War Without Win: ఇవి తుపాకులు పట్టుకుని ఎదురెదురుగా తలపడే ప్రత్యక్ష యుద్ధాల రోజులు కావని;
బాంబులు వర్షిస్తూ శత్రు దేశాలు సరిహద్దులు దాటి పరస్పరం బూడిద చేసుకోవడానికి రగిలిపోయే రోజులు కావని;
ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారో తెలియని యుద్ధోన్మాదానికి కాలం చెల్లిందని అనుకునేవారికి రష్యా-ఉక్రెయిన్ కొత్త పాఠాలు చెబుతోంది. నిరాశ మిగులుస్తోంది. భవిష్యత్తు మీద భరోసాను ఛిద్రం చేస్తోంది. సంవత్సరం గడిచినా ఆగని యుద్ధంలో గెలిచేదెవరో, ఓడేదెవరో తెలియక ప్రపంచం మళ్లీ రెండుగా చీలిపోవాల్సిన విషాదం కనపడుతోంది.
అమెరికా అధ్యక్షుడు ఆకాశ, భూ, సముద్ర, రైలు మార్గాల్లో ఉక్రెయిన్ వెళ్లి రావడం దానికదిగా అంతర్జాతీయ ప్రాధాన్యమున్న వార్త అవుతోంది. యూరోపు ఉక్రెయిన్ వైపు ఎందుకు నిలబడుతోందో? భారత్ రష్యాను బహిరంగంగా సమర్థించకపోయినా…తటస్థంగా ఎందుకు ఉండిపోవాల్సి వచ్చిందో? ఇక్కడ అనవసరం. ఎవరి అవసరాలు వారివి. ఎవరి ప్రాధాన్యాలు వారివి. ఎవరి సమర్థన వారిది.
Ads
ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రకటించి సరిగ్గా సంవత్సరమయ్యింది అంటూ మీడియాలో వార్తలే వార్తలు. చర్చలే చర్చలు.
రష్యా గెలవగలమనుకున్న సమరం గెలవలేని సమరంగా మారి సమాప్తి ఎప్పటికో తెలియడం లేదు. ఉక్రెయిన్ ను నిజానికి ఉఫ్ అని రష్యా ఊది పారేయాలి. కానీ యూరోపు దేశాలు, అమెరికా ఉక్రెయిన్ కు అండగా నిలబడి డబ్బు సాయం, ఆయుధాల సాయం చేస్తున్నాయి కాబట్టి…
పేరుకు రష్యాతో పోరాడేది ఉక్రెయిన్. వెనుక నిలబడేది, ఆడించేది వేరెవరో.
నాటో కూటమిని నిలువరించడానికి రష్యా ఉక్రెయిన్ గొంతు నులుముతోంది. రష్యా పేరు చెప్పగానే ఒంటికాలిమీద లేవడానికి నాటో కూటమి ఉక్రెయిన్ సీమలో అగ్గికి ఆజ్యం పోస్తోంది.
అటయినా – ఇటయినా నలిగేది ఉక్రేయినే. ఎటయినా బలయ్యేది సామాన్యులే.
అందుకే-
నాగ్గనుక తిక్క రేగితే అణ్వాయుధం కూడా ప్రయోగిస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిస్తుంటారు. ఇంట్లో ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసినట్లు అణ్వాయుధం బటన్ నొక్కుతానని ఆయన హెచ్చరించవచ్చు కానీ…అదంత ఆషా మాషీ వ్యవహారం కాదని ఆయనకూ తెలుసు.
రెండు వైపులా ఎన్ని వేల మంది చనిపోయి ఉంటారు? ఎన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుంది? ఎవరిది ఉన్మాదం? ఎవరిది ఆత్మ రక్షణ? లాంటి ప్రశ్నలు కేవలం అకెడెమిక్ డిబేట్లకు పనికి వస్తున్నాయి.
యుద్ధం మొదలు కాకూడదు. మొదలయ్యాక ఎటు వెళుతుందో? ఎవరికీ తెలియదు.
“పుతినూ! పుతినూ!
ఏమిటిది?
ఏమయినా అర్థం పర్థం ఉందా?
ఎన్నాళ్లు చేస్తావు యుద్ధం?
మంచు తగ్గి ఎండలు పెరిగిన ఈ గ్రీష్మంలో అయినా యుద్ధానికి సమ్మర్ హాలిడే ఇవ్వవా?”
అని ప్రపంచం పుతిన్ను అడగగలదా?
అడిగినా వింటాడా?
విన్నా సమాధానం చెప్తాడా?
చెప్పినా మాటకు కట్టుబడి ఉంటాడా?
“నాలుగున్నర కోట్లకు తక్కువున్న ఉక్రెయిన్ జనాభాలో రష్యాతో ఆగని యుద్ధం పేరిట ఎంతమందిని చంపుకుంటావయ్యా వ్లోదిమిర్ జెలెన్ స్కీ?”
అని చిట్టి దేశాధ్యక్షుడినయినా గట్టిగా అడగగలమా?
అడిగినా యుద్ధాన్ని యూరోప్ ఆగనిస్తుందా?
యూరోప్ మెత్తబడినా అమెరికా మెత్తబడుతుందా?
కూలిన మేడలు.
కాలిన బతుకులు.
రాలిన ఆశలు.
పోయిన ప్రాణాలు.
పోయే ప్రాణాలు.
పోలేక మిగిలిన ప్రాణాలు.
వచ్చిన ఆయుధాలు.
వచ్చే ఆయుధాలు.
ఇచ్చే సహాయాలు.
చెప్పే ధైర్యాలు.
తట్టిన భుజాలు.
ఎగదోసిన చేతులు.
రాజేసిన నిప్పులు.
చేసే కుట్రలు.
చచ్చిన ప్రమాణాలు.
“విద్వేషం పాలించే దేశం ఉంటుందా?
విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా?
ఉండుంటే అది మనిషిది అయి ఉంటుందా?
అడిగావా భూగోళమా?
నువ్వు చూశావా ఓ కాలమా?”
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com [ 99890 90018 ]
Share this Article