హైదరాబాద్ లో నేనొక న్యూస్ ఛానెల్ హెడ్ గా పనిచేస్తున్న రోజుల్లో మా అనంతపురం జిల్లా నుండి ఒక యాడ్ ఏజెన్సీ మిత్రుడు వచ్చాడు. అనంతపురం నుండి హిందూపురం వెళ్లేదారిలో కొత్తగా పుట్టుకొచ్చి…ఒక వెలుగు వెలుగుతున్న యువ బాబాగారు భారీ ఎత్తున ప్రకటనలివ్వడానికి సిద్ధంగా ఉన్నారని…నేనొకసారి వారిని దర్శించుకుంటే ఛానెల్ కు యాడ్స్ కట్టలు తెగినట్లు ప్రవహిస్తాయని చెప్పాడు. యాజమాన్యానికి విషయం చెబితే ఎగిరి గంతేసి…వెంటనే నన్ను బయలుదేరమన్నారు.
నాతోపాటు యాడ్ ఏజెన్సీ మిత్రుడు కూడా వచ్చాడు. పక్కనే హిందూపురంలో చాలా ఏళ్లు జర్నలిస్ట్ గా పనిచేశాను కాబట్టి ఆ నవ యువ బాబా లీలలు ఎన్నెన్నో విని ఉన్నాను. ఒక పెద్ద ప్రార్థనా మందిరంలో నన్ను ఒంటరిగా కూర్చోబెట్టారు. పది నిముషాలు…అరగంట…గంట… రెండు గంటల నిరీక్షణ తరువాత బాబాగారు వస్తున్న హడావుడి మొదలయ్యింది. ఎవరైనా వస్తే రెండు మూడు గంటలు వెయిట్ చేయించి తరువాత కలిస్తేనే విలువ పెరుగుతుందని బాబాకు ఆశ్రమ నిర్వాహకులు చెప్పడం వల్ల అలా చేస్తారు కానీ…నిజానికి ఆయనకేమీ పని ఉండదని అక్కడ నాకు తెలిసిన ఒక ఉద్యోగి చెప్పిన విషయం ఇక్కడ అనవసరం.
పల్లెల్లో పొలం పనులకు వెళ్లే వ్యవసాయ కూలీలా(దయచేసి రైతు కూలీ ఆహార్యాన్ని తక్కువచేసినట్లు భావించకండి) లుంగీ, చొక్కా, భుజం మీద ఒక తుండుగుడ్డతో చూడగానే ఇతను బాబా ఏమిటి? అనిపించాడు. యువకుడు. నాలుగు ప్లాస్టిక్ కుర్చీలున్నాయక్కడ. ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా నేనొక కుర్చీలో కూర్చోబోతే ఎవరో టక్కున వచ్చి నా కుర్చీ లాగేశారు. ఎందుకు అని అయోమయంగా చూశాను. బాబాగారి ముందు నేను కుర్చీలో కూర్చోకూడదన్న విషయం అప్పుడు వెలిగింది నాకు. కింద కటిక నేలమీద కూర్చున్నాను. కాళ్లు పైకి మడతపెట్టి కుర్చీలో కూర్చున్న బాబాగారు ఏమిటి నా సమస్య అని అడిగాడు. కొంపదీసి నన్ను భక్తుడిగా అనుకుంటున్నాడేమో అనుకుని…నేరుగా ప్రకటనల విషయంలోకి దిగాను. ఏదీ నేరుగా చెప్పకూడదని ఆయనకు ఇచ్చిన శిక్షణలో భాగమన్న విషయం కూడా ఇక్కడ అనవసరం.
Ads
రాయలసీమ యాసలో నాకు జర్నలిజం జ్ఞానబోధ మొదలుపెట్టాడు. మీ ఛానెల్ నడపడానికి ఒక సంవత్సరానికి సరిపడా యాడ్స్ ఇస్తానన్నాడు. మనమే ఒక ఛానెల్ పెడదామన్నాడు. ఒక పేపర్ కూడా పెడదామన్నాడు. నన్నే ఎడిటర్ గా ఉండమన్నాడు. నా హౌసింగ్ లోన్, వెహికిల్ లోన్ గురించి చెప్పాను. అమిర్ పేట్ లో ఒక త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఒక టాటా సుమో కొనిస్తానన్నాడు.
కడప రేడియోలో పిట్టలదొరల కట్టుకథలు ఎన్నో అప్పటికే విని ఉన్నాను. ప్రత్యేకించి ప్రఖ్యాత జానపద కళాకారుడు అమళ్లదిన్నె గోపినాథ్ రాయలసీమ మాండలికంలో చెప్పే కట్టుకథలంటే నాకు చాలా ఇష్టం. ఆయన మా నాన్న అష్టావధానాల్లో అప్రస్తుత ప్రసంగిగా నాకు బాగా పరిచయం. “సొగిలిగాడు” అని ఆయనొక పాత్రను సృష్టించారు. గాలిమేడలు కట్టే ఒట్టి వదరుబోతు పాత్ర అది. ఏ పనీ జరగదు. కానీ రంగుల కలలు ఆగవు. ఆ చెప్పడంలో గొప్ప అందముంటుంది. చివర ఒరేయ్ సొగిలిగా! ఇగో ఈ గంజి మిగిలింది తాగు! అని విన్నవారు సొగిలిగాడికి గంజి పోయడంతో కట్టుకథాగానం అయిపోతుంది. రేపు ఇంకో కట్టు కథ.
సార్! మీ సొగిలిగాడు నా వెంటపడుతున్నాడు. భలే చెప్తారు సార్! అని గోపినాథ్ గారికి చాలాసార్లు చెప్పాను. రోజూ చూసిన మనుషుల్లో సొగిలిగాళ్లను అందరినీ కలిపి ఆ పాత్ర సృష్టించాను- అని వివరణ ఇచ్చేవారు.
అమళ్లదిన్నె గోపినాథ్ సొగిలిగాడు ఈ నవ యువ బాబా కాలి గోటికి కూడా సమానం కాడు. అదొక కళ. అందరికీ సాధ్యం కాదు.
నాకు అమిర్ పేట్ లో త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదు. టాటా సుమో రాలేదు. ఆయన ఛానెల్ కు, పేపర్ కు నేను ఎడిటర్ కాలేదు. ఒకానొక చెప్పుకోలేని వ్యాధితో( నాకు తెలుసు- సభా మర్యాద దృష్ట్యా చెప్పను) నడివయసులోనే బాబా ఈ లోకాన్ని వీడి శాశ్వతంగా వెళ్లిపోయాడు. బాబాగారి అంగరంగ వైభోగమైన పెళ్లి…సంసారం…ఇతరేతర వ్యవహారాలన్నీ ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు. నాకు జర్నలిస్టుగా ఇంకా ఎక్కువ తెలుసు.
విదేశాలనుండి తెల్లతోలు భక్తులు అక్కడ ఆశ్రమంలో ఉండగా ఈ బాబా ఏమి చెప్పేవాడు? వారికి ఏమి అర్థమయ్యేది? వారెందుకు కట్టలు కట్టలుగా నోట్ల కట్టల విరాళాలు కుమ్మరించి వెళ్లేవారు? అన్నది ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. సిగ్గులేకుండా ఆ ప్రశ్న అడిగాను. దానికి పరిపక్వత, యోగం ఉండాలని సెలవిచ్చాడు.
ఆయన పోయాక ఆ ఆశ్రమం బూజుపట్టి…కాలగర్భంలో కలిసిపోయిందనుకోండి. అది వేరే విషయం.
ప్లాస్టిక్ కుర్చీ దిగి ఆయన నడిచి వెళితే…మెట్లు దాటాక మట్టి బాటలో ఆయన పాద ధూళిని యాడ్ ఏజెన్సీ మిత్రుడు నుదుటికి రాసుకున్నాడు తన్మయత్వంతో. రెండు గంటలకు పైగా బాబాగారితో ఏకాంతంగా గడిపిన నా అదృష్టానికి అతను అసూయపడుతున్నట్లు పైకి చెప్పేశాడు.
నాకేమో పితృసమానుడైన అమళ్లదిన్నె గోపినాథ్ గారి పాదధూళిని వెంటనే నెత్తిన చల్లుకుంటే బాగుండేదనిపించింది.
కొస మెరుపు:- తరువాత యాడ్ ఏజెన్సీ మిత్రుడు ఒక ప్రతిపాదన తెచ్చాడు. నవ యువ బాబాతో వారం వారం ఛానెల్లో ఒక ప్రత్యేక కార్యక్రమం మొదలుపెడితే నెలకు యాభై లక్షల రూపాయల యాడ్స్ కాకుండా కోటి రూపాయల యాడ్స్ లాగచ్చు- అని.
అటు తరువాత ఉలుకూ లేదు- పలుకూ లేదు. యాడ్స్ లేవు. టాటా సుమోల్లేవు. ఆరు నెలల తరువాత అనంతపురంలో మరో యాడ్ ఏజెన్సీ మిత్రుడు చెప్పిన విషయం ఏమిటంటే- ఆ బాబాకు ప్రచారం పనుల కాంట్రాక్ట్ ఈ యాడ్ ఏజెన్సీ తీసుకుంది. యాడ్స్ అనో ఇల్లు- కార్ అనో ఆయనతో చెప్పించి ఆయనకు రకరకాలుగా ఉచితంగా పబ్లిసిటీ వచ్చేలా ఇతను పని చేస్తుంటాడు. ఆ పనులు చేసినందుకు ప్రతి నెలా డబ్బు తీసుకుంటాడు. విషయం తెలిసినా ఎప్పటికప్పుడు గాలానికి దొరికి విలవిలలాడే కొత్త కొత్త చేపలు లెక్కలేనన్ని.
అనంతపురంలో ప్రఖ్యాత జర్నలిస్ట్ యధాటి కాశీపతికి నవ యువ బాబాను కలిసిన సంగతి చెప్పాను. ఆయన నాస్తికుడు. అయినా “ఏ జన్మలోనో నువ్ చేసుకున్న పాపం నిన్నిలా వెంటాడిందప్పా. మీ ఇద్దరి జ్ఞానం అజ్ఞానంగా పెనవేసుకున్న ఆ అసందర్భ సందర్భం సంగతులు నాకెందుకులే!” అని ముసి ముసిగా నవ్వుతూ… స్టయిల్ గా సిగరెట్ పొగ వదులుతూ అన్నారు!
యాడ్ ఏజెన్సీ మిత్రుడు కాలప్రవాహంలో పోగేసుకున్న అంతులేని సంపదతో మైనింగ్ బిజినెస్ లోకి కూడా ప్రవేశించినంతవరకు నాకు తెలుసు. బాబా పాద ధూళి మహిమతో గాలిలోనే మేడలు నిర్మించగలిగినవాడు…నిజమైన మైనింగ్ ధూళిని గంట గంటకు నుదుటిన దాలుస్తూ వజ్రాలు తవ్వుకుంటూ పిల్లా పాపలతో చల్లగానే ఉండి ఉంటాడు!
(ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో ఒకానొక బాబా పాద ధూళికోసం ఎగబడి ప్రాణాలు కోల్పోయినవారి స్మృతికి నివాళిగా) – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article