1955… రోజులు మారాయి అనే తెలుగు సినిమా… కల్లాకపటం ఎరుగనివాడా, ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా అనే పాటలో తొలిసారి నర్తించింది వహీదా రెహమన్… అంటే 68 ఏళ్ల క్రితం… ఇప్పుడామె వయస్సు 87… సుదీర్ఘమైన సినిమా ప్రయాణం… అయితే ఈ ప్రస్థానంలో ఆమెకు లభించిన అవార్డుల సంఖ్య స్వల్పం… అది ఆశ్చర్యకరం… నిజానికి అవార్డులే ఆమె వెంటపడాలి…
తెలుగు, తమిళంలో యాక్ట్ చేసినా సరే, ఆమె ప్రధానంగా పనిచేసింది హిందీ, మరాఠీ ఇండస్ట్రీల్లో…! ఇన్నేళ్ల పయనంలో ఆమె ఒక్కసారి జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందింది… రేష్మా ఔర్ షేరా సినిమాకు అప్పుడెప్పుడో 1971లో దక్కిన ఆ అవార్డు మినహా… చెప్పుకోదగిన అవార్డులేమీ కనిపించవు ఆమె కెరీర్‌లో…
ఫిలిమ్ ఫేర్ అవార్డులు కొన్ని ఉన్నాయి… జీవన సాఫల్య అవార్డు కూడా పొందింది… అదీ 1994లో… 1972లో పద్మశ్రీ వరించగా, తరువాత 2011లో పద్మభూషణ్… అఫ్‌కోర్స్, అవి ప్రతిష్టాత్మకం… ఇప్పుడు ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే జీవన సాఫల్య పురస్కారం లభించింది… సినిమారంగంలోని ఎవరైనా కలలు గనే పురస్కారం అది… దానికి ఆమె పూర్తిగా అర్హురాలే…
Ads
వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె పక్కా హైదరాబాదీ… జననం ఇక్కడే… కాకపోతే తండ్రి జిల్లా మేజిస్ట్రేట్ కాబట్టి విజయవాడలో ఉండేవారు… అక్కడే చదువుకుంది… రోజులు మారాయి సినిమా తరువాత ఫుల్ టైమ్ యాక్ట్రెస్ అయిపోయింది… మంచి డాన్సర్ కూడా..! ఆమెకు లైఫ్ ఇచ్చింది గురుదత్… ఆయనతో కలిసి నటించిన సినిమాలన్నీ హిట్… ఇద్దరి నడుమా చనువు ఉండేది, దాంతో సహజంగానే ఇద్దరి నడుమ ఏదేదో ఉందని పుకార్లు…
ఆమె 1974లోనే కవల్‌జిత్ (శశి రేఖి)ని పెళ్లాడింది… బెంగుళూరు ఫామ్ హౌజులో ఉండేవారు… ఆయన మరణించాక ముంబై బాంద్రాలోని సీవ్యూ రెసిడెన్స్‌లోకి మారిపోయింది… అక్కడే ఉంటోంది… ఇద్దరు పిల్లలు… సోహైల్ రేఖి, కశ్వి రేఖి… ఇద్దరూ రచయితలే… ఇతరత్రా తన వ్యక్తిగత వివరాలన్నీ ప్రైవేటు… మీడియా తెర మీదకు పెద్దగా వచ్చేది కాదు… ఆమె తెలుగులో నటించిన చిత్రాల్లో గుర్తున్నవి జయసింహ, బంగారు కలలు, సింహాసనం, చుక్కల్లో చంద్రుడు… కమల్ హాసన్ విశ్వరూపం-2లో కూడా ఉంది…
Share this Article