Taadi Prakash June 4, ఆరుద్ర వర్ధంతి… కొండగాలి తిరిగిందీ…
తోట భావనారాయణ అనే సీనియర్ జర్నలిస్ట్ కి ఆ అదృష్టం మాములుగా పట్టలేదు. మద్రాసు నగరంలో ఆరుద్రతో ఏకంగా ఐదేళ్లు స్నేహం చేశాడు. కబుర్లు, జోకులు, గ్రీన్ టీ లు…ఆరుద్ర డిక్టేట్ చేస్తుంటే ఇష్టంగా, శ్రద్ధగా రాయడం… తస్సాదియ్యా.
అనుభవం అంటే అది కదా! ఆరుద్ర పాదముద్రలతో పునీతమైన తెలుగుసాహితీపూదోటలో భావనారాయణ పోగుజేసుకున్న పరిమళాల జ్ఞాపకాలివి: జూన్ 4 ఆరుద్ర వర్ధంతి సందర్భంగా మీకోసం…
Ads
*** *** ***
A rare tribute to Arudra
——————————————-
1993లో ఆంధ్రప్రభలో చాలా మార్పులు తీసుకురావాలని ఎడిటర్ దీక్షితులు గారు నిర్ణయించుకున్నారు. రకరకాల సప్లిమెంట్లతోబాటు సినిమా సమాచారం పెంచటం, ఆదివారం అనుబంధంలో కొత్త శీర్షికలు ప్రవేశపెట్టటం లాంటివి అందులో చాలా ఉన్నాయి. అలాంటి కొత్త శీర్షికలలో ఒకటి ఆరుద్ర గారి జ్ఞాపకాలు రాయించటం. అప్పుడు నేను మద్రాస్ ఆంధ్రప్రభలో ఉండటం వల్ల వారం వారం ఆయన దగ్గరికెళ్ళి రాయించి తీసుకొచ్చే బాధ్యత నాకప్పజెప్పారు. దీక్షితులు గారు అప్పటికే ఆరుద్రగారికి ఫోన్ చేసి ఒప్పించి ఉండటం వలన నేను వెళ్ళి పరిచయం చేసుకోవటం కొంత సులువే కావచ్చు గాని అంత పెద్దాయనను కలుసుకోబోతున్నానన్న నిజం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఏమైతేనేం, కలం పేరుతో ‘ఆరుద్ర’గా అందరికీ తెలిసిన భాగవతుల సదాశివ శంకర శాస్త్రి లాంటి పేరుమోసిన సినీ గీత రచయిత, 13 సంపుటాల సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర వెలువరించిన పరిశోధకుడు, అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపకులలో ఒకడు, అనేక సాహితీ ప్రక్రియలలో ప్రతిభను చాటినవాడు అయిన ఆరుద్ర అనే మహానుభావుణ్ణి కలుసుకున్నా.
టీ నగర్ పాండీ బజార్ లో పూలమార్కెట్ పక్క సందులోని ఇల్లు, దానికి కొనసాగింపుగా వేసిన షెడ్డులో ప్రశాంతంగా కూర్చొని నాట్యశాస్త్ర గ్రంధమొకటి చదువుతూ ఉన్నారు. పక్కనే మూడు బీరువాల్లో పుస్తకాలు, ఒక పాత టైప్ రైటర్ కూడా ఉన్నాయి. నమస్కారం పెట్టి పరిచయం చేసుకున్నా. కాసేపటికి ఆరుద్ర వదినగారు ( రామలక్ష్మి గారి అక్కగారు) గ్రీన్ టీ తెచ్చారు. అదే మొదటి సారి గ్రీన్ టీ తాగటం. అప్పటినుంచి వారానికి కనీసం రెండు సార్లు ఆయనదగ్గరికి వెళ్ళటం, గ్రీన్ టీ తాగుతూ మాట్లాడుకోవటం దాదాపు ఆయన చనిపోయేదాకా ఐదేళ్ల పాటు సాగింది.
మొదటిరోజే ఆయన డిక్టేషన్ మొదలైంది. నా అక్షరాలు తప్పుల్లేకుండా కుదురుగా ఉన్నాయని మెచ్చుకున్నారు. ఇంట్లోంచి వస్తూ రామలక్ష్మి గారు ‘అబ్బాయ్, టీ తాగావా” అనగానే ఉలిక్కి పడి అటు చూశా. ఆరుద్రగారు సమాధానమిచ్చాక గాని ఆమె పిలిచింది నన్ను కాదని, ఆరుద్ర గారిని అలా పిలుస్తారని అర్థమైంది. ఆమెకు నన్ను పరిచయం చేశాక నేను రాసింది చదివి “ టైపిస్ట్ టెన్త్ కంటే ఎక్కువ చదివి ఉండకూడదు, సొంత పైత్యం ఉపయోగిస్తాడు అని ఖాసా సుబ్బారావు గారు అనేవారు. కానీ నువ్వు మాత్రం చెప్పింది చెప్పినట్టే రాశావ్” అన్నారు. అలా మార్కులు కొట్టేశా.
అప్పుడప్పుడూ రామలక్ష్మి గారు కాసేపు కబుర్లు చెప్పేవారు. ఇంటిపని మాత్రం వాళ్ళ అక్కగారిదే.
“బ్రాహ్మణుణ్ణే కానీ, జంధ్యం వేసుకోలేదు. పెళ్ళిచేసుకున్నాను గాని తాళి కట్టలేదు.” అనే ఆరుద్ర గారి డైలాగ్ సంగతేమోగాని రామలక్ష్మి గారికి ఒక్కోసారి చాలా ఇబ్బందిగా అనిపించేదట. గర్భిణిగా ఉన్నప్పుడు సిటీ బస్సెక్కితే ఆమె బోసి మెడ చూసి “అయ్యో ఈ వయసులో ఇన్ని కష్టాలా?” అన్నట్టు బాధపడేవాళ్ళని చెబుతూ నవ్వేవారు.
ఆంధ్రప్రభ కాలమ్ మాత్రమే కాకుండా పుస్తక సమీక్షలు మొదలు వ్యాసాల దాకా ఏది రాయాలన్నా, ఆరుద్ర గారు అలా ఫోన్ చేసి పిలవగానే వెళ్ళి రాసిపెట్టటం అలవాటుగా మారింది. ఆ రోజుల్లో రావిశాస్త్రి గారు చనిపోయారు. ఆరుద్రగారి స్పందన తీసుకోమని హైదరాబాద్ నుంచి కల్లూరి భాస్కరం గారి ఫోన్. వెంటనే ఆరుద్ర గారికి ఫోన్ చేసి విషయం చెప్పా. ఎప్పుడు రమ్మంటారని అడిగితే “నేను చెప్పటం, నువ్ రాసుకోవటం అలవాటేగా, ఇక్కడిదాకా ఎందుకులే, రాసుకో” అన్నారు. “రావిశాస్త్రి పెన్ను మూశారు” అంటూ చెప్పటం మొదలుపెట్టారు. ఆరోజు అదే శీర్షిక కూడా అయింది. ఆ తరువాత సాహిత్యకారులెవరు చనిపోయినా ఆ ప్రయోగం ఒక ఆనవాయితీ గా మారింది.
“అయితే రాసుకో” అంటూ లెటర్ డిక్టేట్ చేయటం మొదలు పెట్టారు. అందులో “ మూత్రపిండాల వ్యాధితో నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు మాగుంట సుబ్బారామిరెడ్డిగారు నాకు సహాయం చేశారు. నేను ఆయనకు ఋణపడి ఉన్నా. ఆయన ఒక వీక్లీ పెట్టే ఆలోచన ఉందని తెలిసి, ఆయన అడక్కపోయినా దానికోసం పనిచేస్తానని మాటిచ్చాను. అందువలన మీరిచ్చిన ఈ అవకాశాన్ని వాడుకోలేకపోతున్నా” అంటూ లెటర్ ముగించారు. ఈ లెటర్ తో బాటు రామోజీరావు గారి బ్లాంక్ చెక్ వెనక్కి వెళ్ళిపోయింది. సాహిత్య పత్రిక ఆలోచన వాయిదా పడింది. ఈ మధ్య కాలంలో కొన్నేళ్ళపాటు నడిచి ఆగిపోయిన ‘తెలుగు వెలుగు’ బహుశా ఆ ఆలోచన కొనసాగింపు కావచ్చు.
తెలంగాణ తొలి పత్రిక
——————————-
హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గా రిటైరైన డాక్టర్ పి.ఎస్. గోపాలకృష్ణ అప్పట్లో మద్రాసులో నాకో విషయం చెప్పారు. ఆయన, బంగోరె ఒకసారి మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంధాలయంలో ‘శేద్య చంద్రిక’ అనే పత్రిక ప్రతి చూశారని, అది చాలా పాత పత్రిక అయ్యే అవకాశముందని చెబుతూ దానిమీద ఒక వ్యాసం రాయమని సూచించారు. కష్టపడి దాని ఆచూకీ తెలుసుకొని వివరణాత్మకంగా ఒక వ్యాసం రాశానుగాని అది ప్రచురితమైన సంవత్సరాన్ని కచ్చితంగా లెక్కగట్టటం అందులో చాలా కీలకం. ఆ విషయం ఆరుద్రగారికి చెబితే ఆ ప్రతిని పరిశీలించి, లెక్కలుగట్టి అది 1883 అని నిర్థారించారు. దీంతో ఇదే తెలంగాణ తొలిపత్రిక అని, అప్పటిదాకా అనుకుంటున్న నీలగిరి పత్రిక కాదని తేలింది. ఈ కొత్త విషయానికున్న ప్రాధాన్యాన్ని గుర్తించి అప్పట్లో ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం ఎడిటర్ విజయబాబు గారు (తరువాత కాలంలో ఆంధ్ర ప్రభ సంపాదకునిగా, సమాచార హక్కు చట్టం కమిషనర్ గా కూడా పనిచేశారు) రెండు ఆదివారాలు రెండు భాగాలుగా వేసి తగిన ప్రాచుర్యం కల్పించారు.
పాత రచనల కాలనిర్ణయంలో సమస్యలు ఎలా వస్తాయో, ఎలా పరిష్కరించాలో చెబుతూ ఆరుద్ర గారు స్వామినీన ముద్దు నరసింహం నాయుడు 1855 లో రాసిన ‘హిత సూచని’ ని ఉదహరించారు. దానికి ఆయన రాసిన ప్రవేశిక గురించి చెప్పటానికి పునర్ముద్రించిన ‘హిత సూచని’ కాపీ ఒకటి నాకోసం ప్రత్యేకంగా రాజమండ్రి నుంచి తెప్పించి ఇచ్చారు.
ఆరుద్ర గారితో సాన్నిహిత్యం పెరిగిన తరువాత ఆయనను ఇంటర్వ్యూ చేయాలనే కోరిక పుట్టింది. అయితే, ముందుగా ఎడిటర్ దీక్షితులు గారు అనుమతించాలి. నేరుగా కాకుండా కల్లూరి భాస్కరం గారితో అడిగించటం మేలనిపించింది. రోజూ ఎడిటోరియల్ సహా ఎడిట్ పేజ్ తో కుస్తీ పడుతూనే, ప్రతి సోమవారం ‘సాహితీ గవాక్షం’ కూడా ఆయనే చూసేవారు. ఎడిటర్ ను ఒప్పించటంతో బాటు నేరుగా ఆరుద్ర గారికే ఆ విషయం చెప్పటంతో నా పని సులువైంది. చాలా పెద్ద ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నానని ఆరుద్ర గారితో చెప్పా. రోజూ ఓ గంటపాటు వారం రోజులు కూర్చుందామన్నారు. ఏ ప్రశ్నకూ సమాధానం దాటవేయకుండా చెప్పారు. మొత్తం ఇంటర్వ్యూ నా చేతిరాతలో 68 పేజీలు వచ్చింది. ఎడిట్ చేసుకోవటం భాస్కరం గారికే వదిలేస్తూ అంతా పంపించా. ఎంత ఆశ్చర్యమంటే, మూడు వారాల పాటు సాహితీ గవాక్షం పేజీని ఈ ఇంటర్వ్యూతో నింపారు. ఇది నాకు దొరికిన అరుదైన గౌరవం.
సహజంగానే ఇంటర్వ్యూలో చాలా సార్లు శ్రీశ్రీ ప్రస్తావన వచ్చింది. శ్రీశ్రీ తో ఆయనకు పడదనీ, అసూయ అనీ ఉన్న విమర్శలకూ ఆయన సమాధానం చెప్పారు. అంతే కాదు, ఒక సందర్భంలో నాకు డబ్బింగ్ మెలకువలు చెబుతూ శ్రీశ్రీ ఎంత సునాయాసంగా డబ్బింగ్ రాయగలరో సోదాహరణంగా వివరించారు. అందరూ తెలుగు పదం కోసం వెతుకుతూ ఉంటే ఆయన ఏకకాలంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పదాలు ఆలోచించగలరని శ్రీశ్రీ గొప్పదనం గురించి చెప్పారు.
నిజం చెప్పాలంటే ఆరుద్ర చాలా వేగంగా డబ్బింగ్ రాయగలరని పేరుంది. హిందీనుంచి రాయటం చాలా కష్టమైనా ఆహ్ సినిమాను ప్రేమలేఖలుగా అనువదించినప్పుడు ఆ సినిమాకు ఆయన పాటలు, మాటలు ఎంతబాగా అనువదించారో అప్పట్లో చెప్పుకున్నారు. కానీ ఆయన మాత్రం తనకు తక్కువ మార్కులే పడతాయన్నారు. కడుపులో ఉన్న బిడ్డ గురించి ప్రస్తావించే పాత్ర “మై మా హూ” అని క్లోజప్ లో చెబుతున్నప్పుడు పెదవుల కదలికకు తగినట్టు ఏం రాయాలా అని అరగంట సేపు ఆలోచించాల్సి రావటం కాస్త అవమానంగా అనిపించిందని స్వయంగా చెప్పుకున్నారు. “పాపాయో?”అని రాసి నెట్టుకొచ్చేశానన్నారు.
ఆంధ్రప్రభ నుంచి వార్తకు మారినా ఆరుద్ర గారి దగ్గరకు వెళ్ళటం ఆపలేదు. చివరి మూడేళ్లలో ఆయన అధ్యయనమంతా నాట్యం, సంగీతం మీదనే. అప్పట్లో స్వప్న సుందరి అనే నాట్య కళాకారిణి, పరిశోధకురాలు దేవదాసీల (భోగం సానుల) నాట్యం మీద పరిశోధన చేశారు. అంతా ఆరుద్ర గారి మార్గదర్శనంలోనే. ఆమె కంటే ఆరుద్ర గారే ఎక్కువగా పరిశోధించారనిపించేది. ఆమె వచ్చిన ప్రతి సారీ అప్పటిదాకా ఆయన చేసిన పరిశోధనను నోట్స్ రూపంలో అందించేవారు. అదీ నా చేతిరాతలోనే.
ఈ నాట్యానికి ఆరుద్ర గారు ‘విలాసినీ నాట్యం’ అని పేరుపెట్టారు. ఆ పేరు లాంఛనంగా ప్రకటించటానికి మద్రాస్ జీఎన్ చెట్టి రోడ్డులో ఉన్న రెసిడెన్సీ హోటల్ లో ప్రెస్ మీట్ ఏర్పాటైంది. ఫాలోడ్ బై కాక్ టెయిల్స్ అండ్ డిన్నర్. ఆరుద్రగారున్నారు కాబట్టి అరుదుగా తాగే నైన్టీకి కూడా ఆరోజు గుడ్ బై చెప్పి భోజనానికి సిద్ధమవుతూ ఉంటే నన్ను పిలిచారు. కూర్చోమని స్వయంగా గ్లాస్ నింపారు. “మోహమాటపడకు.. నీ వయసులో హాఫ్ లేపేవాణ్ణి” అంటూ వణుకుతున్న చేతులతోనే గ్లాసందించారు. చాలా సిగ్గుపడ్డాను గాని కాదనలేకపోయా.
సినిమా పాటలు రాయటం ఆపేసి పరిశోధనలకే అంకితమైన ఆరుద్ర రెండు సందర్భాలలో మాత్రం ఒట్టు తీసి గట్టుమీద పెట్టి పాటలు రాయాల్సి వచ్చింది. 1983 లో విడుదలైన ఆంధ్ర కేసరి సినిమా కోసం రాసిన ‘వేదంలా ఘోషించే గోదావరి..’ ఒకటైతే, 1991 లో విడుదలైన పెళ్ళిపుస్తకం కోసం రాసిన శ్రీరస్తు..శుభమస్తు.. శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం” రెండోది. మొదటిది రాజమండ్రి వాసులు గర్వించేలా ఇచ్చిన విలువైన కానుకైతే, రెండోది రెండు దశాబ్దాలకు పైగా పెళ్ళి వీడియో కాసెట్లలో తప్పనిసరి పాటై కూర్చుంది.
ఆరుద్ర అంత్యక్రియలు చేసింది
ఒక్క రామ లక్ష్మీ మాత్రమే
———————————–
వార్తకు స్వస్తి చెప్పి 1998 మే 1 న జెమినీలో చేరా. ఆరుద్ర గారి కిడ్నీ సమస్య పెరిగి ఆరోగ్యం ఇంకాస్త దెబ్బతిన్నట్టు తెలిసింది. కొత్తగా ఎలక్ట్రానిక్ మీడియంలో చేరటం వలన పని వత్తిడి బాగా ఉంది. వెళ్ళిరావాలని అనుకుంటూ ఉండగానే జూన్ 4 ఉదయం సుమారు 10 గంటలకు రామలక్ష్మి గారి ఫోన్. “ భావనారాయణా, ఆరుద్ర గారు పోయారయ్యా” అన్నారు. “ఎప్పుడు? ఎక్కడ?” అనే నా ప్రశ్నలకు అడ్డుకట్టవేస్తూ, ”టైముంటే ఇంటికి రా” అన్నారు. క్షణాల్లో బయలుదేరి సన్ టీవీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరుద్ర గారింటికి వెళ్ళా.
ప్రశాంతంగా కుర్చీలో కూర్చొని ఉన్నారు రామలక్ష్మిగారు. ఆరుద్ర గారి ఆచూకీ లేదు. చివరి రోజుల్లో ఎక్కువగా వాళ్ళింటికి వచ్చే డాక్టర్ వడ్లమాని కనకదుర్గ, మద్రాసు యూనివర్సిటీ తెలుగు డిపార్ట్ మెంట్ హెడ్ ప్రొఫెసర్ జీవీ ఎస్సార్ కృష్ణమూర్తి, సీనియర్ జర్నలిస్ట్ బి ఎస్సార్ కృష్ణ, నిర్మాత నవతా కృష్ణం రాజు, సినిమా-సంగీతం-నాట్యం మీద అథారిటీ అని చెప్పగల వీఏకే రంగారావు వరుసగా చేరుకున్నారు.
ఉదయం ఆరుగంటల సమయంలో కాస్త ఇబ్బందిగా ఉందనిపించగానే ఆయనను కీల్పాక్ లో ఉన్న డాక్టర్ సిఎంకె రెడ్డి (అఖిలభారత తెలుగు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు) హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. సుమారు 8 గంటలకు ఆరుద్ర కన్నుమూశారు. రామలక్ష్మి గారు ఒక్కరే ఆయనను అంబులెన్స్ లో నేరుగా బిసెంట్ నగర్ శ్మశానవాటికకు తీసుకుపోయి దహన కార్యకమం ముగించి అస్థికలు కూడా వద్దని చెప్పి ఇంటికొచ్చి కూతుళ్ళకు, నాలాంటి కొద్ది మందికీ ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇదీ ఆమె స్థూలంగా చెప్పిన విషయం.
సినిమా కెరీర్ చాలా ఉన్నత స్థాయిలో ఉన్న రోజుల్లోనే దాన్ని పక్కనబెట్టి సంచి భుజాన వేసుకొని పెరిగిన గడ్డాన్ని పట్టించుకోకుండా దేశదిమ్మరిలా ఊరూరూ తిరిగి తన పరిశోధన సారాన్ని 13 సంపుటాల తెలుగు సాహిత్య చరిత్రగా మనకందించిన మహానుభావుడు, తన జీవితకాలంలో సేకరించిన పుస్తక భాండాగారాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఇచ్చేసినవాడు, అన్నీ రకాల సాహితీ ప్రక్రియాలూ చేసి పదుల సంఖ్యలో పుస్తకాలు వెలువరించినవాడు, అతి మామూలు జీవితం గడిపిన మహోన్నతుడు సాహితీప్రియుల కడసారి చూపుకు కూడా అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఇంకా చెప్పాలంటే రామలక్ష్మి గారే అలా పంపించేశారు.
నాకు వాళ్ళింట్లో ఉన్న చొరవతో వాళ్ళ బీరువా వెతికి అందులో ఉన్న వీడియో కాసెట్లు తీసుకువెళ్ళి నాకు కావాల్సిన వీడియో భాగాలు కాపీ చేసుకొని, ఎడిట్ చేసుకొని జెమినీ టీవీ 8 గంటల వార్తలకోసం ఒక చిన్నపాటి నివాళి డాక్యుమెంటరీ తయారు చేశా. ఇద్దరు న్యూస్ ప్రజెంటర్లు మార్చి మార్చి వార్తలు చదివే సంప్రదాయం ఉండగా, ఆ స్క్రిప్ట్ ను ఎంతగానో మెచ్చుకున్న సినీనటుడు, రచయిత ఓంకార్ పట్టుబట్టి మరీ ఆ వార్తాకథనం తానే చదివారు.
శ్రీశ్రీ చనిపోయినప్పుడు అరసం, విరసం సభ్యులు మేమంటే మేమని పోట్లాడుకోవటం చిరాకనిపించిందని ఒకసారి రామలక్ష్మి గారు అన్నట్టు గుర్తు. బహుశా అంత్యక్రియలమీద ఇద్దరూ ముందే ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు. ఆరుద్రకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. తెలుగువాళ్ళు తమ సాహిత్య చరిత్రకు పెద్ద దిక్కుగా చెప్పుకోవాల్సిన ఆరుద్రను తగిన రీతిలో సత్కరించుకోలేదు. అది కూడా రామలక్ష్మిగారు కినుక వహించటానికి కారణమై ఉండవచ్చు.
ఇప్పటిదాకా జరిగిన సంగతి పక్కనబెడితే, మరో రెండేళ్లలో 2024 ఆగస్టు 31 నాటి పుట్టినరోజుతో మొదలయ్యే ఆరుద్ర శతజయంతి సంవత్సరంలోనైనా ప్రభుత్వం, సాహిత్యాభిమానులు ఆయన స్మారక కార్యక్రమాలు నిర్వహించటం, ఆయన విగ్రహం పెట్టటం, ఆయన రచనలన్నిటినీ కలిపి సంపుటాలుగా వెలువరించటం లాంటి పనులు చేయటం కనీస మర్యాద……… తోట భావనారాయణ 9959940194
Share this Article