.
అప్పట్లో… ఇంక్ పెన్నులే కదా… మన భాషలో పత్తి పెన్నులు… ఫౌంటేన్ పెన్నులు… వాటితో రాత ఓ ప్రయాస, పట్టు కుదిరితే మాత్రం అక్షరాలు చెక్కినట్టుగా ముత్యాలసరాలే…
చదువంతా ఓ ఎత్తు, పత్తి పెన్ను మెయింటెనెన్స్ మరో ఎత్తు… అందులో ఇంధనం సిరా… అప్పట్లో మేం శాయి అనేవాళ్లం… అందరి ఇళ్లల్లోనూ సిరా సీసా ఉండేది… లేదంటే మల్లయ్య సేటు దుకాణానికి పోతే 5 పైసలు తీసుకుని, నింపి ఇచ్చేవాడు…
Ads
అసలు పత్తి పెన్నులో సిరా పోయడం 65వ కళ… ఇంక్ డ్రాపర్ అని దొరికేది, దాన్నే ఇంక్ పిల్లర్ అనేవాళ్లం… అందులోకి సిరా నింపి, దాన్ని జాగ్రత్తగా చేతులకు అంటుకోకుండా పెన్నులో పోసేయడం…
ప్రతి క్లాసులో ఒకరిద్దరు నిపుణులు ఉండెటోళ్లు… సగానికి విరగ్గొట్టిన రేజర్ బ్లేడుతో పెన్ను పత్తిని క్లీన్ చేసేటోళ్లు… అప్పుడప్పుడూ పత్తిని, దానికింద గడ్డను ఉడుకు నీళ్లలో వేసి, క్లీన్ చేయాలె… అదేం ఖర్మో, పరీక్ష మధ్యలో ఉన్నప్పుడు సిరా అయిపోయేది…
ఎవరినైనా బతిమిలాడితే మూడు నాలుగు చుక్కల్ని పత్తీ పత్తీ కలిపి జాగ్రత్తగా ధారబోసేవాళ్లు… అదీ ఓ ఆర్టే… ఈమధ్య అలాంటి వీడియో ఒకటి వైరల్ అయిపోయింది కదా…
అంగీ జేబుకు స్టయిల్‌గా పెట్టుకోవడం వరకూ బాగానే ఉండేది… పొరపాటున కక్కిందో ఇక అంగీ మొత్తం ఖరాబు ఖరాబు… ఏందిరోయ్, లూజ్ మోషన్సా అని మల్లారెడ్డి సార్ ఎక్కిరించేటోడు… (ఆమధ్య డర్టీ పిక్చర్ సినిమాలో విద్యాబాలన్ వేసిన స్మిత పాత్ర ఈ లీకేజీని కూడా ఓ డర్టీ డైలాగుకు, ఎక్స్‌ప్రెషన్‌కు వాడుకుంది… అది వేరే కథ)
అప్పుడప్పుడూ పత్తి సతాయించేది… చేతులతో పీకితే వచ్చేది కాదు… పంటితో పట్టుకుని పీకితే వచ్చేది… కానీ నోరు, నాలుక, పళ్లు అన్నీ సిరా రంగుతో నిండిపోయేవి… మొహం భీకరం… స్కూల్ బోరింగ్ కాడికి పోయి కడుగుడే కడుగుడు… పోతే కదా…
పత్తి విరిగిపోతే కొత్తది కొనుక్కుని, పెన్నును ఫిట్ చేయడం, సిరాను పీల్చే కెపాసిటీని టెస్ట్ చేయడం కూడా ఓ ప్రయాస… మా పక్క బెంచీ సూరిగాడి చేతులకు ఎప్పుడూ సిరా అంటుకునే ఉండేది… మస్తు కష్టపడుతున్నడు, మస్తు రాస్తున్నాడు అని అందరూ అనుకోవాలని వాడి ప్లాన్…
అదే చెప్పి ఇకఇకమని నవ్వితే అంగీ మీద సిరా జల్లేవాడు… తన్నులాట… చాలాసార్లు… యాదికొచ్చే చాలా పాత సంగతులు… ఇప్పుడేముంది..? మనుషుల తత్వాల్లాగే… యూజ్ అండ్ త్రో… రీఫిల్ కొను, లేదా పెన్నే కొనేసెయ్, సిరాా అయిపోతే పారెయ్… అంతే… అచ్చం ఇప్పటి తత్వాల్లాగే…!! (ఎప్పటిలాగే ఓ ఇంగ్లిష్ పోస్టుకు నా తెలుగు అనువాదం… నా అనుభవాల అక్షరీకరణేమీ కాదు…)
.
Share this Article