కావచ్చు… ఇక వెంకయ్యనాయుడి ప్రస్థానం బీజేపీలోని మార్గదర్శకమండలిలోకే కావచ్చు… అద్వానీ తదితరుల గుంపులో చేరిపోవచ్చు… ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఇతర తెలుగు మేధోవర్గం ఇప్పటికిప్పుడు సాయుధ దక్షిణ భారత తిరుగుబాటును అగ్గిమండించినా సరే, మోడీషాలు బెదరకపోవచ్చు… తెలుగు సంకేతం, వెలుగు సంతకం వంటి శుష్కనినాదాలు ఫలించకపోవచ్చు… మరెవరు..? కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను ఉపరాష్ట్రపతి కుర్చీలోకి ఆహ్వానిస్తారని అనుకున్నారు గానీ, తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పేరు బలంగా వినిపిస్తోంది…
బీజేపీ రాజకీయ కోణంలో ఆలోచిస్తే… కశ్మీర్ ముస్లింలు, పంజాబ్ సిక్కులకు కాస్త ఉపశమనం కలిగించాల్సిన స్థితి… కానీ ఆ పార్టీ ఆలోచనల విస్తృతి, సంక్లిష్టత అంత సులభంగా అర్థం కావు… గులాం నబీ, ఆరిఫ్ అయినా మంచి చాయిసే అయి ఉండేది… కానీ బీజేపీ అమరీందర్ వైపు మొగ్గుతున్నట్టు కనిపిస్తోంది… తనది రాచపుట్టుకే… పాటియాలా రాజకుటుంబానికి చెందినవాడు… ఎనభై ఏళ్ల వయస్సు… తాత, తండ్రి, తను అందరూ సైనికులే… తన ఆర్మీ నేపథ్యాన్ని మీసాలు తిప్పుతూ గొప్పగా చెప్పుకునే సంప్రదాయ సిక్కు…
రాజీవ్ ప్రోద్బలంతో కాంగ్రెస్ రాజకీయాల్లోకి వచ్చినా సరే… స్వర్ణదేవాలయంపై సైనికదాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాడు… మొన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఖాళీచేసిన లోకసభస్థానంలో తాజా ఉపఎన్నికలో గెలిచిన సిమ్రన్‌జిత్ మాన్ అనే అరివీర ఖలిస్థానీవాది తెలుసు కదా… ఆయన ఈ అమరీందర్‌కు షడ్డకుడే… అమరీందర్ భార్య, సిమ్రన్‌జిత్ భార్య అక్కాచెల్లెళ్లు… అమరీందర్ భార్య ప్రణీత్ కౌర్ ఓసారి ఎంపీ… కేంద్ర మంత్రి కూడా… అమరీందర్ సోదరి హేమీందర్ కౌర్ ఎవరో తెలుసా..? సుదీర్ఘకాలం ఈ దేశ విదేశాంగ విధానాన్ని శాసించిన నట్వర్‌సింగ్ భార్య… అనగా అమరీందర్ బావ…
Ads
అప్పట్లో శిరోమణి అకాలీదళ్ (పాంథిక్) అనే ఓ చీలిక పార్టీని స్థాపించాడు… తరువాత కాంగ్రెస్‌లో విలీనం చేశాడు… మొన్న కాంగ్రెస్ తన సీఎం పోస్టు ఊడబీకిన తరువాత పంజాబ్ లోకకాంగ్రెస్ అని కొత్త పార్టీని పెట్టాడు… ఇప్పుడు దాన్ని బీజేపీలో విలీనం చేయబోతున్నాడు… వెరసి తను ఏ సిద్ధాంతానికీ నిబద్ధుడు కాదు… రాచపుట్టుక కదా… అధికారమే లక్ష్యం… ఇప్పుడిక ఉపరాష్ట్రపతి అయిపోతాడట…
ఇవన్నీ చదువుతుంటే… ఆసక్తికరంగా అనిపించింది తన హృదయరాణి అరూసా ఆలం గురించి… ఆమె పాకిస్థానీ డిఫెన్స్ జర్నలిస్టు ఒకప్పుడు… ఓసారి ఇండియాకు వచ్చినప్పుడు అమరీందర్‌తో పరిచయం పెరిగింది… బాగా బలపడింది… అమరీందర్ ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటే చాలు, ఆమెను ఫస్ట్ లేడీ ఆఫ్ పంజాబ్ అనేవాళ్లు… అంత పలుకుబడి, ప్రాభవం… వెలుగు వెలిగేది… పార్టీలు, సంబురాలు, పెద్ద పెద్ద వాళ్లు ఆమె చల్లని కనుసన్నల కోసం పడిచచ్చిపోయేవాళ్లు… వయస్సు ఇప్పుడు 65 ఏళ్లు… డైవర్సీ… ఆమె తల్లి కూడా ఓ చిత్రమైన కేరక్టరే… అప్పట్లో పాకిస్థానీ జనరల్ యాహ్యాఖాన్‌కు దగ్గర ‘-దో-స్త్-’… సేమ్, అమరీందర్‌తో అరూసాలాగే…! తల్లి పేరు అక్లీమ్ అఖ్తర్…
మొన్న అమరీందర్ ముఖ్యమంత్రి పోస్టు పోగానే బాధపడిపోయి ఉంటుంది ఫాఫం… ‘‘అమరీందర్, నేను స్నేహితులం కూడా కాదు… ఆత్మబంధువులం… దేవుడిచ్చిన సోల్ మేట్’’ అని మీడియా ఎదుట వ్యాఖ్యానించింది ఆమె… ఇప్పుడు ఆమె ఫుల్లు ఖుష్ కావచ్చు బహుశా… ఈమధ్య ఖలిస్థానీవాదం మళ్లీ ప్రమాదకరంగా పెరుగుతోంది… పంజాబ్‌లో ఆప్ అధికార ప్రస్థానానికీ ఆ వాదమే బలమైన మద్దతు అనేది అనేక విశ్లేషణల సారం…
పేరుకు రైతుచట్టాలు ఓ సాకు… ఢిల్లీ ముట్టడి ఓ ఆయుధం… చివరకు మోడీ తలవంచి రైతుచట్టాల పట్ల జాతికి క్షమాపణలు చెప్పి, ఖలిస్థానీవాదుల అహంతో రాజీపడ్డాడు… అది భవిష్యత్తులో ఎలా దుష్పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేం కానీ, బీజేపీకి అర్జెంటుగా సిక్కుల ప్రేమ కావాలిప్పుడు… దానికి ఉపరాష్ట్రపతి పదవిని ఆశచూపుతున్నాడు… ఇలాగే అనుకోవచ్చా..? ఇంతకుమించిన విశేష ప్రయోజనం ఏమైనా ఉందా..?!
Share this Article