భిన్నమైన సినిమా ఇది… వెకిలితనం లేదు… వెగటుతనం లేదు… అశ్లీల సీన్లు, అందాల ప్రదర్శనలు, అసభ్య సన్నివేశాలు, పిచ్చి గెంతుల డాన్సులు, ఐటమ్ సాంగులు, హీరోను అసాధారణ మానవాతీత శక్తిగా చూపే ఫైట్లు… ఇవేవీ లేవు… క్లీన్ అండ్ ప్లెయిన్… మరేముంది సినిమాలో..? ఓ ప్రేమకథ ఉంది, ఆ ప్రేమలో గాఢత ఉంది… భిన్నమైన పోకడ ఉంది…
అచ్చమైన తెలంగాణతనం ఉంది… తెలంగాణ పల్లె సంబరముంది… కన్నీళ్లున్నాయి… గాయాలున్నాయి… వాటి తడి ఇంకా ఆరని జ్ఞాపకాలున్నాయి… అప్పట్లో తల్లడిల్లిన తెలంగాణ పల్లె తల్లి గుండె ఉంది… రాజ్యానికీ, తిరుగుబాటుకూ నడుమ ఘర్షణ ఉంది… రెండు తుపాకుల నడుమ చిక్కి నలిగిన పల్లెదనం ఉంది… కథే ఇందులో హీరో… కాదు, దర్శకుడే…
తెలుగులో మంచి కథాప్రాధాన్యం ఉన్న సినిమాలు ఇక రావా..? అనే ప్రశ్నకు సమాధానం విరాటపర్వం… ఇలాంటి కంటెంట్ బేస్డ్, ఇంటెన్స్ స్టోరీ సినిమాల్ని ఆదరించాలి… మరికొందరికి ఈ దిశలో నమ్మకాన్ని ఇవ్వాలి… కాల్పుల నడుమ వెన్నెల పాత్ర పుట్టుక, కాల్పుల నడుమే ఠాణా నుంచి విముక్తి, కాల్పుల నడుమే ప్రేమ… చివరకు ఆ కాల్పుల్లోనే ఖతం… సినిమా మొత్తం కాల్పులే, తూటాలే… పలు సన్నివేశాలు, మాటలు కూడా తూటాల్లా పేలాయి…
Ads
తూము సరళ ఉదంతం నక్సలైట్ల ఉద్యమంలో మరిచిపోలేని ఓ మరక… అయితే కొన్ని సరళ అనుభవాల చుట్టూ దర్శకుడు ఓ సొంత కథను రాసుకున్నాడు… తడి ఉన్న ఈ దర్శకుడు కథకుడు కూడా కదా, ఎమోషనల్ సీన్ల టేకింగ్‌లో తన ప్రయాస, ఆలోచన, కృషి కనిపిస్తాయి… సీన్లలో కృత్రిమత్వం గాకుండా నేచురాలిటీ కనిపిస్తుంది… ప్రత్యేకించి తెలంగాణ సంప్రదాయాలు, భాష, పల్లెవాసన ఆకట్టుకుంటాయి… మానవసహజమైన ఆర్ద్రత ఉంది ఇందులో…
రానా పాత్రకు పెద్ద ప్రాధాన్యం ఏమీ లేదు… తనే చెప్పినట్టు సాయిపల్లవి కథకు ప్రియమణి, నవీన్‌చంద్ర, ఈశ్వరీరావు, నందితాదాస్ తదితరులంతా సహాయపాత్రలే… నో డౌట్, సాయిపల్లవి సినిమా మొత్తాన్ని మోసింది… ఆ పాత్రను ఇంకెవరూ చేయలేరేమో అనే స్థాయిలో తన మ్యాగ్జిమం ఇచ్చేసింది… అయితే వెన్నెల పాత్రను అంత పవర్‌ఫుల్ చేయడంతో మిగతా పాత్రలు మరుగుజ్జులైపోయాయి… బ్యాలెన్స్ తప్పింది… ఒక పాత్రనే దర్శకుడు అమితంగా ప్రేమిస్తే జరిగే తప్పిదం ఇది…
పాటల్ని కూడా అంత ఇంప్రెసివ్‌గా చిత్రీకరించలేకపోయాడు దర్శకుడు వేణు… అక్కడక్కడా బోర్ అనిపిస్తుంది… బీజీఎం, ఇతర టెక్నికల్ యాస్పెక్ట్స్‌లో వోకే… ఇదంతా ఓ సగటు ప్రేక్షకుడి దృక్కోణం… కమర్షియల్ లెక్కల్లో ఇముడుతుందా..? గట్టెక్కుతుందా..? బర్గర్లు, పిజ్జాల శకంలో జొన్న గట్క నచ్చుతుందా..? చూడాలి… అయితే…
కాస్త లోలోపలకు వెళ్లి మథించేవాళ్లకు కొంత అసంతృప్తి సహజం… ఎందుకంటే… ప్రేమే దైవం, ప్రేమకు మించిన ప్రజాస్వామిక విలువ ఏదీ లేదు అనే దర్శకుడి బేసిక్ పాయింట్ దగ్గరే ఒకింత గందరగోళం… ప్రధాన పాత్ర వెన్నెలకు బావతో పెళ్లి ఇష్టం లేదు, ఎక్కడో అడవుల్లో తిరిగే నక్సలైటు రవన్న మీద ప్రేమ, విప్లవోద్యమంపై అభిలాష… వీటిలో ఏది బలంగా ఆమెను అడవుల్లోకి పంపించింది…? రవన్న గురించి ఆమెకు ఏమీ తెలియదు… ఎక్కడి ఖమ్మం, ఎక్కడి నిజామాబాద్… రవన్న మీద ప్రేమ ఎలా కుదిరింది..?
పోనీ, ఆ ప్రేమే ఆమెను అడవిబాట పట్టించిందీ అనుకుంటే… ఆ ప్రేమ కేవలం వ్యక్తిగతం… ఇక ఆ ప్రేమకు సార్వజనీనత అనే ముద్ర వేయకూడదు… జనం మీద ప్రేమతో, విప్లవోద్యమం మీద కోరికతో అడవిబాట గనుక పట్టి ఉంటే వెన్నెల కేరక్టర్‌లో ఇంకా గాఢత ఉండేది… ఇలా వెన్నెల పాత్ర కేరక్టరైజేషన్‌లోనే ఓ గందరగోళం ఉంది… ప్రేమ వేరు, విప్లవం వేరు… రెండింటికీ ఓ ప్రేమకథతో లంకె పెట్టే ప్రయత్నం ఈ గందరగోళానికి కారణం… దర్శకుడి ఈ ప్రేమైక విప్లవ ఫిలాసఫీ ఏమేరకు జనానికి ఎక్కుతుందో చూడాల్సిందే… Revolution is an act of Love అనేది వినడానికి బాగానే ఉన్నా, కరెక్టే అని కన్విన్స్ చేయడం కష్టం…!
ఒరిజినల్ కథలో ఆమె రవన్నను కలవడానికి ప్రయత్నించదు… దళంలో చేరాలనే సిర్నాపల్లి ప్రాంతంలో తిరుగుతూ, ప్రయత్నిస్తూ ఉంటుంది… అది కాస్త అసహజంగా ఉంటుంది కాబట్టే పోలీసు ఇన్‌ఫార్మర్‌గా నక్సలైట్లు అనుమానిస్తారు… ఇంటరాగేషన్ సమయంలో తుపాకీ పొరపాటున పేలి ఆమె చనిపోతుందని ఓ ప్రచారం… కాదు, శంకరన్న దుందుడుకు వైఖరితో కాల్చాడని మరో ప్రచారం… అంతేతప్ప, ఆమెను దళంలో చేర్చుకున్నదీ లేదు… ఆమె తుపాకీ పట్టిందీ లేదు… సినిమాలో చూపినట్టు పోరాటమూ లేదు…. సరే, ఇదంతా దర్శకుడి క్రియేటివ్ ఫ్రీడం అనుకుందాం…
తప్పు జరిగింది నక్సలైట్ల వైపు నుంచి… వాళ్లే క్షమాపణ చెప్పారు, తప్పని అంగీకరించారు… కానీ ఆ తప్పును తప్పు అని చెప్పడానికి దర్శకుడు ఎందుకో విముఖత చూపించాడు… ఆ తప్పు అనివార్యంగా చేయాల్సి వచ్చినట్టుగా… ఆ తప్పుకు జస్టిఫికేషన్ అన్నట్టుగా… ఆమెను కోవర్టు అని అనుమానించడానికి కొన్ని కారణాలను, సంఘటనల్ని జాగ్రత్తగా ఆలోచించి పేర్చినట్టు కనిపిస్తుంది… చివరకు దీనికి కూడా పోలీసులే కారణం అన్నట్టుగా ఉంది… నక్సలైట్లది తప్పే అని చెప్పలేక దర్శకుడు రాజీపడ్డట్టున్నాడు…
అయితే ఇవన్నీ సగటు ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోడు… ఒరిజినల్ కథకూ, ఈ సినిమా కథకూ నడుమ తేడా ఏమిటనేది తనకు అక్కర్లేదు… జస్ట్, ఇదీ ఓ కథే అనుకుని గనుక కథలో లీనమైతే సినిమా కనెక్టవుతుంది… పలు సన్నివేశాలు బలంగానే పండాయి కాబట్టి, కనెక్టవుతుందనే ఆశిద్దాం..! ఎందుకంటే… ప్రేక్షకుడి ఆలోచనలకు పదును పెట్టే కథాంశాలతో సాగే భిన్నమైన సినిమాలు ఇప్పుడు తెలుగులో అవసరం కాబట్టి…! జీవమున్న కథలు కావాలి కాబట్టి..! నిరర్థకమైన, నిస్సారమైన, నిష్ప్రయోజనకరమైన, నికృష్ట గ్రాఫిక్స్ కథల్ని ఇంకా ఎన్నాళ్లు మోద్దాం..!?
Share this Article