Sridhar Bollepalli ……….. అబ్బ దబ్బ జబ్బ… A story by Sridhar Bollepalli… సుబ్బారావుకి నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదూ అంటే ఏమీ నచ్చట్లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా తన మేథస్సుని ఎవరూ గుర్తించి ప్రశంసించకపోవడం అస్సలు నచ్చట్లేదు. ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే అందరూ గుర్తించి ప్రశంసించదగిన పని అతను ఏమీ చేసివుండలేదు యిప్పటివరకూ.
తాను ఏమేం చేయగలడో, తాను మిగిలినవాళ్లకన్నా ఏ విధంగా అధికుడో సుబ్బారావుకి తెలుసు. ఏదో ఒకటి చేస్తే తప్ప తనలాంటి వాణ్ని గుర్తించలేని దయనీయ స్థితిలో సమాజం వుండిపోవడం అతనికి సుతరామూ నచ్చలేదు. ప్రత్యామ్నాయం లేని నిస్సహాయ స్థితిలోకి నెట్టబడినవాడై ఏం చేయాలా అని ఆలోచించడం మొదలెట్టాడు సుబ్బారావు.
ఆలోచించగా ఆలోచించగా గుర్తింపు తెచ్చుకోడానికి కథలు రాయడమే తేలిక మార్గమని తోచింది అతనికి. కోకొల్లలుగా వున్న తన జీవితానుభవాలని పేపర్ మీద పెట్టడం ఏవంత కష్టమైన పని?! అలా అనుకున్నాడులే కానీ లోపల్లోపల అతనికొక భయం లేకపోలేదు. ఆ భయానికి కారణమైన వ్యక్తి పేరు అప్పారావు. అప్పారావు అల్లాటప్పారావు కాదు. రచయితగా, విశ్లేషకుడిగా మంచి పేరున్నవాడు. మొదట్లో అతన్నెవరూ సీరియస్‌గా తీసుకునేవారు కాదు. తాను చెప్పదల్చుకున్న విషయంతో అందరూ ఏకీభవించేలా చేయడానికి ఎంత దూరం అయినా వెళ్లడానికి సంకోచించని అప్పారావు ఓపిక రాన్రానూ అతనికి చాలామంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది.
Ads
ఎంత దూరం అయినా వెళతాడు అనేది కేవలం ఫిగరేటివ్‌గా చెప్పింది కాదు. అదొక లిటరల్ ఫాక్టు. ఒకసారి అప్పారావు 670 మైళ్ల దూరంలో వున్న ఒక ఎఫ్బీ ఫ్రెండు యింటికెళ్లి అతని జబ్బమీద గట్టిగా కొరికి వచ్చాడు. అప్పటివరకూ అప్పారావుతో ఏనాడూ ఏకీభవించి వుండని ఆ జబ్బ తాలూకూ యజమాని మర్నాటినుండీ అప్పారావు అభిమానసంఘంలో సభ్యత్వం పుచ్చుకోక తప్పింది కాదు. ఎలాగోలా అప్పారావు వొక్కణ్నీ మెప్పిస్తే తాను కథలు రాయడం నల్లేరు మీద బండి నడకే అనే తెలివిడి సుబ్బారావులో వుంది.
తొలుతగా సుబ్బారావు రాసిన కథ “దూరంగా” అనే వెబ్ మాగజీన్లో పబ్లిష్ అయ్యింది. ఆ కథ తాలూకూ లింక్‌ని వెంటనే వాట్సప్ లోనూ, ఎఫ్బీలోనూ పెట్టాడు సుబ్బారావు. చదవకపోవడం వల్ల కొందరూ, చదివినా మొహమాటానికి కొందరు సుబ్బారావు రాసిన కథ బావుందని కామెంట్లు పెట్టారు. లెక్కలేనంత మంది లైకులు కొట్టారు. అలా కొట్టినవాళ్లలో విస్ఫులింగేశ్వరి, కణికకుమారి, చుక్కముగ్గు రాణి, కళ్లాపిదేవి, విజృంభిత, కపోతకుపిత లాంటి ఆడస్నేహితులు వుండడం సుబ్బారావుని అలౌకికానందంలో ముంచెత్తింది.
కానీ, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సుబ్బారావు కథకి అప్పారావు కామెంట్ రానేవచ్చింది. “తిర్యక్ తరంగాల ప్రభావాన్ని తక్కువగా చూసే హ్రస్వదృష్టి కథ ఆసాంతం ప్రతిఫలిస్తూనే వుంది. అణుధార్మికత ఛాయలు కూడా అక్కడక్కడా లేకపోలేదు. కానీ, మొత్తంగా చూసినప్పుడు అనుదైర్ఘ్య కంపనపరిమితి డామినేట్ చేసిందని చెప్పకతప్పదు” అనేది ఆ కామెంట్ సారాంశం. అది ఎవరికంటా పడకూడదని షట్కోటి దేవతలకూ మొక్కుకున్నాడు సుబ్బారావు . (నిజానికి ముక్కోటి దేవతలకే మొక్కుకోవాలి. కానీ ఒక్కోళ్లకీ రెండేసిసార్లు మొక్కుకోవడం వల్ల అలా జరిగింది). ఫేస్‌బుక్‌లో రెండోసారి లైక్ కొడితే మొదటి లైకు ఎగిరిపోయినట్లు దేవుళ్లక్కూడా ఏవో లెక్కలున్నట్టున్నాయి. సుబ్బారావు మొరని ఎవరూ ఆలకించలేదు. అప్పారావు పెట్టిన కామెంటుకి ఆరులక్షల లైకులొచ్చాయి. ఈ పరిణామంతో సుబ్బారావులోని రచయిత మ్రాన్పడిపోయాడు.
ఇక్కడ ఒక తమాషా ఏంటంటే.. అసలు అప్పారావు పెడదామనుకుంటున్న కామెంట్ వేరే వుంది. అప్పారావుకి తెలుగు టైపింగ్ రాదు. వాయిస్ రికార్డ్ చేస్తే.. అది ఆటోమేటిగ్గా టైప్ అయిపోయే సాఫ్ట్వేర్ వాడుతున్నాడు. అతను కామెంట్ పెట్టడం కోసం రికార్డు చేస్తున్న టైముకి అతని కూతురు పక్కనే కూచోని బిగ్గరగా భౌతికశాస్త్రం పాఠం చదువుతోంది. (ఆ పిల్లకి చదువంటే ఆసక్తి అని మనం భ్రమపడరాదు.
పేరెంట్స్ ఏదైనా సీరియస్ పనిలో వుంటే, వాళ్లకి చికాకు పుట్టించడం కోసం శత్రువైఖరితో పిల్లలు పుస్తకాలు ముందేసుకోని బిగ్గరగా చదవడం అనేది భారతీయ సంప్రదాయం భాగం). అప్పారావు రికార్డు చేస్తున్న మాటల్లో ఆ పిల్ల చదువుతున్న ఫిజిక్సు పదాలు మిక్సయిపోయి.. సదరు కామెంటు వింతరూపాన్ని సంతరించుకుంది. “విమర్శకుల భాష విధవిధాలు” అనే ఎరుక వున్న ఎఫ్బీయన్లంతా ఆ కామెంటుకి టపటపా లైకులు కొట్టేశారు. రావాల్సిన లైకులు ఎలాగూ వచ్చాయి కాబట్టీ, అసలు నిజం బయట పెట్టడం ఎందుకులే అని అప్పారావు కూడా మిన్నకుండిపోయాడు.
తాత్కాలికంగా వైరాగ్యానికి లోనైనా అనతికాలంలోనే పుంజుకున్న సుబ్బారావు రోజుకొకటి చొప్పున కథలు రాసి దేశంలో వున్న వెబ్ మాగజీన్లన్నిటికీ పంపసాగాడు. రచయితల కన్నా విమర్శకులు వేగంగా పుంజుకుటారనేది మనకి తెలియంది కాదు. సుబ్బారావు మెరుపు వేగంతో కథలు రాస్తుంటే అప్పారావు డబల్ మెరుపు వేగంతో వాటిని చీల్చిచెండాడడం చేస్తూవచ్చాడు. పైగా కూతురిని సాంతం బడి మాన్పించేశాడు కూడానూ. కామెంట్లు రికార్డు చేసే సమయంలో తన కూతురికి సోషియాలజీ, ఆంత్రొపాలజీ పుస్తకాలిచ్చి బిగ్గరగా చదవమనేవాడు. ఆ పిల్ల సహకారం వల్ల అప్పారావు పోస్టు చేసే రివ్యూలు మరింత వైవిధ్యాన్నీ, చిక్కదనాన్నీ సంతరించుకన్నాయి. తనకి లైకులతో సరిపెట్టిన విస్ఫులింగేశ్వరి వంటి మిత్రురాండ్రు అప్పారావు కామెంట్లకి మాత్రం లవ్వులు కొట్టడంతో సుబ్బారావు బిక్కచచ్చిపోయాడు. తన యిమేజీ డ్యామేజీ అయిపోతోందన్న బాధ కన్నా అప్పారావు గొప్ప క్రిటిక్ గా అవతరించడం సుబ్బారావుకి మరింత కంటగింపుగా మారింది. దాంతో కథలు రాయడం మానిపారేశాడు సుబ్బారావు.
రాయడం మానేసినా సుబ్బారావుని ప్రశాంతంగా బతకనీయలేదు సమాజం. “విమర్శకుల నోళ్లు మూయించడానికి సుబ్బారావు ఒక గొప్ప కథని ప్లాన్ చేశాడనీ, అందుకోసమే అజ్ఞాతంలోకి వెళ్లాడనీ, త్వరలోనే ఒక విస్ఫోటనం లాంటి కథతో బయటకి వస్తాడనీ” అందరూ చెప్పుకోవడం మొదలెట్టారు. అతను రాసినన్నాళ్లూ పట్టించుకోనోళ్లు కూడా యిప్పుడు అతని గురించి గొప్పగా చెప్పుకోవడం మొదలెట్టారు. దీంతో చచ్చినట్టు యింకో కథ రాయాల్సిన అనివార్యతలోకి నెట్టబడ్డాడు సుబ్బారావు. కానీ ఎలా? అప్పారావు రూపంలో ఒక బ్రహ్మరాక్షసుడు కాసుకొని కూచున్నాడే. పైగా, లేటెస్టుగా జరిగిన బుక్ ఫెస్టివల్లో వేదగణితం, ఖగోళశాస్త్రం పుస్తకాలు కూడా కొన్నాడాయె కూతురి కోసం. పిల్లని పక్కనెట్టుకోని అప్పారావు రివ్యూ చదివి రికార్డు చేస్తే యింకేమన్నా వుందా? అలాగని అసలుకే అస్త్రసన్యాసం చేస్తే తన పరువేం కానూ?
సుబ్బారావు అదృష్టం అంతా ఖర్చు అయిపోలేదనీ, జస్ట్ విధి అతనితో తాత్కాలికంగా ఫ్లర్టింగ్ చేస్తుందనీ నిరూపించే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. రాయాలా వద్దా, రాస్తే ఏం రాయాలీ అని మల్లగుల్లాలు పడుతున్న సుబ్బారావుకి అశరీరవాణి నుండీ ఒక మెసేజ్ వచ్చింది. నిజానికి ఆ వాణి అశరీరరాణిది కాదు. ఆవిడెవరో అందరికీ తెలుసు. గతంలో అప్పారావు ఒకరి జబ్బని గట్టిగా కొరికాడని చెప్పుకున్నాం కదా. సదరు బాధితుడి సహచరి యీవిడ. ఎప్పటికప్పుడు కొత్త నంబర్లు, కొత్త అకౌంట్ల నుండీ యిలా మెసేజులు పంపడం ఆమెకి రివాజు అనేది బహిరంగ రహస్యం. అయితే, “పిట్ట” అనడానికి “పిట” అనీ, “రెట్ట” అనడానికి “రెట” అనీ రాసే బలహీనత వల్ల తన ఐడెంటిటీని దాచుకోలేక రకరకాల వివాదాల్లో కూరుకుపోతుంటుంది ఆవిడ.
ఇక అసలు విషయానికి వస్తే.. “తనతో విభేదించిన వాళ్లపై భౌతికదాడికి దిగడమే అప్పారావు బలం. అందుకే అందరూ అతన్ని చూసి భయపడుతున్నారు. నువ్వు కూడా భౌతికవాదివే అనే ప్రచారం జరిగిన పక్షంలో నీ కథలకి కూడా పాజిటివ్ స్పందన రాగలదు” ఇదీ సుశరీరవాణి గారు పంపిన సందేశం తాలూకూ సారాంశం. అది చదవగానే నక్కతోకని తొక్కినట్టు ఫీలయ్యాడు సుబ్బారావు.
ఎలాంటి కథ రాయాలీ అనే మీమాంసని పక్కనపెట్టి, ఎవరి జబ్బని కొరకాలీ అని మేథోమధనం మొదలెట్టాడు సుబ్బారావు. ఇక్కడొక సంగతి చెప్పుకొని తీరాలి. తన ప్రాధాన్యతల విషయంలో క్లారిటీ లేక సుబ్బారావు తింగరోడిగా చూడబడుతున్నాడే తప్ప అతను మరీ లోకజ్ఞానం లేనివాడేమీ కాదు. కొన్నికొన్నిసార్లు అతని అబ్జర్వేషన్లు చుట్టుపక్కలవారిని దిగ్భ్రాంతికి లోనుచేసిన సందర్భాలు లేకపోలేదు. అసలు ఎవరెవరిదో కొరకడం దేనికి? అదేదో డైరెక్టుగా అప్పారావు జబ్బనే కొరికితే?!
ఈ ఆలోచన రాంగానే సుబ్బారావుకి కాలు నిలవలేదు. కట్ చేస్తే నాలుగ్గంటల్లో అప్పారావు ఇంటిముందు తేలాడు సుబ్బారావు. అతన్ని చూసి అప్పారావు ఆశ్చర్యపోయాడు. అతని కుడిచంక అదరడం మొదలెట్టింది. మామూలుగా అయితే అదరాల్సింది కన్నే అనుకోండీ. కానీ, జబ్బల ప్రాధాన్యత తెలిసున్నవాడిగా అదరాల్సిన అదనపు బాధ్యతని కంటికి కాకుండా చంకకి ఏనాడో అప్పగించాడు అప్పారావు. అదేంటీ, అంత కృతజ్ఞత వున్నవాడు జబ్బనే అదిరేలా చేయొచ్చుగా అని సహృదయులైన పాఠకోత్తములు ప్రశ్నించవచ్చు. కానీ, మనిషికి వున్న బయలాజికల్ లిమిటేషన్స్ కారణంగా అది జరిగే పని కాదని మనం గ్రహించాలి. అందుకే, జబ్బకి క్లోజెస్ట్ పాజిబుల్ డిస్టెన్స్ లో వున్న వేరే భాగాన్ని అతను వినియోగించాల్సి వచ్చింది.
మామూలుగా అయితే సుబ్బారావుకి అప్పారావంటే కోపం వుండాలి. తన కథలకి దక్కాల్సిన క్రెడిట్ దక్కకుండా చేశాడు కాబట్టీ. కోపంగా వున్నవాడు ఎలా చూడాలి? కోపంగానే కదా! కానీ, సుబ్బారావు తనవైపు కొంటెగా చూడడం అప్పారావుని ఆందోళనకి లోనుచేసింది. ఒకరకంగా చూడాల్సిన మనిషి యింకోరకంగా చూడడం అంత హర్షించదగినది కాదని అప్పారావుకి తెలుసు. పైగా ఆ చూపు అప్పారావుకి మరీ కొత్తదేమీ కాదు. గతంలో తాను నిర్వహించిన “ఆపరేషన్ జబ్బ బైటింగ్” కి ముందు అప్పారావు కూడా తన ప్రత్యర్థిని సరిగ్గా యిలాగే కొంటెగా చూశాడు. గత జ్ఞాపకాలు ముప్పిరిగొన్న మీదట.. పిక్కబలం చూపి, వీలైనంత వేగంగా పరిగెత్తడమే తన తక్షణ కర్తవ్యమని అప్పారావుకి బోధపడింది. కానీ, “ఆకలితో వున్న ఒక రచయిత పాతికమంది బ్రూస్లీల కన్నా ప్రమాదకరం” అన్నది ఆర్యోక్తి కదా! సుబ్బారావు పరధ్యానంగా వుండి అప్పారావు పారిపోవడానికి అవకాశం యిస్తే అది ఆర్యులని అవమానించడమే. ఆర్యులని అవమానించే వుద్దేశం సుబ్బారావుకి ఎంతమాత్రమూ లేదు. పైగా తన అభిమాన హీరో కూతురు ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నప్పటి నుండీ సుబ్బారావుకి ఆర్యులపట్ల గౌరవం ద్విగుణీకృతం అయింది కూడానూ. అందుకే, అప్పారావు చేతిని పట్టుకొని జబ్బమీద గట్టిగా కొరికాడు.
అప్పారావు జబ్బని సుబ్బారావు కొరికాడన్న వార్త ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దావానలంలా వ్యాపించింది. సాహితీప్రియులందరికీ సుబ్బారావు పట్ల వున్నట్టుండి గౌరవం పెరిగిపోయింది. అందరూ అతని పాతకథల్ని తిరగదోడి కొత్తగా తమ అభిప్రాయాలు చెప్పడం మొదలెట్టారు. “సుబ్బారావు ఒక దార్శనికుడనీ, వైతాళికుడనీ.. అతను తన సమకాలీనుల కన్నా ముందు వుండడం మూలంగానే తగిన గుర్తింపుకి నోచుకోలేకపోయాడనీ” అనడం మొదలెట్టారు. సుబ్బారావు రాయబోయే తదుపరి కథ ‘మాకు కావాలంటే మాకు కావాలని’ వెబ్ మాగజీన్ల యజమానులందరూ కొట్టుకోసాగారు. వెబ్ మాగజీన్లలో పడే కథలకి మామూలుగా అయితే పారితోషికాలు వుండవు. కానీ, సుబ్బారావు రాయబోయే కథ చరిత్రని తిరగరాసింది. ‘వెబ్ మాగజీన్ ఓనర్స్ అసోసియేషన్’ అత్యవసర సమావేశంలో సుబ్బారావు కథ సొంతం చేసుకోడానికి ఒక వేలంపాట కూడా నిర్వహించారు. మూడు రూపాయల నలభై పైసల దగ్గర మొదలైన పాట ఆరు రూపాయల డెబ్భైపైసల దగ్గర ఆగింది. ఈ వార్త బయటకి పొక్కడంతో నిభిలప్రపంచం నివ్వెరపోయింది. వెబ్, ప్రింట్ అనే కాటగిరీలతో సంబంధం లేకుండా ఒక రచయిత అంత రెమ్యూనరేషన్ తీసుకోవడం గత ముప్పై సంవత్సరాల్లో యిదే మొదటిసారి.
తాను రాయబోయే కథకి “అబ్బ దబ్బ జబ్బ” అనే పేరు పెడుతున్నట్టు ప్రకటించాడు సుబ్బారావు. ఆ టైటిల్ సృష్టించిన సంచలనం అంతాయింతా కాదు. అసలు ఆ కథలో యితివృత్తం ఏంటీ అన్నది తెలీకుండానే అదొక గొప్ప కథ అని అందరూ కీర్తించడం మొదలెట్టారు. పులిట్జర్‌కి పోటీగా స్థాపించబడిన తోడేలుట్జర్ అనే పాకిస్తానీ సాహితీ సంస్థ సుబ్బారావుకి ‘ఆఫ్ఘన్ పద్మ’ అనే అవార్డు యిస్తున్నట్లు ప్రకటించింది. దానికి కొనసాగింపుగా ‘కొరియన్ మరకత’, ‘జపాన్ మాణిక్య’, ‘రష్యన్ రత్న’, ‘ఉక్రెయిన్ వైఢూర్య’ అవార్డులు కూడా సుబ్బారావుని వరించాయి. అంతర్జాతీయంగా వస్తున్న వొత్తిడి తట్టుకోలేక భారత ప్రభుత్వం కూడా సుబ్బారావుని “కలువ విదూషణ్” తో సత్కరిస్తున్నట్లు ప్రకటించింది. చే గెవారాని వదిలేసి యూత్ అంతా సుబ్బారావుని ఐకాన్‌గా చూడడం మొదలెట్టారు. నాన్-యూత్ సెక్షన్స్ లో పురుషులంతా కూడా మూకుమ్మడిగా సుబ్బారావు గొప్పదనాన్ని అంగీకరించారు. ఎటు తిరిగీ మహిళాసంఘాల నుండీ మాత్రం మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చింది.
“జబ్బని లక్ష్యంగా చేసుకోవాలనుకునే సుబ్బారావు ఐడియాలజీ మహిళలపై ఎలాంటి ప్రభావం కలిగిస్తుందీ” అనే ఎజెండాతో పెద్దచర్చ కూడా నడిచింది. సుబ్బారావుకి అయాచితంగా గౌరవం వచ్చిపడడం పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ ధోరణిని ప్రోత్సహిస్తూ పోతే అది జబ్బతో ఆగేది కాదనీ, వేరే వేరే అవయవాలకి కూడా పాకే అవకాశం వుందనీ, కొంతకాలం పాటు కొన్ని అవయవాలు లేకుండా పోతే (అది కొరకడం వల్ల అయినా సరే) జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం కొన్నాళ్ల తర్వాత అసలు మనుషులు ఆ అవయవమే లేకుండా పుట్టే ప్రమాదం వుందని” ఒక ఆంత్రొపాటజిస్టు కమ్ రచయిత్రి కమ్ యాంటీ సోషల్ వర్కర్ వొకావిడ గట్టిగా వాదించింది.
ఆవిడ వాదన హేతుబద్ధంగా వుందా లేదా అన్నది పక్కనపెట్టి.. “ఏయే అవయవాలు కొరకడానికి అనుకూలంగా వుంటాయి” అనే విషయంలో అందరూ కామెడీ చేయడం మొదలెట్టేసరికి ఆవిడ ఫీలయ్యి వాకౌట్ చేసింది. “దీనిని రెండు భావజాలాల మధ్య సంఘర్షణగా చూడకూడదనీ, జబ్బల పరిరక్షణ అనే సర్వైవల్ ఇష్యూ గా చూడాలనీ” ఒక యువ సైకాలజిస్టు ఆర్గ్యూ చేసింది. ఆవిడ చెప్పిన థియరీ ఎవరికీ అర్థం కాలేదులే కానీ, కంక్లూజన్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. “సుబ్బారావు వల్ల జబ్బలకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే స్లీవ్ లెస్ జాకెట్లు వేసుకోవడం కుదరదనీ, కోవిడ్ వేక్సీన్ నలభైమూడో డోసు పొడిపించుడం యిబ్బంది కావొచ్చుననీ, టాటూలు వేయించుకోడానికి ఒక ప్లేసు తగ్గిపోతుందనీ” ఆమె యిచ్చిన కంక్లూజన్ సారాంశం. దీనితో మహిళాసంఘాల నుండీ కూడా అభ్యంతరాలు రావడం ఆగిపోయింది.
ఏం కథ రాయాలో ఆలోచించుకోకుండానే “అబ్బ దబ్బ జబ్బ” అనే టైటిల్ కి ఫిక్స్ అయిపోయిన సుబ్బారావు తన స్వీయానుభవాల్నే మెయిన్ ప్లాట్ గా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. అది ఆసక్తికరంగా వుంటుందా లేదా, తన రచనని ఎవరైనా తక్కువచేసి మాట్లాడతారా అనే భయం అతనిలో లేదిప్పుడు. గతంలో మాదిరిగా టెన్షన్ పడుతూ కాకుండా.. కుడిచేత్తో కాసేపూ, ఎడంచేత్తో కాసేపూ టైప్ చేస్తూ, ఆల్రెడీ రాసిన పేరాలని కూడా కళ్లు మూసుకొని పైకీ కిందకీ జరుపుతూ ఎడిట్ చేసే ఆట ఆడుకుంటూ రచనవ్యాసంగాన్ని ఆస్వాదించసాగాడు. ఈ కొత్తజీవితం అతనికి చాలా హాయిగా వుంది. ఇలాంటి హాయి తన అనుభవంలోకి రావడానికి మూలం అయిన అప్పారావు పట్ల అతని మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. కృతజ్ఞత అంటే గుర్తొచ్చింది. ఇదే సమయానికి అప్పారావు ఏం చేస్తున్నాడో తెలుసా? తన చంక వంక కృతజ్ఞతా భావంతో చూస్తున్నాడు. నిజానికి ఆరోజు అతని చంక అదరకపోయి వుంటే, క్షణంలో వెయ్యోవంతు పాటైనా అప్పారావు వెనకడుగు వేయకపోయుంటే సుబ్బారావు తనని యింకా బలంగా కొరికివుండేవాడు.
కృతజ్ఞతని కేవలం చూపులకి పరిమితం చేయడం యిష్టం లేని అప్పారావు ఒక కవిత రాశాడు కూడానూ.“ఓ నా చంకా.. నా దేహపు ఆకాశంలో నువ్వే నెలవంక.. నీకోసం కొంటానొక పంఖా.. ‘శ్రీ’ తో మొదలయ్యి, ‘క’ తో ముగిసే దేశం పేరు శ్రీలంక..” కవిత రాయడం పూర్తయ్యాక ఆప్యాయంగా దానిని ఒకసారి స్పృశించాడు అప్పారావు. దానిని అంటే కవితనో కాగితాన్నో కాదు. అప్పారావు రాసిన కవితకి ఆ ఏడాది “జ్ఞానస్టూలు” అవార్డొచ్చింది. తనకున్న పలుకుబడి వుపయోగించి సుబ్బారావే అప్పారావుకి ఆ అవార్డు యిప్పించాడని కొందరు చెవులు కొరుక్కున్నారులే కానీ, అందులో నిజం వుందని రూఢిగా తెలిసినవాళ్లెవరూ లేరు. ఉన్నా వాళ్లు పెదవి విప్పలేదు. ఎందుకంటే ‘పెదవి జారితే జబ్బకి చేటు.. ఎండలో ఆరితే కంపుకొట్టదు బూటు’ అన్న కవిత కూడా వాళ్లు గతంలో ఎప్పుడో చదివేశారు.(కథంతా చదివాక “ఇది పాతదేగా” అని పోట్లాటకి రావొద్దు. మొదటి పేరా చదివాక అర్థం కాలేదంటే అప్పుడు శ్రద్ధగా చదవలేదనేగా…)
Share this Article