.
చాలామందికి ఒక దేశం ఆలోచించే, అమలు చేసే విదేశాంగం అర్థం కాదు… ఏవేవో తోచిన వ్యాఖ్యానాలకు దిగుతారు… చివరకు బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు కూడా… కానీ విదేశాంగ శాఖ అనేక కోణాల్లో ఆలోచించి, అడుగులేస్తుంది… ప్రధాని కూడా వాటి ప్రకారం నడుచుకోవాలి…
పెద్ద టీమ్… అంతేతప్ప ఒక వ్యక్తి తీసుకునే వ్యక్తిగత నిర్ణయాలు కావు… అప్పుడెప్పుడో ప్రఖ్యాత రచయిత Veerendranath Yandamoori రాసిన నవల కాసనోవా… అందులో ఓ పార్ట్ ఇది… ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు ఇది… ఓసారి చదవాలి… చైనా ఆక్రమణల మీద పలు పార్టీల అవాకులు, చవాకుల నేపథ్యంలో…
Ads
(భారత సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ కి, పాకిస్తాన్ విదేశాంగ శాఖలో ఉద్యోగికి మధ్య సంభాషణ ఇది. పక్కదేశాలతో అప్పటి భారత దేశపు సంబంధాల గురించి, కరప్షన్ గురించి, అప్పటి బీద రాష్ట్రాల గురించి ఈ తరం పాఠకులకు చెప్పాలని ఉద్దేశంతో…)
‘‘పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో మీ భారతదేశం ఎందుకు జోక్యం చేసుకుందో మాకెప్పటికీ అర్థం కాదు మాంధాతా…! ఒక దేశాన్ని రెండుగా విడగొట్టటం క్షమించరాని నేరం. టిబెట్ విషయంలో కూడా మీరు చైనాతో అనవసరంగా వైరం పెంచుకుని యుద్ధంలో చావు తప్పి కన్ను లొట్టబోయారు. మరో వైపు శ్రీలంకకి శాంతిదళాలు పంపి, వారి ప్రభుత్వం మారగానే మీ దళాలు వెనక్కి తెప్పించుకుని నవ్వుల పాలయ్యారు. మీ ప్రధాని రాజీవ్ గాంధీని కోల్పోయారు. సిక్కుల ప్రార్థనా స్థలంలోకి సైన్యాన్ని పంపి ఇందిరాగాంధీని కోల్పోయారు..! అసలు మీ గురించి మీరేమనుకుంటారు? ఆసియా ఖండానికి మీరే ‘బిగ్ బ్రదర్’ అనుకుంటూ ఉంటారా…!
పోనీ ఇంత చేసినా శ్రీలంకతో గానీ, బంగ్లాదేశ్‌తో గానీ మీ సంబంధాలు బావున్నాయా అంటే, అదీ లేదుగా…! అసలు రష్యా ముక్కలై పోయిన తరువాత మీకు ప్రపంచంలో మిత్రదేశమంటూ మిగిలిందా…? మీ మీద ఆధారపడ్డ నేపాల్, భూటాన్లను వదిలేయండి. మీ పొరుగు దేశాలయిన బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, ఇరాన్, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, ఫిజీ- అందరితో మీకు వైరమే కదా. అంతవరకూ ఎందుకూ? మా దేశ పౌరుడి Per Person Productivity 2130 డాలర్లయితే మీ దేశ పౌరుడి పి.పి.పి 1210 డాలర్లు.
అంతకన్నా హాస్యాస్పదమయిన విషయం ఏమిటంటే, మెన్న మొన్న మీ సాయంతో స్వాతంత్య్రం సంపాదించి, ఎప్పుడూ వానల్లో వరదల్లో కొట్టుకు పోయే బంగ్లాదేశ్ ఆదాయం కూడా మీకన్నా ఎక్కువే. 1230 డాలర్లు…! దీనికి కారణం ఏమిటంటారు? మీరు చెప్పరు. నేను చెప్తాను వినండి. మీ దేశపు వివిధ రంగాల్లో లంచగొండితనం పేరుకు పోయింది.
చివరికి డిఫెన్స్‌లో రొట్టెల ఖర్చు నుంచి, బోఫోర్సు వరకూ కూడా లంచమే…! చిన్న కంటి ఆపరేషన్ కోసం మీ మాజీ ప్రధాని విదేశాలకి వెళ్తే అతడితో పాటూ ఎనిమిది మంది బంధువుల విదేశీ ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. తెలుగు సభల పేరు మీద గుండె చెకప్‌కి మీ ముఖ్యమంత్రి అమెరికా వెళ్తే, దాని ఖర్చు ప్రభుత్వం ఇస్తుంది. ఆయన పది సూట్ కేసులతో విదేశాల్నించి దిగుతాడు. మీ దేశంలో మున్సిపల్ కౌన్సిలర్‌కి కూడా అంగరక్షకుడు ఉంటాడు’’…

‘‘ఇదంతా మీరెందుకు చెప్తున్నారు?’’
‘‘పంజాబీలూ, కాశ్మీరీలూ స్వతహాగా కష్టపడే గుణం కలవారు. మీ అంత లౌక్యులూ, తెలివైన వారూ కాదు. మోసం చేసే గుణం తక్కువ. దేశభక్తి ఎక్కువ. పంజాబ్ గానీ మీ నుంచి విడిపోయిన పక్షంలో, అలా విడిపోయిన అయిదారు సంవత్సరాల్లో అమెరికా, జపాన్ల స్థాయికి చేరుకుంటుంది. కాశ్మీర్ మరో స్విట్జర్లాండ్ అవుతుంది. వాళ్ళు మీతో ఎందుకు కల్సి ఉండాలి?
ఈ విషయమే మేము పంజాబీలకూ, కాశ్మీరీలకూ చెప్తే, వారిని రెచ్చగొట్టామని అంటారెందుకు? ఆ మాటకొస్తే బంగ్లాదేశీయుల్ని మీరు ఆ రోజుల్లో రెచ్చగొట్టలేదా?’’
‘‘మేము రెచ్చగొట్ట లేదు అమిత్. బంగ్లాదేశ్ ఆదాయాన్ని ఎక్కడో దూరంగా ఉన్న పశ్చిమ పాకిస్తాన్ కొల్లగొట్టేది. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా బంగ్లా ప్రజలు ముజిబూర్ రెహ్మాన్‌ని ఎన్నుకు౦టే, సైన్యాన్ని పంపి అణిచి వేసింది. వేల సంఖ్యలో విద్యార్ధులు మరణించారు. రెండు లక్షల మంది బంగ్లా యువతులను మీ సైన్యం రే – చేసి౦ది. వింటున్నారా అమిత్? రెం…డు… ల… క్షల మందిని…! మరి కొన్ని లక్షల సంఖ్యలో బంగ్లా శరణార్థులు భారతదేశం వలస వచ్చారు. ఇప్పుడు చెప్పండి. మీరు భారత ప్రధాని అయితే బంగ్లాకి సాయం చేయరా? న్యాయం వైపు నిలబడరా?’’
అమిత్ సన్నగా నవ్వాడు. ‘‘పంజాబ్ చాలా సంపదలున్న భూమి.. మెజారిటీ పంజాబ్ ప్రజలు, ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా ప్రత్యేక దేశం కావాలనే పార్టీని ఎన్నుకుంటే, అప్పుడు వారికి సాయం చేయటం కోసం, మేము మా సైన్యాన్ని పంజాబ్ పంపవచ్చా?’’
చాలా ఇబ్బందికరమైన ప్రశ్న…! అమిత్ కొనసాగించాడు- ‘‘మీరు న్యాయం గురించీ హిందూ, సంస్కృతి గురించీ ఎక్కువ మాట్లాడుతున్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్ విషయాల్లో న్యాయం వైపు నిలబడ్డామన్నారు. మరి కువాయిట్‌ని ‘ఇరాక్’ ఆక్రమించుకున్నప్పుడు దాన్ని ఎందుకు ఖండించలేదు? కాశ్మీర్ విషయంలో మీ దేశాన్ని ‘ఇరాక్’ సపోర్టు చేస్తోందని. అవునా?’’
‘‘మేము ఇరాక్‌ని సమర్ధించలేదు అమిత్. యుద్ధం అవసరం లేకుండానే సమస్య పరిష్కరించాలని కోరుకున్నాం…’’
‘‘చేత కాని వాళ్ళే శాంతి ప్రవచనాలు చెబుతారు మాంధాతా…! పైగా దానికి ‘సంస్కృతి’ అని పేరు పెట్టుకుంటారు. మీరు చెప్పే సంస్కృతి ఎలాంటిది? దేవుడంటే అపరిమితమైన భక్తి శ్రద్ధలు చూపిస్తారు. అదే దేవుడితో సినిమాల్లో బ్రేక్ డాన్సులు చేయిస్తారు. అదే మమ్మల్ని తీసుకోండి. మా దేవుడి పేరు తీస్తే, యుద్ధ ప్రాతిపదిక మీద అలజడి లేవదీస్తాం. మాకున్న దైవభక్తి, దేశం పట్ల ప్రేమ, బిలాంగింగ్‌నెస్ మీకు లేవు’’…
మాంధాత మాట్లాడలేదు. అతడి మౌనాన్ని అమిత్ మరోలా అర్థంచేసుకున్నాడు. ‘‘ఐ యామ్ సారీ. నేను ఎక్కువగా మాట్లాడినట్టున్నాను’’ అన్నాడు.
మాంధాత నవ్వి, ‘‘అటువంటిదేమీ లేదు’’ అన్నాడు.
‘‘నాకు మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది. మా పాకిస్తాన్ ఆతిథి మీరు. యువరక్తం వేడిలో నేనేదో ఆవేశంగా మాట్లాడితే, మీరు సహనం కోల్పోకుండా ఉన్నారు. హేట్సాఫ్ టు యు. మీకు నా అభినందనలు…’’ అన్నాడు.
‘‘ఇందులో అభినందనల ప్రసక్తి ఏముంది అమిత్? మనిషి, కుటుంబం, రాష్ట్రం, దేశం, మతం, కులం- ఇవేమీ గొప్పవి కావు. వ్యక్తిత్వం. అదీ ముఖ్యం…! వ్యక్తిత్వం అన్న పదంలోనే ధర్మం, దేశభక్తి, విశ్వజనీయమైన కరుణ- అన్నీ మిళితమై ఉంటాయి” విమానం వైపు నడుస్తూ అన్నాడు.
“దురదృష్టవశాత్తు రాజకీయ నాయకులూ, మతాచార్యులు ప్రజల్ని తమ గ్రిప్‌లో ఉంచుకోవటం కోసం, విప్లవాల్ని లేవదీస్తున్నారు. పంజాబ్ ప్రత్యేక దేశంగా మారితే మరొక పార్లమెంటు, మరొక ప్రధాని, తమ గ్రూప్ వారికి మరికొన్ని రాజకీయ పదవులూ వస్తాయి. ఇదీ వారి స్వార్థం.
అలాగే ఛాందస వాదులు కాశ్మీర్ ప్రజల్ని మతం ప్రాతిపదిగ్గా రెచ్చగొడుతున్నారు. ఈజిప్ట్, టర్కీ, బంగ్లాదేశ్, ఇరాన్‌లలో ఈ టెర్రరిస్టులు సృష్టిస్తోన్న అలజడి చూసి కూడా, దాన్ని కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రోత్సహించటం దురదృష్టకరం. విప్లవకారుల మీద నాకు చాలా గౌరవం ఉంది అమిత్.
ఒకప్పటి టెర్రరిస్టులే, స్వాతంత్య్రం వచ్చాక దేశ నాయకులయ్యారు. అరాఫత్, నేతాజీ, మండేలా- అందరూ యుద్ధంలో పాల్గొని జైలుకి వెళ్ళినవారే. కానీ అలాటి స్వాతంత్ర ఉద్యమాలకి బలమైన కారణమూ, అణగదొక్క బడిన పరిస్థితులూ ఉండాలి. పంజాబు, కాశ్మీర్‌లో అలాటి పరిస్థితులు లేవే. కేవలం మతమే అక్కడ బలమైన పాత్ర పోషిస్తోంది…!” ఆగి అన్నాడు.
“‘పంజాబ్, కాశ్మీర్ సంపన్నమైన రాష్ట్రాలు కాబట్టి అవి విడిపోవచ్చు’ అని వాదించావు. ఆ మాటకొస్తే అంత కన్నా సంపన్నమైన ఆంధ్రప్రదేశ్, కేరళలు కూడా విడి పోవచ్చు. కానీ బీద రాష్ట్రాలయిన మధ్యప్రదేశ్, ఒరిస్సాల సంగతి ఏమిటి? వనరులున్న ధనిక రాష్ట్రాలు అలా విడిపోయిన మరుక్షణం, బీద రాష్ట్రాలు దేశాలుగా మారి ఇథోపియా, సోమాలియాల్లా మారిపోవా?
మా దేశం ఒక వసుదైక కుటుంబం అమిత్…! మా హిందూ సంస్కృతిలోనే దయా, కరుణ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఒక కుటుంబంలో బలమైన అన్నయ్యలూ, సంపన్నులయిన తమ్ముళ్ళూ, తను స్వార్థం కోసం విడిగా వెళ్ళిపోతే, బలహీనమైన మిగతా కుటుంబ సభ్యుల్ని ఎవరు ఆదుకుంటారు? అందుకే మేం కలిసి ఉంటాం…!
కలిసి ఒకే జెండా క్రింద ఉండాలని ప్రచారం చేస్తాం…! శ్రీలంకకి శాంతి సైన్యాన్ని పంపిందీ అందుకే. రాజీవ్‌నీ, ఇందిరాగాంధీనీ మేము కోల్పోయిందీ అందుకే. జైహింద్’’.
విమానం గాలిలోకి లేచింది. అమిత్ అటే చూస్తూ నిలబడ్డాడు. విమానం ఎత్తుగా ఎగురుతోంది. మాంధాత అంతకన్నా ఉన్నతంగా కనబడ్డాడు….
Share this Article