.
పేరు శివప్రసాద్ అలియాస్ మంత్రి శంకర్… రాష్ట్రం కర్నాటక… వృత్తి దొంగతనాలు… కాలంతోపాటు సైబర్ క్రైమ్స్, ఇతరత్రా దొంగతనాలు, నేరాలు గాకుండా పద్ధతిగా సంప్రదాయికమైన రీతుల్లోనే దొంగతునాలు చేస్తుంటాడు…
అతని మీద పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులే 260… ఎప్పుడూ పోలీసులకు దొరకలేదు… దొరక్కపోవడానికి తాను చేసిన పుణ్యాలు, ఇచ్చిన విరాళాలే కారణమని అనుకున్నాడు… కానీ ఈ నయా రాబిన్‌హుడ్ ఎట్టకేలకు మొన్న పోలీసులకు దొరికిపోయాడు…
Ads
తనకు వేరే గ్యాంగు లేదు, ఒక్కడే… ప్రొఫెషనల్… తన వేళ్ల ముద్రలు కూడా పోలీసులకు దొరక్కుండా గ్లవ్స్ తొడుక్కోవడం లేదా వేళ్లకు ఫెవికాల్ వంటి గ్లూ వాడటం అలవాటు… అంటే ఈ 260 కు మించి దొంగతనాలు తన ఖాతాలో ఉండి ఉంటాయి…
ఎటొచ్చీ చిన్నాచితకా పోలీసులకు ఫిర్యాదులు అంది ఉండకపోవచ్చు… ఐతే ఇతను దోచుకున్నదంతా విలాసాలకో లావిష్ జీవితానికో అస్సలు ఖర్చు పెట్టడు… ఎక్కువ శాతం గుళ్లకు ఇచ్చేస్తుంటాడు… ఫుడ్ డొనేషన్స్ అధికం…
కర్నాటకలో దాదాపు ప్రతి గుళ్లో మధ్యాహ్నం, రాత్రి ప్రసాద వితరణ ఉంటుంది… అంటే భోజనాలే… అదుగో వాటికి డొనేషన్స్ ఇస్తుంటాడు విరివిగా… ప్రత్యేక ఉత్సవ సందర్భాల్లో మొత్తం ప్రసాద వితరణ ఖర్చునూ భరిస్తుంటాడు… పేదలకు తనెవరో తెలియకుండా ఇచ్చేస్తుంటాడు… హాస్పిటల్స్‌లో పేద రోగులకు కూడా…
అసలు తాను చేస్తున్నవి నేరాలు కావు, తన ఆధ్యాత్మిక యాత్రలో చిన్న చిన్న తప్పుటగులు అనుకుంటాడుట… ఐతే గుల్బర్గా పోలీస్ కమిషనర్ ఏమంటాడంటే..? ‘‘తను ప్రొపెషనల్ దొంగ… తను చేసిన తప్పులకు ఈ పుణ్యాలు, విరాళాలు విరుగుడు అనుకుంటాడు…’’
రాబిన్‌హుడ్ కథల్లో దోపిడీ, దొంగతనాలు… పేదలకు పంపిణీ ఉంటాయి… కానీ ఈ దొంగ పంపిణీ కథలకు భజనలు, ప్రసాదాలు, గుడిగంటల ధ్వనులు అదనం… ఐతే ఇక్కడ సదరు పోలీస్ కమిషనర్ క్లారిటీ ఇవ్వనిది ఒకటుంది… తన దగ్గర దాదాపు 30 లక్షల రూపాయల విలువ చేసే 41 తులాల బంగారం రికవరీ చేశామనీ, అందులో అధికశాతం ఆల్రెడీ గుళ్లకు ఇచ్చిందే అంటాడు…
ఎలా..? గుళ్ల నుంచి రికవరీ చేస్తారా..? తనెలాగూ తన పేరుతో విరాళాలు ఇవ్వడు, మరి తను ఫలానా గుడికి ఫలానా పరిమాణంలో బంగారం ఇచ్చాను అనగానే ఆ గుడి నుంచి రికవరీ చేస్తారా..? అది సాధ్యమేనా..? ఆలయ అధికారులు అలా ఒకసారి దేవుడికి విరాళంగా వచ్చిన సొమ్మును గానీ, బంగారాన్ని గానీ పోలీసులకు ఇవ్వగలరా..? ఏమో..!!
Share this Article