అనుకరణతో అల్లరి చేసే మేజిక్… పేరడీ.
పైకి వొట్టి మాటల గారడీలానే ఉంటుంది.
అందులోనే గిలిగింతలు పెట్టే కామెడీ పండుతుంది. మన తెలుగులో పేరడీ చాలా పాపులర్.
Ads
మీరజారగలడా నా యానతి – (అనగానే)
వీపు గోకగలడా… సత్యాపతి! అలా కుదరాలి.
మరో ప్రపంచం మరో ప్రపంచం
మరో ప్రపంచం పిలిపించి…
తన కవితనే శ్రీశ్రీ పేరడీ చేస్తూ –
పొగాకు తోటలు పొగాకు తోటలు
పొగాకు తోటలు పండితున్ అన్నారు.
దీన్ని కంటిన్యూ చేస్తూ జర్నలిస్టు మిత్రుడు, గాయకుడు తుమ్మలపల్లి రఘురాములు –
పొగాకు తోటలు జగానికంతా
సిగార్లుగానే నందింతున్ అన్నాడు
ఓ సాయంకాలం సరదా పార్టీలో!
***
పేరడీ అంటే జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి పేరే గుర్తొస్తుంది. మాచిరాజు దేవీప్రసాద్, భమిడిపాటి రాధాకృష్ణ, ఆరుద్ర, పఠాభి, శ్రీరమణ పేలిపోయే పేరడీలు రాశారు.
శ్రీశ్రీ నవ కవితను పేరడీ చేస్తూ జరుక్ శాస్త్రి గారు
మాగాయీ, కంది పచ్చడీ
ఆవకాయి, పెసరప్పడమూ
తెగిపోయిన పాత చెప్పులూ
పిచ్చాడి ప్రలాపం, కోపం
వైజాగులొ కారాకిల్లీ
సామానోయ్ సరదా పాటకు – అన్నారు.
కన్యాశుల్కం సినిమాలో సావిత్రి డాన్స్ చేసిన
శ్రీశ్రీ ప్రసిద్ధ కవిత ‘అద్వైతం’ కి జరుక్ శాస్త్రి పేరడీ:
ఆనందం అంబరమైతే
అనురాగం బంభరమైతే
అనురాగం రెక్కలు చూస్తాం
ఆనందం ముక్కలు చేస్తాం!
C.A.T – కేటువి నీవై
R.A.T – రేటుని నేనై
రాతగ్గ కవిత్వం నీవై
పోతగ్గ ప్రభుత్వం నేనై!
తిగ్మాంశుని కిరణం లాగా
ఎగ్మూరు స్టేషను నీవై
మారురంగు మణీ లాగా
నోరులేని ముక్కను నేనై
కాలానికి ఆక్సిజన్ ఇచ్చాం
ఏలాగో తగలడి చచ్చాం!
ఇలా వెటకారాన్ని పద్యంగా పరిగెత్తించారు.
వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్ – శ్రీశ్రీ కవితకి జరుక్ శాస్త్రి అద్భుతమైన పేరడీ రాశారు.
లలాటాన కుంకుమాగ్ని, భుజం మీద మబ్బు దుబ్బు
కాళ్ళ కింద కిర్రు చెప్పు, అంగోస్త్రం పొడుంకాయ
వ్యవధి లేని అవధానం వెళిపోయిందెళిపోయింది
చెళ్లపిళ్ల పద్యావళి చిలకమర్తి గయుడికథా
వడ్డాదీ, పానుగంటి, బావిలీలు, బ్రహ్మసమాజ్
తాటికాయ నీటికాడ, ఫుల్లుమూను టాటాలూ
ప్రచారిణీ చింతామణి వెళిపోయాయెళిపోయాయి
గిరజాలూ లాల్చీలూ, వల్లెవాటు కళ్ళజోళ్ళు
టాగూరూ, పొడుగురైక, రిస్టువాచి, రోషనార
ఎంకిపాట, హనీడ్యూలు, కాంతం కథ, జలవైద్యం
టాల్మాడ్జీ, గృహలక్ష్నీ, లారెన్సూ, లాంగ్ ఫెలో
సాయ్ బాబా, ఫెవర్ లూబా వెళిపోయాయ్యెళిపోయాయి
చీరాలా పేరాలా హోమ్ రూలు, మాగ్డోనాల్డు
ముద్దుకృష్ణ జ్వాలగోల అయిపోయిందయిపోయింది
మా కళ్ళ ముందు కాళ్ళ ముందు వెళిపోయాయ్యెళిపోయాయి
కపిలవాయి, గంధర్వా, స్థానం నటి, చలం వ్యధా
రాయప్రోలు దేశభక్తి, విశ్వనాథా విసురుళ్ళూ
డాడాయిజం, ఇమేజిజం వెళిపోయాయ్యెళిపోయాయి – యిలా
పదాలతో కదం తొక్కించారు జరుక్ శాస్త్రి.
*** *** ***
జరుక్ శాస్త్రి తరువాత మాచిరాజు దేవీప్రసాద్
మంచి పేరడీలు రాశారు. నాయని వారిని
దేవీప్రసాద్ ఇమిటేట్ చేస్తూ –
ఎవ్వడా క్రూర కర్మకుడెవడు, నీల
జలద నిర్ముక్త శైశిర శర్వరీ, ప్ర
శాంత మలవాటుపడిన నిశాంతమందు
అక్కట నీల్ కాలుబుడ్డి తన్నేసినాడు –
అని చమత్కారంగా రాశారు.
ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు (మాస పత్రిక ఢంకా, 1955) అని శ్రీశ్రీ రాసిన పోయెంకి ఆయనే రాసుకున్న పేరడీ:
ఏరి తల్లీ నిరుడు మురిసిన
ఇనప రచయితలు?
కృష్ణశాస్త్రపు టుష్ట్రపక్షీ
దారి తప్పిన నారి బాబూ
ప్రైజు ఫైటరు పాపరాజూ పలకరేంచేత?
ప్రజాస్వామ్యపు పెళ్ళికోసం
పండితారానాధ్యుడాడిన
వంద కల్లల పంది పిల్లల
ఆంధ్రపత్రిక ఎక్కడమ్మా
ఎక్కడమ్మా ఎలక గొంతుక
పిలక శాస్త్రుల పనికిమాలిన
తలకుమించిన, వెలకు తగ్గిన
రణగొణ ధ్వనులు?
ఏవి తల్లీ నిరుడు మురిసిన
హిమసమూహములు!
*** *** ***
కట్ చేస్తే అది… 1989. విజయవాడ.
‘ఆంధ్రభూమి’ దినపత్రిక grandగా launch చేయాలని ఎండీ తిక్కవరపు వెంకట్రామిరెడ్డి,
ఎడిటర్ ఏబీకే ప్రసాద్ ప్లాన్ చేశారు. అప్పటికి విజయవాడ ‘ఆంధ్రజ్యోతి’లో హేపీగా ఉన్న నన్ను కొమ్మినేని వాసుదేవరావు ‘భూమి’కి లాక్కొచ్చారు.
“విజయవాడ ఎడిషన్ బాధ్యత పూర్తిగా మీదే.
మేం జోక్యం చేసుకోం. బాగా చేయండి” అని వాసు గారు చెప్పారు. ట్రైనీలుగా, సబ్ ఎడిటర్లుగా పనిచేయడానికి దాదాపు 60 మందిని రిక్రూట్ చేశాం. వాసు, ఏబీకే విప్లవ తీవ్రవాదానికి అనుకూలురు గనక ‘విరసం’ కి సంబంధించిన వాళ్ళనీ, విప్లవోద్యమంలో పనిచేసి అలసిపోయిన వాళ్ళనీ ఎక్కువగా తీసుకున్నారు.
‘భూమి’ విజయవాడ ఎడిషన్ బాగా వస్తోందని అందరూ ముచ్చటపడ్డారు. అయితే, విప్లవ పూనకంతో వున్న కొందరు కుర్ర జర్నలిస్టులు, వరవరరావు వార్త ఆరో పేజీలో వేశారేం?
బాలగోపాల్ ప్రెస్ మీట్ పదో పేజీలోనా వేసేది?
అని నాతో గొడవ పడేవాళ్ళు.
“నేను సీపీఐకి అనుకూలం ఐనా, మీరు నక్సలిజాన్ని ప్రేమించే వాళ్ళయినా ఈ ‘ఆంధ్రభూమి’ ఒక కాంగ్రెస్ ఎంపీకి చెందిన పేపరు. ముష్టి నెల జీతాలకి పనిచేస్తున్న వాళ్ళం మనం. ఓవర్ యాక్షన్ వద్దు” అని నచ్చజెప్పబోయినా వినేవాళ్ళుకారు.
నిజానికి నేనక్కడ సూపర్ బాస్ ని.
వాసు గారు, ఏబీకే, మేనేజ్మెంటూ… నేనేం చేసినా కాదనేవాళ్ళుకారు. కుర్ర జర్నలిస్టులు మాత్రం ఎగిరెగిరి పడేవాళ్లు. నాక్కాస్త చికాగ్గా వుండేది.
అలాంటి సమయంలో ఒక దినపత్రికలోనో, వారపత్రికలోనో కవయిత్రి కొండేపూడి నిర్మల
పోయెం ఒకటి వచ్చింది. శీర్షిక ‘వోణీ’.
కొత్తగా వోణీ వేసుకునే ఆడపిల్ల మానసిక ఉద్వేగాన్ని చాలా బాగా రాశారామె.
అప్పటికే ఒక్క నేనే – ఇన్ని ముక్కలు, లేబర్ రూం కవితలతో కొండేపూడి నిర్మల పాపులర్ అయి వున్నారు. ఆఫీసులోనే, ‘వోణీ’ కవితకు గబగబా ఒక పేరడీ రాశాను ‘విప్లవోణీ’ శీర్షికతో.
నేనూ విప్లవాభిమానినే అయినా, కుర్రాళ్లు పెట్టిన చిరాకు వల్ల నక్సలైట్లని శపిస్తూ contextual change తో పేరడీ రాశాను.
‘భూమి’లో పనిచేస్తున్న ఖమ్మం కవి ప్రసేన్, నేను రాసింది చదివి చాలా బావుందనీ ‘ఆంధ్రజ్యోతి’
వీక్లీకి యిస్తానని తీసుకున్నాడు.
పేరు తెలియకుండా ‘ప్రకాశరావు’ అని పెట్టమన్నాను. వీక్లీ ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారికి పేరడీ నచ్చి, వెంటనే పబ్లిష్ చేశారు. అప్పటి జ్యోతి వీక్లీలో కథో, కవితో రావడం అంటే పెద్ద గౌరవం కిందే లెక్క.
*** *** ***
1990లో కావొచ్చు.
కొండేపూడి నిర్మల కవితా సంపుటి ‘నడిచే గాయాలు’ ఆవిష్కరణ సభ విజయవాడలో జరిగింది.
సాహిత్య సభలకి వెళ్లే పాత దురలవాటు వల్ల,
కవిగా నిర్మల గారిపై గౌరవం వల్లా ఆ సభకి వెళ్లాను. భాషావేత్త చేకూరి రామారావు ముఖ్య అతిథి.
ఆ సభలో చేకూరి మాట్లాడుతూ,
“నిర్మల మంచి కవయిత్రి. ‘నడిచే గాయాలు’లో కవితలన్నీ బావున్నాయి. ఎవరో ఒక కవితకి పేరడీ రాశారని నిర్మల చెప్పింది. పేరడీ రాయడం అంటే కవిని గౌరవించడమే. ఒక distinct style వున్నవాళ్ళనే అనుకరిస్తారు. కనుక
ఆ పేరడీని కూడా ఈ సంకలనంలో చేర్చమని
నేను చెప్పాను ఈ సంపుటి చివరి పేజీలో ప్రకాశరావు పేరడీ వుంది” అని చెప్పారు.
అది రాసిందెవరో ఆ సభలో నాకొక్కడికే తెలుసు.
*** *** ***
కవికి ఒక ప్రత్యేకమైన శైలి వున్నపుడే పేరడీ పండుతుంది. వెక్కిరింత, మిమిక్రీ, చురక, చమత్కారం, వక్రీకరణ, అధిక్షేపం, ఒరిజినల్ ని
భగ్నం చేయడం, భ్రష్టు పట్టించడం… హాస్యం పండించడం కోసం చేసే వికటానుకరణే పేరడీ.
ఇలాంటివేవీ తెలియని చిన్నతనంలోనే రేడియోలో – అందాల ఓ చిలకా… అని పాట వస్తుంటే –
అందుకో నా పిలకా – అని పాడేవాళ్ళం!
…. ముత్తైదు కుంకుమా బతుకంత మాయా
అనీ అనేవాళ్ళం.
“లే, లే, లే నారాజా…” అనే చిల్లర పాటని ప్రభువు గీతంగా మార్చి రా..రా..రా.. నా యేసూ – అంటూ భక్తిపారవశ్యంతో పాడినపుడు పడీపడీ నవ్విన రోజులు మర్చిపోగలమా?
రగులుతోంది మొగలిపొదా… అనే మన జాతీయ బూతు గీతం బాణీలో పాడిన అయ్యప్పస్వామి
భక్తి గీతం విన్నారా? – లేదా? అయితే మీరు జీవితంలో నవ్వీనవ్వీ తిరిగి కోలుకోలేని
హాస్యాన్ని కోల్పోయినట్టే.
***
ఇది కొండేపూడి నిర్మల గారి ‘వోణీ’ కవిత.
బాల్యపు పెళ్ళి యింటికీ
యవ్వనం విడిది యింటికీ
పరుగులు తీసే చిత్తకారి వాన ఓణీ అంటే
ఆకతాయితనం తలుపులు మూసేస్తూ
అడ్డగడియలా వుంటుంది
గాలాడక ఉక్కపోస్తున్న కొట్టుగదిలా వుంటుంది
మడిచీరతో మగ్గిపోయే ఛాదస్తపు హెచ్చరికలా వుంటుంది
మధ్యతరగతి బూర్జువా కొంపకి పెద్ద పిల్లలా వుంటుంది
పుస్తకం బోర్లించిన గ్లాసులో నిలవనీళ్ల రుచిలా వుంటుంది
రోడ్డెక్కితే చాలు అదేదో ఎలక్ట్రిక్ పోల్ ఎక్కినట్టు
ఇంటిల్లిపాదీ ఎదురుచూడ్డంలా వుంటుంది
పాపా అనాలో మేడమ్ అనాలో తోచనివ్వని
సందేహ సరసిలా వుంటుంది
గౌను మీద బెంగలా వుంటుంది
చీర మీద మనసులా వుంటుంది
మొహానికి నూన్రాసుకుని, జుట్టు ముడేసుకుని
మహా లేజీగా వున్నప్పుడు
ఇంటికెవరో హాండ్సమ్ వచ్చినట్టు వుంటుంది
తీరిగ్గా సింగారించుకుని గొప్ప గోలయిపోతుందనుకున్న రోజు
అసలెవ్వరూ పట్టించుకోక పోవడంలా వుంటుంది
ఓణీ ఓణీలానే వుంటుంది
ఓణీకున్న లాలిత్యమెప్పుడూ
ఓణీ గొంతు విప్పనట్టు వుంటుంది
బాణీకట్టని పాటలా వుంటుంది
రాయని పద్యంలా వుంటుంది
ఇవ్వని ముద్దులా వుంటుంది
ఒక చంచలానంద సాయంత్రం అచ్చు ఓణీలానే వుంటుంది
నాభి మీద ఒక చెయ్యివేసి
నడుము చుట్టూ గిరికీలు తిరిగి
ఎద మీద వాలిపోతూ
మెడ మీద కితకితలు పెట్టిన
నైలాన్ జార్జెట్ ఇంద్రజాలంలా వుంటుంది
అసలది కట్టుకున్న తీరే యమ గమ్మత్తుగా ఉంటుంది
*** *** ***
‘వోణీ’కి నేను రాసిన పేరడీ…
‘విప్లవోణీ’ అని నేనంటే, పురాణం గారేమో
‘విప్లవ వోణీ’ అని శీర్షిక మార్చారు. విప్లవకారులం అనుకుంటున్న కొందరు కుర్రాళ్ళ ‘అతి’ మీద
ఇది నా ఉక్రోషం మాత్రమే!
నిజమైన త్యాగధనులను కించపరచడం
నా ఉద్దేశం కాదు.
‘విప్లవోణీ’
(‘ఓణీ’కి ఫక్తు పేరడీ)
బాల్యపు సంకెళ్ళ ఇంటికీ
యవ్వనం సూర్యోదయానికీ
నినదిస్తూ తిరిగే ఒంటరి గొంతు ‘ఓణీ’ అంటే –
పెట్టుబడి తలుపులు మూసేస్తూ
అడ్డగాడిదలా వుంటుంది
గాలాడక వుక్కపోస్తున్న వ్యవస్థలా వుంటుంది
మడిచీరతో మగ్గిపోయే
ఫ్యూడల్ హెచ్చరికలా వుంటుంది
మధ్యతరగతి పెటీ బూర్జువా కొంపకి
మల్టీ నేషనల్ లా వుంటుంది
నినాదం బోర్లించిన దేశంలో
నీరసపు కేకలా వుంటుంది
అడివంటే అదేదో విప్లవ జెండా పైకెత్తినట్టు
కుర్రకారంతా ఎర్రగా చూస్తారు
ఎత్తుగడలో వ్యూహమో తోచనివ్వని
జంగిల్ ఇండియా జాలంలా వుంటుంది
జెండానీ కర్రనీ అల్లంత దూరాన చూడగానే
చెడ్డీలో వుచ్చ పోసుకోడంలా వుంటుంది
1917 మీద బెంగలా వుంటుంది
చందాలు దండుకుని ఎన్నికలంటూ
మహా బిజీగా వున్నప్పుడు
ఇంటికెవరో తుపాకీ తెచ్చినట్టు వుంటుంది
సకల ఆయుధాలూ సంధించి
వ్యవస్థ కూలిపోతుందనుకున్నప్పుడు
ముక్కు సుబ్బారెడ్డి పిక్కబలం చూపినట్టు వుంటుంది
విప్లవ్వోణీ ఎర్రగానే వుంటుంది
జెండా కట్టని కర్రలా వుంటుంది
పేలని గ్రెనేడ్ లా వుంటుంది
ఒక చంచల అరుణానంద సాయంత్రం
చిమ్మచీకటి కురిసినట్టుగా వుంటుంది
కుర్రాళ్ళను బలవంతంగా ఎన్ కౌంటర్లకు ఒప్పిస్తూ
నాయకత్వం నోట్లో చుట్ట తిప్పుకుంటూ
పిస్టల్ కున్న రోల్డ్ గోల్డ్ ట్రిగర్ని
నొక్కుతున్నట్టు నటిస్తూనే
‘రామ్మా రా’ అంటూ
విప్లవాన్ని పిలుస్తున్నట్టే వుంటుంది
అసలు తుపాకీ తిప్పి పట్టుకున్న తీరే
గమ్మత్తుగా వుంటుంది!
– TAADI PRAKASH 97045 41559
Share this Article