Murali Buddha………. పళ్లూడగొట్టుకొని బంగారు పళ్ళు పెట్టించుకొన్న జర్నలిస్ట్, అద్దె కట్టలేక అటవీ ప్రాంతంలో అంతిమ రోజులు…. అతని జీవితం ఓ పాఠం… జ్ఞాపకాలు…
‘‘చూశారా బంగారు పళ్ళు పెట్టించుకున్నాను . నా పళ్ళు బాగానే ఉన్నాయి కానీ చిన్నప్పటి నుంచి పేదరికంలోనే గడిపాను . ఇప్పుడు డబ్బులు వచ్చాయి . బాగున్నా సరే, ఆ పళ్ళు తీసేసి ఈ బంగారు పళ్ళు పెట్టించుకున్నాను’’ ……….. ఇదో జర్నలిస్ట్ వాస్తవ కథ . పేదరికం జీవితంలో చాలా పాఠాలు నేర్పిస్తుంది . మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే . నేర్చుకోకపోతే మరింత పేదరికంలోకి నెట్టేసి క్రూరంగా నవ్వుతుంది .
రంగారావు అని ఆంధ్రప్రభలో జర్నలిస్ట్ . నాకు పెద్దగా పరిచయం లేదు కానీ నా మిత్రుడికి మంచి ఫ్రెండ్ . మా ఇద్దరి మధ్య తరుచుగా రంగారావు ప్రస్తావన వచ్చేది . ఈ మధ్య కలిసినప్పుడు రంగారావు గురించి అడిగితే రాజమండ్రి సమీపంలోని ఓ గిరిజన ప్రాంతంలో అనాథలా మరణించాడు అని చెప్పుకొచ్చాడు . సరదాగా బంగారు పళ్ళు పెట్టించుకున్న అతను ఇక్కడ అద్దె భరించలేక నాలుగు వందల రూపాయల అద్దె కోసం గిరిజన ప్రాంతానికి వెళ్లి ఒక్క చిన్న గదిలో చివరి రోజులు గడిపారు .
Ads
ఖమ్మంలో జర్నలిస్ట్ లకు ప్లాట్ల కోసం 28 ఎకరాల స్థలం కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది . హైదరాబాద్ జర్నలిస్ట్ లకు భూమి బదలాయించాలి అని ఉద్యమం వార్తలు . ఇవి చూశాక రంగారావు జీవితం గుర్తుకు వచ్చింది . అతను ఆంధ్రప్రభలో కాంట్రాక్ట్ ఉద్యోగి . జీతం తక్కువ ఉంటుంది . ఉద్యోగ భద్రత అస్సలు ఉండదు . జీవితం మొత్తం లో అతను చేసిన ఒకే ఒక లాభసాటి పని సకాలం లో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో దరఖాస్తు చేయడం .
దరఖాస్తు చేసిన వేళా విశేషం అతనికి ప్లాట్ అలాట్ అయింది . దాదాపు రెండు దశాబ్దాల క్రితం గోపన్ పల్లి లోని ప్లాట్ 36 లక్షలకు అమ్మేశాడు . ఇప్పుడు అక్కడ దాని విలువ మూడు కోట్ల రూపాయలు ఉంటుంది . రెండు దశాబ్దాల క్రితం 36 లక్షలు అంటే చాలా పెద్ద మొత్తమే . డబ్బు సంపాదించడమే కాదు దాన్ని హోల్డ్ చేసే సామర్ధ్యం కూడా ఉండాలి . ఆ డబ్బుతో ఉప్పల్ వద్ద చిన్న ఇల్లు కుటుంబం అంతా జల్సాగా వెళ్లేందుకు ఓ కారు కొన్నాడు .
సరిపోవడం లేదు అని కారుతో పాటు ఓమిని కొన్నారు . చదువు ఒంటబట్టక చిన్న ఉద్యోగం చేస్తున్న కొడుకు తో ఉద్యోగం మానేయించి బేకరీ పెట్టించాడు . చేతిలో ఇంత డబ్బు ఉన్నాక కాంట్రాక్ట్ ఉద్యోగం ఎందుకు అని ఉద్యోగం మానేశాడు . సరైన ప్లాన్ లేకపోతే కొండలే కరిగిపోతాయి 36 లక్షలు ఓ లెక్కనా ?
రెండు కార్లలో ఆలయాల సందర్శన . సరదాగా పళ్లూడగొట్టుకొని బంగారు పళ్ళు పెట్టించుకోవడం వంటివి అన్నీ చేశారు . చిన్న పాటి ఇల్లు కూడా అమ్మేసి అద్దె ఇంట్లోకి మకాం మారింది . వ్యాపారం తెలియక ఎక్కడ అమ్ముడుపోనివి వీరి బేకరీకే అంటగట్టే వారు . ఒక శుభముహుర్తంలో బేకరీ మూసేసి కొడుకు మళ్ళీ ఉద్యోగంలోకి . చిన్న ఇంటికి కూడా హైదరాబాద్ లో అద్దె చెల్లించలేక రాజమండ్రి దగ్గర లోని అటవీ ప్రాంతంలో నెలకు నాలుగు వందల అద్దెతో చిన్న గదిలోకి జీవితం మారింది .
అప్పటి వరకు పేదరికంలో గడిపిన వారికి హఠాత్తుగా సంపద వస్తే రెండు రకాలుగా వ్యవహరిస్తారు . పేదరికం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు కాబట్టి మళ్ళీ తనను పేదరికం ప్రేమించకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకునే వారు కొందరైతే .. నేనిప్పుడు పేదరికంలో లేను నా పరిస్థితి మారింది చూడు అని బంగారు పళ్ళు పెట్టించుకుని బోల్తా పడేవారు కొందరు .
జర్నలిస్ట్ లకు ఎవరూ పాఠాలు చెప్పలేరు … ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే బార్ షాప్ లో కూర్చొని అమెరికా పీచమణచగలరు . అందరూ అలా అని కాదు జీవితం గురించి ఏ మాత్రం అవగాహన లేనివారే అలా ఉంటారు . మహబూబ్ నగర్ జిల్లాల్లో దొంగసారాయి వ్యాపారం గురించి రాసినందుకు డీకే భరత్ సింహా రెడ్డి అనుచరులు రాధాకృష్ణ అనే పార్ట్ టైం విలేకరిని కిడ్నాప్ చేశారు .
ఉదయంలో జొన్నలగడ్డ రాధాకృష్ణ అనే మంచిమనిషి మహబూబ్ నగర్ రాధాకృష్ణను హైదరాబాద్ కు పిలిచి ఫోటో గ్రాఫర్ గా ఉద్యోగం ఇచ్చారు . అతనికి అదృష్టం కలిసొచ్చి జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో ప్లాట్ దక్కింది . కిడ్నాప్ తో తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అయింది . ఆ ప్లాట్ అమ్మి బోలెడు అద్దెలు వచ్చే విధంగా ఉప్పల్ లో పెద్ద బిల్డింగ్ కొనేసాడు . అతను మేధావి కాదు కాబట్టి అలా చేయగలిగాడు .
జర్నలిస్ట్ ల అందరి జీవితాలు అందరికీ తెలిసిన ఓ అరడజను మంది జీవితాల్లా ఉండవు . పారిశ్రామిక వేత్తలు , సాధారణ జర్నలిస్ట్ నుంచి పత్రికను కొనే స్థాయికి ఎదగడం , పవర్ ప్రాజెక్ట్ లు , కోట్ల ఆదాయం ఉండే వారు మహా అయితే అరడజను లోపే ఉంటారు . ఎక్కువ మంది జీవిత పోరాటంలో బాగా అలసిపోయిన వారే ఉంటారు . ఈ సంగతి మనకూ తెలుసు పాలకులకు తెలుసు .
ఉమ్మడి రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల భూములు ఆక్రమించుకున్న రాజకీయ కుటుంబాల వారు సైతం మేం అధికారంలోకి వస్తే జర్నలిస్ట్ లకు ప్లాట్స్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పెడతాం అంటున్నారు . ఆక్రమించుకున్న భూమిలో ఓ ఎకరం ఇస్తాం అంటే నమ్మకం కుదిరేది . కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు . అప్పటివరకు వేచి చూడాలి . వచ్చాక రంగారావులం అవుదామా ? పాలమూరు రాధాకృష్ణలం అవుదామా ? అనేది మన ఇష్టం .
భార్యాభర్తల మధ్య కలహాలు ఉంటే ఛానల్ వాళ్ళు బతుకు జట్కా బండి ప్రోగ్రాంకు తీసుకు వస్తారు . ఆ ఛానల్ ఉద్దేశం వాళ్ళ కుటుంబాన్ని కలపాలి అని కాదు . వాళ్ళ గొడవతో ఛానల్ రేటింగ్ పెంచుకోవాలి అని …. (ఈ కథనంలోనివి రచయిత సొంత అభిప్రాయాలు)
Share this Article