Siva Racharla………. డాన్స్ బార్ ఓనర్ నుంచి బలమైన నేత వరకు… లాయలిటీ మార్చటం పెద్దగా ఆక్షేపించవలసిన అంశం కాని రోజులు ఇవి. గుండె ఆపరేషన్ కోసం అమెరికాకు బయలుదేరిన ఎన్టీఆర్ గారికి గుమ్మడికాయతో దృష్టి తీసిన సన్నపనేని రాజకుమారి వారం తిరగక ముందే నాదెండ్ల భాస్కరరావు గ్రూప్ లో చేరినప్పుడున్న ప్రజా వ్యతిరేకత 2014 తరువాత కాంగ్రెస్, టీడీపీల నుంచి తెరాసలోకి , వైసీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు లేదు. 2019 తరువాత ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో కండువా కప్పుకోకుండా కలిసిపోయినా అదే పరిస్థితి.
వైశ్రాయ్ గురించి రాయవలసిన సందర్భం కాదు కానీ వైశ్రాయ్ కుట్రకు తక్షణ కారణం అంటే ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేయటానికి ఇమ్మిడియట్ రీజన్ ఎంతమందికి గుర్తుంది?. చాలా కారణాలు గుర్తుకు రావొచ్చు కానీ తక్షణ కారణం మాత్రం ఎన్టీఆర్ మంత్రి వర్గం నుంచి చంద్రబాబు గారి మద్దతుదారులు గోడే నగేష్ , కడియం శ్రీహరి లను బర్తరఫ్ చేయటం. ఆ తరువాత యల్.రమణ మీద కూడా ఏదో చర్య తీసుకున్నారు.
2014 ఎన్నిక నాటికో లేక ఇప్పుడో నగేష్ గారు , శ్రీహరి గారు ఎక్కడున్నారు ?. 2014 ఎన్నికల ముందు టీడీపీని వీడి తెరాసలో చేరి నగేష్ ఆదిలాబాద్ కు , శ్రీహరి వరంగల్ ఎంపీగా గెలిచారు. యల్ రమణ గారు దాదాపు సంవత్సరం కిందట టీడీపీ తెలంగాణ అధ్యక్షపదవికి రాజీనామా చేసి తెరాసలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరో టక్కున చెప్పలేము.
Ads
కొత్తకోట దయాకర్ రెడ్డి మొన్న అంటే 13-జూన్-2023న చనిపోయారు. ఆయన చనిపోయిన సందర్భంలో ఈ చరిత్ర ఎందుకంటే 2014, 2018 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఓడిపోయినా పార్టీని వీడకుండా కనీసం సొంత జిల్లా మహబూబ్ నగర్లో టీడీపీ గెలుపు కోసం కష్టపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన రేవంత్ రెడ్డి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తరువాత ఆయనతో విబేధాలతో టీడీపీకి దూరం జరుగుతూ వచ్చాడు.
రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరిన తరువాత రేవంత్ తో విబేధాలను పక్కన పెట్టి టీడీపీకి భవిషత్తు లేదన్న ఆలోచనతో 2022 ఆగస్టులో టీడీపీకి రాజీనామా చేశాడు . దయాకర్ రెడ్డి కాంగ్రెస్లో చేరటం కోసమే టీడీపీకి రాజీనామా చేశారు. కానీ ఇంతలోనే ఆయన క్యాన్సర్ బారిన పడటం తదితర కారణాలతో స్తబ్దుగా ఉండిపోయారు.
కొత్తకోట దయాకర్ రెడ్డి అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయ్యారు, శవం మీద టీడీపీ జండానే కప్పారు. ఆ విధంగా తెలంగాణ టీడీపీలో మిగిలిన చివరి బలమైన నేత కొత్తకోట దయాకర్ రెడ్డి జీవితం ముగిసింది.
భూస్వామి…… కొత్తకోట అనే ఊరు హైద్రాబాద్-కర్నూల్ హైవేలో ఉంది. దాదాపు 150-200 సంవత్సరాల కిందట కర్నూల్ నవాబ్ గద్వాల్ సంస్థానానికి కప్పం కట్టేవారు. ఆ కప్పం కట్టటంలో వచ్చిన తేడాలో గద్వాల్ రాజు కర్నూల్ నవాబ్ మీద దాడి చేశారు కానీ ఆ యుద్ధంలో గద్వాల్ రాజు చనిపోయారు. 150 సంవత్సరాల కిందటనే దయాకర్ రెడ్డి ముత్తాతల్లో కొందరు కర్నూల్ ప్రాంతంలో సెటిల్ అయ్యారు.
రజాకార్ల గొడవల సమయంలో కొత్తకోట దయాకర్ రెడ్డి కుటుంబం కర్నూల్ జిల్లా కోడుమూరు ప్రాంతానిలోని కొత్తకోట అనే ఊరిలో నివసించారు. దయాకర్ రెడ్డి సొంత అన్న సత్యశీలరెడ్డి కర్నూల్ కే దత్తు వెళ్ళాడు.
మహబూబ్ నగర్ లో రెడ్డి దొరలు /భూస్వాములు ఎక్కువ. చాలాకాలం వారిదే రాజకీయ ఆధిపత్యం. వనపర్తి కి చెందిన జె.రామేశ్వర్ రావ్ (పేరులో రెడ్డి లేదు కానీ రెడ్డినే), పుల్లూరు సంస్థానం కు చెందిన భూస్వామి చల్లా రాంభూపాల్ రెడ్డి , అమరచింత సంస్థానం దివాన్ మునిమనవడు కొత్తకోట దయాకర్ రెడ్డి, గద్వాల్ సంస్థానంకు చెందిన సోమభూపాల్ , వడ్డేమాన్ /చిన్నచింతకుంట భూస్వామి కోడలు స్వర్ణా సుధాకర్ రెడ్డి, కొల్లాపూర్ సంస్థానంకు చెందిన జూపల్లి కృష్ణా రావ్ (వెలమ) , అలంపూర్ భూస్వాములు రాజగోపాల్ రెడ్డి & చంద్రాశేఖర్ రెడ్డి (కమ్మ) చాలా చాలా కాలం రాజకీయాలు నడిపారు.
అమరచింత, గద్వాల్, దోమకొండ (నిజామాబాదు) ల మధ్య బంధుత్వాలు ఉన్నాయి. దయాకర్ రెడ్డి అమ్మగారు గద్వాల్ మహరాణి తమ్ముడి కూతురు. దయాకర్ రెడ్డి భార్య దోమకొండ సంస్థానం ఆడపడుచు. దయాకర్ రెడ్డి పెద్దమేనత్తను దోమకొండ సంస్థానం సదాశివనగర్ రాజేశ్వర రావుకు ఇచ్చారు.
దయాకర్ రెడ్డి తండ్రి కృష్ణా రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డికి క్లాస్మేట్. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి భార్య శ్యామలాంబ గద్వాల సంస్థానంలో మంత్రిగా పనిచేసిన కృష్ణరెడ్డి కుమార్తె. కృష్ణరెడ్డి పేరుతో గద్వాల్లో కృష్ణరెడ్డి పేట ఉంది.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి చిన్నాయన చిన్న సుబ్బారెడ్డి కొత్తకోట వేణుగోపాల్ రెడ్డి సోదరిని వివాహం చేసుకున్నారు. ఈ వేణుగోపాల్ రెడ్డి కోడుమూరు సమితి పుట్టినప్పటి నుంచి 1987లో రద్దయ్యే వరకు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. వేణుగోపాల్ రెడ్డి కుమారుడు అంటే దయాకర్ రెడ్డి కజిన్ కొత్తకోట ప్రకాష్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తో విభేదించి అలంపూర్ నుంచి 1994 ఎన్నికలో టీడీపీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
చల్లా వారి గురించి కూడా ఒక మాట రాయాలి. చల్లా రాంభూపాల్ రెడ్డి నీలం సంజీవ రెడ్డికి అల్లుడు. అలంపూర్, నందికొట్కూరు ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా పనిచేశారు. రాంభూపాల్ రెడ్డి కొడుకు చల్లా వెంకట్రామిరెడ్డి 2004లో అలంపురం నుంచి కాంగ్రెస్ రెబల్ గా ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ మధ్యనే తెరాసలో చేరి ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. కర్నూల్ టౌన్ లో “చల్లా కాంపౌండ్” అందరికి పాపులర్, అది చల్లా వారి ఇల్లే.
2004లో దయాకర్ రెడ్డి మీద గెలిచిన స్వర్ణ గారి స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా రాయవరం . ఈమె తండ్రి తేతలి లక్ష్మి నారాయణ రెడ్డి గారు అనపర్తి నియోజకవర్గం నుంచి 1955లో ప్రజా పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1962లో కాంగ్రెస్ తరుపున ఓడిపోయారు. ఆ తరువాత రాజకీయాల నుండి విరమించి న్యాయవాద వృత్తిలో స్థిరపడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా పనిచేశారు.
లక్ష్మీనారాయణ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా జడ్జిగా పనిచేసే రోజుల్లో కలిగిన పరిచయంతోనే స్వర్ణ , సుధాకర్ రెడ్డిల వివాహం జరిగింది. స్వర్ణ సుధాకర్ రెడ్డి ప్రస్తుతం తెరాస తరుపున మహబూబ్ నగర్ జడ్పీ చైర్మన్ గా ఉన్నారు. తేతలి లక్ష్మి నారాయణ రెడ్డి అల్లుడు పడాల అమ్మిరెడ్డి 1978లో జనతాపార్టీ తరుపున అనపర్తి ఎమ్మెల్యేగా గెలిచారు.
అలంపూర్ కే చెందిన చంద్రశేఖర్ రెడ్డి మరియు రాజగోపాల్ రెడ్డి సోదరి తేళ్ల లక్ష్మీకాంతమ్మ ఖమ్మం ఎంపీగా 1962-1971 మధ్య మూడుసార్లు గెలిచారు. సింగర్ స్మిత ఈవిడ మనవరాలే. చంద్రశేఖర్ రెడ్డి కూడా 1967 & 1972లో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. బాలీవుడ్ స్టార్స్ కిరణ్ రావ్ (అమీర్ ఖాన్ మాజీ భార్య ), అదితి రావ్ హైదరి వనపర్తి జమిందార్ , మాజీ ఎంపీ రామేశ్వర రావ్ గారి మనవరాళ్లు. స్థూలంగా గద్వాల్, అలంపూర్, అమరచింత, కర్నూల్ బంధుత్వాలు. రాజకీయ బంధాలు విడదీయలేనివి .
బార్ ఓనర్ నుంచి ఎమ్మెల్యేగా..
కొత్తకోట దయాకర్ రెడ్డి పూర్వీకులకు సొంత ఊరు పర్కాపూర్లో 1280 ఎకరాల భూమి ఉండేదంట . దయాకర్ రెడ్డి AG Bsc మధ్యలోనే వదిలేసి పంజాగుట్టలో “దివాన్ చి ” పేరుతో డాన్స్ ఫ్లోర్ ఉన్న బార్ పెట్టారు. ఆ బార్ లాయర్, మాజీ మంత్రి ఏరాసు అయ్యపురెడ్డి ఇంట్లో ఉండేది. పంజాగుట్ట మోడల్ హౌస్ లైన్లో ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది.
ఏరాసు అయ్యపురెడ్డి, ఆయన కుమారుడు ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ అంజయ్య & కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో న్యాయశాఖ మంత్రులుగా పనిచేశారు. తండ్రికొడుకులు న్యాయశాఖ మంత్రులుగా చేయటం ఒక రికార్డ్. అయ్యపురెడ్డి 1984 ఎన్నికల్లో టీడీపీ తరుపున కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ఓడించి కర్నూల్ ఎంపీ కూడా అయ్యారు.
ఎన్టీఆర్ అభిమాని కావటంతో టీడీపీ నాయకులతో మంచి పరిచయాలు ఉండేవి. బార్ వ్యాపారం వలన సాన్నిహిత్యం పెరిగింది. అప్పటి హోమ్ మంత్రి వసంత నాగేశ్వర రావ్ తో మంచి పరిచయం ఉండేది. ఒక విధంగా దయాకర్ రెడ్డికి రాజకీయ లైన్ వసంత్ నాగేశ్వర్ రావ్ వలనే ఏర్పడింది. ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే , ఎన్టీఆర్ అభిమాన సంఘాల అధ్యక్షుడు శ్రీపతి రాజేశ్వర రావ్ తో స్నేహం దయాకర్ రెడ్డికి బాగా కలిసొచ్చింది. ఆ స్నేహంతోనే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ హోదాలో ఎన్టీఆర్ ఏ రాష్ట్రానికి వెళ్లినా దయాకర్ రెడ్డి కూడా ఆయనతో పాటు వెళుతూ ఎన్టీఆర్ కు దగ్గరయ్యారు.
1989 ఎన్నికలు
మొదట ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా నియమితులైన దయాకర్ రెడ్డికి 1989 ఎన్నికల్లో అమరచింత టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో టీడీపీ వ్యతిరేకత దయాకర్ రెడ్డి కొత్త కావటం వలన కాంగ్రెస్ అభ్యర్థి వీరారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత 1994, 1999 ఎన్నికల్లో గెలిచారు. వైశ్రాయ్ సందర్భంలో చంద్రబాబు వైపు బలంగా నిలబడ్డారు. లాయలిటీ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు మారింది.
2004 ఎన్నికల్లో మాత్రం ఊహించని విధంగా దయాకర్ రెడ్డి ఓడిపోయారు. చింతకుంటకు చెందిన భూస్వామి సుధాకర్ రెడ్డి శ్రీమతి స్వర్ణ చేతిలో దయాకర్ రెడ్డి ఓడిపోయారు. కాంగ్రెస్ గాలి ఒక కారణం అయితే టీడీపీలోనే వెన్నుపోటు పొడిచారని దయాకర్ రెడ్డి ఆరోపిస్తుండేవారు. జడ్చెర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సొంత గ్రామంలో టీడీపీకి ఎప్పుడు 100% ఓట్లు పడేవి. శేఖర్ అంతకు ముందు వారి సోదరుడు ఎర్ర సత్యం వారి గ్రామంలో వారి సొంత ఓటు కాంగ్రెస్కు వేసి మిగిలిన ఓట్లు టీడీపీకి వేసేవారు . 2004లో మాత్రం మొత్తం కాంగ్రెస్కు వేయించారని ఆరోపణ. అది కారణం అనుకున్నా 2004లో దయాకర్ రెడ్డి ఓడిపోయింది 14,000 తేడాతో.
2009 ఎన్నికలు – తొలి ఎమ్మెల్యే దంపతులు
2009 లో నియోజకవర్గాల పునఃవిభజనలో అమరచింత రద్దయ్యి కొత్తగా దేవరకద్ర నియోజకవర్గం ఏర్పడింది. అమరచింతలోని మండలాలు దేవరకద్ర మరియు మక్తల్ నియోజకవర్గాల్లో విలీనమయ్యాయి.
దయాకర్ రెడ్డి శ్రీమతి సీత 2001లో మహబూబ్ నగర్ జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. డైనమిక్ లేడి, భర్త చాటు కాకుండా కొంత స్వతంత్రంగా వ్యవహరించేవారు. కొన్ని సందర్భాలలో ఎమ్మెల్యేగా దయాకర్ రెడ్డి అడిగిన పనులు చేయలేదని ఆయన జడ్పీ సమావేశం నుంచి వాక్ అవుట్ కూడా చేశారు.
2009 ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు అడ్డుకున్నా సీత గారికి దేవరకద్ర , తనకు మక్తల్ టికెట్లు సాధించి రెండుచోట్ల నుంచి గెలిచారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన తొలి దంపతులుగా రికార్డ్ సృష్టించారు. 2014లో ఉత్తమ్ కుమార్ రెడ్డి & పద్మావతి దంపతులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఒకేసారి ఎంపీ మరియు ఎమ్మెల్యేలుగా పనిచేసిన భూమా , నేదురుమల్లి, కోట్ల దంపతులున్నారు, ఎంపీ & ఎమ్మెల్సీ గా చేసిన యన్ జి రంగా & భారతి దేవి గారు, ఎమ్మెల్సీ & ఎమ్మెల్యేగా పనిచేసిన భవనం వెంకట్ రామ్ & జయప్రద దంపతులున్నారు కానీ ఒకేసారి ఎమ్మెల్యేలుగా పనిచేసిన దంపతులు కొత్తకోట దంపతులు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు మాత్రమే.
తెరాస సీట్ – టీడీపీ బీఫార్మ్
2009 ఎన్నికల్లో టీడీపీ, తెరాస, కమ్యూనిస్టుల పొత్తులో భాగంగా మక్తల్ సీట్ తెరాస కు ఇచ్చారు. మహబూబ్ నగర్ ఎంపీగా కెసిఆర్ పోటీచేశారు. దయాకర్ రెడ్డి మాత్రం కెసిఆర్ తో తిరుగుతూనే మక్తల్ నుంచి టీడీపీ బీ- ఫార్మ్ తో నామినేషన్ వేశారు. తెరాస నుంచి శ్రీధర్ గౌడ్ అనే కొత్త అభ్యర్థి నామినేషన్ వేశారు. ఏదో కేసులో దయాకర్ రెడ్డిని నామినేషన్ వేసిన తరువాత అరెస్ట్ చేశారు. మొత్తానికి మక్తల్ నుంచి తెరాస, టీడీపీ ఇద్దరు పోటీ చేశారు, టీడీపీ తరుపున దయాకర్ రెడ్డి గెలిచారు.
2014 తరువాత
తెలంగాణకు మద్దతు కానీ రాష్ట్ర విభజన సరిగా జరగలేదు అని వాదించే దయాకర్ రెడ్డి 2014 ఎన్నికల్లో గెలుస్తాడన్న ధీమాతో పోటీకి దిగారు. బహుశా గెలిచేవారేమో కూడా కానీ తెరాస తరపున టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మంచి వాడని పేరున్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఎల్. ఎల్లారెడ్డి ని పోటీకి దించారు. డీకే అరుణ తన సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డిని గెలిపించుకోవటానికే కెసిఆర్ తో అవగాహనా రాజకీయం చేసి నారాయణపేట నుంచి పోటీ చేయవలసిన ఎల్లారెడ్డి ని మక్తల్ నుంచి పోటీ చేసేలా చేసిందని దయాకర్ రెడ్డి ఆరోపించాడు.
2014 ఎన్నికల్లో మక్తల్ నుంచి దయాకర్ రెడ్డి 35 వేల ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితం అయ్యాడు. దేవరకద్ర నుంచి సీత దయాకర్ రెడ్డి కూడా 24 వేల ఓట్లు సాధించి 0.4% ఓట్ల తేడాతో డిపాజిట్లు కోల్పోయి మూడో స్థానంకు పరిమితం అయ్యారు. 2018 ఎన్నికల్లో దయాకర్ రెడ్డి మరోసారి మక్తల్ నుంచి ఓడిపోయారు. 26 వేల ఓట్లు సాధించి 0. 5% తేడాతో డిపాజిట్ కోల్పోయారు. 2018 ఎన్నికల్లో సీత గారు పోటీ చేయలేదు. ఆ విధంగా దయాకర్ రెడ్డి రాజకీయ జీవితం ముగిసింది.
టీడీపీకి రాజీనామా
స్వయంగా డిపాజిట్ కోల్పోవటం దయాకర్ రెడ్డికి భవిష్యత్తు మీద స్పష్టత వచ్చింది. కాంగ్రెస్లో చేరే ఆలోచనతోనే 2022 ఆగస్ట్ లో టీడీపీకి రాజీనామా చేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటం, తన వర్గాన్ని మానసికంగా సిద్ధం చేయటం కోసం కొంత సమయం తీసుకున్నారు. ఈ లోపు క్యాన్సర్ రావటంతో రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోయారు. సీత గారు కాంగ్రెసులో చేరుతారో లేదో చూడాలి. తెరాస లో మక్తల్ నుంచి కానీ దేవరకద్ర నుంచి కానీ ఖాళీ లేదు.
కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులకు 2014 & 2018 ఎన్నికల్లో వచ్చిన దాదాపు 25 వేలు వారి సొంత ఓట్లుగానే చూడాలి. టీడీపీ పార్టీ ఓట్ అందులో 5% కూడా ఉండదు. సీనియర్ నేత కోటాలో నాగం జనార్దన్ రెడ్డి, బీసీ నేతగా పి.చంద్రశేఖర్ మంత్రులు కావటంతో దయాకర్ రెడ్డికి మంత్రి అయ్యే అవకాశం రాలేదు.
ఎర్రబెల్లి దయాకర్, కొత్తకోట దయాకర్ రెడ్డి ఇద్దరికీ పేర్లలోనే కానీ అనేక విషయాలలో సారూప్యత ఉంది. ఎన్టీఆర్ సన్నిహితులు, వైశ్రాయ్ లో బాబుగారి వైపు నిలిచారు. సొంత బలం ఉంది అన్నిటిని మించి ఇద్దరూ టీడీపీలో మంత్రులు కాలేకపోయారు. ఎర్రబెల్లి దయాకర్ కెసిఆర్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు…
Share this Article