ఇటు పంజాబ్… అటు యూపీ… రెండింటి నడుమ ఓ బంధం ఇప్పుడు ఓ చిత్రమైన వార్తాకథనాన్ని ఆవిష్కరిస్తోంది… అంతేనా..? ప్రియాంక గాంధీ ధోరణి మీద, కాంగ్రెస్ టికెట్ల పంపిణీ తీరు మీద దుమారం రేపుతోంది… కాస్త వివరంగా చెప్పుకుందాం… అంగద్ సింగ్ అని ఒక ఎమ్మెల్యే, పంజాబ్‌లోని నవన్‌షార్ నుంచి కాంగ్రెస్ టికెట్టు మీద గెలిచాడు… 26 ఏళ్లకే ఎమ్మెల్యే అయిపోయాడు… నిజానికి ఆ నియోజకవర్గంలో ఎన్నాళ్ల నుంచో ఆ కుటుంబసభ్యులే గెలుస్తున్నారు… అదంతా వేరే కథ… ఇప్పుడు తన వయస్సు 31 ఏళ్లు…
అదితి సింగ్ అని మరో ఎమ్మెల్యే… ఈమె యూపీలోని రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ టికెట్టు మీదే గెలిచింది… వయస్సు 34 ఏళ్లు… అమెరికాలో ఎంబీఏ చేసింది… బాగా యాక్టివ్… ఈ నియోజకవర్గంలో కూడా ఆమె కుటుంబసభ్యులదే చాలా ఏళ్లుగా గెలుపు… ఆ అంగద్ సింగ్‌కూ ఈ అదితి సింగ్‌కూ 2019లో పెళ్లయింది… వాళ్ల సంసారం తిప్పలేవో వాళ్లు పడుతున్నారు పాపం, కాంగ్రెస్ పెట్టే తిప్పలు వాటికి అదనం…
అదితి సింగ్‌కు బీజేపీతో సంబంధాలున్నాయని ప్రియాంక గాంధీకి పెద్ద డౌటు… పదే పదే ఈ వేధింపులు ఏమిటని విసిగిపోయిన ఆమె నిజంగానే మొన్నటి నవంబరులో బీజేపీలో చేరిపోయింది… ఇప్పుడు ఆమె బీజేపీ టికెట్టు మీద అక్కడి నుంచే పోటీచేస్తోంది… అంతేకాదు, ఎప్పుడూ చెబుతుంటవ్ కదా, కమాన్, రాయ్‌బరేలీ నుంచి పోటీచేయి, చూసుకుందాం అని ప్రియాంక గాంధీకి సవాల్ విసురుతోంది…
Ads
ఫాఫం, అసలు కథ ఇది కాదు… ఈ ప్రభావం అక్కడ పంజాబ్‌లో మొగుడి మీద పడింది… నీ పెళ్లాం బీజేపీలో చేరింది అనే సాకుతో తరచూ పంజాబ్ కాంగ్రెస్ నుంచి తిరస్కారాలు, వేధింపులు స్టార్టయినయ్… అరె, ఆమె రాజకీయం వేరు, నాది వేరు, నాతో మీకొచ్చిన ప్రాబ్లం ఏమిటి అనడిగినా ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు… పైగా ఈసారి టికెట్ కూడా కట్ చేసింది పార్టీ… దాంతో ఇండిపెండెంటుగా నామినేషన్ వేశాడు…
‘‘మా పెళ్లే చిక్కుల్లో ఉంది… 15 నెలలుగా దూరదూరంగానే ఉంటున్నాం… ఇక ఆ పెళ్లాన్ని చూపించి, నా టికెట్టుకు కత్తెర వేయడం ఏమిటో, అసలు పార్టీకి ఇప్పుడు ఏమైనా దశ, దిశ ఉందా..?’’ అని అంగదుడు కస్సుమంటున్నాడు… ఆమెను పెళ్లిచేసుకున్నందుకు నన్ను ఓ నేరస్థుడిలా చూస్తున్నారు అనేది తన ఆరోపణ…
మరోవైపు అదితి కూడా సేమ్ ఆరోపిస్తోంది… తండ్రి లేని బిడ్డనని కూడా చూడకుండా ప్రియాంక నన్ను సఫర్ చేస్తోంది… పార్టీలో ఉండనివ్వలేదు అనేది ఆమె ఆరోపణ… సో, ఇదండీ ఇద్దరు వేర్వేరు రాష్ట్రాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేల జంట చిత్రమైన కథ… అవునూ, ఒక్క ఇంటి మీద రెండు పార్టీల జెండాలు ఉండకూడదా అధ్యక్షా..? మొగుడు ఏ పార్టీలో ఉంటే పెళ్లాం కూడా అదే పార్టీలో ఉండాలా..?! ష్, ఓ సంగతి గుర్తుందా..? అప్పట్లో అదితితో ఏకంగా రాహుల్ గాంధీకి లింకులు పెట్టి వార్తలొచ్చేవి… ఆమెను పెళ్లి చేసుకుంటాడు అని కూడా రాసేవాళ్లు… తూచ్…!!
Share this Article