వయనాడు కొండచరియలు విరిగిపడిన విపత్తు వేళ సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీ బాసటగా నిలబడింది… గుడ్
ఊరుఊరంతా కొట్టుకుపోయినా ఒక ఇల్లు మాత్రం నిక్షేపంగా ఉంది… ఆ ఇంటాయన వేరే ఊరికి వెళ్లడం వల్ల బతికిపోయాడు, తిరిగి వచ్చి చూసేసరికి తనవాళ్లెవరూ లేరు, గల్లంతు… బతికిన ఆనందమా, అందరినీ కోల్పోయిన విషాదమా… ఓ వార్త…
ఓ స్కూల్ పిల్ల అచ్చం ఇదే విపత్తును సూచిస్తూ వారం క్రితమే తమ స్కూల్ మ్యాగజైన్‌కు ఓ కథ రాసింది… ఇప్పుడు ఆ స్కూల్ నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది… ఇదొక వార్త…
Ads
ఓ లేడీ ఆర్మీ ఆఫీసర్ కొన్నిగంటల్లోనే ఓ బ్రిడ్జి నిర్మించి వేలాది మందిని సురక్షితంగా తరలించింది… సహాయక సామగ్రిని సమకూర్చింది… హేట్సాఫ్ టు ఆర్మీ ఎఫర్ట్స్… మరొక వార్త…
ఇలాంటి హ్యూమన్ ఇంటరెస్టింగ్ వార్తలెన్నో కనిపిస్తున్నాయి… 300 మంది మరణించగా, 200 మంది వరకూ గల్లంతు ఇప్పటికీ… వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు… వందల కుటుంబాలు బజారున పడ్డాయి… ఇన్ని వార్తల నడుమ ఓ వార్త బాగా ఆకర్షించింది… మనుషుల్లో కరుణ, మానవత్వం ఇంకా మిగిలే ఉందని చెప్పడానికి…
భావన సజిన్, భర్త సజిన్ పరేక్కర… ఇడుక్కిలోని ఉప్పుతారలో ఉంటారు… రెండు కాల్స్ వచ్చాయి… ఏదో రాత్రి వేళ… సహాయక శిబిరాల్లో అనాథలుగా మిగిలిన శిశువులకు స్తన్యం కావాలి అని…! ఏమైనా సాయం కావాలంటే సంప్రదించండి అని అంతకుముందే వాళ్లు తమ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు సోషల్ మీడియాలో… దానికి స్పందనగా ఈ కాల్స్ రావడంతో అప్పటికప్పుడు అర్జెంటుగా ఓ ట్రక్కులో తమ పిల్లలను కూడా వెంటేసుకుని 350 కిలోమీటర్ల దూరంలోని మెప్పడిలో ఓ సహాయక శిబిరాన్ని చేరుకున్నారు…
తీరా అక్కడికి వెళ్లి చూస్తే… రమ్మని కాల్స్ చేసిన వాళ్లు పత్తా లేరు… రాగానే మాకు కాల్ చేయండి అని చెప్పారు వాళ్లకు కాల్స్ చేసి రమ్మన్నవాళ్లు… ఎవరూ లేరు… అక్కడ పాలు కావల్సిన పిల్లలూ లేరు… షాక్ తిన్నారు వీళ్లు… అర్జెంటు అన్నారు కదాని అర్థరాత్రి బయల్దేరి వచ్చారు, రాత్రి ఓ గంట కూడా నిద్రపోలేదు…
సుల్తాన్ భతేరీలో వాళ్ల చుట్టపాయన ఉంటే వాళ్లింట్లో దిగారు… ఆ సమయానికి రాహుల్, ప్రియాంకలు విపత్తు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు… వేరే సహాయక శిబిరాలకు వెళ్లే వీలు లేదు… బందోబస్తులతో హడావుడి… (నిజానికి విపత్తుల వేళ ఏ రాజకీయ నాయకుడు పర్యటించినా సరే, అది సహాయ, పునరావాస కార్యక్రమాలకు విఘాతం… ఆ సోయి, విజ్ఞత మన లీడర్లకు ఉంటే కదా… కాస్త పరిస్థితులు చక్కబడ్డాక, సద్దుమణిగాక వెళ్లండిరా బాబులూ…)
అర్ధరాత్రి అక్కడికి హుటాహుటిన వెళ్లిన ఈ సజిన్ ఏమంటున్నాడూ అంటే… సహాయక చర్యల్లో పాల్గొంటూనే… సమీపంలోని ఏ శిశువుకు అవసరమైనా సరే, మేం అక్కడికి చేరుకుంటాం… నా భార్య భావన కనీసం ఒక్క శిశువుకైనా పాలివ్వనిదే తిరిగి వెళ్లను అంటోంది… స్పిరిట్… వార్త చిన్నదే, కానీ కదిలించేది… కనెక్టయ్యేది… కొందరు పిల్లలకు డబ్బా పాలు పడవు, అనాథలుగా మిగిలిన ఒక్క శిశువుకైనా ఆమె పాలిస్తే, ఆమె మాతృత్వ భావనలకు సార్థకత… గ్రేట్ తల్లీ..!!
Share this Article