…….. By…. Nàgaràju Munnuru…….. == కైలాస మానస సరోవర్ యాత్ర == ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలి అనుకునే యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. సాక్షాత్ పరమశివుడు కొలువై ఉన్నాడని భావించే కైలాస పర్వతం హిమాలయాల్లోని కైలాస పర్వతశ్రేణిలో ఒక శిఖరం. కైలాస పర్వతం పశ్చిమ టిబెట్‌లోని హిమాలయాల్లో 22,000 అడుగుల ఎత్తులో ఉంది. కైలాస మానస సరోవర యాత్ర హిందువులకే కాకుండా జైనులు మరియు బౌద్ధులకు కూడా సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. అయితే ఈ కైలాస మానస సరోవర్ యాత్ర చేయడం అందరివల్ల కాదు. టిబెట్‌లోని ఎత్తైన ప్రదేశం కావడం మరియు సుదూర మారుమూల ప్రదేశం కావడం వలన ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో మాత్రమే యాత్రికులు కైలాస మానసరోవర్ యాత్రను చేయగలుగుతారు. ఇవే కాకుండా డబ్బు, ఆరోగ్యం, అదృష్టం వంటి కారణాల వలన ఈ యాత్రను పూర్తి చేయడం అందరి వల్ల కాదు. ఇలా ఎందుకు అంటున్నానో మున్ముందు మీకే తెలుస్తుంది.
యాత్రలో ప్రధానమైనవి ఏమిటి?
Ads
ఈ యాత్ర ప్రధానంగా రెండు విషయాలకు ప్రసిద్ధి చెందింది: కైలాస పర్వతం యొక్క పరిక్రమ అంటే చుట్టూ ప్రదక్షిణ చేయడం మరియు మానస సరోవర్ సరస్సులో పవిత్ర స్నానం చేయడం. ఇవి ఏడు జన్మల పాపాలను తొలగించి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాయని చెబుతారు.
1.పరిక్రమ – కష్టతరమైన ట్రెక్కింగ్ పూర్తి చేసుకుని కైలాస పర్వతాన్ని చేరుకున్న యాత్రికులు పర్వత శిఖరం చుట్టూ ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది. కైలాస పర్వతం చుట్టూ సవ్యదిశలో లేదా అపసవ్యదిశలో నడవడాన్ని పరిక్రమ అంటారు. పర్వతం చుట్టూ పరిక్రమ సుమారు 34 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పూర్తి చేయడానికి సాధారణంగా 3 రోజుల సమయం పడుతుంది. కాలినడకన చేయలేని వారికి అదనపు ఖర్చుతో యాక్ (జడల బర్రె) లేదా పోనీని (చిన్న గుర్రం) మీద కూర్చుని పరిక్రమ పూర్తి చేయవచ్చు.
2.మానస సరోవరం – ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సు.., 4500 మీటర్ల ఎత్తులో మానస సరోవర్ సరస్సు పవిత్రమైన కైలాస పర్వతం పాదాల వద్ద ఉంది. టిబెట్‌లో ఉన్న ఇది ఆసియాలోని అత్యంత పవిత్రమైన సరస్సులలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు యాత్రలో ముఖ్యమైన భాగం. ఈ సరస్సు రంగులు మారుస్తుందని కూడా నమ్ముతారు. తీరానికి సమీపంలో ఇది స్పష్టమైన నీలం రంగులో ఉన్నప్పటికీ, ఇది మధ్యవైపు పచ్చగా లేదా ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. పున్నమి చంద్రకాంతిలో ఈ సరస్సు అద్భుతంగా కనిపిస్తుంది. భక్తులు ఈ సరస్సులో పుణ్య స్నానాలు చేస్తారు.
ఇతర ప్రధాన ఆకర్షణలు
మానస సరోవర్ తో పాటు యాత్రలో ఇతర ఆకర్షణలు 1.తీర్థపురి – యాత్రికులు యాత్ర తర్వాత సందర్శించే ఒక ఆసక్తికరమైన ప్రదేశం. ఇక్కడ భూమి నుండి ఉబికివచ్చే స్ప్రింగ్స్ కొలనులు ఉంటాయి. ఈ కొలనులలో భక్తులు స్నానం చేస్తారు. 2.గౌరీ కుండ్ – కారుణ్య సరస్సు అని కూడా పిలుస్తారు. 3.యమ్ ద్వార్ – పరిక్రమం ప్రారంభమయ్యే ప్రారంభ స్థానం, 4.అస్తపద్ – పవిత్ర పర్వతం దిగువన మరియు 5.టార్బోచే – అనేక ప్రార్థన జెండాలతో కూడిన జెండా స్తంభం ఇతర ప్రధాన ఆకర్షణలు.
యాత్ర ఎప్పుడు నిర్వహిస్తారు?
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కైలాస మానస సరోవర యాత్రను ప్రతి సంవత్సరం జూన్ నుండి సెప్టెంబర్ వరకు రెండు వేర్వేరు మార్గాల ద్వారా నిర్వహిస్తుంది – 1.లిపులేఖ్ పాస్ (ఉత్తరాఖండ్) 2.నాథులా పాస్ (సిక్కిం). మతపరమైన ప్రయోజనాల కోసం కైలాస మానస సరోవర్‌కు వెళ్ళడానికి చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న అర్హతగల భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ యాత్రికులకు ఎలాంటి సబ్సిడీ లేదా ఆర్థిక సహాయం అందించడం లేదు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న మార్గాలు, ఖర్చు, మరియు యాత్ర వ్యవధి
విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లుగా ఈ యాత్రకు రెండు మార్గాలు ఉన్నాయి. కొంత ట్రెక్కింగ్‌తో కూడిన లిపులేఖ్ పాస్ (ఉత్తరాఖండ్) ద్వారా ఒక వ్యక్తికి సుమారు రూ.1.60 లక్షలు (అధికారిక) ఖర్చవుతుందని అంచనా వేయబడింది. 60 మంది యాత్రికులు చొప్పున 18 బ్యాచ్‌లుగా దీనిని నిర్వహిస్తారు. యాత్ర యొక్క వ్యవధి ప్రతి బ్యాచ్‌కు 24 రోజులు. యాత్ర సన్నాహక పనులు మరియు వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీలో 3 రోజులు ఉండాల్సి వస్తుంది. ఈ మార్గం నారాయణ్ ఆశ్రమం, పాతాల్ భువనేశ్వర్ మొదలైన ముఖ్యమైన ప్రదేశాల గుండా వెళుతుంది. యాత్రికులు చియాలేఖ్ లోయ యొక్క సుందరమైన అందాలను మరియు ఈ పర్వత శ్రేణిలో ఒక పర్వతంపై ‘ఓం’ ఆకారంలో మంచులో సహజంగా ఏర్పడే ‘ఓం పర్వతాన్ని’ కూడా చూడవచ్చు.
ఇక రెండవ మార్గం నాథులా పాస్ (సిక్కిం) గుండా వెళ్లే మార్గం. మోటరబుల్ (వాహన ప్రయాణానికి అనుకూలం) మరియు కష్టతరమైన ట్రెక్కింగ్ చేయలేని సీనియర్ సిటిజన్లకు అనుకూలంగా ఉంటుంది. సిక్కింలోని గాంగ్ టాక్ నుండి మొదలయ్యే ఈ మార్గం హంగు సరస్సు వంటి సుందరమైన ప్రదేశాల గుండా మరియు టిబెటన్ పీఠభూమి యొక్క విస్తారమైన ప్రకృతి రమణీయ దృశ్యాల గుండా వెళుతుంది. దీని కోసం దాదాపు రూ.2 లక్షలు (అధికారిక) ఖర్చవుతుందని అంచనా వేయబడింది. యాత్ర సన్నాహక పనులు మరియు వైద్య పరీక్షల నిమిత్తం ఢిల్లీలో 3 రోజులతో కలిపి 21 రోజుల సమయం పడుతుంది. సాధారణంగా 50 మంది యాత్రికుల చొప్పున 10 బ్యాచ్‌లు ఈ రూట్‌లో షెడ్యూల్ చేయబడతాయి. (ప్రతి సంవత్సరం ఈ బ్యాచుల సంఖ్య వాతావరణ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది)
అందుబాటులోకి రానున్న మూడవ మార్గం
మార్చి 11, 2022నాడు కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కైలాస మానస సరోవర యాత్రికుల కొరకు భారత ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో నిర్మించిన 80 కిలోమీటర్ల కొత్త రహదారిని జాతికి అంకితం చేశారు. ఇది వాస్తవ నియంత్రణ రేఖకు (LAC) దగ్గరగా ఉండి లిపులేఖ్ పాస్ ద్వారా కైలాస మానస సరోవర్ యాత్రకు కొత్త మార్గాన్ని ఇస్తూ యాత్రికుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) కైలాస మానస సరోవర్ యాత్రా మార్గంగా నిర్మించింది. ఇంతకు ముందున్న రెండు మార్గాల కంటే ఈ కొత్త మార్గం యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది ఇతర వాటితో పోలిస్తే కేవలం ఐదవవంతు దూరం మాత్రమే. ఇది అతి తక్కువ దూరమే కాక చౌకైన మార్గం కూడా.
ఈ మార్గం గుండా యాత్ర చేపడితే విమాన ప్రయాణం అవసరం లేదు. అంతేకాక దాదాపు 80 శాతం రోడ్డు ప్రయాణం టిబెట్‌లో ఉన్న ఇతర మార్గాలతో పోల్చితే ఈ రోడ్డు ద్వారా ఎక్కువ భాగం అంటే 84 శాతం భారతదేశంలో…, 16 శాతం రోడ్డుమార్గం మాత్రమే టిబెట్‌లో ఉంది. అలాగే లిపులేఖ్ పాస్ మీదుగా చైనా వైపు 5కిమీ ట్రెక్కింగ్ (అంటే పర్వతాలలో నడక) మినహా పూర్తి ప్రయాణం ఇప్పుడు వాహనాల ద్వారా వెళ్ళడానికి వీలు కలుగుతుంది. కాబట్టి గతంలో ఐదు రోజుల ట్రెక్కింగ్ ఇప్పుడు 5 కిలోమీటర్లకు తగ్గుతుంది. అంటే యాత్రికులు వాహనాలపై సరిహద్దు నుండి 5 కి.మీ వరకు ప్రయాణించి, మొదటి రాత్రిని గుంజి వద్ద స్టేజ్-I కి (వాతావరణ పరిస్థితులకు) అలవాటు పడవచ్చు మరియు స్టేజ్-II అలవాటు కోసం లిపులేఖ్ పాస్ దగ్గర రెండవ హాల్ట్ చేయవచ్చు. అంతకుముందు పిత్తర్ ఘర్ (Pithoragarh) మీదుగా ఘటియాబ్‌గఢ్‌కు చేరుకున్న తర్వాత లిపులేఖ్ పాస్‌కు 79 కిమీ లేదా ఐదు రోజుల కాలినడక ఉండేది. పిత్తర్ ఘర్ ఢిల్లీ నుండి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది.
17,060 అడుగుల ఎత్తులో ఉన్న లిపులేఖ్ పాస్ భారతదేశం, టిబెట్ (చైనా) మరియు నేపాల్ దేశాల ట్రై-జంక్షన్‌కు దగ్గరగా ఉంది. (మ్యాప్ చూడండి) ఘటియాబ్‌గఢ్ నుండి లిపులేఖ్ వరకు కొత్త 80 కి.మీ పొడవు గ్రీన్‌ఫీల్డ్ రహదారి చైనా స్టడీ గ్రూప్ (CSG) ఆదేశాల మేరకు తయారు చేయబడింది దీనికి ఇండో-చైనా బోర్డర్ రోడ్ (ICBR) ద్వారా నిధులు సమకూర్చబడ్డాయి. డిసెంబర్ 2022 నాటికి పూర్తి చేయాలని అనుకున్నారు. ₹439.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారి ఏప్రిల్ 17, 2020న లిపులేఖ్ పాస్‌కు 5 కి.మీ దూరం వరకు పూర్తయింది.
డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ 2016లో చివరి-మైల్ కనెక్టివిటీపై తాత్కాలికంగా నిషేధం విధించినందున చివరి బిట్ పూర్తి కాలేదు. ఇప్పుడు ఆ నిషేధం ఎత్తివేసింది. లిపులేఖ్ పాస్‌కు చివరి-మైలు కనెక్టివిటీకి సంబంధించిన పని ఈ సంవత్సరం మే నెలలో (మంచు క్లియరెన్స్ తర్వాత) ప్రారంభమవుతుంది మరియు 2022 సంవత్సరం చివరికి పూర్తవుతుంది. ఈ మార్గం పూర్తి అయితే యాత్రకు పట్టే సమయం కలిసి రావడమే కాకుండా ఖర్చు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. (ఎంత తగ్గుతుంది అనేది ఇప్పుడే చెప్పలేం)
యాత్ర చేపట్టడానికి ఎవరు అర్హులు?
ఎ. భారతదేశ పౌరుడిగా ఉండాలి.
బి. యాత్ర మొదలయ్యే నాటికి కనీసం 6 నెలల వరకు చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండాలి.
సి. యాత్ర సంవత్సరం జనవరి 01 నాటికి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 70 సంవత్సరాలు ఉండాలి.
డి. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 25 లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.
ఇ. యాత్ర చేపట్టేందుకు శారీరకంగా దృఢంగా మరియు వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండాలి.
ఎఫ్. విదేశీ పౌరులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు; (OCI కార్డ్ హోల్డర్లు అర్హులు కాదు)
ఎంపిక ప్రక్రియ
కైలాస మానస సరోవర యాత్ర కొరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేయాలి. ప్రతి దరఖాస్తుదారు కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. ఒక యాత్ర సంవత్సరంలో అందిన దరఖాస్తుల లాట్‌లను డ్రా పద్దతిలో ఎంపిక చేస్తుంది. కంప్యూటర్ ద్వారా నిర్వహించే డ్రా లో ఒక బ్యాచులో స్త్రీ పురుష లింగ సమతుల్యత, దాదాపు అన్ని వయసుల వారు ఉండేలా ఎంపిక ఉంటుంది. అంటే దరఖాస్తుదారులు ఎవరు ఎంపిక అవుతారు అనేది చెప్పడం కష్టం. కానీ దరఖాస్తు దశలో ఇద్దరు లేదా వ్యక్తుల సమూహం (ఒక బృందం) ఒకే బ్యాచ్‌లో కలిసి ప్రయాణించే అవకాశాన్ని కోరవచ్చు. ప్రతి యాత్రికుడి ఎంపిక దరఖాస్తుదారు యొక్క అర్హత షరతులకు లోబడి వీలైనంత వరకు అటువంటి అభ్యర్థనలను ఆమోదించడానికి అవకాశం ఉంది.
సింపుల్ గా చెప్పాలంటే కొందరు వ్యక్తులు ఒక బృందంగా దరఖాస్తు చేసుకుంటే బృందంలోని అందరు సభ్యులు ఎంపిక అవుతారు అని గ్యారంటీ లేదు కాని ఎంపిక అయిన సభ్యులు ఒకే బ్యాచ్ గా యాత్ర చేయడానికి అవకాశం ఉంది. అందువలన ఈ యాత్రకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే ముందు దరఖాస్తుదారు వారి ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ స్థితిని గుర్తించడానికి కొన్ని ప్రాథమిక తనిఖీలు చేసుకోవడం ఉత్తమం. అయితే, యాత్రకు ముందు ఢిల్లీలో హార్ట్ అండ్ లంగ్ ఇన్‌స్టిట్యూట్ (DHLI) మరియు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) నిర్వహించే వైద్య పరీక్షలలో తప్పని సరిగా వైద్యపరంగా అర్హత సాధించాల్సి ఉంటుంది.
యాత్ర ప్రారంభించడానికి ముందు సన్నాహాలు మరియు వైద్య పరీక్షల కోసం యాత్రికులు 3 లేదా 4 రోజులు ఢిల్లీలో గడపవలసి ఉంటుంది. ఢిల్లీ ప్రభుత్వం యాత్రికుల కోసం మాత్రమే కుమావోన్ బోర్డింగ్ మరియు లాడ్జింగ్ సౌకర్యాలను ఉచితంగా ఏర్పాటు చేస్తుంది. యాత్రికులు ఢిల్లీలో బోర్డింగ్ మరియు బస కోసం యాత్రికులు వారి స్వంత ఏర్పాట్లు చేసుకునే స్వేచ్ఛ ఉంది.
ఈ యాత్రను భారత విదేశీ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఉత్తరాఖండ్, ఢిల్లీ మరియు సిక్కిం రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సహకారంతో నిర్వహించబడుతుంది. మరియు కుమావోన్ మండల్ వికాస్ నిగమ్ (KMVN), మరియు సిక్కిం టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (STDC) మరియు వాటి అనుబంధ సంస్థలు భారతదేశంలోని యాత్రికుల ప్రతి బ్యాచ్‌కి లాజిస్టికల్ మద్దతు మరియు సౌకర్యాలను అందిస్తాయి.
భారత విదేశీ మంత్రిత్వ శాఖ అడ్వైసరి
యాత్రలో భాగంగా సుమారు 19,500 అడుగుల వరకు ఎత్తైన ప్రదేశాలలో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అనూహ్యమైన పరిస్థితులలో, విపరీతమైన వాతావరణం (విపరీతమైన చలి, గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండటం) మరియు కఠినమైన భూభాగాలు ఉన్నాయి. ఇది శారీరకంగా మరియు వైద్యపరంగా దృఢంగా లేని వారికి ప్రమాదకరంగా పరిణమించవచ్చు.
హిమాలయాల అనూహ్య వాతావరణ మార్పులు, కొండచరియలు విరిగిపడటం వంటి అనేక కారణాల వలన ఈ యాత్ర మొదలు అయిన తర్వాత పూర్తవుతుందని కూడా గ్యారంటీ లేదు మరియు యాత్రా స్థలాల సందర్శనలు ఏ సమయంలోనైనా స్థానిక పరిస్థితులకు లోబడి ఉంటాయి. ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల లేదా మరేదైనా కారణం వల్ల యాత్రికుల ప్రాణనష్టం లేదా గాయం లేదా ఏదైనా నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినప్పుడు భారత ప్రభుత్వం ఏ విధంగానూ బాధ్యత వహించదు. యాత్రికులు యాత్రను పూర్తిగా వారి స్వంత ఇష్టానుసారం, ఖర్చులు, ప్రమాదం మరియు పర్యవసానాలతో చేపడతారు.
యాత్ర సమయంలో యాత్రికులెవరైనా భారత సరిహద్దుకు ఆవల మరణించిన సందర్భంలో దహన సంస్కారాల కోసం ఏ యాత్రికుల మృత దేహాన్ని భారతదేశానికి తీసుకురావాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉండదు. అందువల్ల, ఒకవేళ ఈ యాత్ర సమయంలో టిబెట్ భూభాగంలో మరణిస్తే తమ మృతదేహాన్ని టిబెట్ (చైనీస్) వైపున ఉన్న భూభాగంలో దహనం చేయడానికి సమ్మతి తెలిపే పత్రంపై యాత్రికులందరూ సంతకం చేయాల్సి ఉంటుంది.
ఈ యాత్ర నిర్వహణ కోసం విదేశీ మంత్రిత్వ శాఖ (MEA) ఏ ఇతర NGO, స్వచ్ఛంద సంస్థ లేదా వ్యక్తిని ఏ ఉద్దేశానికైనా లేదా ఏ పద్ధతిలోనూ నియమించలేదు. అటువంటి సంస్థ లేదా వ్యక్తి ద్వారా ఏదైనా అసోసియేషన్ దావా వారి స్వంతం మరియు ఈ విషయంలో MEA ఎటువంటి బాధ్యత వహించదు. ఈ యాత్ర పూర్తి చేయడం ఎంత కష్టతరం అనేది ఈపాటికి అర్థం అయి ఉండవచ్చని అనుకుంటున్నాను.
యాత్రాభిలాషులకు సమాచారం ఇవ్వడానికి ఓ ఫేస్‌బుక్ ప్రైవేట్ గ్రూపు ఏర్పాటు చేస్తున్నాను… https://www.facebook.com/groups/4836536349793786
ఇందులో యాత్రకు సంబంధించిన సమాచారం, పాస్పోర్ట్ దరఖాస్తు మొదలు యాత్ర దరఖాస్తు చేసుకునే విధానం, దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాత్రకు అవసరమైన శారీరక మానసిక ఆరోగ్యం పొందడానికి సూచనలు మొదలగునవి చర్చించడం జరుగుతుంది. వచ్చే సంవత్సరమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో యాత్ర చేపట్టాలి అని భావించే వారు కూడా గ్రూపులో సభ్యులుగా చేరవచ్చు. ఇది కేవలం సభ్యుల అవగాహన మరియు మార్గదర్శకం కొరకు మాత్రమే.
Ps: దేవుడిని నమ్మని నాస్తికులు, సర్వం తెలిసిన మహాజ్ఞానులు, నిర్వికల్ప సమాధి స్థితిని పొందిన వారు, ముఖ్యంగా మేధావులు ఈ గ్రూపులో చేరడానికి ప్రయత్నించవద్దని మనవి. ఎందుకంటే మీకు సమాధానం చెప్పే ఓపిక, జ్ఞానం నాకు లేవు…
Share this Article