Nancharaiah Merugumala…… కేంద్ర కేబినెట్ సెక్రెటరీగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగు ఐఏఎస్ టీఆర్ ప్రసాద్…. కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా పనిచేసిన 1963 బ్యాచ్ ఐఏఎస్ అధికారి టీఆర్ ప్రసాద్ (81) మంగళవారం విశాఖపట్నంలో మరణించారనే వార్త బుధవారం తెలుగు దినపత్రికల్లో వచ్చింది. హైదరాబాద్ తెలుగు పత్రికల్లో ఈనాడు మాత్రమే కాస్త పెద్ద వార్త ఇచ్చింది. కొన్ని పేపర్లయితే అసలు పట్టించుకోలేదు. ఈనాడు వార్త చదివాక గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించిన తాతా రామచంద్ర ప్రసాద్ కు సంబంధించిన అనేక విషయాలు నాకు గుర్తుకొచ్చాయి.
కేంద్ర సచివాలయంలో కేబినెట్ సెక్రెటరీ బాగా పెద్ద పదవి అని, ఈ పోస్టులో తెలుగు ఐఏఎస్ అధికారి నియమితుడవడం ఇదే మొదటిసారి అని కూడా పత్రికలు అప్పట్లో (2000 సంవత్సరంలో) రాశాయి. ప్రసాద్ గారి తర్వాత తెలుగు ఐఏఎస్ లు ఎవరూ ఈ పదవి చేపట్టలేదు. ఓబీసీ గౌడ కుటుంబంలో పుట్టిన టీఆర్ ప్రసాద్ ప్రసిద్ధ బనారస్ హిందూ యూనిర్సిటీ (బీఎచ్‌యూ– కాశీ విశ్వవిద్యాలయం)లో ఎంఎస్సీ ఫిజిక్స్ టాప్ ర్యాంక్ తో పాసైన మెరిటోరియస్ విద్యార్థి.
ఆయన తర్వాత ర్యాంకులు తెచ్చుకున్న ఆయన బ్యాచ్ ఎంఎస్సీ భౌతికశాస్త్రం వారు ఆరేడుగురు లండన్ రాయల్ సొసైటీలో స్థానాలు సంపాదించగలిగారు. అయితే, ఆయన ‘అనవసరంగా’ ఐఏఎస్ కోసం ప్రయత్నించి సఫలమయ్యారు. 2000–2002 మధ్యకాలంలో బీజేపీ– ఎన్డీఏ తొలి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి హయాంలో కేంద్ర కేబినెట్ సెక్రెటరీగా ఉండగా టీఆర్ ప్రసాద్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
Ads
‘‘నేను బీఎచ్‌యూలో ఎమెస్సీ ఫిజిక్స్‌లో అగ్రశ్రేణి ర్యాంక్ సాధించాను. నేను 22 ఏళ్లకే ఐఏఎస్ కు సెలెక్టయ్యాను. ఐఏఎస్ అధికారిగా ఎందరి కిందో పనిచేయాల్సి వచ్చింది. ఈ పిచ్చి పనిచేయకుండా నా ముందు బ్యాచ్ ఎమెస్సీ ఫిజిక్స్ టాప్ ర్యాంకర్స్ మాదిరిగా విమానంలో లండన్ పోయి ఉంటే రాయల్ సొసైటీ (అకాడమీ ఆఫ్ సైన్సెస్)లో చేరేవాణ్ని. భౌతికశాస్త్రంలో మానవాళికి మేలు చేసే పరిశోధనలు చేయగలిగేవాణ్ని,’’ అని ప్రసాద్ గారు బాధపడుతూ చెప్పారు.
కూచినపూడి ఎమ్మెల్యే దంపతుల అల్లుడు కూడా!
–––––––––––––––––––––––––––––
గుంటూరు జిల్లా కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులుగా పనిచేసిన దంపతులు ఈవూరి సుబ్బారావు (1978–83 జనతా పార్టీ), ఈవూరి సీతారావమ్మ (తెలుగుదేశం–1985, 89, 94) అల్లుడే తాతా రామచంద్రప్రసాద్… సీతారావమ్య గారు నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో సభ్యురాలుగా ఉన్నారు కూడా… పాత గుంటూరు జిల్లా కూచినపూడి (ఇప్పుడు రద్దయింది), రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గాల్లో గౌడ కులస్తులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. వారిలో రాజకీయ చైతన్యం ఎక్కువ. 1955 ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కూచినపూడి అసెంబ్లీ స్థానంలో కమ్యూనిస్టు దిగ్గజం కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య గారిని స్థానిక గౌడ కులానికి చెందిన అనగాని భగవంతరావు గారు (కాంగ్రెస్) ఓడించి సంచలనం సృష్టించారు. తర్వాత అనగాని గారు కేబినెట్ మంత్రిగా పనిచేశారు చాలా ఏళ్లు. ఈ ప్రాంతంలో గౌడ కులానికి చెందిన జనంలో మొదట్నించీ బాగా చదువుకుని పైకొచ్చినవారున్నారు.
ప్రసాద్ సర్వీసు పొడిగింపు కోసం నిబంధన సవరణ
––––––––––––––––––––––––––––––––
కేబినెట్ సెక్రెటరీగా ప్రసాద్ సేవలు నచ్చిన అప్పటి ప్రధాని వాజపేయి గారు చట్టాన్ని సవరించి మరీ ప్రసాద్ సర్వీసును 2002 అక్టోబర్ వరకూ పొడిగించారు. 2001 జులైలో 60 ఏళ్లు నిండిన ప్రసాద్ అలా మరో ఏడాది న్యూఢిల్లీ సెంట్రల్ సెక్రెటేరియట్ లో కొనసాగారు. అయితే, అనేక కార్పొరేట్ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న ప్రసాద్ గారు సత్యం రామలింగరాజు కుంభకోణం వెల్లడయ్యాక కూడా సత్యం కంప్యూటర్స్ కంపెనీ డైరెక్టర్‌గా కొంతకాలం కొనసాగడం విమర్శలకు దారితీసింది. ఈ కుంభకోణానికి అసలు కారణం సత్యం ఆడిటర్స్ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ సంస్థ అని టీఆర్ ప్రసాద్ గారు నిందించడం చాలా మందికి విస్మయం కలిగించింది.
సర్వీసులో ఉండగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాగాని అనేక మంది రిటైర్డ్ ఐఏఎస్ లు విశ్రాంతి తీసుకోవడమో లేదా ఏదైనా లక్ష్యం కోసం యాక్టివిస్టుగా మారడమో చేయరు. అధికారం అలవాటయి కార్పొరేట్ కంపెనీల్లో డైరెక్టర్ పదవులు తీసుకోవడం ద్వారా వారు పొరపాటు చేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. మరి, కేంద్ర సచివాలయంలో కేబినెట్ సెక్రెటరీగా పనిచేసిన ఏకైక తెలుగు ఐఏఎస్ అధికారిగా పేరు సంపాదించిన ప్రసాద్ గారి మరణ వార్తను తెలుగు పత్రికలు ప్రముఖంగా, వివరంగా ప్రచురించలేదు. ఆయన కూడా పెద్దగా ప్రచారం కోరుకోకపోవడం, విశాఖపట్నంలో స్థిరపడడం దీనికి కారణం కావచ్చు…
తెలుగు ప్రముఖుల పేర్లు, ఇంటిపేర్లు ఉన్నంతలో చాలా వరకు తప్పులు లేకుండా వేసే ఈనాడులో నిన్న ప్రసాద్ గారి మరణ వార్తలో తాతా అనే ఆయన ఇంటి పేరును టాటా అని రాయడం కాస్త వింతగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈనాడు కూడా దాని ప్రభావం నుంచి తప్పించుకోలేదని అనిపించింది. కృష్ణా నదికి ఇరువైపులా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని గౌడ కులస్తుల్లో తాతా అనే ఇంటి పేరు ఉండడం, నాతోపాటు ఉదయంలో పనిచేసిన నా ఘంటశాల గౌడ మిత్రుడు తాతా గోపాలస్వామి కారణంగా తాతా రామచంద్ర ప్రసాద్ గారిపై నాకు ఆసక్తి కాస్త ఎక్కువ ఉండేది. అదీగాక తెలుగు ఓబీసీ కులమైన గౌడ, ఈడిగ, కలాలీ, శెట్టి బలిజ, శ్రీశయన,యాత అనే కల్లుగీత వృత్తి సముదాయం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగిన ఏకైక వ్యక్తి టీఆర్ ప్రసాద్ గారు కావడం కూడా ఆయన జీవిత విశేషాలు ఇలా రాయడానికి పురికొల్పింది…
Share this Article