Bharadwaja Rangavajhala….. ఏలూరు నటుడు వల్లూరి బాలక్రిష్ణ… అంజిగాడు… అనే పేరుతో పాపులర్ అయిన అంజిగాడి కథలోకి ఓసారి తొంగి చూద్దాం … విజయా వారు తీసిన చాలా చిత్రాల్లో ఇతను కనిపిస్తాడు. ఇతను చేసిన పాత్రల్లో బాగా గుర్తుండిపోయే పాత్రలన్నీ విజయా వారి చిత్రాల్లోనే చేశాడు కూడా. పాతాళభైరవిలో అంజిగాడు సరే .. ఆ తర్వాత అప్పుచేసి పప్పుకూడులో నౌకరుగానూ, అంతకు చాలా ముందు పెళ్లి చేసి చూడులో ఎన్టీఆర్ ఇంటి వంటవాడుగానూ … ఇలా ప్రతి ఒక్కటీ గుర్తుండిపోయే పాత్రే.
తను చేసిన పాత్రలు ప్రధానంగా హాస్య పాత్రలు. జానపద చిత్రాల్లో హీరో చెలికాడుగా రామారావు, కాంతారావుల చిత్రాల్లో కాస్త ఎక్కువగా కనిపించేవాడు వల్లూరి బాలకృష్ణ. జానపద చిత్రాల హవా నడచినన్నాళ్లూ బాలకృష్ణకు ఎదురులేదు. నటుడు కావాలని ఉండడంతో చదువు అబ్బలేదు. ఐదో తరగతితోనే ముగించేశాడు. నాటకాల్లో ప్రవేశించాడు.
ఆ రోజుల్లో శ్రీరంజని , మాధవపెద్ది, పారుపల్లి సుబ్బారావు, సూరిబాబు మొదలైన వారు లవకుశ నాటకం ఆడుతూ ఉండేవారు. అందులో మొదటిసారి ముని బాలకుడి వేషం వేశాడు. అలా రంగస్థలం మీద కాలుపెట్టాడు. తారాశశాంకం లాంటి నాటకాల్లో బాలనటుడుగా నటిస్తున్న సమయంలోనే సినిమాల్లోకి పోతే ఇంత పోటీ ఉండదు కదా అనిపించిందతనికి …
Ads
ఇదంతా 1933 ప్రాంతాల కథ. అప్పట్లో చిత్ర నిర్మాణం షోలాపూర్, కలకత్తాల్లో ఎక్కువగా జరిగేది. కలకత్తా వెళ్తే కుదిరితే తెలుగు సినిమా, లేకపోతే హిందీ పిక్చర్లోనైనా ఛాన్స్ సంపాదించుకోవచ్చని తలంచి ఇంట్లో చెప్పకుండా టిక్కెట్టు లేకుండా కలకత్తా వెళ్లాడు. మధ్యలో నాలుగు చోట్ల పట్టుకుని రైల్లోంచీ దించేశారు.
మలేరియా జ్వరం కూడా పట్టుకుంది. ఎట్లాగో కలకత్తా చేరి అక్కడే జ్వరానికి చికిత్స చేయించుకున్నాడు. తప్ప వెనక్కు రాలేదు. నిజంగా సినిమా వాళ్లకన్నా కెరీర్ గైడెన్స్ కు ఉపయోగపడేవాళ్లు మరొకరు కనిపించరేమో .. శ్రీశ్రీ అన్నట్టు సినిమా హిట్టైతే వాసన్ … ఫ్లాపైతే ఉపవాసన్ లే అందరూ …
తనకు వచ్చిన మూడు నాలుగు హిందీ మాటల సహాయంతో పొట్టగడుపుకుంటూ వచ్చి హజ్రా రోడ్డులోని మార్వాడీ సత్రంలో వచ్చి పడ్డాడు. బీదలకు రోజూ రొట్టెలిచ్చేవారక్కడ. ఈయనా పుచ్చుకునేవాడు. ఇలా ఉండగా ఓ రోజు ఈస్టిండియా స్టూడియోకు దారి కనుక్కుని కాలినడకన పది మైళ్లు నడచి వెళ్లాడు. గూర్ఖావాణ్ణి మోసగించి లోపలికి ప్రవేశించాడు.
లోపల తెలుగు మాటలు వినిపించాయి. అక్కడ అరవ బాలయోగిని తీస్తున్నారు కె.సుబ్రహ్మణ్యం గారు. అందులో వేషం వేస్తున్న బాలసరస్వతి అప్పటికి చిన్నపిల్ల. ఇడ్లీ తింటోంది. ఆకలేస్తున్నదంటే తనకూ రెండిచ్చింది. ఆమె వెంట స్టూడియో లోపలికి వెడితే అక్కడ తెలుగు ఆర్కెస్ట్రా వాళ్లు కనిపించారు. ఆ ఆర్కెస్ట్రాకు నాయకుడు సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారి తండ్రిగారు సాలూరు సన్యాసిరాజుగారు. వల్లూరు బాలకృష్ణ జీవితాన్ని మలుపు తిప్పింది … ఈ సాలూరు సన్యాసిరాజుగారే.
వల్లూరి బాలకృష్ణ కథ విన్న సన్యాసిరాజుగారు అప్పుడు కలకత్తాలో తెరకెక్కుతున్న కీచక వధ చిత్రంలో వేషం ఇప్పించారు. ఆ సినిమా నిర్మాత వెంకటనారాయణగారు … కీచకవధ పిక్చరు పూర్తి అయి వాళ్లంతా వెళ్లేప్పుడు బాలకృష్ణను పిల్చి పదిహేను రూపాయలు ఇచ్చారు. దాంతో అతనిలో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏం పర్లేదు కాస్త లేటుగా అయినా డబ్బులు ముడితే చాలులే అని ఇల్లు చేరక కలకత్తాలోనే ఉండిపోయాడు.
శ్రీ రామా ఫిలిమ్స్ వారు చిత్రనళీయం తీయడానికి ఈస్టిండియాకు వచ్చినప్పుడు వాళ్ల లాడ్జి కనుక్కుని అందులో జొరబడ్డాడు. అందులో అతను వేసిన వేషం వంటగాడి వేషం కాస్త పేరు తెచ్చింది. ఈ ట్రూపులో ఎస్.వి.ఎస్. రామారావు అనే ఆర్డు డైరక్టరు పరిచయమై ఆయనే ఇతన్ని మద్రాసు చేర్చారు.
ఇది పందొమ్మిది వందల ముప్పై ఆరు నాటి మాట. అలా మద్రాసు చేరిన బాలకృష్ణ సినిమాల్లో ఇచ్చిన వేషం వేస్తూ … సినిమా రంగానికి సంబంధించిన ఇతర పనులూ చేస్తూ కాలక్షేపం చేసేవాడు … అతని నవ్వు , మెలికలు తిరిగిపోయే శరీర తత్వం కె.వి.రెడ్డిగారికి నచ్చేవి. దీంతో ఆయన పాతాళభైరవిలో అంజిగాడి పాత్ర ఆఫర్ చేశారు.
పాతాళభైరవి విడుదల అయ్యేవరకు నటుడుగా వల్లూరి బాలకృష్ణకు పెద్ద గుర్తింపు లేదు. విజయావారి పాతాళభైరవి , పెళ్లిచేసి చూడు చిత్రాలలో అతని పాత్రలు జనాన్ని ఆకర్షించాయి. గుర్తింపు నిచ్చాయి. అది దాదాపు 1975 వరకు సినిమాల్లో ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉన్నాడు. బాలకృష్ణను బాగా ప్రోత్సహించిన వారిలో దర్శకుడు విఠలాచార్య కూడా ఒకరు.
ఎస్డీలాల్, కెఎస్సార్ దాస్ లాంటి క్రైమ్ చిత్ర దర్శకులు కూడా తమ చిత్రాల్లో ఇతనికో వేషం ఇచ్చేవారు. కాస్త సీరియస్ గా పెద్ద డైలాగులు చెప్పడం దగ్గర వల్లూరి బాలకృష్ణకు ఇబ్బంది ఉండేది. దీంతో ఆయన ఎక్కువగా డైలాగులకు ప్రాధాన్యత లేని పాత్రల్లోనే కనిపించేవారు.
అన్నట్టు చెప్పడం మర్చిపోయాను . కామెడీ స్టార్ రాజబాబుకు ఇన్సిరేషన్ కూడా ఇతనేనట …అంటే మెలికలు తిరిగిపోతూ నటించడం శరీరం అంతా ఉపయోగించి హాస్యం పుట్టించగల లాంటి పన్లకు రాజబాబు ఫిదా అయిపోయాట్ట … సదాజపుడు పద్మనాభంతో చాలా ఆత్మీయ స్నేహం ఉండేది. మాయాబజార్ లో రేలంగికి బాబాయిల పద్యం చెప్పి జనాన్ని తెగనవ్వించాడు బాలకృష్ణ. శర్మ శాస్త్రిల పాలిత శనిలా దాపురిస్తూంటాడు… విజయా బైట అతను చేసిన పాత్రల్లో పెద్దగా గుర్తుకు వచ్చేవి తక్కువే…
Share this Article