.
Bharadwaja Rangavajhala …….. మణిసిపోతే మాత్రమేమి? మణిసి పోతె మాత్రమేమి మనసు ఉంటది… మనసుతోటి మనసెపుడో కలసి పోతదీ…
అని గీతోపదేశం చేసిన కవిమాంత్రికుడు ఆచార్య ఆత్రేయ. పుట్టిన తేదీ… గిట్టిన తేదీ… తారీఖులు దస్తావేజులతో తెలుగు వారికి ఆత్రేయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు…
Ads
నీ మనసుకు తెలుసూ నా మనసు
నీ వయసుకు తెలియదు నీ మనసు
అనగలిగిన వాడు ఆత్రేయ ఒక్కడే.
దీని ఎక్స్ టెన్షన్ లోనే …
మనసు కొమ్మ వంటిది
వయసు కోతి వంటిది
ఊపేసి పోతుంది మొదటిది
ఆ ఊపు మరువనంటుంది రెండవది అంటాడు..
వయసుకి మనసుకి ఉన్న లింకు గురించి మాట్లాడుతూ…
ఆత్రేయ పాటల్లో గొప్ప ప్రజాస్వామిక దృక్పథం కనిపిస్తుంది.
కోకిలమ్మ సినిమాలో…
పోనీ పోతే పోనీ అనే పాటలో
అడిగేందుకు నీకున్నది మమకారం
విడిపోయేందుకు తనకున్నది అధికారం
అంటాడు.
అంటే …
ప్రేమ జంట లో ప్రియుడు ఆ బంధం నుంచీ వెళ్లిపోయినప్పుడు
ప్రేయసి మనసు పాడే పాటలో ఇలా రాస్తాడు…
అంతే కాదు …
ప్రేమించి ఓడావు నీ తప్పుకాదు
అది జీవితానికి తుది మొదలు కాదు
ప్రేమించగల నిండు మనసున్న చాలు
అది పంచి ఇచ్చేందుకు ఎందరో కలరు అంటాడు…
అనగా…
నీకు అతని మీద ప్రేమ ఉంది నిజమే
అతను వేరే అమ్మాయితో ప్రేమలోకి వెళ్ళాడు
నిన్ను కాదన్నాడు అని కుమిలిపోకు
అతన్ని తిట్టకు
నిన్ను నువ్వు నిందించుకోకు…
ప్రేమికులే అయినప్పటికీ మీరిద్దరూ రెండు యూనిట్లు …
మీ ఆలోచనలు అవగాహనలు వేరువేరు, ఎవరూ ఎవర్నీ ఎల్లప్పుడు ఇన్ఫీయులెన్స్ చేయలేరు…
కనుక విడిపోవాలి అన్న అతని అభిప్రాయాన్ని తెలుసుకుని హర్ట్ అవకు …
వదిలేసి నీ జీవితంలో ముందుకు వెళ్ళు …
అని చెప్తాడు…
అలాగే
రావణుడే రాముడైతే అనే సినిమాలో ప్రేమంటే తెలుసా నీకు పాటలో …
ప్రేమమార్గం ఎన్నడూ ఒకేవైపు దారికాదు
నువ్వు నీ తలుపును తెరిస్తే ఎదుటి తలుపు తెరుచుకోదు అంటాడు …
ఈ అభిప్రాయాలన్నిటికీ పరాకాష్ట…
వలచుట తెల్సిన నా మనసుకు
మరచుట మాత్రము తెలియనిదా అని వదిలేయకుండా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే రుజువు కదా అంటాడు..
అంచేత ప్రేమ ఉన్న దగ్గర ద్వేషం ఉండవద్దు..
అనేది చాలా పాటల్లో చెప్తూ …
ప్రేమ పేరుతో దాడులు చేయద్దు అలా దాడులు చేసేది ప్రేమ కాదు అని పదే పదే చెప్తాడు…
హృదయంతో రాసే కవుల్లో ఆత్రేయ ఒకరు.
తెలుగు సినీ సాహిత్యయుగంలో రెండో తరానికి ప్రతినిధి ఆయన.
ఏ భావాన్నైనా సూటిగా హృదయానికి తాకేలా చెప్పగలగడం ఆత్రేయ స్పెషాలిటీ .
అది భక్తైనా… రక్తైనా… ఆత్రేయ రాస్తే అద్భుతమే….
శ్రీకృష్ణుడిని యశోదమ్మ కోప్పడడం… కృష్ణుడి అల్లరి పనులు ఇవన్నీ… ఎన్ని సార్లు చెప్పినా… ఎవరు చెప్పినా… వింటానికి ఉత్సాహపడతాం…
విన్నావా యశోదమ్మా అని పింగళి మాయాబజార్‌లో రాస్తే అద్భుతం అనేశాం.
ఆత్రేయ అర్దాంగి సినిమాలో
ఒద్దురా కన్నయ్యా పాట రాస్తే మల్లాది రామకృష్ణశాస్త్రి అంతటి వాడు పిల్చి అభినందించారట.
మనసు పాటల పేటెంట్ హోల్డర్ ఆత్రేయ.
డాక్టర్ చక్రవర్తిలో మనసున మనసై బతుకున బతుకై పాట ఆత్రేయే రాసారనుంటారు చాలా మంది.
కానీ ఆ పాట రాసింది శ్రీశ్రీ…
దాదాపు అలాంటి సందర్భమే శ్రీశ్రీకీ ఎదురైంది.
తోడికోడళ్లు సినిమాలో కారులో షికారుకెల్లే పాలబుగ్గల పసిడీచాన పాట చాలా మంది శ్రీశ్రీ రాసారనుకునేవాళ్లట.
కానీ ఆ పాట రాసింది ఆత్రేయ…
బుచ్చిబాబు నవత పత్రికలో ఈ పాట మీద విపుల వ్యాఖ్యానం రాయడం విశేషం.
ఆదుర్తి సుబ్బారావుకీ ఆత్రేయకూ ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
ఆదుర్తి సినిమాల్లో ఆత్రేయ అద్బుతమైన పాటలు రాసారు. తేనెమనసులులోని
ఓ హృదయం లేని ప్రియురాలా పాటలో…
నీ మనసుకు తెలుసు నా మనసు…
నీ వయసుకు తెలియదు నీ మనసు అంటాడు.
అలాగే మరెన్నో పాటలు…
ఆత్రేయ పాటల్లో అల్లిక ఉంటుంది.
ఆ అల్లిక వెనుక అద్భుతమైన అన్వయం, సమన్వయం ఉంటుంది.
మూమూలుగా ఆయన పాటలు వింటే పాట రాయడం చాలా తేలిక అనిపిస్తుంది.
కానీ పెన్ను తీసాక కానీ అర్ధం కాదు…
అది అంత వీజీ కాదని…
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ… అంటాడు.
ఆవేశం ఏనాడు తెలిసెనో ఆనాడే తెలిసిందిదీ అనడం గతితర్కం తెలిసిన వాడికే సాధ్యం.
ఆత్రేయ బేసికల్‌గా పద్య కవి.
తన ఆత్మకథను పద్యకావ్యంగానే రాసుకున్నారు.
ఆ తర్వాత నాటక రచయిత.
నాటక రచయితగా ఆయన సూపర్‌స్టార్…
ఎన్‌జిఓ, కప్పలు , ఈనాడు లాంటి నాటకాలు ఆరోజుల్లో రంగస్థలాన్ని ఓ ఊపు ఊపాయి.
ఆత్రేయ డైలాగుల్లో ఆ పదును కనిపిస్తుంది.
ఆత్రేయకు బాష మీద పట్టు అపారం.
ఈ పట్టువల్లే ఆయన చాలా సందర్భాల్లో జనం మర్చిపోయిన మాటలు వాడేస్తాడు…
పెళ్లి కానుక సినిమాలో
ఆడే పాడే పసివాడ పాటలో
నెనరంత అనలాన నీరైన నాడు
నెమ్మది మనకింక కనరాదు అంటాడు.
నెనరు… అనలం లాంటి పదాలు కన్వే అవుతాయా లేదా అనేది ఆయన పట్టించుకోలేదు.
పాట హిట్ అయింది.
నెనెరెల్ల అనలాన నీరైన నాడు అంటే …
ప్రేమంతా మంటల్లో కాలి బూడిదైపోయిందనే.
నీరు అంటే సంస్కృతంలో బూడిద అని అర్ధం.
నా మనసు పిచ్చి ముండా అనేయగలిగిన లౌక్యుడు ఆత్రేయ. మనసు పలికే బాష ఏమిటో కూడా ఆయనకు బాగా తెల్సు. మౌనమే నీ బాష ఓ మూగమనసా పాటలో తెగిన పతంగానివే…
మనసా మాయల దెయ్యానివే అని కోప్పడేస్తాడు…
ప్రేమ్‌నగర్ లో హీరో అంతరంగ మధనాన్ని ఆవిష్కరించే ఓ గొప్ప విషాదగీతం రాసారు ఆత్రేయ.
చాలా రోజుల తర్వాత నా మనసుకు నచ్చిన పాట అది అని స్వయంగా ఘంటసాల ప్రకటించిన ఆ పాట మనసు గతి ఇంతే…
ఆత్రేయ గురించి ఓ కామెంట్….
ఆత్రేయ రాసి ప్రేక్షకులను.. రాయకుండా నిర్మాతలనూ ఏడిపిస్తాడని.
నిజంగానే మనసును మెలితిప్పే విషాదగీతాలు అనేకం ఆయన కలం నుంచి వచ్చాయి.
సన్నివేశ నేపధ్యాన్ని చెప్తూ సాగే పాటలు రాయడంలోనూ ఆత్రేయ స్పెషలిస్ట్…
నాటకాల నుంచి రావడం వల్ల మొత్తం కథకు ఒన్ లైన్ ఆర్టర్ అనదగ్గ స్టైల్లో ఆయన బ్రాక్‌గ్రౌండ్ సాంగ్స్ రాసేవారు.
ఈ జీవన తరంగాలలో…. పాటలో దాదాపు సినిమాలో ప్రతి పాత్ర రిఫరెన్సూ ఉంటుంది…
అల్లరి పాటలకూ ఆత్రేయదే పేటెంట్ .
ఎవరైనా అంటారేమో అని తనకు తానే బూత్రేయ బిరుదిచ్చేసుకున్నారాయన.
ముఖ్యంగా దసరాబుల్లోడు ఎట్టాగో ఉన్నాది ఓ లమ్మీతో ఈ ట్రెండ్ మొదలైంది.
అది వేటూరి మీదుగా కొనసాగింది…
ఒక వైపు ఇలాంటి పాటలు రాస్తూనే…
బాలచందర్ సినిమాల్లో ఆత్రేయ తరహా పాటలు రచించారు. ముఖ్యంగా మరోచరిత్ర, ఇది కథకాదు, అందమైన అనుభవం సినిమాల్లో ఆత్రేయ రాసిన పాటలు అనితరసాధ్యాలే. కుర్రాళ్లోయ్ పాట ఒరిజినల్ కన్నా వైవిధ్యంగా రాసి మెప్పించారు ఆత్రేయ…
త్రిశూలం సినిమాలో
పెళ్లంటే సందళ్లు… అంటూ కాన్వర్‌జేషన్ స్టైల్లో సాగే పాటొకటి ఉంది.
దాదాపు ఇలాగే మాయదారి మల్లిగాడులో వస్తా వెళ్లొస్తా అంటూ కాన్వర్‌జేషనల్ స్టైల్లో సాగే పాట ఆత్రేయ సూపర్బ్‌గా రాసారు.
ఇంత కాలం తర్వాత విన్నా ఆ పాట చాలా కొత్తగా అనిపిస్తుంది…
ఆత్రేయ చతురోక్తులకు మోస్ట్ పాపులర్.
ఆయన రేంజ్‌లో ఆ లైన్‌లో పాపులర్ అయిన వాళ్లు మరొకళ్లు కనిపించరు.
ఆత్రేయ మీద ప్రధాన విమర్శ ఆయన మోస్ట్ అనార్కిస్ట్ అని. అనార్కిజం క్రియేటివిటీ రెండూ కవల పిల్లల్లాంటివని ఆత్రేయను బాగా తెల్సిన వాళ్లు అంటూంటారు…
ఆత్మబలం సినిమాకు డైలాగ్స్ గట్రా రాసేయమని ఆత్రేయను తీసుకెళ్లి హోటల్ చోళాలో రూం బుక్ చేసి మరీ కూర్చోబెట్టారట వి.బి.రాజేందప్రసాద్.
ఎన్ని రోజులైనా ఆత్రేయ కలం ముందుకు సాగలేదు.
కారణం అడిగితే… ఈ హోటల్ పేరు చోళా కదా…. పల్లవులకీ చోళులకూ పడదు కనుకే మనం పల్లవులు రాయలేకపోయాం అన్నారట.
కూల్ గా…
ఓ సారెప్పుడో మోదుకూరి జాన్సన్ ఆత్రేయతో గురువుగారూ నేనూ మిమ్మల్నే ఫాలో అవుతున్నానండీ…
డబ్బివ్వకుండా ఎవరికీ ఏమీ రాయడం లేదన్నారట.
దానికి రిప్లైగా ఆత్రేయ పిచ్చివాడా నేనిప్పుడు డబ్బిచ్చినా రాయడం లేదన్నారట…
డి.వి.నరసరాజు గారు ఆత్రేయ గురించి ఓ మాట చెప్పేవారు. నాకు బ్యాంకులో డబ్బు లేకపోతే నిద్ర పట్టదు.
ఆత్రేయకు బ్యాంకులో డబ్బు ఉంటే నిద్రపట్టదు అని…
జీవితాంతం నంబర్ ఒన్‌గానే ఉన్న ఆత్రేయ మరణం మీద కూడా జోక్ వేసుకున్నాడు.
చావు గురించి ఎప్పుడూ భయపడను… మనం చూస్తుండగా అది రాదు… అదొచ్చేశాక మనం ఉండం అనేవారు. అలాగే… ఆయనకే తెలియకుండా వెళ్లిపోయారు.
ఆయన మొదటి పాట …కెఎస్ ప్రకాశరావు తీసిన దీక్ష లో రాశారు…
పోరాబాబూ పో అంటూ…
….
Share this Article