సాధారణంగా సినిమా ఇంటర్వ్యూలు అంటేనే… అదోరకం..! అధోరకం అనుకున్నా పర్లేదు… విపరీతమైన హిపోక్రసీ… ప్రత్యేకించి సినిమా ప్రమోషన్ కోసం ఉద్దేశించిన ఇంటర్వ్యూలయితే మరీ…!! ఆచార్య సినిమా కోసం చిరంజీవి అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు… ఈనాడు వాళ్లు కూడా వెళ్లారు… ఏదో అడిగారు, ఆయన ఏదో చెప్పి ఉంటాడులే అని పైపైన చదువుతుంటే… ఒక దగ్గర కన్ను ఆగిపోయింది… ఓ ప్రశ్న… అడగాల్సిన ప్రశ్నే…
ఇది సినిమా ఇంటర్వ్యూయేనా..? ఇది ఈనాడేనా..? అనిపించింది ఓ క్షణం… చిరంజీవి కూడా అవాయిడ్ చేయలేదు… జవాబు చెప్పాడు… గుడ్… ఆ ప్రశ్న ఏమిటంటే..? ‘‘పరిశ్రమ సమస్యల్ని ప్రస్తావిస్తున్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రి దగ్గర మీరు చేతులు జోడించడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి..? మీ దృష్టికి వచ్చాయా..?’’ ఇదీ ప్రశ్న… చాకచక్యంగానే అడగబడిన ప్రశ్న…
Ads
నిజం… చిరంజీవి మరీ చేతులు జోడించి జగన్‌ను ఏదేదో అడుగుతున్న వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది… (అసలు ఆ వీడియో లీక్ కూడా ఉద్దేశపూర్వకమే అనే విమర్శలూ వచ్చాయి… ఇక్కడ దాని లోతుల్లోకి వెళ్లడం అప్రస్తుతం…) తన మాట ధోరణి కూడా ఏదో ప్రాధేయపడుతున్నట్టు, సాగిలబడుతున్నట్టు ఉందనే అభిప్రాయాలు వినవచ్చాయి… సరే, దానికి జవాబుగా… పరిశ్రమ మనుగడకి సంబంధించిన సమస్య కాబట్టి చేతులు జోడించి వివరించాు… నా ఒక్కడి కోసం కాదు కదా… నా సొంతం కోసం చేసి ఉంటే నేను సిగ్గుపడాలి, కానీ లక్షలాది మంది భవిష్యత్తులో ముడిపడిన పరిశ్రమ సమస్య కాబట్టి ఓ పరిష్కార ప్రయత్నం చేశాను అని చిరంజీవి వివరించాడు…
ఎస్… తన కోణం నుంచి కరెక్టే కావచ్చుగాక … తనను పెద్దగా దేకని తెలుగు ఇండస్ట్రీని జగన్ ‘మెడ మీద కత్తులు పెట్టి’ మరీ రప్పించుకున్న తీరు చూశాం కదా… ఆ స్థితిలో కూడా ఒక సెక్షన్ నిర్మాతలు జగన్‌తో భేటీకి ఇష్టపడలేదు… తలవంచినట్టు అనిపించలేదు… మహేశ్ బాబు సొంత బావ గల్లా జయదేవ్‌తో జగన్‌కు ఫైట్ నడుస్తోంది… ప్రత్యర్థి పార్టీ… ఒక దశలో తమ వ్యాపారాన్ని, అంటే అమరరాజా బ్యాటరీ యూనిట్లను తమిళనాడుకు తరలించడానికి కూడా జయదేవ్ సిద్ధపడ్డాడు…
రాజకీయాలకు దూరంగా ఉండే మహేశ్ బాబు జగన్‌తో భేటీ సందర్భంగా హంబుల్‌గా మాట్లాడుతూనే… ఏదో ప్రాధేయపడుతున్నట్టుగా కూడా ఏమీ మాట్లాడలేదు… రాజమౌళి అదో టైపు… ఆలీ, పోసాని, నారాయణమూర్తి జగన్ వైపే కాబట్టి పరిగణనలోకి రారు… ఈ స్థితిలో చిరంజీవి మాట్లాడిన తీరే ‘‘ఫుల్లీ సరెండర్’’ అనే భావనను కలిగించింది… ఆ భేటీలో ఎవరూ ఎగ్జిబిటర్లు కూడా లేరు… ఫిలిమ్ చాంబర్ లేదు… నిర్మాతల మండలి లేదు… మిగతా ఏ సంఘాలూ లేవు… ఇది బాధ్యతా, లేక తనంతటతాను సొంతంగా మీద వేసుకున్న పెద్దరికమా..?
నిజానికి చిరంజీవికి ఏం తక్కువ..? తన ప్రజారాజ్యం సినిమాను కాంగ్రెస్‌లో నిమజ్జనం లేదా విలీనం చేయకుండా ఉంటే… ఆ పార్టీని అలాగే ఇప్పటికీ కొనసాగించి ఉంటే ఏపీ రాజకీయాల కథ వేరే ఉండేది… ప్రస్తుతం ఏపీలో ఓ ఆల్టర్నేట్ వాయిస్ అంటూ లేకుండా పోయింది… తను పద్మభూషణ్, ఈరోజుకూ కోట్ల మంది అభిమానులున్నారు… తన స్టేటస్ ఏమీ తక్కువ కాదు… తనది తెలుగు ఇండస్ట్రీలో హీరోలను ఉత్పత్తి చేసే పెద్ద ఫ్యాక్టరీ…
అప్పట్లో చంద్రబాబును, వైఎస్‌ను రాజకీయంగా విభేదిస్తూ… ఊరూరా రాజకీయ యాత్ర చేసినప్పుడు కూడా వాళ్లను ఉద్దేశించి ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడినట్టు గుర్తులేదు… భాషలోనూ, మాటలోనూ, విమర్శలోనూ తన సంస్కారాన్ని, సంయమనాన్ని ఎక్కడా విడిచిపెట్టలేదు… వైఎస్‌తో కూడా మంచి దోస్తీయే మెయింటెయిన్ చేశాడు… మరి ఆ వైఎస్ కొడుకు దగ్గర చనువు కనబరచవచ్చు కదా… జగన్ ఇంటికి భోజనానికి కూడా వెళ్లాడు కదా, ఆ సత్సంబంధాలు ఉన్నాయి కదా… అలాంటప్పుడు తలవంచి కాదు, తల ఎత్తుకుని… చేతులు జోడించి కాదు… ఓ రిప్రజెంటేషన్‌లాగే తనకు కావల్సినవి అడగొచ్చు… తన ఫ్యాన్స్‌లో చాలామంది ఫీలైంది కూడా అదే… ఈనాడు అడిగింది కూడా అదే..!!
Share this Article