Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కలర్ ముఖ్యమా..? కళ ముఖ్యమా..? సినిమా వాకిట్లో చెరిగిపోని ముగ్గు ఈమె…

October 21, 2023 by M S R

Bharadwaja Rangavajhala………   చెరిగిపోని ముగ్గులు అనే అర్ధం వచ్చే అళయిద కోలంగళ్ తమిళ సినిమా బాలూ మహేంద్ర తీశారు. శోభ , ప్రతాప్ పోతన్ , కమల్ హసన్ తదితరులు నటించిన చిత్రం అది. బాలూ మహేంద్రకు నివాళి అర్పిస్తూ .. ఆ మధ్య అళయిద కోలంగళ్ టూ తీశారు .. కొందరు బాలు మహేంద్ర దగ్గరి మనుషులు. ఎమ్ ఆర్ భారతి డైరక్ట్ చేసిన ఈ సినిమా నిర్మాత ఈశ్వరీరావు. ప్రకాశ్ రాజ్, రేవతి, ఈశ్వరీరావు, అర్చన నటించారీ సినిమాలో …

మంచి ఉద్దేశ్యాలతో తీసిన సినిమాలన్నీ మంచి సినిమాలు కానక్కర్లేదనడానికి ఉదాహరణగా నిల్చిపోయిందా సినిమా. బహుశా నిరీక్షణ అర్చనకు అదే చివరి సినిమా కావచ్చు అనుకున్నారందరూ. అర్చనతో ఎందుకనో మన యూట్యూబ్ బ్యాచ్ కూడా పెద్దగా ఇంటర్యూలు చేసినట్టులేదు.

చాలా మంది నిరీక్షణే ఆవిడ తొలి చిత్రం అనుకుంటారు. అంతకు ముందే ఆవిడ తెలుగు తెర మీద ఒకటి రెండు సినిమాలు చేసేశారు. ఇవన్నీ కాదండీ, ఆవిడ్ని తెలుగు తెరకు పరిచయం చేసింది దాసరి నారాయణరావు. పోలీసు వెంకటస్వామి సినిమాలో కీలక పాత్ర పోషించారీవిడ. ఆ సినిమా కథంతా అత్యాచారానికి గురై అదృశ్యమైపోయిన అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆ కారక్టర్ అర్చనే చేసింది.

Ads

అప్పటికి ఆమె పేరు రాణీ సుధ. కథక్ డాన్స్ నేర్చుకునేది. తల్లి కూడా నర్తకే. ఆవిడ పేరు సుశీల అనుకుంటాను. వీళ్లు తెలుగువారే .. అయితే చెన్నైలో సెటిల్ అయిపోయిన ఫ్యామ్లీ … అలా 1983 లో తెలుగు సినిమాల్లో నటించడం ప్రారంభించిన రాణీ సుధ ఇలా లాభం లేదని అడయార్ ఫిలిం ఇన్స్ టిట్యూట్ లో చేరింది.

ఇన్స్ టిట్యూట్ లో ఉన్న రోజుల్లోనే అక్కడకి వచ్చి క్లాసులు చెప్పిన హాలీవుడ్ డైరక్టర్ విలిమయ్ గ్రీవ్స్ అర్జనకు పరిచయం అయ్యాడు. ఇండియాలో నాకో ఫ్రెండు ఉన్నాడు, అతనికి నిన్ను పరిచయం చేస్తానని చెప్పి బాలూ మహేంద్రను పరిచయం చేశాడాయన. అలా నీన్గళ్ కేట్టావై అనే బాలు మహేంద్ర సినిమాలో ఛాన్స్ పంపాదించారు అర్చన. అప్పటికీ ఆవిడ పేరు రాణి సుధే. బాలు మహేంద్ర తనకు అర్చన అని స్క్రీన్ నేమ్ సెట్ చేశారు. అది 84లో విడుదలైంది.

ఇళయరాజా సంగీతం చేసిన ఈ సినిమాలో ఓ హిందీ ట్యూన్ వినిపిస్తుంది. కస్మేవాదే ప్యార్ వఫా అంటూ మనోజ్ కుమార్ ఉప్కార్ సినిమాలో మన్నాడే పాడిన కళ్యాణ్ జీ ఆనంద్ జీ గీతాన్ని ఏసుదాస్ తో పాడించారు రాజా. వేరే వారి ట్యూన్లు తీసుకోవడం చాలా రేర్ .. అయితే బహుశా బాలుమహేంద్ర బలవంతం వల్ల కూడా ఇది జరిగి ఉండవచ్చు. ఈ సంగతి అలా ఉంచితే …

పోలీస్ వెంకటస్వామి నాటికి పెద్దగా నటన తెలియని రాణీ సుధ అడయార్ ఫిలిమ్ ఇన్స్ టిట్యూట్ నుంచీ బాలు మహేంద్ర సినిమాల్లోకి వెళ్లే నాటికి నటిగానే కాదు వ్యక్తిగానూ ఎదిగింది. అది అప్పట్లో ఆవిడ పేపర్లకు ఇచ్చిన ఇంటర్యూల్లో చూడచ్చు .. జీవితాల్లోలానే సినిమాల్లో కూడా ఆడ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు మన దర్శక నిర్మాతలు అనేసిందావిడ అలవోకగా. నా వరకు కాస్తైనా ప్రాధాన్యత ఉన్న పాత్రలైతేనే చేస్తాను .. అని తేల్చి చెప్పేశారు.

నీన్గల్ కేట్టావై సినిమాలో భానుచందర్ అర్చన జంట. ఈ లోగా 1985లో మళయాళంలో మమ్ముట్టి శోభనలతో తను తీసిన యాత్ర సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేశారు బాలుమహేంద్ర. ఆ సినిమా నిర్మాణాన్ని తాము తీసుకున్నారు లక్ష్మీ ఫిలింస్ లింగమూర్తి. అప్పటికే ఆయన వజ్రాయుధం, కిరాతకుడు సినిమాలు చేసి ఉన్నారు. ఇది మూడో సినిమా. పేరు నిరీక్షణ.

నిరీక్షణలోనూ మళ్లీ భానుచందర్ అర్చన జంట. తెలుగులో ఓ మోస్తరుగా ఆడేసిందా సినిమా. పాటలు మాత్రం చాలా పెద్ద హిట్ అయ్యాయి. వికీపీడియాలో ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ పొరపాటు చేశారు. 82 లో ఈ మూవీ విడుదలైనట్టు రాశారు. బాపు డైరక్షన్ లో నటించాలని ఉంది అని కూడా ఓ ఇంటర్యూలో అర్చన అన్నారు. కానీ ఆ అవకాశం ఆవిడకు రాలేదు.

బాలూ మహేంద్ర డైరక్షన్ లోనే వీడు, రెండు తోకల పిట్ట లాంటి సినిమాల్లో నటించారు. తెలుగులో విజయ్ చందర్ యోగి వేమన, వంశీ తీసిన లేడీస్ టైలర్, నర్సింగరావు దాసి, మట్టి మనుషులు లాంటి సినిమాల్లో నటించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు గెల్చుకున్నారు. అయినా ఆవిడ్ని తెలుగు మీడియా పెద్దగా పట్టించుకోలేదు.

ఆ మధ్యెప్పుడో ఓ తమిళ ఛానల్ ఎందుకు మీరు సినిమాల్లోంచీ షడన్ గా మాయం అయ్యారు అని అడగగా … నన్ను అడిగి చేయించుకునేవారు ఉన్నంత వరకు నేను నటించాను. నన్ను ఎవరూ పిలవడం లేదు కనుక నటించడం లేదు .. ఇప్పటికీ పిలిస్తే నేను రడీనే .. అన్నారు. పెళ్లి అయిపోయింది.. నా కుటుంబ జీవనం హాయిగా ఉంది .. అయినప్పటికీ నేను ఎవరైనా వచ్చి అడిగితే నటిస్తాను గానీ నా అంత నేను ఛాన్సులు ఇవ్వండి అని అడగను అనేశారు.

ఆవిడ ఖాతాలో ఒక బెంగాలీ ఒక హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. అన్ని భాషల్లో చేసిన ఏకైక నటి అర్చనేనేమో? అలా తనను భారతీయ నటి అని పిలవాలి. తెల్లతోలు కాకపోవడం వల్లో ఏమో మన డైరక్టర్లు ఆవిడ పైపు పెద్దగా చూళ్లేదు … అలాగే వాణిశ్రీ లాగా దాన్ని కవర్ చేసుకోవాలని కూడా అనుకున్నట్టు కనిపించదు.

నిన్ను నువ్వుగా చూపించను అనడం కూడా ఒక రకంగా ఆత్మగౌరవాన్ని కించపరచడమే అనేది నా పర్సనల్ ఒపీనియన్ను. మరి ఇలాంటి అభిప్రాయాలు ఆవిడకీ ఉన్నాయేమో నాకు తెలియదుగానీ … … నలుపు అని అర్ధమయ్యేట్టే తెర మీద కనిపించేవారావిడ. అది కూడా ఆవిడకు ఎక్కువ అవకాశాలు రాకపోడానికి కారణం అయి ఉండవచ్చు. ఏది ఏమైనా తను మంచి నటి.

నిరీక్షణలో రాళ్లపల్లి కొట్టు ముందు నుల్చుని తనతో మాట్లాడే సందర్భంలో అర్చన నటన చూస్తే అర్ధమైపోతుంది. తాను కమిట్మెంట్ మాత్రమే కాదు కంటెంట్ ఉన్న నటి అని. తన ముఖం యమునా పాటలో ఎంత అందంగా ఉంటుందో .. చూసి తీరాలంతే ..

అలాగే ఏ విషయాన్నైనా కాస్త స్ట్రెయిట్ గా చెప్పేసే టైప్ అవడం కూడా పెద్దగా నచ్చలేదేమో … ఆడవారి జ్ఞానాన్ని అంగీకరించడానికి మగ వారి మెదళ్లు అంత త్వరగా తెమలవు కదా … అలాకూడా ఆవిడ ఓ తరహా సినిమాలకే పరిమితం అయిపోయినట్టున్నారు. ఆవిడ జ్ఞాని … తొలి రోజుల్లో విజయచిత్రకు ఇచ్చిన ఇంటర్యూలోనే ఆవిడ చాలా ప్రశ్నలకు చాలా స్ట్రెయిట్ గా రియలిస్టిక్ గా ఇచ్చిన సమాధానలు చూస్తేనే అర్ధమౌతుందా విషయం .

అణచివేత తాలూకు మూలాలు తెల్సిన మనిషిలానే మాట్లాడింది తను ఆ ఇంటర్యూలో … పేరుకి హీరోయిన్ చేసేది నాలుగు సీన్లు .. డాన్సులు చేయాల్సింది మాత్రం అన్ని పాటల్లోనూ .. పాటకు నలభై డ్రస్సులు మార్చాలి ఇలా చాలా వ్యంగ్యంగా మాట్లాడిందావిడ … తమిళ కన్నడ మలయాళ తెలుగు హిందీబెంగాలీ ఇలా ఐదు భాషల్లోనూ కలిసి యాభై లోపే ఉంటాయి తను చేసిన సినిమాలు. వీడు, దాసి సినిమాలకు జాతీయ స్థాయి ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన అర్చన అనగానే నాకు మాత్రం … నిరీక్షణలో యమునా ఎందుకే నీవూ ఇంత నలుపెక్కినావూ అన్న పాటే గుర్తొస్తుంది …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions