ఉత్తరప్రదేశ్… బండా జిల్లా… మవాయి బైపాస్ దగ్గర ఉన్న సర్క్యూట్ హౌజ్, అనగా ఓ ప్రభుత్వ అతిథి గృహం… తెల్లవారుజామున మూడు గంటలు… అకస్మాత్తుగా ఓ గది నుంచి కేకలు… ఒక్కసారిగా మొత్తం గెస్ట్ హౌజ్ మొత్తం లైట్లు వెలిగాయి… హడావుడిగా సిబ్బంది పరుగులు…
సార్, సార్… ఏమైంది సార్..? ఎందుకలా చెమటలు పట్టాయి..? పీడకల ఏమైనా వచ్చిందా..? మజ్జిగ తీసుకురమ్మంటారా..? పోనీ, కాస్త నిమ్మకాయ సోడా..? అని అడుగుతున్నారు… ఆయన కళ్లల్లో భయం… ఆందోళన…
బీపీ పెరిగిందా..? లైట్ స్ట్రోక్ ఏమైనా వచ్చిందా..? ఆ చెమటలేమిటి..? ఏం జరిగింది..? ఆయన ఏమైనా చెబితే కదా తెలిసేది… చెప్పలేని స్థితిలో ఉంటే అర్జెంటుగా డాక్టర్లను పిలుస్తారు… కానీ అరుపులు, చెమటలు… సిబ్బందికి కూడా ఏం చేయాలో తోచడం లేదు…
Ads
అంతమంది అంతగా శ్రద్ధ చూపించడానికి కారణం… ఆయన సాదాసీదా గెస్టు కాదు… రాష్ట్ర ఆటల మంత్రి… పేరు గిరీష్ చంద్ర… నిన్నంతా బాగా యాక్టివ్‌గానే ఉన్నాడు… రాత్రి ఎంచక్కా పుష్టిగా భోజనం చేసి పడుకున్నాడు… తెల్లవారుజామున ఇదీ పరిస్థితి…
నా చేతి మీద ఏదో పాము కరిచింది… డాక్టర్లను అర్జెంటుగా పిలవండ్రోయ్ అని కేకలేసి మళ్లీ ఫెయింటయ్యాడు మంత్రివర్యుడు… ఆయన చెబుతున్న చోట చూశారు… పాము గాట్లు ఏమీ లేవు… అవేమైనా కనిపిస్తే అప్పటికప్పుడు కనీసం ప్రాథమిక చికిత్స ఏమైనా చేయవచ్చు కదా… ఓ వేలి మీద మాత్రం కాస్త ఏదో కొరికినట్టుగా ఉంది…
ఎందుకొచ్చిన తిప్పలు..? ఏదైనా పొరపాటు దొర్లితే తెల్లవారే బుల్‌డోజర్లు ఇళ్ల ముందుకొస్తాయి… వెంటనే అధికారులు అప్పటికప్పుడు అమాంతం మోసుకెళ్లి, ఓ అంబులెన్సులో ఎక్కించి, సమీపంలో ఉన్న ఓ ప్రభుత్వ హాస్పిటల్ ట్రామా సెంటర్ బెడ్ మీద పడుకోబెట్టారు… డాక్టర్ల ఇళ్లకు ఫోన్లు చేసి, అర్జెంటుగా రప్పించారు…
అది ఏ పామో తెలియదు… ఏ పాము విషమైనా సరే, విరుగుడుగా పనిచేసే యాంటీ వీనమ్ ఇంజక్షన్లను రెడీ చేయాలని నర్సులకు పురమాయించి, డాక్టర్లు పరుగులు తీస్తూ వచ్చారు… పామును బట్టి యాంటీ వీనమ్ సూదులు ఉంటాయి తెలుసు కదా… తాజాగా ప్రభుత్వ హాస్పిటళ్లలోకి కూడా పలు పాముల విషానికి స్థూలంగా విరుగుడుగా పనిచేసే పాలీవలెంట్ స్నేక్ యాంటీ వీనమ్ కూడా అందుబాటులోకి వస్తోంది… ఎందుకైనా మంచిదని ఓ సూది గుచ్చేశారు… ఓ సెలైన్ ఎక్కించసాగారు… మరీ అవసరమైతే వెంటనే ఆక్సిజన్ అందించడానికి ఏర్పాటు ప్రారంభించారు… కరోనా కాలంలో పలు చిన్న హాస్పిటళ్లలో సైతం ‘మినీ ఐసీయూ’లు ఏర్పడ్డాయి కదా…
డాక్టర్లు కూడా మరోసారి థరోగా చెక్ చేశారు… కానీ పాముగాట్లు కనిపించలేదు… అసలే గెస్ట్ హౌజు చుట్టూ దట్టమైన అడవి… పాములు వచ్చిపోవడం అక్కడున్నవారికి అలవాటే… కానీ ఏ పాము వచ్చి కాటేసిందో తెలియదు… ఈలోపు సిబ్బంది గదులన్నీ గాలించారు…
ఎక్కడైనా పాము నక్కిందేమో, చంపేద్దాం, విరుగుడు చికిత్స కూడా సులభం అవుతుందని ఆలోచన… ఆశ… మెల్లిమెల్లిగా మంత్రి మన సోయిలోకి వచ్చాడు… ఇక ఫర్లేదులే అని డాక్టర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు… తెల్లవారింది… ఉదయం ఆరుగంటలు…
గెస్ట్ హౌజులోని గదులన్నీ గాలించిన సిబ్బందికి ఏ పామూ దొరకలేదు… కానీ ఓ ఎలుకను పట్టుకున్నారు… సమయానికి అది తనకు అలవాటైన బొరియలోకి దూరలేక దొరికిపోయింది… డాక్టర్లకు అదే చెప్పారు… ‘‘అయ్యా, ఎలుక తప్ప గెస్ట్ హౌజులోకి రాత్రి ఏ పామూ వచ్చినట్టుగా లేదు…’’
ఓ డాక్టర్‌కు వెలిగింది… మంత్రి శరీరం మీద పాము గాట్లు లేవు, నురగ లేదు, పాముకాటు లక్షణాలేమీ కనిపించడం లేదు… బహుశా ఎలుక కొరికి ఉంటుంది, దాంతో మంత్రి హఠాత్తుగా లేచి అరుపులు అందుకున్నట్టున్నాడు… పాము కొరికిందనుకునే భయానికి లోనయ్యాడు… హమ్మయ్య… మంత్రికి అదే చెప్పారు… కొంతసేపు మళ్లీ మంత్రి గారికి నోటమాట రాలేదు… చివరకు ఏమైంది..? ఎందుకైనా మంచిదని, అలర్జీ రాకుండా… రూపాయి విలువ చేసే ఓ అవిల్ టాబ్లెట్ మింగించి, అర్జెంటుగా మంత్రిని డిశ్చార్జ్ చేశారు… ఆ ఎలుకను కూడా వదిలిపెట్టినట్టున్నారు…
(ఇది కథ కాదు… నిన్నటి వార్తే… కాస్త క్రియేటివ్ ఫ్రీడం తీసుకుని, కథీకరించిన ఓ న్యూస్… సరదాగా…)
Share this Article