మిత్రులు Prabhakar Jaini ఫేస్‌బుక్ వాల్ మీద కనిపించింది… తరువాత చాలామంది పోస్టుల్లో కనిపించింది… షేర్లు, లైకులు, కామెంట్లు, అభినందనలు… అనేకమందిలో ఆశ్చర్యం… వాట్సప్ గ్రూపుల్లో షేరింగులు… మొత్తానికి ఓ చిన్న వీడియో బిట్ బాగా వైరల్ అయిపోయింది… ఏముంది అందులో..? నిజానికి ఏమీ ఉన్నట్టుగా అనిపించదు… కానీ ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే మటుకు నిజంగా ఆశ్చర్యమే అనిపిస్తుంది…
ప్రజెంట్ జనరేషన్… ఓ ఫోకస్ ఉండదు, టార్గెట్ ఏమిటో తెలియదు… ఎలా దాన్ని రీచ్ కావాలో పట్టింపు ఉండదు, ప్రయత్నం ఉండదు… పనికిమాలిన టీవీ షోలు, అభిమానసంఘాలు, సోషల్ మీడియాలో చెత్తా వాగ్వివాదాలు లేదంటే పబ్బులు, క్లబ్బులు, బార్లు, సిట్టింగులు, పేకాటలు… అబ్బే, ఇప్పటి యువతరం బొత్తిగా చెడిపోయిందండీ… ఇలాంటి కామెంట్లు చాలా వినీ వినీ విసిగిపోయాం కదా…
కానీ ఇలాంటి బ్యాచులు ఎప్పుడూ ఉన్నయ్… గతంలో ఉన్నయ్, వర్తమానంలోనూ ఉన్నయ్… అదే సమయంలో పట్టుదలకు మారుపేరుగా, ఓ స్థిరమైన సంకల్పంతో మనసును, దేహాన్ని, సమయాన్ని, ప్రయత్నాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసి, పరుగులు తీసే వాళ్లూ ఉన్నారు… గెలుపో ఓటమో జానేదేవ్… కానీ లైఫ్ పట్ల ఓ క్లారిటీ ఉండి, టార్గెట్ పట్ల ఫోకస్ ఉండి, ఆ ప్రయత్నాల్లో పూర్ణాంకితుడై ఉండటం అరుదు… ఈ ప్రదీప్ వంటి వాళ్లు మరీ అరుదు…
Ads
19 ఏళ్ల వయస్సు తనది… మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేసి, ఇంటికి చేరడానికి రాత్రిపూట పది కిలోమీటర్లు పరుగు తీస్తాడు… అదేమిటి అనడిగితే… ‘‘ఆర్మీలో జాయిన్ కావడానికి’’ అని బదులిస్తాడు… ఓహ్, మనం ఆశ్చర్యపోయి, కారులో డ్రాప్ చేస్తాను రండి అని అడిగితే నవ్వుతూ ‘‘నేను చేసేది జాగింగ్’’ అని పరుగు వేగం పెంచేస్తాడు…
మనం ఇంకాస్త ఆశ్చర్యంగా చూస్తే… ‘‘నాకు ఎక్సర్‌సైజ్ చేయడానికి టైం దొరకదు… ఉదయమే మళ్లీ మెక్‌డొనాల్డ్స్ వెళ్లాలి, వంట చేయాలి’’ అని సమాధానం… సరే, ఓసారి డిన్నర్‌కు కలుద్దాం అని ఆఫర్ ఇస్తే… ‘‘సారీ, నాకు కుదరదు, అమ్మ హాస్పిటల్‌లో ఉంది… సో, రాత్రి డ్యూటీకి వెళ్లిన అన్నయ్యకు, నాకు వంట చేసుకోవాలి… అసలు అది కాదు ఇష్యూ, ఒక్కరోజు కారులో డ్రాప్ చేయడానికి గనుక నా శరీరం అలవాటు పడితే నా రొటీన్ దెబ్బతింటుంది, లైన్ తప్పకూడదు కదా… నా టార్గెట్ వేరు కదా…’’ అన్నాడు…
ఏమిటి నీ టార్గెట్..?
‘‘ఆర్మీలో చేరాలి… అందుకే ఈ పరుగు, ఈ జాగింగ్’’
‘‘నీ వీడియో వైరల్ అయిపోతే..?’’
‘‘కానివ్వండి, నేనేమీ తప్పు పనిచేయడం లేదు కదా…’’
……. అలా నవ్వుతూ, పరుగు తీస్తూ, ముందుకు ముందుకు సాగిపోయాడు… కారును దాటేసి, తన ఆశల తీరాల వైపు… లక్ష్యసాధకుడు తను… ముందుగానే మనం చెప్పుకున్నట్టు… విజయమో, పరాజయమో వదిలేసేయండి… మన ప్రయత్నంలో ఏమేరకు కమిట్‌మెంట్, ఎఫర్ట్ ఉన్నదనేదే ముఖ్యం… అలాంటి యువతీయువకులే దేశానికి ప్రాణాధారం…
Share this Article