికి వెళ్ళినా తన పూర్తి ధ్యాస ఆ కారుమీదే. కనీసం కారు టైర్లకి కూడా ఇసుమంత దుమ్ము కనపడనిచ్చేవాడు కాదు.
అప్పారావుది ప్రకాశం జిల్లాలోని “ఇంకొల్లు” అనే ఊరు.
ఆయాచితంగా ఎవ్వరి దగ్గరా ఏమీ ఆశించేవాడు కాదు.చిన్నపెద్ద అందరి దగ్గరా గౌరవంగా మెలిగేవాడు.
అప్పారావు మీది ఇష్టంతోనే అతని తమ్ముడు “రాంబాబు”ని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పెట్టుకున్నారు డైరెక్టర్ గారు.
ఓ రోజు రాత్రి ఓ స్టార్‌హోటల్ లో వెంకటేష్ బాబు హీరోగా నటించిన “శత్రువు” సినిమా శతదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.
నందమూరి బాలకృష్ణ గారు, కె.విశ్వనాధ్ గార్లు చీఫ్ గెస్ట్‌లు.
మాకు కూడా 100 రోజుల షీల్డ్స్ రాబోతున్నాయని ఉత్సాహంలో ఉన్నాము మేము.
రాత్రి 10 గంటల టైమ్‌లో గురువు గారు డ్రైవర్ అప్పారావుని పిలిచి “నేను వేరే కారులో ఇంటికి వెళ్తాన్లే. నువ్వు తినేసి వెళ్ళి పడుకో… తెల్లవారుఝాము 3 గంటలకి తిరుపతి బయల్దేరదాము” అన్నారు.
“ఫరవాలేదు సర్. నేను మిమ్మల్ని దింపాకే వెళ్ళి మళ్ళీ 3 గంటలకు వచ్చేస్తాను”అన్నాడు.
తరువాతి రోజు నుండి తిరుపతిలో “తరంగాలు” సినిమా షూటింగ్ ఉంది గురువు గారికి.
మేము ఓ 11 గంటల సమయానికి టి.నగర్ లోని బోగ్‌రోడ్ లో “రాజాతీ అపార్ట్‌మెంట్స్” లో ఉన్న నిర్మాత “వాకాడ అప్పారావు” గారి “లలిత కళాంజలి ప్రొడక్షన్స్” ఆఫీస్‌కి చేరి పడుకున్నాము. (బ్రహ్మచారులమే కనుక) “వాకాడ అప్పారావు” గారు మమ్మల్ని బాగా చూసుకొనేవారు.
తరువాత ఓ గంటకి “డ్రైవర్ అప్పారావు” తన బట్టలతో వచ్చి”తెల్లవారుఝామున ఇక్కడే రెడీ అయ్యి వెళ్తాను” అన్నాడు.
నేను బెడ్ మీద పడుకుంటే తను కింద చాప మీద పడుకున్నాడు.
అతి తక్కువగా మాట్లాడే అప్పారావు ఆ రాత్రి నిద్ర రావటం లేదంటూ చాలా విషయాలు మాట్లాడుతూనే ఉన్నాడు.
నేను వింటూనే నిద్రపోయాను.
లైట్ కాంతికి ఎప్పుడో మెలకువ వచ్చి చూస్తే అప్పారావు రెడీ అయ్యి సైలెంట్‌గా వెళ్ళిపోవటం కనిపించింది.
ఉదయం 8 గంటలకు ఎవరో నన్ను కుదుపుతూ లేపి పిడుగులాంటి వార్త చెప్పారు.
తిరుపతికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో అప్పారావు నడుపుతున్న డైరెక్టర్ గారి కారుని ఏదో పెద్ద వెహికల్ గుద్ది యాక్సిడెంట్ అయ్యిందట.
కారులో వెనక సీట్లో కూర్చున్న గురువు గారి పర్సనల్ అసిస్టెంట్ “రమణ”, తిరుపతికి చెందిన నటులు “భక్త” గారితో సహా అందరూ హాస్పిటల్‌లో ఉన్నారనీ, అయితే ఎవ్వరికీ ప్రాణాపాయం లేదనీ వార్త.
కొంత ఊరట కలిగినా వెంటనే కొంతమందిమి తిరుపతికి బయల్దేరాము కారులో.
కొద్ది సేపట్లో తిరుపతికి చేరతామనగా రోడ్డు ప్రక్కన, ముందుభాగమంతా నుజ్జునుజ్జయివున్న డైరెక్టర్ గారి కారు కనిపించింది.
దిగి దాని దగ్గరకు వెళ్ళి చూస్తే గుండె బేజారయ్యింది.
డ్రైవర్ సీట్ పైన చీరుకుపోయి వున్న కారు పైభాగం రేకు మొనకి, తెల్లటి ముద్ద పైన వున్న నల్లటి కనుగుడ్డు గుచ్చుకుపోయి మెరుస్తూ కనిపించింది…..ఝల్లుమంది.
మోకాళ్ళ మీద దెబ్బలు మినహా డైరెక్టర్ గారు సేఫ్ కనుక ఆయన్ని హోటల్ కి పంపించేశారు.
మాట్లాడలేనంత షాక్‌లో ఉన్నారాయన.
హాస్పిటల్‌లో “భక్త” గారు ఇంకా షాక్‌లోనే ఉండి ఏవేవో మాట్లాడుతున్నారు.
రమణ తేరుకున్నాడు.
మరి మా డ్రైవర్ అప్పారావు..?
అతనెంత నీట్‌గా వుంటాడో అంతే నీట్‌గా వున్న తెల్లటి గుడ్డలో పూర్తిగా చుట్టబడి ఉన్నాడు నిర్జీవంగా.
అంబులెన్స్‌లోకి ఎక్కిస్తూ ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు అన్నారెవరో.
అతని ముఖాన్ని చూసే ధైర్యం మాకెవరికీ లేదు.
అతను లేని ప్రపంచంలో ఇన్నేళ్ళ తరువాత కూడా అతనిని గుర్తు చేసినవి రెండే రెండు.
అతను ఉన్నప్పుడు తన పనిలో ప్రదర్శించిన నిబద్ధత, చిరునవ్వును వీడని అతని ప్రవర్తన.

(నా పోస్ట్ చూసిన డ్రైవర్ అప్పారావు వాళ్ళ అబ్బాయి ఈ ఫోటో పోస్ట్ చేశాడు. ఫోటో కొంత పాడయిపోయి వున్నా పోస్ట్ చేస్తున్నాను. యాక్సిడెంట్‌కి గురైన కారు కూడా ఫోటోలో ఉన్నదే…) ____ దేవీప్రసాద్.
Share this Article