Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అగ్రి‘కల్చర్’ మీద టెక్సాస్‌లో ప్రత్యేక మ్యూజియం… మనకుందా ఈ సోయి..?

February 23, 2023 by M S R

Akula Amaraiah………  1879 డిసెంబర్‌ 30, హిల్స్‌ కౌంటీ, టెక్సాస్‌… *డియర్‌ ఫాదర్, నేను నా వ్యవసాయ క్షేత్రానికి చేరా. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నా. పొలమంతా తిరిగి చూశా. మీరు చెప్పినట్టే చేస్తున్నా.. ఈ ఏడాది మొక్కజొన్న, పత్తి మంచి దిగుబడి వచ్చేలా ఉన్నాయి. తక్షణం నాకు వ్యవసాయ పనివాళ్లు కావాలి…..*. ఏమిటిదనుకుంటున్నారా? సుమారు 150 ఏళ్ల నాడు వ్యవసాయానికి సంబంధించి ఓ కుమారుడు తండ్రికి రాసిన లేఖ అలా సాగుతుంది. మనం కరెంటు బిల్లులు, ప్రామిసరీ నోట్లు దాచుకోవడం లేదా? ఏముంది గొప్ప అనుకోవచ్చు గానీ సాగుపై లేఖను కాపాడడం, ఇదీ మన వారసత్వమని భావితరానికి చెప్పడమే విశేషం..

మనకు రకరకాల మ్యూజియంలు తెలుసు. మన జీవనవిధానంలో భాగమైన వ్యవసాయానికో పురావస్తు ప్రదర్శన శాల ఉంటుందని చాలామందికి తెలియదు. పంట… ప్రతి దేశావసరమే… తిండి… ప్రపంచ ప్రజలందరికీ అనివార్యమే. అమెరికాలో డాలర్లు పండినా పండకపోయినా’ పంటలు పండాల్సిందే కదా. నాలుగేళ్లు నోట్లోకి పోవాల్సిందే. రైతులకు సాగు గిట్టుబాటవుతుందా? లేదా? అనేది ఇక్కడ అప్రస్తుతం.
….
ఆధునిక సాంకేతికత, నాగరికత పెరిగింది. నిన్నున్నది నేడు ఉండడం లేదు. సేద్యం సహా ఏదీ ఇందుకు మినహాయింపు కాదు. మోడరన్‌ టెక్నాలజీ సాగును కమ్మేసింది. పాత పనిముట్లు అటకెక్కాయి. పురాతన పద్ధతులు పనికి రాకుండా పోయాయి. కాడీ మేడీ కనపడడం లేదు. ఎలపట దాపట ఎడ్లు ఎగ్జిబిషన్లకే పరిమితమవుతున్నాయి. ఉత్పాదన, ఉత్పాదకత పెరుగుతోంది. వస్తు సేవలు మారుతున్నాయి. అయినా కొన్ని సంఘాలు, ప్రాంతాలు ఇప్పటికీ వ్యవసాయ చరిత్రను, గొప్పతనాన్ని, పాత పని ముట్లను కాపాడుతున్నాయి. భావితరాలకు చూపుతున్నాయి. దానికి నిదర్శనమే టెక్సాస్‌ రాష్ట్ర రాజధాని ఆస్టిన్‌లోని అగ్రికల్చరల్‌ మ్యూజియం. వ్యవసాయ చరిత్రకు దర్పణం. 150 ఏళ్లనాటి పురాతన సాగు పద్ధతుల సంరక్షణకు సజీవ సాక్ష్యం. వ్యవసాయ విప్లవానికి ప్రతినిధి. రాష్ట్ర వ్యవసాయ చరిత్రకు అద్దం పట్టే ఈ మ్యూజియం ఓ గొప్ప వారసత్వ సంపద.

ప్రస్థానం ఇలా మొదలైంది…
టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌. 1890 తొలినాళ్లలో రాష్ట్ర శాసనసభ వ్యవసాయ మ్యూజియంను రాజధాని భవనంలోని తొలి అంతస్తులోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రెండు గదులను కేటాయించింది. ఒకటి రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనకు, మరొకటి పురాతన వ్యవసాయ పరికరాలు, రాష్ట్రంలోని భూములు, వాటి స్వరూపం (జియోలాజికల్‌ ఫీచర్స్‌), ఏయే పంటలకు అనువైందీ తెలిపేందుకు ఉపయోగించారు. 1888 నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగిందో, ఏమేమి తీర్మానాలు చేశారో వివరించే పెద్ద బోర్డు ఉంది. అగ్ని ప్రమాదంలో రాజధాని భవనం తగలబడినా, రెండుమూడు సార్లు మరమ్మతులు చేసినా, ప్రభుత్వాఫీసుల్ని మార్చాల్సి వచ్చినా వ్యవసాయ మ్యూజియానికి గదిని కేటాయించకుండా ఉండలేకపోయారు.
1993లో రాజధాని భవనాన్ని పునరుద్ధరించినపుడు 1888లో ఎక్కడైతే వ్యవసాయ మ్యూజియాన్ని పెట్టారో అక్కడే పెట్టాలని టెక్సాస్‌ ప్రతినిధుల సభ స్పీకర్‌ జేమ్స్‌ ఇ. ‘పీట్‌‘ పట్టుబట్టారట. దాంతో ఈ మ్యూజియానికి పూర్వవైభవం వచ్చింది. ఈ మ్యూజియంలో ఏమేమి ఉంచాలనే దానిపై జేమ్స్‌ భార్య నెల్డా నాయకత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. చారిత్రాత్మక కళాఖండాలు, సామగ్రితో గదిని పునర్నిర్మించారు. నిలువెత్తున్న నాలుగు పెద్దపెద్ద బీరువాల్లో విత్తనాలు, విత్తన సేకరణ పద్ధతులు తెలిపే వివరాలున్న పుస్తకాలు, సేద్య తీరుతెన్నులు, పురాతన పరికరాలున్న మూడు పెద్ద టేబుళ్లు ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఆరు కాళ్లున్న అతిపెద్ద ఉడెన్‌ టేబుల్‌ను– అమెరికాలో పురాతన వస్తువుల అమ్మకానికి పేరున్న చికాగో సంస్థ –ఏ.హెచ్‌. అడ్రూస్‌ కంపెనీ నుంచి సేకరించారు.

ఈ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయంటే…
ఏ రాష్ట్ర ఆర్ధికవ్యవస్థలోనైనా వ్యవసాయమనేది ఎప్పుడూ కీలకమే. ఆనాటి రైతులు, రాంచర్లు (పెద్ద భూస్వాములు. వీళ్లకు వందల, వేల ఎకరాల భూమి ఉంటుంది. గుర్రాలు, ఎద్దులు, ఆవులు, గేదెలు పెద్ద సంఖ్యలో ఉంటాయి) వాడిన వ్యవసాయ పరికరాలు, పద్ధతులను చూడొచ్చు. ఆనాటి ఆహార ఉత్పత్తులు, దిగుబడులను పెంచేందుకు రైతులు చేసిన ప్రయత్నాలను తెలుసుకోవచ్చు. అందువల్లే భావి అమెరికా రైతులు, వ్యవసాయ విద్యార్ధులు ఇక్కడకు తరచూ వస్తుంటారు. ఇక్కడ నిర్వహించే పోటీలలో పాల్గొంటుంటారు. వ్యవసాయాధికారులు సదస్సులు ఏర్పాటు చేస్తుంటారు.

టెక్సాస్‌ చార్టరే సాక్ష్యం…
ఈ మ్యూజియంలోని ముఖ్య విషయమొకటి ఎఫ్‌.ఎఫ్‌.ఏ (ఫ్యూచర్‌ ఫార్మర్స్‌ ఆఫ్‌ అమెరికా)కు భూమికగా నిలిచింది. అదే టెక్సాస్‌ చార్టర్‌. 1920ల నాటిది. ఎఫ్‌.ఎఫ్‌.ఏ. చార్టర్‌ తప్ప ఇప్పుడు మ్యూజియంలో కనిపించే వస్తువులన్నీ 1920కి ముందున్నవే. వీటిలో కార్న్‌ షక్కర్‌ (మొక్కజొన్నలు వలిచే పనిముట్టు), పాల సీసాలు, మూతలు, ఇనుప పనిముట్లు, వ్యవసాయ సమస్యలకు సంబంధించి పత్రికలు, లేఖలు ఉన్నాయి. టెక్సాస్‌ వ్యవసాయ విధానాలలో చెప్పుకోదగింది నీటిపారుదల వ్యవస్థ. నీటి వృధాను అరికట్టేందుకు ఉద్దేశించిన ‘భూగర్భ నీటిపారుదల వ్యవస్థ‘ అవకాశాలను, ఆవిష్కరణలను 150 ఏళ్ల కిందటే టెక్సాస్‌ రైతులు అన్వేషించినట్టు లేఖలున్నాయి. ధాన్యం డీలర్లు, కొనుగోలు ఏజెంట్లు కూడా ఈమేరకు లేఖలు రాసినట్టున్న చారిత్రాత్మక ఆధారాలున్నాయి. టెక్సాస్‌లో ఆనాడు వాడిన తూకపు రాళ్లు, నూనెల కొలతకు ఉపయోగించిన గ్యాలన్లు, లీటర్‌ డబ్బాలు వంటి వాటికి ఈ మ్యూజియం నిలయంగా ఉంది.
పత్తికి ప్రత్యేక విభాగం…
అచ్చంగా పత్తి కోసమే ఇందులో ఓ డెస్క్‌ ఉంది. టెక్సాస్‌ టెక్‌ యూనివర్శిటీ, లుబ్బాక్‌లోని టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం పరిశోధన కేంద్రం విరాళాలతో రైతుల నుంచి సేకరించిన పత్తి గింజలు, నూనె గింజలు, మొక్కలు, నూలు తీసే యంత్రాలు ఇందులో ఉన్నాయి. డబ్బాలలో నిల్వచేసే పండ్లు, కూరగాయలు, ఇతర పదార్ధాల పాత ఫోటోలను టెక్సాస్‌ స్టేట్‌ ప్రిజర్వేషన్‌ బోర్డ్‌ క్యాన్డ్‌ సమకూర్చింది. ఆ రోజుల్లోనే క్యాన్డ్‌ వస్తువులుండడం చూసి ఆశ్చర్యమేస్తుంది. టెక్సాస్‌ రైతులు, రైతు సంఘాల నుంచి సేకరించిన పనిముట్లను, ఇతర వస్తువుల్ని సంఘసేవకురాలైన మిస్‌ లానీ అనే ఆమె ఈ మ్యూజియంకు విరాళంగా ఇచ్చారు. వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన కారణంగానే ప్రజాప్రతినిధులు ఈ మ్యూజియం ఆవశ్యకతను గుర్తించారు. వ్యవసాయం, అనుబంధ పరిశ్రమల చారిత్రక అంశాలను పాక్షికంగానైనా ప్రదర్శించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ప్రతినిధుల స్పీకర్‌ పీట్‌ లేనీ– స్వయానా పత్తి రైతు. ఆయన భార్య మిస్‌ లేనీ తండ్రి టెక్సాస్‌ ప్లెయిన్‌వ్యూలో ఓ పత్తి, జిన్నింగ్‌ మిల్లులో పని చేశారు.

ఏటా పది లక్షల మంది చూస్తారట..
వ్యవసాయ మ్యూజియంను సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు, శని, ఆదివారాలలో ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు చూడొచ్చు. ఏటా సగటున పది లక్షల మంది ఈ మ్యూజియంను చూస్తారని అంచనా. అందుబాటులో ఉన్న మ్యూజియంలలో ముఖ్యమైందిదే. ఎందుకంటే టెక్సాస్‌లో వ్యవసాయ క్షేత్రాలను, రాంచ్‌లను, మ్యూజియంలను ముందస్తు అనుమతి లేకుండా చూడలేం. సిటీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ లేదా టెక్సాస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ని సంప్రదించాలి. అనుమతి తీసుకోవాలి. ఫీజు ఉంటే కట్టాలి. ఆ తర్వాతే లోనికి అడుగుపెట్టాలి.

నోటి మాట తప్ప సాయమేదీ?

ఇండియాలో ఇటువంటి వ్యవసాయ మ్యూజియం లేదంటారు. మనకున్నది నేషనల్‌ అగ్రికల్చరల్‌ సైన్స్‌ మ్యూజియం. అది ఢిల్లీ ఐసీఏఆర్‌లో ఉంది. మన నాయకులు నోరు తెరిస్తే వచ్చే పదం రైతు, వ్యవసాయం. ఇప్పటికీ 65,70 శాతం మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ రంగంపై ఆధారపడి ఉన్నాం. కానీ, సాగు రంగం గురించి భావి తరాలకు చెప్పే ఓ మ్యూజియం లేకపోవడం విచారకరం. పైగా మనమే సెటైర్లు వేస్తాం. వరి మొక్కో, చెట్టో తెలియకుండా పోతుందని వాపోతాం. మన వ్యవసాయ వారసత్వ సంపదను కాపాడుకునేందుకు మనం ఏమి చేయలేకపోయామే అని బాధ పడం. గతం తెలియకుండా వర్తమానాన్ని లెక్కించలేం. భవిష్యత్‌ను అంచనా వేయలేం. చూసే వాళ్లకి అది అర్థం కావాలంటే మన వ్యవసాయ వారసత్వమేమిటో పిల్లలకు తెలియాలి. టెక్సాస్‌ మాదిరి ప్రతి రాష్ట్ర రాజధానిలో అగ్రికల్చరల్‌ మ్యూజియంలను ఏర్పాటు చేసుకోవాలి… అమరయ్య ఆకుల, సీనియర్‌ జర్నలిస్ట్‌  9347921291

Ads

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions