.
( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) ….. 1980 లోకి వచ్చేసాం . ఆరనిమంటలు . తమిళంలోకి డబ్ చేయబడిన చిరంజీవి మొదటి సినిమా . రెండు భాషల్లోనూ కమర్షియల్ గా కూడా సక్సస్ అయింది . ఏంగ్రీ యంగ్ మేన్ గా , రివెంజ్ తీసుకునే పాత్రల్లో చిరంజీవి తొలి రోజుల్లో ప్రేక్షకులకు దగ్గరయ్యారు .
ఈ ఆరనిమంటలు సినిమా ఆ కోవకు సంబంధించిందే . అయితే ఈ సినిమాలో అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ కూడా ఉంది . ఓ అన్నయ్య పాట కూడా ఉంది . బాగుంటుంది .
Ads
ఓ నలుగురు దుండగులు , మరో వాంప్ వలన హీరో చెల్లెలు ఆత్మహత్య చేసుకుంటుంది . వాళ్ళను చంపేయాలని హీరో వారిని వెంటాడుతాడు . కానీ , మరెవరో చంపుతుంటారు . సినిమా ముగింపులో తెలుస్తుంది ఆ చంపేది చనిపోయిన చెల్లెలు ప్రియుడు అని . ఈ సస్పెన్సును చివరిదాకా బాగా మెయింటైన్ చేసారు సినిమాలో .
చిరంజీవి గిటారిస్టుగా , డాన్సరుగా , ఏంగ్రీ యంగ్ మేన్ గా , అన్నయ్యగా బాగా నటించారు . తొలి రోజుల నుండి కూడా ఆనాటి అగ్ర నటుల వలనే మంచి డిక్షన్ ఉండేది . డైలాగ్ డెలివరీలో ఉచ్చరణ బాగుండేది . కష్టపడటంలో చెప్పేదేముంది ! అందుకే మెగా స్టార్ కాగలిగారు .
హీరో చెల్లెలుగా సుభాషిణి బాగా నటించింది . ఆత్మరక్షణకు కరాటే నేర్చుకుంటుంది . ఎవడయినా అల్లరి పెడితే అక్కడికక్కడే కొట్టేస్తుంది . ఎర్ర హీరో నారాయణమూర్తి ఇలా కొట్టించుకునే ఓ రోడ్ సైడ్ రోమియో పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాలో .
హీరోయిన్ గా కవిత చాలా హుషారుగా నటిస్తుంది . ప్రతీకారం తీసుకోవాలని ఆరాటపడే ప్రియుడికి సాయపడే పాత్రలో బాగా నటించింది . ఇతర పాత్రల్లో గిరిబాబు , సిలోన్ మనోహర్ , జయమాలిని , ప్రసాద్ బాబు , జగ్గారావు , ప్రభృతులు నటించారు . జగ్గారావుకి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది ఈ సినిమాలో .
కె ప్రత్యగాత్మ కుమారుడు కె వాసు దర్శకుడు . డైలాగులను జంధ్యాల వ్రాసారు . పదునుగా ఉంటాయి . సత్యం సంగీతంలో పాటలన్నీ బాగుంటాయి . డ్యూయెట్లు , క్లబ్ డాన్సులు , డాన్సులకు పాటలు అన్నీ బాగుంటాయి .
వేటూరి వ్రాసిన అన్నయ్య దీవెన పాటను శైలజ పాడింది . కమ్మని నా పాట అనే క్లబ్ పాటలో చిరంజీవి , జయమాలిని పోటాపోటీగా డాన్స్ చేస్తారు . జయమాలిని స్పీడుకు బహుశా ఒక్క చిరంజీవే తట్టుకోగలడేమో ఆ రోజుల్లో .
మిగిలిన పాటలు ఓయమ్మో టక్కరి గుంట , నలుగురి కోసం వెతుకుతున్నవి నా కళ్ళు పాటల్లో కవిత డాన్సులు కూడా బాగుంటాయి . టి.వి ఫిలింస్ బేనరుపై కె మహేంద్ర , త్రిపురమల్లు వెంకటేశ్వర్లు నిర్మాతలు . ఈ త్రిపురమల్లు వెంకటేశ్వర్లు గుంటూరు వాడేమో అని అనుకుంటా .
సినిమా , పాటల వీడియోలన్నీ యూట్యూబులో ఉన్నాయి . చూడబుల్ సినిమా . అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్+ రివెంజ్+ చిరంజీవి డాన్సుల సినిమా . చిరంజీవి అభిమానులకు బ్రహ్మాండంగా నచ్చుతుంది . మరయితే ఆలస్యమెందుకు ? చూసేయండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article