ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ఈవెంట్‌కు ఆహ్వానం అందింది గానీ… నిజానికి ఆ ఈవెంట్ కవరేజీకి వెళ్లాలనే ఆసక్తే కలగలేదు నాకు మొదట్లో…! చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పదవీకాలాల నుంచి కూడా ఈ సమ్మిట్స్ కవర్ చేస్తూనే ఉన్నాను… ఇలాంటి సమ్మిట్ల ప్రచారాడంబరం ఇంతగా మోగిపోతుంది కదా… తీరా ఆ ఎంవోయూలు ఆచరణలోకి రావడం అత్యంత అరుదు…
నిజానికి వీటితో ఒరిగేదేమీ ఉండదు పెద్దగా… కాకపోతే మేం పరిశ్రమలను, పెట్టుబడులను ఆహ్వానించడానికి బాగా కష్టపడుతున్నాం అనే షో… ముఖ్యమంత్రి ఎవరున్నా సరే…! ఈమాత్రం దానికి హైాదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లి రావడం, రెండురోజులు టైమ్ వేస్ట్ పైగా ఎనర్జీ లాస్… కానీ సీఎంవో పబ్లిసిటీ వింగ్ ఉన్నతాధికారులు, ఐఅండ్ పీఆర్ శాఖ నుంచి వరుస కాల్స్ కారణంగా ఇక వెళ్లకతప్పక బయల్దేరాను…
అఫ్‌కోర్స్, జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పెట్టుబడులను ఆకర్షించడంలో నిర్లక్ష్యం కనబడుతోందనే విమర్శ ఉంది కదా, ఈ సమ్మిట్ ఎలా నిర్వహిస్తాడో చూడాలనే చిన్న ఆసక్తి మాత్రం మనసులో ఉంది… కొందరు స్థానిక పెట్టుబడిదారుల పెద్ద పరిశ్రమలు కూడా చెన్నై, తెలంగాణ వైపు చూస్తున్నాయనే వార్తలు కూడా వచ్చాయి కదా…
Ads
వాస్తవం చెప్పాలంటే… ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, అర్జున్ ఒబెరాయ్, పునీత్ దాల్మియా, హెచ్ఎం బంగూర్, మార్టిన్ ఎబర్‌హార్డ్ (టెస్లా కోఫౌండర్) నవీన్ జిందాల్, సంజీవ్ బజాజ్ వంటి మహామహులను రప్పించడంలో జగన్‌మోహన్‌రెడ్డి ఎఫర్ట్స్‌ను తప్పక అభినందించాలి… ఒక వేదిక మీదకు వీళ్లందరినీ రప్పించడానికి సంబంధిత అధికారగణం కొద్దిరోజులుగా ఎంత గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారో నేను ఊహించగలను… అది పెద్ద టాస్కే… కాకపోతే అందులో కొందరు ఆల్‌రెడీ ఏపీతో లింక్స్ ఉన్నవాళ్లే, కొందరు కొత్త…
ఇదంతా బాగానే ఉంది… కానీ స్థూలంగా ఈవెంట్ నిర్వహణ తీరు మాత్రం నాకు అసంతృప్తినే కలిగించింది… క్రూడ్‌గా చెప్పాలంటే అత్యంత గందరగోళం… సిట్టింగ్ ఏర్పాట్ల దగ్గర నుంచి సౌండ్ సిస్టం దాకా… ఇది ఏర్పాటు చేసింది ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్… బ్యాడ్ చాయిస్… కనీసం గ్రౌండ్‌ను సరిగ్గా లెవలింగ్ చేయలేదు… ఎగుడుదిగుడు స్థలంపైనే ఆకుపచ్చని తివాచీలు పరిచేసి, కవర్ చేశారు…
ప్రధాన వేదిక, ఆహుతులు కూర్చునే స్థలం పెద్దగానే ఉంది గానీ డెలిగేట్స్ అందరికీ సరిపోయేంత మాత్రం లేదు… చాలామంది మూలల్లో నిలబడి కనిపించారు… (యూనివర్శిటీ స్టూడెంట్స్ కూడా చాలామంది డెలిగేట్స్‌లా వచ్చి కూర్చున్నారు…) చాలా కుర్చీల్లో వైసీపీ లీడర్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు కూర్చున్నారు…
కొందరు విదేశీ డెలిగేట్స్ సహా ఇతర రాష్ట్రాల డెలిగేట్స్ పలువురు సరైన సిట్టింగ్ ఏర్పాట్లు లేకపోవడం, ఉన్నవాటిని వైసీపీ నేతలు ఆక్రమించుకోవడంతో… ఇక తప్పనిసరై మీడియాకు ఉద్దేశించిన సీట్లలో కూర్చున్నారు… ఇలాంటి ఈవెంట్లలో మీడియా గ్యాలరీని వేదికకు సమీపంలో ఉండేలా ఏర్పాటు చేస్తారు… కానీ ఇక్కడ మాత్రం అక్కడెక్కడో మధ్యలో ఏర్పాటు చేశారు… దీనివల్ల మీడియా ప్రతినిధులకు వేదిక మీద ఏం జరుగుతుందో సరిగ్గా చూసే సౌకర్యం లేకుండా పోయింది… విధిలేక, గ్యాలరీలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్స్ మీద ఆధారపడక తప్పలేదు…
అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ పేరిట మొదట్లో ప్రదర్శించిన లేజర్ షో కూడా చాలా క్రూడ్‌గా అనిపించింది… ఆశ్చర్యం కలిగించిన మరో అంశం ఏమిటంటే… ప్రోగ్రాం స్టార్టయిన చాలాసేపటి వరకు కూడా మీడియా ప్రతినిధులకు ఆరోజు ప్రోగ్రామ్ ఏమిటో చెప్పే షీట్స్ ఇవ్వకపోవడం..! పదే పదే అడిగితే అప్పుడు గానీ కొందరికి మీడియా కిట్స్ ఇచ్చారు… కొందరికి ఈవెంట్ ముగిసే టైమ్‌కు గానీ ఇవ్వలేదు… ఎక్కడా తాగునీటి సౌకర్యం లేదు… కనీసం వచ్చిన ప్రతినిధులకు చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అందించినా బాగుండేది… మీడియా ప్రతినిధులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాక ఏదో ప్రభుత్వ శాఖ సిబ్బంది ఓ బాటర్ బబుల్ తీసుకొచ్చి, పేపర్ కప్పుల్లో నీళ్లు అందించారు…
ఇవన్నీ రంధ్రాన్వేషణ కాదు, ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యాన్ని పట్టిచ్చే చిన్న చిన్న ఉదాహరణలు… వీఐపీలకు లంచ్ ఏర్పాట్ల గురించి నాకు తెలియరాలేదు గానీ మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ఓ టెంట్ ఏర్పాటు చేశారు… అందులోకి వెళ్లగానే షాక్ తిన్నంత పనైంది నాకు… పెద్ద క్యూ… టెంట్ బయటికి వచ్చింది ఆ క్యూ…
ఇంతమంది మీడియా ప్రతినిధులను పిలిచారా అనుకుంటూనే ఉన్నాను… మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా దాకా… రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రతినిధులకు కూడా పాసులు ఇచ్చేశారు… ఒకాయన విసుగ్గా కాస్త గట్టిగానే అంటున్నాడు… డెలిగేట్స్‌కన్నా మీడియా ప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు అని… ఫుడ్ క్వాలిటీ కూడా పూర్… కాకపోతే ఆకలి కదా, నాణ్యతను పెద్దగా పట్టించుకోదు… ఆ క్యూలో నిలబడి, ఎదురుచూసేంత ఓపిక నాకు లేకుండా పోయింది…
ఓ చిన్న ప్లేటు దొరకబుచ్చుకుని, క్యూ లైన్‌కు అతీతంగా కౌంటర్ల వద్దకు వెళ్లి, ఏదో పెడితే, అదే గతికి… మమ అనిపించేసి, పరుగుపరుగున హోటల్ గదికి చేరుకున్నాను… ఏదో ఆ వార్తలు ఫైల్ చేస్తే ఓ పనైపోతుంది కదాని..! మరి కడుపు నిండాలి కదా… మరేం చేయాలి..? హోటల్‌లో దొరికే ఏవో స్నాక్స్ ఆర్డర్ ఇచ్చుకుని, నోట్లో కుక్కుకున్నాను… ఒకవైపు స్టోరీస్ ఫైల్ చేస్తూనే… ఇది నా అనుభవం, నా పరిశీలన… ఏమో, వేరేవాళ్లకు భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు… జగన్ ఈవెంట్‌ను ఇంకాస్త బాగా ఆర్గనైజ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది నాకు బలంగా…!!
.
(పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల అసలు సామర్థ్యం, ఇక్కడ పెట్టుబడులు చూపించిన లెక్కలు, చెబుతున్న ఉపాధి కల్పన అంకెల జోలికి నేను పోవడం లేదు… వాటిల్లో అసలు నిజాలు, ఆ లెక్కల అసలు మర్మాలు ఓ రిపోర్టర్‌గా నాకు బాగా తెలుసు… ఈ విషయంలో చంద్రబాబు వేరు, జగన్ వేరు కానే కాదు… కేవలం ఈవెంట్ నిర్వహణ తీరు పరిశీలనకు మాత్రమే ఇక్కడ నేను పరిమితమయ్యాను…) (ఇది సదరు ఈవెంట్‌కు వెళ్లిన ఓ సీనియర్ జర్నలిస్టు స్వగతం…)
Share this Article