Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మెగాస్టార్‌కు కూడా గాత్రదానం… ఢిల్లీ గణేషుడు మన పరిచితుడే…

November 11, 2024 by M S R

.

మెగాస్టార్ చిరంజీవికి గాత్రదానం చేసిన నటుడు

ఢిల్లీ గణేష్ అనే తమిళ నటుడు నిన్న మరణించారు. ఆయనెవరో తెలుసా? మెగాస్టార్ చిరంజీవికి గాత్రదానం చేసిన వ్యక్తి. ఆశ్చర్యంగా ఉందా? కానీ అది నిజం‌. కె.బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో ‘47 రోజులు’ అనే సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తీశారు. తెలుగులో చిరంజీవి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటే తమిళంలో ఢిల్లీ గణేష్ డబ్బింగ్ చెప్పారు. ఇది జరిగింది 1981లో.

Ads

ఆ తర్వాత మరో పదేళ్లకు చిరంజీవి హీరోగా తెలుగులో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా వచ్చింది. ఆ సినిమాను తమిళంలో ‘కాదల్ దేవతై’ (ప్రేమ దేవత)గా అనువదించారు. అందులో చిరంజీవికి మరోసారి ఢిల్లీ గణేష్ డబ్బింగ్ చెప్పారు. అలా మెగాస్టార్ చిరంజీవికి రెండుసార్లు గాత్రదానం చేసిన ఘనత ఆయనకు దక్కింది.

పేరులో ఢిల్లీ ఉంది కానీ, ఢిల్లీ గణేష్ పుట్టింది తమిళనాడు రాష్ట్రం తెన్‌కాశి జిల్లాలోని కీళపావూర్ అనే ఊరిలో. అదీ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చే మూడేళ్ల ముందు. ఒక అక్క, ఒక తమ్ముడి మధ్యన ఆయన. తూత్తుకుడిలో చదువు పూర్తి చేసి, 1964 నుంచి 1974 వరకు భారత వైమానిక దళం(Indian Air Force)లో పని చేశారు.

ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉన్న సమయంలో ‘దక్షిణ భారత నాటక సభ’ అనే డ్రామా ట్రూప్‌లో చేరారు. అక్కడ ఎన్నో నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఆ తర్వాత ప్రఖ్యాత నాటకకర్త, నటుడు కాత్తాడి రామ్మూర్తి నాటక సమాజంలో చేరారు. అక్కడ ‘డౌరీ కల్యాణ వైభోగమే’ నాటకంలో ‘కుచేలన్’ అనే పాత్ర ఆయనకు విశేషమైన పేరు తెచ్చింది. అక్కడే ఆయనకు ‘ఢిల్లీ గణేష్’ అనే పేరు స్థిరపడింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇవాళ్టికీ ఎంతో క్రేజ్. ఇక ఆ రోజుల్లో ఎలా ఉండేదో చెప్పాల్సిన పని లేదు. అందునా వైమానిక దళంలో ఉద్యోగం. కానీ నటన అనే క్రేజ్ ముందు అది చిన్నదే అయ్యింది. దాంతో 1974లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు గణేష్. ‘డౌరీ కల్యాణ వైభోగమే’ నాటకంలో ఆయన నటన గమనించిన కె.బాలచందర్ ‘పట్టిన ప్రవేశం’ (పట్టణం ప్రవేశం) సినిమాలో అవకాశం ఇచ్చారు. కమల్‌హాసన్, రజినీకాంత్, ప్రకాశ్‌రాజ్, సరిత, గీత లాంటి నటులతోపాటు ఢిల్లీ గణేష్‌కూ బాలచందరే గురువుగా మారారు.

సినీ పరిశ్రమలో కొంతమంది లిమిటెడ్ ఆర్టిస్టులుంటారు. తమకొచ్చినంతమేర నటనతో బండి లాగిస్తారు. మరికొందరు కమిటెడ్ ఆర్టిస్టులుంటారు. ఒక పాత్ర కోసం ప్రాణం పెడతారు. ఢిల్లీ గణేష్ కమిటెడ్ ఆర్టిస్టు. అయితే తమిళ సినిమారంగం ఆయన్ని చాన్నాళ్ళపాటు లిమిటెడ్ ఆర్టిస్టుగానే గుర్తించింది‌. 1981లో ‘ఎంగమ్మా మహారాణి’ సినిమాలో హీరోగా నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.

దీంతో పరిశ్రమ ఆయనకు సహాయక పాత్ర, ఇంటి పెద్ద పాత్ర లేదంటే హీరోకు అన్న, బావ.. ఇలాంటి పాత్రలే ఇస్తూ వచ్చింది. కానీ ఆయనలో అంతకుమించిన ప్రతిభ ఉంది. టైం కోసం వేచి చూస్తూ ఉన్నారు. అప్పుడొచ్చారో నటుడు. ఆయన పేరు కమల్‌హాసన్.

‘ఇతను గొప్ప నటుడు. ఇతనిలో అన్ని రకాల పాత్రలూ వేసే ప్రతిభ ఉంది’ అని గుర్తించారు కమల్‌. తన సినిమాల్లో ఆయనకో పాత్ర ఉండేలా చూసుకున్నారు. అలా 1981లో ‘రాజాపార్వై’ (తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’) సినిమాతో మొదలుపెట్టి, ఆ తర్వాత కమల్‌హాసన్ నటించిన అనేక సినిమాల్లో ఢిల్లీ గణేష్ కీలక పాత్రలు పోషించారు.

‘నాయగన్’, ‘మైకేల్ మదన కామరాజన్’, ‘అవ్వై షణ్ముగి’ (తెలుగులో ‘భామనే సత్యభామనే’), ‘తెనాలి’.. ఇలాంటి చిత్రాలతో ఢిల్లీ గణేష్ ప్రతిభ అందరికీ తెలిసింది. తగ్గ పాత్రలు దక్కినప్పుడు నటుల ప్రతిభ బయటకు వస్తుంది. ఢిల్లీ గణేష్‌కు అలాంటి అవకాశం 1989లో వచ్చింది. అప్పటిదాకా సహాయక పాత్రలే చేస్తున్న ఆయన చేత ‘అపూర్వ సహోదర్‌గల్’ (తెలుగులో ‘విచిత్ర సోదరులు’) సినిమాలో విలన్ పాత్ర చేయించారు దర్శకుడు సింగీతం. అదీ కమల్‌హాసన్ సినిమానే కావడం విశేషం.

‘అవ్వై షణ్ముగి’ సినిమాలో కమల్‌హాసన్, జెమినీ గణేశన్‌తో సరిసమానంగా ఉండే పాత్రను ఢిల్లీ గణేష్‌కు ఇవ్వాలని అనుకున్నప్పుడు చాలామంది వద్దన్నారు. సీరియస్ రోల్స్ చేసే ఆయనకు అంత కామెడీ రోల్ ఇవ్వడం కరెక్ట్ కాదు, నెగెటివ్ ఫీలింగ్ వచ్చి సినిమాకు మైనస్ అవుతుందని భావించారు. కానీ కమల్‌హాసన్ ధైర్యం చేశారు. ‘ఆయన రంగస్థలం నుంచి వచ్చిన నటుడు. ఏ పాత్రైనా పోషించగలరు’ అని గట్టి నమ్మకంతో ఉన్నారు.

తన పాత్ర కంటే ఢిల్లీ గణేష్‌ పాత్రకు ఎక్కువ డైలాగులు, కొత్త మేనరిజమ్స్ పెట్టి ఆ పాత్ర బాగా వచ్చేలా చేశారు. ఆ క్రెడిట్ అంతా కమల్‌హాసన్‌దేనని ఢిల్లీ గణేష్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ‘తెనాలి’ సినిమాలో కూడా పూర్తి నిడివి ఉన్న డాక్టర్ పంచభూతం పాత్రను ఆయన చేత చేయించారు. ఈ రెండు పాత్రలకూ తెలుగులో నటుడు ఏవీఎస్ డబ్బింగ్ చెప్పారు.

మొత్తం 400 సినిమాల్లో నటించారు ఢిల్లీ గణేష్. అందులో పది మలయాళం, మూడు తెలుగు (జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమినాగు (2009)), మూడు హిందీ సినిమాలున్నాయి. సినిమాల్లో విశేషమైన పేరు వచ్చిన తర్వాత దాదాపు 30 తమిళ సీరియళ్లలో నటించారు. 2018లో ‘అమెరికా మాప్పిళ్లై’, 2021లో ‘నవరస’ అనే రెండు వెబ్ సిరీస్‌లలో నటించారు. ఇటీవల విడుదలైన ‘ఇండియన్-2’ ఆయన చివరి సినిమా.

ఏ కమల్‌హాసన్‌తో నటించడం ఆయనకు విశేషమైన పేరు తెచ్చిందో, ఆ కమల్‌హాసన్‌తో చేసిన చిత్రం ఆయన చివరి చిత్రం అయ్యింది. తెలుగులో చంద్రమోహన్, తమిళంలో నగేష్‌లతో సమానమైన గుర్తింపు ఢిల్లీ గణేష్‌కు రావాల్సింది. కానీ ఆ గుర్తింపూ రాలేదు, ఆ స్థాయి అవార్డులూ రాలేదు. అయితే జనాల చేత మంచి నటుడనే పేరు దక్కింది. అది వాస్తవం.

80 ఏళ్ల వయసులో ఢిల్లీ గణేష్ అనే గొప్ప నటుడు తన పాత్ర చాలించి జీవన రంగస్థలం నుంచి నిష్క్రమించారు. జోహార్…. – విశీ (వి.సాయివంశీ)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • == యుద్ధము, వ్యాపారం, స్టాక్ మార్కెట్లపై ప్రభావం ==
  • నూకల అత్తెసరు..! ఈ తరానికి తెలియని సూపర్ రెసిపీ… విత్ పచ్చిపులుసు…!!
  • ఎస్.జైశంకర్..! నాన్- పొలిటికల్ మంత్రిగా ఓ విశిష్ట ఎంపికే..! చదవండి..!
  • అటు పాకిస్థాన్‌తో యుద్ధం… సేమ్ టైమ్, విదేశీ కక్కుర్తి మీడియాతోనూ…
  • విస్తరి లేదు, అరిటాకు లేదు… నేల మీదే భోజనం… మహాప్రసాదం..!!
  • వయస్సు ఓ దశ దాటాక ఎలా బతకాలి..? గానుగెద్దు జీవితం వదిలేదెలా..?
  • గూఢచారి జ్యోతి… ఎన్ఐఏ‌ను ఏడాది క్రితమే అలర్ట్ చేసిన ట్వీట్…
  • అందరూ సమానమే, కానీ కొందరు ఎక్కువ సమానం… అసలు ఏమిటీ 23…
  • పాకిస్థానీ క్యాంపెయిన్ టీమ్‌లో ఈ ఇద్దరూ… వారి చుట్టూ ఓ ప్రేమకథ…
  • ‘‘ఛలో, ఇండియా ప్రచారాన్ని మనమూ కౌంటర్ చేద్దాం, టాంటాం చేద్దాం…’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions