ముంబయి… టాటా కేన్సర్ హాస్పిటల్… ఓ వ్యక్తి అనుకోకుండా అక్కడికి వెళ్లాడు… హాస్పిటల్ ఎదురుగా రోడ్డు పక్కన నిలబడ్డాడు… చూస్తూనే ఉన్నాడు… రోగుల్ని, వాళ్ల కోసం వచ్చిన కుటుంబసభ్యుల్ని చూస్తుంటే తన కడుపు తరుక్కుపోతోంది… అక్కడికి వచ్చేవాళ్లలో అధికులు పేదవాళ్లే… మందులు కాదు కదా, అక్కడ చికిత్స కోసం ఉంటుంటే ఎవరికీ సరిగ్గా భోజనమూ దొరికేది కాదు… డబ్బు లేక, అక్కడ ఆ సౌకర్యం లేక… మనిషి పుట్టుక పుట్టినందుకు నేనేమీ చేయలేనా అనుకున్నాడు… మరుసటి రోజు మళ్లీ వెళ్లాడు…
ఆలోచనలు తెగలేదు… ఆ మరుసటి రోజు మళ్లీ వెళ్లాడు… ఓ నిశ్చయానికి వచ్చాడు… తను నడిపించే హోటల్‌ను అద్దెకు ఇచ్చేశాడు… తన మకాం కేన్సర్ హాస్పిటల్ సమీపంలోకి మార్చుకున్నాడు… అక్కడ ఓ చిన్న గది అద్దెకు తీసుకున్నాడు… కేన్సర్ చికిత్స కోసం వచ్చే రోగులు, వాళ్ల అటెండెంట్లకు ఉచితంగా భోజనం సమకూర్చడం స్టార్ట్ చేశాడు… నీకు హోటల్ మీద వచ్చే అద్దెతో ఎన్నాళ్లు ఈ ఉచిత భోజన కేంద్రం నడిపిస్తావోయ్ సేటూ అని మొహం మీదే వెక్కిరించిన వాళ్లూ ఉన్నారు…
తను నిర్లిప్తంగా నవ్వి ఊరుకున్నాడు… కానీ అది ఆగలేదు… ఓ సత్సంకల్పానికి ఎవరో చేయూతనిస్తారు, సాయపడే చేయి అవుతారు అని నమ్మాడు… ఇప్పటికి 30 ఏళ్లు… అది నడుస్తూనే ఉంది… ఉంటుంది కూడా… ఏ ఒక్కరోజూ సెలవు లేదు, తను తీసుకున్న నిర్ణయం పట్ల వీసమెత్తు అసంతృప్తీ లేదు తనకు… అంతేకాదు, దాన్ని తనకు చేతనైనంతగా విస్తరిస్తూనే ఉన్నాడు… కలిసి వచ్చే దాతలకు స్వాగతం… ఒక ట్రస్టు ఏర్పాటు చేశాడు… దాని పేరు JivanJyot ఆయన పేరు హరక్‌చంద్ సావ్లా…
Ads
మొదట్లో 40, 50 మంది వరకూ భోజనం అందించేవాడు… ఎండలు, వానలు, ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ఆ హాస్పిటల్‌కు వచ్చిన వాళ్లు ఆకలితో కడుపు మాడ్చుకోకూడదు అనేదే తన ప్రాథమిక లక్ష్యం… మొదట్లో డబ్బు సరిపోయేది కాదు… ఆ చుట్టుపక్కల ఇళ్లకు వెళ్లి పాత న్యూస్‌పేపర్లు, బట్టలు, ఇతరత్రా సాయం అడిగేవాడు… ఆ రద్దీ పేపర్ అమ్మేసి కొంచెం కొంచెం మొత్తాల్ని సమకూర్చుకునేవాడు… మెల్లిగా పెరుగుతూ పోయింది ఆ సెంటర్… ఇప్పుడు రోజుకు 700 మంది దాకా ఆహారం సమకూరుస్తున్నారు… భోజనమే కాదు, తన సేవల్ని ఉచిత మందుల వైపు విస్తరించాడు… మెడిసిన్స్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు… ఎవరో దాతలు సాయం చేస్తారు, మరీ అవసరమైన పేదలకు మందులు కూడా ఇస్తున్నాడు…
ఒక్క ముంబయి మాత్రమేనా అనుకున్నాడు ఓ దశలో… కుటుంబం గడవడానికి ఏదో చిన్న వ్యాపారం… భార్య చూసుకుంటుంది… ఈయన మొత్తం తన సేవ కార్యక్రమాల్లోనే… కేన్సర్ సోకిన పిల్లల కోసం టాయ్స్ బ్యాంక్ పెట్టాడు… తన సేవల్ని జలగాం, సాంగ్లి, కోల్‌కతా తదితర 20 కేంద్రాలకు విస్తరించాడు… బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ దగ్గర్నుంచి అనాథ శవాలకు అంత్యక్రియల దాకా… తన సేవల్ని కొనసాగిస్తూనే ఉన్నాడు… ఇప్పుడు ఆయన వయస్సు 57 ఏళ్లు… కరోనా సంక్షోభంలోనూ ఈ ట్రస్టు అనేకచోట్ల అండగా నిలబడింది… (టాటా వాళ్లే తమ హాస్పిటల్ దగ్గర ఈ ఉచిత భోజనం ఏర్పాటు చేయవచ్చు కదా అనే ఓ ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు…)
(పిల్లికి బిచ్చం వేయని, ఎడమ చేత్తో కాకిని కూడా తోలని పెద్ద పెద్ద క్రికెటర్లు, సినిమా హీరోలు, రాజకీయ నాయకులను కీర్తిస్తూ, ప్రేమిస్తూ… వాళ్ల కోసం రక్తాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేసే మూర్ఖ అభిమానుల కోసం ఈ కథనం… వాళ్లకే అంకితం…)
Share this Article